Monday, November 28, 2022

మహాత్మ జ్యోతిరావు ఫూలే గారి వర్థంతి సందర్భంగా🙏🌷

🌷🙏"బహుజనతత్వకర్త తొలి మహాత్ముడు"మహాత్మ జ్యోతిరావు ఫూలే గారి వర్థంతి సందర్భంగా🙏🌷





"ఒక యువకుడు తన ప్రాణస్నేహితుని పెండ్లికి వెళ్ళాడు..పెండ్లిఇంటిలో వరుడితో చాలా సన్నిహితంగా వుంటూ హడావుడిగా తిరుగుతూ పనులు పర్యవేక్షిస్తున్నాడు.. అతని హడావుడి,చురుకుదనం చూసిన కొంతమంది అతనెవరని అడిగారు.. అతని కులం ఏమిటని అడిగారు..ఆ అబ్బాయి తన పేరు,కులం చెప్పాడు..అంతే అక్కడున్న కొందరు ఒక బ్రాహ్మణునిఇంట పెండ్లిలో ఒక శూద్రుడు తిరుగాడుటయా అంటూ మండిపడ్డారు..అతనిని అవమానకరంగా మాట్లాడారు. పెండ్లికొడుకు,తండ్రి ఎంత చెప్పినవినకుండా..అతను ఇంట్లో తిరిగితే మేము వెళ్ళిపోతామంటూ బెదిరించారు.విదిలేనిపరిస్థితులలో ఆ యువకుడు అవమానభారంతో తలదించుకొని ఇంటిదారి పట్టాడు. మానవుల మధ్య వివక్షత అతని మనసును గాయపరిచింది..ఇంట్లో బాగా ఆలోచించాడు.తనను అవమానపరిచినవారి గొప్పతనం ఏమిటో ఆలోచించాడు..అతనికి వెంటనే ఆలోచన తట్టింది... ఏ "అక్షరం"చూసి వారు మిడిసిపడుతున్నారో ఆ అక్షరమనే ఆయుధాన్ని ప్రజలందరికీ అందించాలని నిర్ణయించుకున్నాడు.ఫలితంగా ఒక మహోద్యమానికి తెరతీశాడు...అతడే నవయుగవైతాళికుడు జ్యోతీరావుపూలే....
***    ***  *** 

#మహాత్మ జ్యోతిరావు ఫూలే ఈ దేశ ఆధునిక యుగ వైతాళికుడు. నిజమైన #పునరుజ్జీవనోద్యమ #పితామహుడు. భారతదేశంలోని శూద్రులు… శూద్రాతిశూద్రులు (దళిత, బహుజన, ఆదివాస, గిరిజన, ముస్లీం, మైనార్టీలు)  అగ్ర కుల వ్యవస్థలో బానిసలుగా ఉన్నారు. అంతే కాకుండా అమెరికాలోని నల్లజాతి బానిసల్లాగా బానిస బతుకులు బతుకుతున్నారని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు ఫూలే.
కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురౌతున్న బడుగు, బలహీనవర్గాల ప్రజలకు తాను అండగా నిలిచాడు. అందరికీ చదువు ఎంతో అవసరమని #పాఠశాలలను రూపొందించారు.

స్త్రీలకు #ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు. భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాడు.బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడటమే ప్రథమ కర్తవ్యంగా తను ప్రజలను చైతన్య పరిచి, పోరాటాన్ని నడిపినాడు.

#బాల్యం-తొలి జీవితం:

సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడైన జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే మహారాష్ట్ర లోని సతారా జిల్లాలోని వ్యవసాయ కుటుంబంలో 1827 ఏప్రిల్‌ 11న జన్మించాడు. ఈ‍యన ఏడాదిలోపే పూలే తల్లి మరణించింది.

#ఇంటి పేరు ఫూలే గా మారింది.....

ఆయన తండ్రి గోవిందరావు కూరగాయలు అమ్మి వారి కుటుంబాన్ని పోషించేవాడు. కాలక్రమేణా భారతదేశంలో పీష్వా పరిపాలన ప్రారంభం అయింది. దీంతో ఆ కాలంలో కూరగాయల వ్యాపారం మానేసి పూల వ్యాపారం మొదలు పెట్టాడు పూలే తండ్రి. అలా పూల వ్యాపారం చేస్తూ ఉండడం వలన వారి ఇంటి పేరు ఫూలే గా మారింది. 

7 సంవత్సరాల వయస్సులో ఫూలే ఒక మరాఠీ పాఠశాలలో చేరి తన ప్రాథమిక విద్యనభ్యాసాన్ని ప్రారంభించాడు. కొన్ని రోజులకు చదువును మానేసి తన తండ్రికి వ్యవసాయంలో సాయం చూస్తూ ఉండేవాడు. పనులు ముగించుకుని రాత్రి పూట లాంతరు ముందు కూర్చుని చదువుకునేవారు పూలే. అది గమనించిన ఒక ముస్లిం టీచర్, మరో క్రైస్తవ పెద్వ మనిషి పూలే తండ్రితో మాట్లాడి తన చదువును తిరిగి కొనసాగించేలా ఒప్పించారు. 1841లో స్కాటిష్ మిషన్ పూణేలో నడుపుతున్న పాఠశాలలో చేర్పించాడు.

#శివాజీ అంటే అభిమానం...

జోతిరావ్‌కు చిన్నప్పటి నుంచే శివాజీ అంటే అభిమానం ఎక్కువ. శివాజి, జార్జ్‌ వాషింగ్టన్‌ల జీవితచరిత్రలు ప్రభావితం చేయడంవల్ల దేశభక్తి, నాయకత్వ గుణాలు అలవాటయ్యాయి. #థామస్‌ రచించిన ‘మానవ హక్కులు’ పుస్తకం అతని ఆలోచనలను ప్రభావితం చేసింది.

#వివాహం:

తన చదువును కొనసాగిస్తున్న సమయంలోనే అంటే పూలే 13వ ఏట 9ఏళ్ల సావిత్రి బాయితో వివాహం జరిపించారు. తన చదువులు పూర్తి చేసుకున్న అనంతరం పూల వ్యాపారం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవారు. 1848లో జరిగిన ఒక సంఘటన పూలేని గాయపర్చింది. దీంతో పూలే అప్పటి నుంచి వివక్షపై పోరాడాలని నిశ్చయించుకున్నాడు. దాంతోపాటు సమాజంలో స్త్రీలు విద్యావంతులు కావాలనే నిర్ణయానికొచ్చాడు. తన భార్య సావిత్రిబాయి పూలేని పాఠశాలకు పంపించాడు. మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించాడు. ఆయన స్థాపించిన పాఠశాలలో అన్ని కులాల వారికి ప్రవేశం కల్పించాడు. అతను తక్కువ కులానికి చెందినవారు కావడంతో ఆ పాఠశాలలో విద్యను బోధించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో తన భార్య #సావిత్రి బాయి పూలేని ఆ పాఠశాలకు మొదటి మహిళా ఉపాధాయురాలిగా నియమించాడు.

 
కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురౌతున్న బడుగు, బలహీనవర్గాల ప్రజలకు తాను అండగా నిలిచాడు. అందరికీ చదువు ఎంతో అవసరమని పాఠశాలలను రూపొందించారు.

#ప్రజల్లో చైతన్యం:

ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. చిన్న పిల్లలని ముసలివారికిచ్చి పెళ్ళి చేయడం వల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతువులయ్యేవారు. దీంతో వితంతు వివాహాలను చేయాలని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాడు.1853లో వితంతు మహిళల అనాథ శిశువుల కోసం సేవాసదనం ప్రారంభించాడు. అంతేకాక వింతంతువుగా మారిన గర్భిణీ స్ర్తీల కోసం 1864లో "బాలహత్య ప్రధిబంధక్ గృహ" స్థాపించాడు. 1872లో ఈ కేంద్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుణ్ణి ఫూలే దత్తత తీసుకున్నాడు. 1873 సెప్టెంబరు 24న సత్య శోధక సమాజాన్ని ఫూలే స్థాపించాడు.
ఫూలే కేవలం శూద్ర వర్ణాల్లో అణిచివేతకు గురౌతున్న కులాల ప్రజల పక్షాన పోరాడటమే కాకుండా, అగ్రవర్ణ వితంతువుల పునర్వివాహానికి గొప్ప కృషి చేశారు.

#దీనబంధు' వార పత్రిక...

 1873లో 'గులాంగిరి', 'సేద్యగాని చర్మకోల' అనే గ్రంథాల్ని రచించారు. 
1871 సత్యశోధక సమాజం తరపున 'దీనబంధు' వార పత్రిక ప్రారంభించాడు. 1880లో భారత ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమ పితామహుడు లోఖాండేతో కలసి రైతులను, కార్మికులను సంఘటితం చేసేందుకు ప్రయత్నించాడు.

#శివాజీ చరిత్రను గేయ రూపంలో....

1874 ఫిబ్రవరి 12న మహాత్మ జ్యోతిబా ఫూలే, రాయఘడ్‌లోని శివాజీ సమాధిని వెలికితీసి ఆయన చరిత్రను గేయ రూపంలో రాసి 1885 నుండి శివాజీ జయంతి ఉత్సవాలను ప్రారంభించాడు. 

#సామాజిక,ప్రజాస్వామ్యం సాధించటం  దేశానికి ముఖ్యం.....

సామాజిక,ప్రజాస్వామ్యం సాధించటం ఈ దేశానికి అతి ముఖ్యమనే సందేశాన్ని అందించినారు
సామాజిక ప్రజాస్వామ్యం సాధించటం భారత దేశానికి ముఖ్యమనే మహత్తర సందేశాన్ని అందించిన మహాత్మ ఫూలే తన గురువు అని డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ ప్రకటించారు. దక్షిణాఫ్రికా జాతీయోద్యమ నాయకుడు #నెల్సన్‌ మండేలా భారతదేశ పర్యటనకు వస్తున్న సందర్భంలో ఆ మహనీయునికి సమర్పించాలని నిర్ణయించుకొన్న గౌరవ కానుక మహాత్మ ఫూలే రచించిన మహత్తర గ్రంథం ‘#గులాంగిరి’.ఫూలే. సమాజంలో వెనుకబడిన వర్గాల, కులాల, మహిళల అభ్యున్నతికి చేసిన కృషికి ఆయనను ప్రజలు “#మహాత్మా” అనే బిరుదుతో పిలుచుకున్నారు.

#తెలుగు వారి సహకారం:

గాంధీజీ కంటే ముందే మహాత్మునిగా జన నీరాజనాలందుకున్న జోతీరావు ఫూలే దంపతులు నివసించిన భవనం నేటికీ పుణేలో నిలిచి ఉంది. ఆ భవనంలోని హాలులో ఫూలే, సావిత్రిబాయి ఫూలే, సాహు మహరాజ్‌ల సరసన మరో నిలువెత్తు చిత్రపటం కనబడుతుంది. ఆయన ఫూలే సామాజిక సంస్కరణోద్యమానికి తుదిశ్వాస వరకు చేదోడువాదోడై నిలిచిన జాయా కారాడీ లింగు తెలంగాణం కన్న తెలుగుబిడ్డ. నైజాం సంస్థానంలో న్యాయమూర్తి పదవిని కాదనుకొని తండ్రిలా భవన నిర్మాణవృత్తిని చేపట్టారు. పుణే, ముంబైలలో సామాజిక ఉద్యమకారునిగా సుప్రసిద్ధులైన ఆయన పుణే మునిసిపాలిటీకి ఎన్నికై, 12 ఏళ్ల ప్రజాప్రతినిధిగా పనిచేశారు. కారాడీ లింగువంటి సహచరుడు దొరకడం ఫూలే అదృష్టమని చరిత్రకారులు అంటారు. కారాడి లింగు తండ్రి జాయా ఎల్లప్పలింగు ముంబైలో భవన నిర్మాణ కాంట్రాక్టరు.ఫూలే కొంతకాలం భవన నిర్మాణ కాంట్రాక్టరుగా పనిచేశారు. అప్పుడే ఆయనకు ముంబై తెలుగు ప్రజల పితామహునిగా ప్రసిద్ధులైన కాంట్రాక్టరు రామయ్య వెంకయ్య అయ్యవారితో పరిచయమైంది. వెంకయ్య ఫూలేను ముంబైకి ఆహ్వానించి, తోటి కాంట్రాక్టర్లతో కలిసి సత్యశోధక సమాజాన్ని విస్తరింపజేయడానికి, పాఠశాలలను ఏర్పాటుచేసి నడపడానికి ఆర్థిక, హార్దిక సహాయాలను అందించారు. సత్యశోధక సమాజానికి తెలుగువారి విరాళాలే ప్రధాన ఆర్థిక వనరుగా ఉండేవి. వెంకయ్య ఇల్లే అనాథ బాలల ఆశ్రమంగా ఉండేది. ఫూలే ప్రసిద్ధ గ్రంథం ‘గులాంగిరి’ని ఆయనే ప్రచురించారు.

ఏ #ప్రాణస్నేహితుని పెండ్లిలో అవమానపడ్డాడో ..అదే ప్రాణస్నేహితుడు పూలేగారికి చివరి వరకు సహాయసహాకారాలు అందించి తోడ్పాటుగా నిలవడం #కొసమెరుపు.....

#దీర్ఘకాల వ్యాధితో బాధపడుతూ… తన జీవితాంతం అసమానతలు లేని సమసమాజ స్థాపన కోసం పరితపించి మహాత్మా జ్యోతిరావు ఫూలే 1890 నవంబర్ 28న కన్నుమూశారు. ఆ మహానీయుడు, సామాజిక తత్వవేత్త, సమన్యాయ సత్య శోధకుడు.

0 comments:

Post a Comment