A homepage subtitle here And an awesome description here!

Thursday, March 17, 2022

కల్పనా చావ్లా జయంతి 🌻

🌻TODAY KALPANA CHAWLA BIRTH ANNIVERSARY🌻

🌻కల్పనా చావ్లా జయంతి సందర్భంగా🌻



🌺కల్పనా చావ్లా (మార్చి 17 , 1962 – ఫిబ్రవరి 1 ,
2003 ), ఈమె ఒక ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి మరియు వ్యొమనౌక యంత్ర నిపుణురాలు.

🌺నాసా శాస్త్రవేత్తగా ఎంపిక🌺

🌺1994 లో మొట్టమొదటి సారి కల్పనా చావ్లా పేరు ప్రపంచానికి తెలిసింది. ఎందుకంటే అప్పుడామెను "నాసా" వ్యోమగామిగా ఎంపిక చేసింది. నిజానికి కల్పనా చావ్లా "నాసా" కు దరఖాస్తు చేసేనాటికి ఆమెతో పాటు దాదాపు 2000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చెసుకున్నారు. అంతమందినీ పరిశీలించి... కేవలం 23 మందినే నాసా ఎంపిక చేసింది. 1995 లో మిగతా 22 మందితో కలసి నాసాకు చెందిన వ్యోమగామి శిక్షణ కార్యక్రమాన్ని ఈమె పూర్తి చేసుకున్నారు. టెక్సాస్ లోని హూస్టన్ లో గల జాన్సన్ స్పేస్ సెంఆట్ర్లో తన శిక్షణ చాలా ఆనందంగా గడిచిందంటారీమె... అక్కది శిక్షణ గురించి వ్యాఖ్యానిస్తూ "శిక్షణ చాలా ఉత్కంఠభరితంగా తమాషాగా ఉండేది. తమాషాగానూ ఉండేది లెండి." అనేవారు. తరువాత పైలట్ గా వివిధ రకాల విమానాలు నడిపేందుకు అర్హత సాధించారు.

🌺అంతరిక్ష యానం🌺

🌺1997 లో కల్పనా చావ్లా అంతరిక్ష యానం చేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. అప్పుడీమె 376 గంటల పాటు అంతరిక్షంలో గడిపారు. భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించి 6.5 మిలియన్ మైళ్ళు అంతరిక్ష యానం చేశారు. నాసా వ్యోమగామిగా కల్పనను ఎంపుక చేసేటప్పుడు ఒక తమాషా సంఘటన జరిగింది. అదేమిటంటే ఈమెకు వైద్య పరీక్షలు చేశారు. ఒక డాక్టరు ఈమె ఎక్స్రే పరిశోలిస్తూ "నువ్వు శాఖాహారివా?" అంటూ ప్రశ్నించారు. "అవును, నేనెప్పుడూ మాంసం ముట్టలేదు" అని కల్పన జవాబిచ్చారు. "అది ఎక్స్రే చూడగానే తెలిసిందిలే. ఎందుకంటే లోపలంతా చాలా స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంది" అంటూ డాక్టరు పెద్దగా నవ్వేశారు. కల్పన కూడా ఆయనతో గొంతు కలిపారు.

🌺2003, జనవరి 16 న రెండోసారి అంతరిక్షం లోకి వెళ్ళే ముందు కల్పనా చావ్లా విలేకరులతో మాట్లాడారు. "భారతదేశంలో మొట్టమొదటి విమానాన్ని నడిపిన జె.ఆర్.డి.టాటా యే నాకు స్ఫూర్తి, అందుకనే ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ ను కెరీర్ గా తీసుకున్నా" అని చెప్పారు. భారత మహిళలకు మీరిచ్చే సందేశమేమిటని అడిగితే..... "ఏదో ఒకటి చేయండి, కానీ దాన్ని మిరు మనస్ఫుర్తిగా చేయాలనుకోవాలి. ఎందుకంటె ఏదైనా పనిని కేవలం ఒక లక్ష్యం కోసం చేయడం కాక,... దానిలో లీనమై అనుభవించాలి" అనేవారు. అలా అనుభవించలేని వారు తమకు తాము వంచించుకున్నాట్లేయని చెప్పెవారు.

🌺పరిశోధనా రంగంలో🌺

🌺డాక్టర్ కల్పన 1988 లో నాసా అమెస్ రీసెర్చ్ సెంటర్ లో చేరారు. విమాన యానానికి సంబంధించిన అనేకాంశాలపై పరిశోధనలు చేశారు. 1993 లో కాలిఫోర్నియా లోని లాస్ అల్టోన్ లో గల ఓవర్ సెట్ మెథడ్స్ ఇన్కార్పోరేటెడ్ లో ఉపాధ్యక్షురాలు (రీసెర్చి సైంటిస్ట్) గా చేరారు. అక్కది శాస్త్రవేత్తలతో కలిసి అంతరిక్షం లో శరీర కదలికలు, సమస్యలపై అనేక పరిసోధనలు చేశారు.ఏరో డైనమిక్స్ ఆప్టిమైసేషన్ కు సంబంధించిఅనేక టెక్నిక్స్ ను అభివృద్ధి పర్చారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సెమినార్లలో పరిశోధనా పత్రాలను సమర్పించారు.

🌺వ్యోమగామిగా🌺

🌺వ్యోమగామిగా ఎంపికైన తర్వాత శిక్షణలో భాగంగా ఆమె ఎంత కష్టమైన పనినైనా దీక్షతో చేశారు. వ్యోమగాములందరూ కొండ ఎక్కుతున్నారు. వెంట తెచ్చుకున్న బరువూ మోయలేక ఒక్కొక్కరు వాటిని వదిలివేస్తూ ఉంటే ఆ వెనకే వస్తున్న కల్పన వాటిని మోసుకొచ్చేవారు. సహచర వ్యోమగాములు వారించిన తర్వాతే వాటిని వదిలివేసేవారు. శారీరక శ్రమ విషయంలో పురుషుల కంటే తాను తక్కువ కాదని నిరూపించుకున్నారు. కల్పన ఒక శక్తిగా ఎదిగారు. కనుకే 1988 లో నాసా లోని రీసెర్చి సెంటర్ లో సైంటిస్ట్ గా చేరిన కల్పన అయిదేళ్ళకే ఎన్నో పరిశోధనలు చేసి కాలిఫోర్నియా ఓవర్ సెట్ మెథడ్స్ వైస్ ప్రెసిడెంత్ గా ఎన్నికైనారు. 1995 లో నాసా వ్యోమగామి అభ్యర్థిగా ప్రకటించింది. 15 మంది వ్యోమగాములు కలసి కల్పన అంతరిక్షంలోకి వెళ్ళేందుకు మూడేళ్ళపాటు శిక్షణ తీసుకున్నారు. 1997 లో ఎస్టిఎస్ - 87 లో అంతరిక్షం పైకి వెళ్ళారు. 1997, నవంబరు 19 న మిషన్ స్పెషలిస్టు గా ఆరుగురు సభ్యులు గల చోదక సిబ్బందిలో ఒకరుగా 4 వ యు.ఎస్.మైక్రో గ్రావిటీ పేలోడ్ ప్లైట్ లో కొలంబియా "ఎస్టిఎస్ -87" మీద అంతరిక్షయానం చేసి సూర్యుని వెలుపలి వాతావరణాన్ని అధ్యయనం చేశారు.

🌺రెండవసారి అంతరిక్ష యానాన్ని చేసే అవకాశం కూడ ఆమెకు లభించింది. 2003, జనవరి 16 న ఎస్టిఎస్-107 కొలంబియా స్పేస్ షటిల్ లో 16 రోజుల అంతరిక్ష పరిశోధనకు అంతరిక్షంలోకి వెళ్లడానికి నిర్ణయం జరిగింది.

🌺అవార్డులు🌺

🌺మరణానంతర గౌరవాలు🌺

🌺కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ అఫ్ ఆనర్

🌺NASA స్పేస్ ఫ్లైట్ మెడల్

🌺NASA విశిష్ట సేవా మెడల్

🌺డిఫెన్స్ విశిష్ట సేవా మెడల్

🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

Wednesday, March 16, 2022

ఆంధ్రరాష్ట్ర అవరతణకు మూలపురుషుడు......అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి

🌷🙏ఆంధ్రరాష్ట్ర అవరతణకు మూలపురుషుడు......అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా వారికి అక్షర నివాళులు🌷 





 ✍️పొట్టి శ్రీరాములు గారు భారతదేశ మెర్కాటరా? ***భాషా ప్రయుక్త రాష్ట్రాలకు బీజం వేసింది శ్రీరాములేనా?*** ✍️ప్రముఖ రచయిత, చరిత్రకారుడు రామచంద్ర గుహ.. శ్రీరాములు గారి గురించి ఏమన్నాడు? 🌺🌺శ్రీరాములు గారి గురించి గాంధీజీ ఏమన్నాడు? ✍️ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు #అమరజీవి. మహా పురుషుడు, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు. ✍️బాల్యం-తొలి జీవితం: పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌనులో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వీరి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పడమటిపాలెం గ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు. జీతం నెలకు 250 రూపాయలు. 1928లో వారికి కలిగిన బిడ్డ మరణించాడు. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమంచేరాడు. ✍️స్వాతంత్ర ఉద్యమంలో: పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు. 1985లో ప్రచురింప బడిన ఆంధ్ర ఉద్యమం కమిటీ అధ్యయనంలో పొట్టి శ్రీరాములు - మహాత్మా గాంధీల మధ్య అనుబంధం గురించి చెప్పబడింది. - "సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు సేవ చరిత్రాత్మకమైనది. ప్రేమ, వినయం, సేవ, నిస్వార్ధతలు మూర్తీభవించిన స్వరూపమే శ్రీరాములు. సత్యాన్ని అహింసను ఆరాధించే ప్రేమమూర్తి. దరిద్ర నారాయణుల ఉద్ధతికి అంకితమైన మహానుభావుడు..... శ్రీరాములు తన కర్తవ్య దీక్షలను ఉత్సాహంగా నిర్వహిస్తూ ఆశ్రమంలో అందరి మన్ననలనూ గాంధీ ఆదరాన్నీ చూరగొన్నాడు. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లోను, ఆంధ్రలో కృష్ణా జిల్లాలోని కొమరవోలులోను గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కొమరవోలులోయెర్నేని సుబ్రహ్మణ్యం నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరాడు. 1943-44ల్లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషిచేసాడు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవాడు. ✍️ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష: 1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష బూని, సాధించాడు. మరోసారి నిరాహారదీక్ష చేసి, మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసాడు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చెయ్యవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తరువులు ఇచ్చింది. *✍️గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు అతని మంకుతనం మీద కాస్త చిరాకు కూడా ఉండేవి. 🌺🌺శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవాడు.🌺🌺 1946 నవంబరు 25న ఈ గాంధీ శిష్యుడు మద్రాసు ప్రొవిన్సులోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే స్వాతంత్ర్యం రావచ్చునన్న ఆశాభావంతో కాంగ్రెసు నాయకులు, సభ్యులందరి దృష్టీ ఆ స్వాతంత్ర్యోద్యమంపైనే ఉంది. కనుక శ్రీరాములు దీక్షను మానుకోవాలని వారు సూచించినా అతను వినకపోయేసరికి ఇక వారు గాంధీని ఆశ్రయించారు. ఎలాగో గాంధీ శ్రీరాములుకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశాడు. ✍️జీవితం చివరిదశలో..... జీవితం చివరిదశలో నెల్లూరులో ఉంటూ, హరిజనోద్ధరణకు కృషిచేసాడు. దీనిగురించిన నినాదాలను అట్టలకు రాసి, మెడలో వేలాడేసుకుని ప్రచారం చేసేవాడు. కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ను పిచ్చివాడనేవారు. ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని, అమరజీవి అయ్యాడు. ✍️ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు #నిరాహారదీక్ష: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆంధ్రదేశానికి కూడా మద్రాసు రాజధానిగా వుండేది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు పొట్టి శ్రీరాములు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు. ✍️ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా ప్రకటన చెయ్యలేదు. చివరికి 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు. ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. మద్రాసులో జరిగిన ఆయన శవయాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారు. తదుపరి జరిగిన పరిణామాలలో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు, హింస చెలరేగాయి. పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు. చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటన చేసాడు. కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రంఏర్పరచారు. తర్వాత 1956 నవంబర్ 1 న తెలంగాణ తో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. *🌺ప్రముఖ రచయిత, చరిత్రకారుడు 🌺రామచంద్ర గుహ.. శ్రీరాములు గురించి ‘ది హిందూ’ పత్రికలో రాసిన వ్యాసంలో ఇలా పేర్కొన్నారు.. * *✍️దురదృష్టవశాత్తూ ఆంధ్రా బయట ఆయనొక మర్చిపోయిన వ్యక్తి. భారతదేశ చరిత్ర, భౌగోళిక స్వరూపంపై శ్రీరాములు గణనీయమైన ప్రభావం చూపారు. ఆయన దీక్ష, దాని తదనంతర పరిణామాలు.. భారతదేశ చిత్రపటాన్ని భాషాప్రయుక్త రేఖల్లో పునఃచిత్రీకరించాయి. పొట్టి శ్రీరాములు భారతదేశ 🌺మెర్కాటర్ (1569లో ప్రపంచ పటాన్ని తయారు చేసిన జర్మన్-ఫ్లెమిష్ భౌగోళిక శాస్త్రవేత్త)గా అభివర్ణించవచ్చు.‘‘** ***🌺భాషా ప్రయుక్త రాష్ట్రాలకు బీజం వేసింది శ్రీరాములేనా?*** భాషాప్రయుక్త రాష్ర్టాలకు బీజం వేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములే అని మేధావుల అభిప్రాయం. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాతే భారతదేశంలో అనేక భాషాప్రయుక్త రాష్ర్టాలు ఏర్పడినాయి. ✍️శ్రీరాములు మరణానికి కారకులెవరు?.. పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి.. ప్రాణత్యాగం చేస్తే ఆయన్ను కనీసం పట్టించుకోలేదని మదరాసు ముఖ్యమంత్రి రాజగోపాలాచారి, ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూలపై చాలామంది అప్పట్లో మండిపడ్డారు. శ్రీరాములు అంత్యక్రియల సందర్భంగా ప్రకాశం పంతులు మాట్లాడుతూ.. ‘‘నెహ్రూ తలచుకుంటే శ్రీరాములు ఆదర్శం అతను బతికి ఉండగానే అమలు జరిగేది. ధార్ కమిటీ వ్యవహారమంతా సౌకల్యంగా పరిశీలించి.. మద్రాసును ప్రత్యేక రాష్ట్రం చెయ్యమన్నది. అదే శ్రీరాములు కోరాడు. అన్యాయమైనదేమీ అతడు కోరలేదు.(ఆంధ్రపత్రిక) ✍️మరణించాక మరీ దారుణం ఎదురైంది: ఇక మరణించాక మరీ దారుణం ఎదురైంది. తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు. చివరి వరకు దీక్షలో తోడుగా ఉన్న సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళవైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకునిి వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీగాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాగనంపుదాం అని ఒప్పించి తెచ్చారు. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా నేనూ వస్తానని వచ్చారు. తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళటం సబబుకాదు అని తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఒక ఎద్దులబండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే ఆశువుగా ఘంటసాల తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని, చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువుల బాసిన శ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడతూ శవయాత్ర ప్రారంభించారు. యేర్నేని సాధు సుబ్రహ్మణ్యం గారే అమరజీవి శ్రీరాములకు దహనక్రియలు కర్మకాండ జరిపారు. శ్రీరాములు అంత్యక్రియల సందర్భంగా ప్రకాశం పంతులు మాట్లాడుతూ.. ‘‘మనలో మనం తగువులాడుకుంటున్న సమయంలో ఆంధ్రరాష్ట్రం కోసం తన ప్రాణాలను బలిదానం చేసి, మనందరికీ ఒక గుణపాఠం నేర్పాడు శ్రీరాములు. స్వార్థంతో మనమంతా శ్రీరాములును దీక్ష విరమించవలసిందిగా కోరాం. అయితే, శ్రీరాములు ఒక ఆదర్శం కోసం చివరిదాకా దీక్షను కొనసాగించి, నిస్సంకోచంగా తన నిండు ప్రాణాలను అర్పించాడు. ✍️పొట్టి శ్రీరాములు ✍️ప్రశంస: *తపాలాశాఖ 2000లోపొట్టి శ్రీరాములు గుర్తుగా తపాలాబిళ్ళనువిడుదల చేసింది. *మద్రాసు మైలాపూరు, రాయపేట హైరోడ్డులో శ్రీరాములు అమరజీవియైన 126 నంబరు ఇంటిని ఆయన స్మృతి చిహ్నంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కాపాడుతున్నది. *ఈ మహనీయుని జ్ఞాపకార్థం రాష్ట్రప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించింది. * *నెల్లూరు జిల్లా పేరును 2008లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు. ✍️ఆంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకై అహింసాయుత సత్యాగ్రహం ద్వార ఆత్మబలిదానం చేసిన ఆ అమరజీవి కథ నేటి యువతరానికి మార్గదర్శకం అయి, భవ్య భావోన్నత భవిష్య నిర్మానానికి ప్రేరకం కాగలదు.

Monday, March 7, 2022

గ్రంథాలయ గాంధీ" అయ్యంకి వెంకట రమణయ్య గారి వర్థంతి

🌹🙏 గ్రంథాలయోద్యమకారుడు, ఆయుర్వేదం,ప్రకృతి వైద్యంలో సిద్ధహస్తులు,పత్రికా సంపాదకుడు, గ్రంథాలయ పితామహుడు,"గ్రంథాలయ గాంధీ" అయ్యంకి వెంకట రమణయ్య గారి వర్థంతి సందర్భంగా🙏🌹





#ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు విస్తరించిన కారణంగా పుస్తకాలు చదివేవారు తక్కువయ్యారు. పెద్ద గ్రంథాలయాలు కొన్ని బాగా నడుస్తున్నప్పటికీ, మరికొన్ని గ్రంథాలయాలు సరైన సంరక్షణ, పర్యవేక్షణ లేక మూతపడుతున్నాయి.
కొన్ని దశాబ్దాలకి పూర్వం ఈ గ్రంథాలయాల అభివృద్ధికి ప్రముఖ గ్రంథాలయోద్యమకారుడు, పత్రికా సంపాదకులు అయ్యంకి వెంకట రమణయ్య ఎంత కృషిచేశారు.

#అయ్యంకి వెంకట రమణయ్య  గ్రంథాలయోద్యమకారుడు, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంలో సిద్దహస్తులు, పత్రికా సంపాదకుడు. గ్రంథాలయ సర్వస్వము అనే పత్రికను నిర్వహించాడు. ఈయన గ్రంథాలయ ఉద్యమంలో జీవితాంతం విశేష కృషి సల్పి గ్రంథాలయ పితామహుడుగా పేరుగాంచాడు.

#ఆయన తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా అనపర్తి నియోజక వర్గంలోని బిక్కవోలు మండంలో ఉన్న కొంకుదురు గ్రామంలో 1890 జూలై 24న జన్మించాడు. వీరి తల్లిదండ్రులు వెంకటరత్నం, మంగమాంబ.వీరి తండ్రి శ్రీ వెంకతరత్నం గారు నీటిపారుదల శాఖలో ఉద్యోగి. ఈయన అయ్యంకిలో శ్రీ గంగా పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం నిర్మించారు. 

#గ్రంథాలయోద్యమం:

1911లో విజయవాడలో రామమోహన గ్రంథాలయ స్థాపనకు తోడ్పడ్డాడు. 1914లో విజయవాడలో ఆంధ్రదేశ గ్రంథ భాండాగార, ప్రతినిధుల గ్రంథాలయ మహాసభలు జరిపి భారతదేశంలో తొలిసారిగా గ్రంథాలయ సంఘాన్ని, 1915లో సంఘ పక్షాన గ్రంథాలయ సర్వస్వం పత్రికను స్థాపించడానికి తోడ్పడ్డారు. 1919లో అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘాన్ని స్థాపించి, 1924లో ఆ సంఘ పక్షాన ఇండియన్ లైబ్రరీ జర్నల్ అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించాడు. వీరు ఈ సంఘాన్ని స్థాపించిన రోజును నేషనల్ లైబ్రరీ డేగా భారత గ్రంథాలయ సంస్థ గుర్తించి దేశమంతటా 1968 నుంచి ప్రతి సంవత్సరం జాతీయ గ్రంథాలయ వారోత్సవము (నేషనల్ లైబ్రరీ వీక్) ను నిర్వహిస్తుంది.

#గ్రంథాలయోద్యమంలో 70ఏళ్ళు నిర్విరామకృషిచేసిన నిస్వార్ధపరుడు.
చదువు కూడా ఆటలో భాగమేననీ, అన్నిటికంటే చదువే ఓ గొప్ప ఆట అనీ పిల్లలకు తెలియజెప్పేందుకు ఆయన  పుస్తకం రాసారు.

1907లోప్రముఖ #జాతీయ నాయకుడు,స్వాతంత్య్ర సమర యోధుడు బిపిన్ చంద్రపాల్  రాజమండ్రి లో భారతస్వాతంత్య్ర సమరంలో యువకులు పాల్గొనాలని ఇచ్చిన ఉత్తేజపూరితమైన ఉపన్యాసాలు విని, చదువుకు స్వస్తి చెప్పి దేశ సేవకు జీవితాన్ని అంకితం చెయ్యటానికి 'రక్షాబంధనం ' కట్టుకొన్నారు.

#దేశంలోని పలు సమస్యలకు ముఖ్యకారణం అవిద్య, అజ్ఞానం అని గ్రహించి, అందరినీ విద్యావంతులుగా,
జ్ఞాన వంతులుగా చెయ్యాలని అందుకు గ్రంథాలయాల వ్యాప్తి అవసరమని భావించి ఆ ఉద్యమ వ్యాప్తికి కంకణం
కట్టుకొన్నారు. 1910 లో బందరులో 'ఆంధ్రభారతి' సచిత్ర మాసపత్రిక ప్రారంభించారు. అలాగే 'గ్రంథాలయసర్వస్వం'(త్రైమాసిక),
'ఇండియన్ లైబ్రరీ జర్నల్', 'కొరడా', 'ప్రకృతి', 'ది ఇండియన్ నేచురోపతి','సహకారం', 'దివ్యజ్ఞాన దీపిక' వంటి పత్రికలను కూడా నడిపారు.

#వేటపాలెం, సి.పి.బ్రౌన్, శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషానిలయం లాంటి ప్రసిద్ధ పొత్తపుగుడుల అభివృద్ధిలోనూ పాలుపంచుకున్నారు. #ఏటా తన రెండు నెలల పెన్షనుతో రెండు పౌర గ్రంథాలయాలకు, సంక్షేమ కార్యక్రమాలకు సాయపడేవారు. అందుకే ఆయన ‘గ్రంథాలయ గాంధీ’ అయ్యారు.#

#ఆంధ్రభాషాభివర్థినీ మండలి, ఆంధ్రపరిషత్తు,కళాపీఠము, దివ్యజ్ఞాన చంద్రికామండలి అనే గ్రంథమాలలను
స్థాపించి అనేక ఉత్తమ రచనలను తెలుగు పాఠకులకు అందించారు. గ్రంథాలయోద్యమంలో వీరి సేవలను
గుర్తించి, వారి సప్తతి మహోత్సవ సందర్భంగా ,గుడివాడలో 'సరస్వతీ సామ్రాజ్య ప్రతిష్ఠాపనాచార్య' బిరుదుతో
సత్కరించారు.1977లో ప్రొఫెసర్ కౌలా అంతర్జాతీయ స్వర్ణపతకం అందుకున్నారు. భారత ప్రభుత్వం వీరి గ్రంథాలయ సేవలకు స్పందించి 1972 లో
'పద్మశ్రీ' తో గౌరవించింది.

#ఆంధ్రదేశంలో గ్రంథాలయోద్యమ పితామహుడుగా,గ్రంథాలయ వైతాళికుడుగా, 'గ్రంథాలయ శాస్త్ర విశా‌ద'గా ,వెలుగొందాడు అయ్యంకి వెంకటరమణయ్య.

#వెంకటరమణయ్యగారు 1979, మార్చి 7న దివంగతులైనారు. ఏటా ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన మనుమడు ఆచార్య డా.వెంకట మురళీకృష్ణ విద్యార్థులకు నోటు పుస్తకాలు అందిస్తున్నారు. తమ పూర్వీకులు కట్టించిన ఆలయానికి ధర్మకర్తగా ఉంటూ, లక్షలాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. ఆయన స్వగ్రామంలో ‘అయ్యంకి’ పేరిట ఒక గ్రంథాలయం నెలకొల్పాలని స్థానికుల అభిలాష.


Sunday, March 6, 2022

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

🙏💐 *స్త్రీ లేకపోతే జననం లేదు*
*స్త్రీ లేకపోతే గమనం లేదు*
*స్త్రీ లేకపోతే సృష్టిలోజీవం లేదు*
*స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు*
*కంటికి రెప్పలా కాపాడే స్త్రీ మూర్తులందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు*💐



వినాస్త్రీయ జననం నాస్తి, వినాస్త్రీయ గమనం నాస్తి వినాస్త్రీయ జీవం నాస్తి, వినాస్త్రీయ సృష్టి ఏవన్నాస్తి’.. 

అమ్మగా లాలిస్తుంది. అక్కా, చెల్లిగా అనుబంధాన్ని పంచుతుంది. భార్యగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. పాత్ర ఏదైనా పరిపూర్ణ బాధ్యత నిర్వర్తించే అపూర్వ వ్యక్తి మహిళ. మగువలను గౌరవించాలనే భావన భారతీయుల రక్తంలోనే ఉంది. యత్ర నార్యంతు పూజ్యతే, రమంతే తత్ర దేవత..’ అంటే ఎక్కడ నారీమణులు పూజింపబడుతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని భారతీయుల నమ్మకం.. అందుకనే ప్రతిరోజూ పూజిస్తాం, ఆరాధిస్తాం.
    
ఈ లోకంలో స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీలేకపోతే అసలు సృష్టే లేదు. మరి.. మనల్ని కంటిపాపలా కాపాడే ‘స్త్రీమూర్తి’ని స్మరించుకోవడం మన అందరి బాధ్యత. తల్లిగా లాలిస్తూ.. చెల్లిగా తోడుంటూ.. భార్యగా బాగోగులు చూస్తూ.. దాసిలా పనిచేస్తూ.. కుటుంబ భారాన్ని మోస్తూ... సర్వం త్యాగం చేస్తుంది మహిళ. అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇదే.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్చి 8 న జరుపుకుంటారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక సహా వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు, హక్కుల గురించి వారికి అవగాహన కల్పించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనితో పాటు, ఈ రోజును జరుపుకోవడం వెనుక ఒక కారణం ఉంది.




అంతర్జాతీయ మహిళా దినోత్సవ చరిత్ర:

1908 సంవత్సరంలో తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. తరువాత 1910 లో, సోషలిస్ట్ ఇంటర్నేషనల్ యొక్క కోపెన్‌హాగన్ సమావేశంలో దీనికి అంతర్జాతీయ హోదా ఇవ్వబడింది. ఆ సమయంలో మహిళలకు ఓటు హక్కు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఎందుకంటే అప్పుడు చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు లేదు. అంతేకాదు..1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ఆహారం - శాంతి డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా రాజు నికోలస్ జార్ సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది.

ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. నిజానికి రష్యాలో మహిళలకు ఓటు హక్కు లభించిన సమయంలో, రష్యాలో జూలియన్ క్యాలెండర్, మిగితా ప్రపంచంలోని గ్రెగోరియన్ క్యాలెండర్లో చెలామణిలో ఉంది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 ఆదివారం. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు ఐక్యరాజ్యసమితి 1996 నుండి ప్రత్యేక థీమ్ తో ఈ రోజును జరుపుకోవడం ప్రారంభించింది. దీని తరువాత, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం కొత్త థీమ్ తో జరుపుకుంటారు. 



సామాజికంగాను, రాజకీయాల్లోనూ, ఆర్థిక రంగంలోనూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకుని, వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది. వాస్తవంగా.. కొనసాగుతున్న అసమానతలపై అవగాహన పెంచేందుకు ధర్నాలు, నిరసనలు నిర్వహించటం ఈ దినోత్సవం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం.

*ఈ సంవత్సరం థీమ్ విషయానికి వస్తే "Women in Leadership: Achieving an Equal Future in a Covid-19 World" గా ఎంపిక చేసుకున్నారు.*

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ముఖ్య లక్ష్యం మహిళల హక్కులను ప్రోత్సహించడం మరియు ప్రపంచ శాంతిని కాపాడటం.వాస్తవానికి, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఉన్నాయి, ఇక్కడ మహిళలు తమ హక్కుల కోసం ఆందోళన చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా, చాలా దేశాలలో, కాలక్రమేణా, మహిళలు తమ కదలికలలో గెలిచారు మరియు మహిళల పట్ల పరిస్థితి కూడా మారిపోయింది. కానీ ఇప్పుడు మహిళల పట్ల ప్రజల వైఖరి ప్రపంచవ్యాప్తంగా మారడం ప్రారంభించింది. అటువంటి పరిస్థితిలో, రాజకీయాలు, విద్య, కళలు మరియు ఇతర రంగాలలో మహిళల భాగస్వామ్యం పెరగడం ప్రారంభమైంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ఉద్దేశ్యం రాబోయే సంవత్సరాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది.

స్త్రీ లేకపోతే అసలు జననమే లేదు, స్త్రీ లేకపోతె మనకు గమనమే లేదు.. స్త్రీ లేకపోతె జీవం లేదు, స్త్రీ లేకపోతె అసలు సృష్టే లేదు.. ఆమె పుట్టినప్పటి నుంచి ఓ కూతురిగా, ఓ సోదరిగా, స్నేహితురాలిగా, ఆపై భార్యగా, తల్లిగా, చిన్నమ్మ, పెద్దమ్మ, అత్త, నానమ్మ, అమ్మమ్మ.. ఇలా ప్రతిదశలోనూ మనకు ప్రేమను పంచుతుంది స్త్రీమూర్తి. మేము సైతం అంటూ అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్న మహిళా మహారాణులకు  అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

గడియారం రామకృష్ణ శర్మ గారి జయంతి

💐🖋️పరిణత ప్రజ్ఞామూర్తి, శతపత్ర’ యోధుడు,రంగస్థల నటుడు పండిత గడియారం రామకృష్ణ శర్మ గారి జయంతి సందర్భంగా

 【  *చదివింది ఆరో తరగతి వరకే కావచ్చు, కాని ఆరు భాషల్లో అరుదైన పాండిత్యాన్ని సాధించిన° అఖండుడు గడియారం వారు. విశ్వవిద్యాలయాల్లో చదవకున్నా విశ్వవిద్యాలయాలు ఆయన ప్రతిభకు మెచ్చి గౌరవ డాక్టరేట్‌ పట్టా ఇచ్చాయి. తెలుగు విశ్వవిద్యాలయం పక్షాన నాటి గవర్నర్‌ సూర్జిత్‌ సింగ్‌ బర్నాలా చేతుల మీదుగా డాక్టరేట్‌ పట్టానందుకున్న శర్మ అదే విశ్వవిద్యాలయంలో లిపి శాస్త్రం మీద పరిశోధన చేసిన పరిశోధకులకు పర్యవేక్షకులుగా ఉండటం ఎంతో అరుదైన విషయం* 】

✍️తెలుగు సాహితీ రంగంలో అగ్రగణ్యులు.. చరిత్ర, పురావస్తు పరిశోధకుడు.. బహుముఖ ప్రజ్ఞాశాలి గడియారం రామకృష్ణ శర్మ .

గన్నమరాజు గిరిజా మనోహర బాబు

శ్రీచాళుక్య నృపాది పాలితము, రాశీభూత విద్యాకళా

ప్రాచుర్యం బల దక్షిణా పథ పవిత్ర క్షేత్ర రాజంబు నా

ప్రాచీనాంధ్ర విభూతి చిహ్నమగు నాలంపూరు నందాంధ్ర వా

ణీ చాంపేయ సుమార్చనల్‌ జరుగుచుండెన్‌ నేత్రపర్వంబుగన్‌

✍️ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సమక్షంలో తమ గంభీరమైన కంచుకంఠంతో కీ.శే. గడియారం రామకృష్ణ శర్మ గానం చేసిన స్వాగత కవితలోని తొలి పద్యం ఇది. ఈనాటికీ ఇంతటి మహాసభలు జరుగ లేదేమోనన్నంత వైభవంగా విశ్వనాథ, శ్రీశ్రీ దాశరథీ, కప్పగంతుల, కేశవ పంతుల వంటి సాహితీ దిగ్గజాలెందరో పాల్గొన్న నాటి సభకు ఆనాటి భారత ఉపరాష్ట్రపతి సర్వేపల్లి ముఖ్యఅతిథిగా విచ్చేసి సభలు ప్రారంభించారు. హైదరాబాద్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల, మంత్రులు డా. మర్రి చెన్నారెడ్డి, వి.బి.రాజు వంటి రాజకీయ ప్రముఖులందరూ పాల్గొన్న ఆ సభలో కాళోజీ నా గొడవ ఆవిష్కరణ వంటి కార్యక్రమాలే గాక, కవిసమ్మేళనాలు, పుస్తక ప్రదర్శనలు అనేకం జరిగాయి. నేటికీ పచ్చని జ్ఞాపకంగా నిలిచిపోయిన ఆ సభలకు కర్త, కర్మ క్రియ అన్నీ బహుముఖ ప్రజ్ఞాశాలియైన గడియారం రామకృష్ణ శర్మ కావడం ఒక విశేషం.

✍️గడియారం రామకృష్ణ శర్మ 1919 మార్చి 6న అనంతపురం జిల్లా కదిరిలో కీ.శే. జ్వాలాపతి శాస్త్రి, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు


 కొంతకాలం తాము జన్మించిన కదిరిలోనే ఉండి ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తూ తమ పితృవ్యులవద్ద అమరకోశం, కొంత సంస్కృతము చదివారు. ప్రాథమిక పాఠశాలలో 6వ తరగతి వరకు మాత్రమే చదివారు. అక్కడితో వారి పాఠశాల విద్య దాదాపు ముగిసిపోయినట్లే.

 ✍️కారణాంతరాల వల్ల వారు చిన్నతనాననే తమ స్వగ్రామాన్ని వదిలి అలంపురం రావలసివచ్చింది. నాటి నుండి తమ ఆజీవన పర్యంతము దక్షిణకాశిగా వాసికెక్కిన పరశురామక్షేత్రమైన అలంపురమే వారి స్థిర నివాసంగా మారింది.

✍️వారు రచించిన మన వాస్తు సంపద, భారతీయ వాస్తు విజ్ఞానము తెలుగు సిరి వంటి రచనలు వారికి ఈ విషయాల్లో ఉన్న విశేష జ్ఞానానికి చిహ్నాలు. భారతదేశ చరిత్ర వంటి రచనలు వారికి చరిత్ర పైనున్న అధికారాన్ని, ఆసక్తిని తెలియజేస్తున్నాయి. అలంపూరు శిథిలములు, దక్షిణ వారణాసి, అలంపూరు క్షేత్రము మొదలైన గ్రంథములు వారి పరిశోధనా పాటవానికి వారి నిర్దుష్ట సాహితీ మూర్తిమత్వానికి నిదర్శనాలు. మాధవ విద్యారణ్య స్వామి చరిత్రము పేర వారు రచించిన ప్రామాణిక చారిత్రక గ్రంథము లోతైన వారి అధ్యయన శక్తిని బహిర్గతం చేస్తున్నది.

 ✍️కేవలం చరిత్ర, శిల్పం, వాస్తు విజ్ఞానం వంటి గ్రంథాలకే పరిమితం గాక వారి ప్రతిభను ఇతర సాహిత్య రంగాల్లోనూ మనం దర్శించవచ్చును.
✍️సాహిత్య రంగంలో ఉన్న సృజనాత్మక, విమర్శనాత్మక రంగాల్లోనూ శర్మ ప్రతిభ రాణించింది. చిన్నతనాన్నే రాసిన ”చంద్రహాస” పద్యకావ్య రచనతో ప్రారంభమైన రచనా వ్యాసంగం చివరి వరకూ కొనసాగుతూనే వచ్చింది. తెలుగులో మాత్రమేగాక కన్నడ భాషలోనూ విస్తృత పాండిత్యం ఉన్న గడియారం వారు గదాయుద్ధ నాటకము, కన్నడ చిన్న కథలు అనే రెండు అనువాద గ్రంథాలను అందించారు. గదాయుద్ధ నాటకము కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారాన్ని అందుకున్న రచన. రెండు గ్రంథాలు అకాడెమీ వారే ముద్రించారు.

✍️కువలయానందసారము, పాంచజన్యము, దశరూపక సారము మొదలైన శర్మ రచనలు బహుళ ప్రచారము పొందినవి. తిక్కన, పాల్కురికి సోమనాధులను గురించి నెల్లూరు, హైదరాబాదులలో ప్రసంగించిన వారి ప్రసంగ వ్యాసాలు ఆయాకవులపై వారికున్న ప్రత్యయానికి సాక్ష్యాలుగా నిలుస్తాయి.

✍️గడియారం అనేక సంస్థలలో పలుబాధ్యతలను నిర్వహించి కృతకృత్యులయ్యారు. ఆంధ్ర సారస్వత పరిషత్తులో వ్యవస్థాపక సభ్యులుగా, పరీక్షా కార్యదర్శిగా, కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా తెలంగాణ ఆంధ్రోద్యమం (1940-41) తాలూకా సంఘ బాధ్యులుగా అలంపురంలోని శ్రీ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు అధ్యక్షులుగా, అలంపురం తాలూకా రైతుసంఘం అధ్యక్షులుగా, రీజనల్‌ హిస్టారికల్‌ సర్వే కమిటీలో సభ్యులుగా,
ఉస్మానియా విశ్వవిద్యాలయం అకడెమిక్‌ కౌన్సిల్‌ సభ్యులుగా, ఢిల్లీ కేంద్ర సాహిత్య అకాడెమీ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా కూడా ఇతోధిక సేవలందించిన సేవా ధురంధరులు గడియారం రామకృష్ణ శర్మ. ఆం.ప్ర. సాహిత్య అకాడెమీ వారి విశిష్ట పురస్కారం మొదలుకొని వారి జీవితకాలంలో వారందుకున్న సన్మానాలు, సత్కారాలు లెక్కకు మిక్కిలి. 

✍️వారి నాటకరంగాభిరుచి వారినొక మహా నటునిగా, వారి వ్యక్తిత్వము వారి నొక ఆదర్శ మూర్తిగా, వారి సంభాషణా చతురత వారినొక మహావక్తగా, వారి సామాజిక నిష్ఠ వారి నొక ఆరితేరిన యోద్ధగా రూపొందించినవి. వారి సమగ్ర మూర్తిమత్వ దర్శనం వారి చివరి రచనయైన వారి స్వీయచరిత్ర ”శతపత్రము” చదివితే కలుగుతుంది.
కాలంతో పోటీపడి అవిరళ కృషి చేసిన గడియారం రామకృష్ణ శర్మ 25 జూలై 2006న కన్నుమూశారు.

✍️సాహితీవేత్తగానే కాకుండా స్వాతంత్ర్య సమరయోధుడుగానూ పేరొందాడు. స్వాతంత్ర్య సమరంలో చురుగ్గా పాల్గొన్నాడు. రామకృష్ణ శర్మ సంఘ సంస్కరణ అభిలాషి, రంగస్థల నటుడు కూడా.

Monday, February 28, 2022

జాతీయ సైన్స్ దినోత్సవం

🔷జాతీయ సైన్స్ దినోత్సవం
National science day
      February 28🔷


రామన్‌ ఎఫెక్ట్‌ అనే అంశం పై నేచర్‌ పత్రికలో సి.వి.రామన్ ప్రచురించిన వ్యాసాలను చూసి ప్రపంచం ఆశ్చర్యపడింది. 1930 డిసెంబర్‌లో రామన్‌ కు నోబెల్‌ బహుమతి ప్రకటింపబడింది. వీరికి భారతరత్న (1954) బహుకరింపబడింది. భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి సి.వి రామన్. ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి, భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా, అన్నింటికీ మించి భారతరత్నగా మనందరికి సుపరిచితుడు శ్రీ చంద్రశేఖర్ వెంకటరామన్ (సి.వి.రామన్). 
జాతీయ విజ్ఞాన దినోత్సవమును ఈ రోజునే సైన్స్ డే గా పేర్కొంటారు. ప్రతి ఏడది ఫిబ్రవరి 28వ తేదీన సైన్స్ డేను జరుపుకుంటారు. భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి, ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి, భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా, అన్నింటికీ మించి భారతరత్నగా పేరుగాంచిన సీవీ రామన్‌గా ( ప్రముఖ భౌతికశాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్) 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నారు. దీంతో ఈ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు.

అంతే కాదు ఆయన చిన్నతనం నుంచి భౌతికశాస్త్రంలో ఎన్నో అద్భుతాలను సృష్టించారు. 'నా మతం సైన్సు.. దానినే జీవితాంతం ఆరాధిస్తా..' అని చెప్పి తుదిశ్వాస వరకూ శాస్త్రాన్వేషణలోనే గడిపిన దార్శనికుడు. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయస్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తిల్లో సర్ సీవి రామన్.
 భౌతికశాస్త్రంలో రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తుగా ఆ తేదిని జాతీయసైన్స్ దినంగా ప్రభుత్వం ప్రకటించింది. 1888 నవంబరు 7 న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మాళ్ దంపతులకు రామన్ జన్మించారు.
విశాఖపట్నంలో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన రామన్ చిన్ననాటి నుంచే విజ్ఞాన శాస్త్ర విషయాలపై అమితాసక్తిని ప్రదర్శించేవారు. తండ్రి కూడా భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు కావడంతో దానిపై మరింత కుతూహలం పెంచుకున్నారు. తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ పూర్తి చేసి ఫిజిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించాడు. ఆ తర్వాత మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఆ సబ్జెక్టులో గోల్డ్ మెడల్ సాధించిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.

పద్దెనిమిదేళ్ల వయసులో కాంతికి సంబంధించిన ధర్మాలపై రామన్ రాసిన పరిశోధనా వ్యాసాలు లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమయ్యాయి. పరిశోధనల పట్ల అయనకున్న అభిరుచిని గమనించిన అధ్యాపకులు ఇంగ్లాండు వెళ్లాలని సలహా ఇచ్చారు. అయితే ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో ఆయన ఆరోగ్యం ఇంగ్లాండు వాతావరణానికి సరిపడదని తేల్చడంతో ప్రయాణాన్ని విరమించుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం ఫైనాన్స్ విభాగంలో చేరిన సీవీ రామన్ 1907లో ఉద్యోగరీత్యా కలకత్తాకు బదిలీ అయ్యారు.
అక్కడ ఇండియన్‌ సైన్స్‌ అసోసియేషన్‌కు రోజూ వెళ్లి పరిశోధనలు చేసుకునేవారు. రామన్‌ ఆసక్తిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతి అశుతోష్‌ ముఖర్జీ బ్రిటీష్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. రామన్‌ పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే బాగుంటుందని ఆ లేఖలో సూచించారు. అయితే బ్రిటీష్‌ ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసిన రామన్ పరిశోధనలపై పూర్తిస్థాయి సమయాన్ని వెచ్చించాడు.

ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసిఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణులై కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరారు. ఒకసారి కలకత్తాలో వీధుల్లో తిరుగుతుండగా బౌబజారు స్ట్రీట్ దగ్గర ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూశాడు. ఆ సంస్థ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్‌ను కలిసి పరిశోధన చేయడానికి అనుమతిని పొందాడు.
అతని తల్లి పార్వతి అమ్మాళ్‌ వీణను అద్భుతంగా వాయించేది. అందుకే రామన్ తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం లాంటి సంగీత వాయిద్య పరికరాలపై సాగింది. విజ్ఞాన పరిశోధనలపై తృష్ణ‌తో ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ‌లో ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరారు. తను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై 1921లో లండన్‌లో ఉపన్యాసాలు ఇచ్చాడు. శ్రోతల్లోని ఓ వ్యక్తి ఇలాంటి అంశాలతో రాయల్ సొసైటీ సభ్యుడవు కావాలనుకుంటున్నావా అంటు హేళన చేశాడు.
దీంతో రామన్‌కు పరిశోధనలపై మరింత పట్టుదల పెరిగింది. శబ్దశాస్త్రం నుంచి తన పరిశోధనలను కాంతివైపు మళ్లించాడు. ఇంగ్లాండు నుంచి తిరిగొస్తూ ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు రెండూ నీలిరంగులో ఉండటాన్ని ఆసక్తితో గమనించాడు. అప్పటిదాకా అనుకుంటున్నట్లు సముద్రపు నీలం రంగుకు కారణం ఆకాశపు నీలిరంగు ప్రతిబింబంగా ఏర్పడటం కాదని.... సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణమని ఊహించాడు.

కలకత్తా చేరుకోగానే తన ప్రాకల్పనలను నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్థాల కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో యువశాస్త్రవేత్తలైన కె.ఆర్.రామనాధన్, కె.యస్ .కృష్ణన్ ఆయనకు అండగా నిలిచారు. 1927 ఏడాదికి భౌతికశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి పొందిన కాంప్టన్ ఎక్స కిరణాలు పరిశోధననిజమైనపుడు, కాంతి విషయంలోనూ నిజం కావాలంటూ ఆలోచనలో పడ్డాడు.

ఆ ఆలోచనే రామన్ ఎఫెక్టుకు దారితీసింది. అధునాతనమైన పరికరాలు లేకపోయినా తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంగా ఉన్న రామన్ అనుకున్నట్లుగానే 1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నాడు. పారదర్శకంగా ఉన్న ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా కాంతి ప్రసరించినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుందని రామన్ ఎఫెక్ట్ ద్వారా నిరూపించాడు. ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో వెళ్లడించాడు.

దీంతో బ్రిటీష్ ప్రభుత్వం 1929లో నైట్‌హుడ్ బిరుదుతో రామన్‌ను సత్కరించింది. రామన్ ఎఫెక్ట్ అసామాన్యమైందని కేవలం రూ.200 కూడా విలువలేని పరికరాలతో దృగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమైందని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ కొనియాడారు. ఈ పరిశోధనను గుర్తించిన రాయల్ స్వీడిష్ అకాడమీ భౌతికశాస్త్రానికి 1930లో నోబెల్ బహుమతి ప్రధానం చేసింది. సైన్స్‌కు చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయనకు 1954లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించింది. చివరి వరకు భారతదేశంలో సైన్స్ అభివృద్దికై పాటుపడ్డ ఆయన 1970 నవంబర్ 21 కన్నుమాశారు.

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించుకొని ఆయనను చిరంజీవిగా మనమధ్యే నిలిపేలా కొన్ని సంస్థలు ఆయన పేరు మీద టాలెంట్ టెస్ట్‌లు, సైన్స్‌కు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నాయి. విద్యార్థినీ, విద్యార్థుల్లో ఆయన స్ఫూర్తిని నింపుతూ సైన్స్ అంటే మక్కువ కలిగేలా చేస్తున్నాయి.

Friday, February 11, 2022

థామస్ ఆల్వా ఎడిసన్ జయంతి




🌹"మేధావి అంటే ఒక శాతం ప్రేరణ, తొంభై శాతం పరిశ్రమ" అనే నానుడికి నిలువెత్తు రూపం ఎడిసన్ మహాశయుడు... ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా...🌹




👉ప్రపంచంలో అత్యధిక పేటెంట్లు పొందిన శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. ఇతను 1847 ఫిబ్రవరి 11 న అమెరికాలో జన్మించాడు. పుట్టినప్పుడు తల లావుగా, శరీరం పీలగా ఉంటే ఆ బిడ్డ బతకరని అప్పటి (మూఢ) నమ్మకం. ఎడిసన్ కు కూడా తల లావుగా శరీరం పీలగా ఉంటే ఇతను కూడా బతకడని ఇతని తల్లి నాన్సీ. తండ్రి సామ్యూల్ ఎడిసన్ అనుకున్నాడు. ఈమెకు ఆరు మంది పిల్లల్లో అప్పటికే ముగ్గురు చనిపోయారు. కాబట్టి ఎడిసన్ ఎక్కువ కాలం బతకడని అతని తల్లితోపాటు చుట్టు ప్రక్కవారు అనుకొన్నారు.

👉ఏడేళ్ళ వయసులో ఎడిసన్ కు విషజ్వరం వచ్చింది. తల్లి మరింత భయపడినది కానీ విషజ్వరం తగ్గిపోయినా చెవిటితనం మిగిలిపోయింది. ఇతని తండ్రి వ్యాపారంలో లాభాలు తగ్గిపోయినవి. 1859 లో పోర్టు హరన్ - డిట్రాయిట్ మధ్య రైళ్ళ రాకపోకలు మొదలయ్యాయి. ఎడిసన్ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. స్కూలులో ఎడిసన్ ఉపాధ్యాయులు బుద్ది హీనత కలిగిన వ్యక్తి గా పరిగణించారు. ఎడిసన్ తల్లికి ఉపాధ్యాయులు “ఇతనికి చదువు రాదు” అని చెప్పగా ఎడిసన్ తల్లి ఇంట్లోనే చదువు చెప్పుతూ ఎడిసన్ ను ప్రోత్సహించింది. ఎడిసన్ ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. కేవలం మూడు నెలలు మాత్రమే పాఠశాలకు వెళ్ళిన ఎడిసన్ కు తల్లే టీచర్ ఇల్లే బడి. బుట్టలో గుడ్లపై బాతు కూచుంటే పిల్లలు వస్తాయని తెలిసి ఒక రోజు తానే గుడ్లపై కూర్చున్నాడు. ఆ గుడ్లన్ని పగిలిపోయాయి. రెండు గండు పిల్లుల తోకలను రాపిడి చేయడం ద్వారా కరెంట్ ఉత్పత్తి చేయాలని ప్రయత్నించాడు. కరంట్ రాలేదు కానీ ఎడిసన్ కు గాయాలైతే అయ్యాయి. ప్రయోగాలతో ఇల్లు దడదడలాడేది. తండ్రి మందలించినా తల్లి వెనకేసుకొని వచ్చేది. మేధావుల జీవిత చరిత్రలు, వాళ్ళ పరిశోధనలు, ప్రాముఖ్యతలను శ్రద్దగా చదివేవాడు. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల పన్నెండేళ్ళ వయసులోనే వార్తా పత్రికలు అమ్మే ఉద్యోగంలో చేరి విరామ సమయంలో పుస్తకాలు చదివేవాడు. అచ్చుయంత్రం కొని స్వయంగా వార్తా పత్రికలను ముద్రించి అమ్మి వచ్చే డబ్బుతో ప్రయోగాలు చేసేవాడు. రైలులో లగేజీ బోగీలో చిన్న ప్రయోగాలు చేసేవాడు అయితే అక్కడ ప్రమాదం జరిగి ఉద్యోగం ఊడింది.

👉పదహారేళ్ళ వయసులో రైలో రోడ్ టెలిగ్రాఫ్ ఆపరేటర్ గా రాత్రి షిప్టులలో వనిచేసేవాడు. 'తను నిద్ర పోలేదని’ హెడ్ ఆఫీసుకు ప్రతి గంటకు సిగ్నల్ ఇవ్వాలి. కానీ ఎడిసన్ గడియారం ప్రతి గంటకు సిగ్నల్ ఇచ్చేది. కొద్ది రోజులకు ఈ విషయం అధికారులకు తెలిసి ఉద్యోగం ఊడింది. ఈ గడియారమే ఎడిసన్ తొలి ఆవిష్కరణ.

👉పెద్ద పెద్ద చదువులు, డిగ్రీలు లేకపోయినా. తన తెలివి, పట్టుదలతో తంతి ద్వారా వార్తలు పంపేయంత్రాన్ని కనిపెట్టి గడియారపు పెండ్యులమ్ కు అనుసంధానం చేసి వార్తలను పంపేవాడు. 1868 లో అమెరికా కాంగ్రెస్ సభ కోసం “ఓట్ రికార్డర్” ను ఆవిష్కరించి పేటెంట్ పొందాడు. కానీ ఇది అవసరంలేదని కాంగ్రెస్ అనడంతో డబ్బు రాలేదు. కానీ ప్రజలకు అవసరంలేని ఆవిష్కరణను చేయరాదనే గుణపాఠంగా భావించాడు.

👉రెండు సందేశాలను ఏక కాలంలో తీసుకుపోగా 'డైస్లెక్స్' ను రూపొందించాడు. టెలిగ్రాఫ్ ద్వారా షేర్ల రేటును తెలుసుకొనే “స్టాక్ టిక్కర్” ను ఆవిష్కరించి 40,000 డాలర్లు సంపాదించాడు. ఇలా ఇరవై మూడేళ్ళకే ప్రముఖ ఆవిష్కర్తగా గుర్తింపు పొందాడు. ఒకేసారి 45 పరికరాల మీద పరిశోధన చేసి అందరి దగ్గర ప్రశంసలు పొందాడు. తంతి ద్వారా 2500 మాటలను ఒక నిమిషంలో పంపిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే. తంతి ద్వారా నాలుగు సందేశాలను ఒకేసారి ప్రసారం చేయగలిగాడు. ఎడిసన్ తనవద్ద పరిశోధకురాలిగా పనిచేసే ఆమెకు మోర్స్ కోడ్ ద్వారా తన ప్రేమను తెలిపి వివాహం చేసుకొన్నాడు. తర్వాత అతని ప్రయోగాలలో భార్య చాలా సహకరించింది. టెలిఫోన్స్ బాగా పరిశీలించి శబ్దతరంగాలను విద్యుత్ తరంగా మార్చే మైక్రోఫోన్లు తయారు చేసాడు. తనకు చిన్నతనం నుండి చెవిటితనం ఉన్నా గ్రాంఫోన్ నిర్మాణం చేసి, మూకీ సినిమాలకు ధ్వనిని చేర్చాడు. విద్యూత్ బల్బును కనుక్కొని ప్రతి ఇంటా వెలుగులు నింపేందుకు వందల ప్రయోగాల తర్వాతనే విజయం సాధించాడు. డైనమో మొదలు స్విచ్ బల్బుల వరకు ఎడిసన్ తయారుచేసి విజయం సాధించాడు. “కైనెటోస్కోప్” కనిపెట్టి మనం చూసే దృశ్యాలను తెరపై చూపడమే కాకుండా ఫోనోగ్రాఫ్ ను ఉపయోగించి ధ్వనిని చేర్చి ప్రదర్శించాడు.

👉ఇలా దాదాపు 1098 ఆవిష్కరణలకు పేటెంట్ పొంది 2500 కోట్ల డాలర్ల డబ్బును సంపాదించి యావత్ ప్రపంచానికి సైన్స్ ఫలితాలను అందించిన ఎడిసన్ 1931 వ సం. అక్టోబర్ 18 న మరణించినా ఆయన చేసిన ప్రయోగవలితాలు అందరికి అందుబాటులో ఉన్నాయి. ఈయన జయంతి సందర్భంగా ఎడిసన్ కృషిని తలచుకోవడమే ఆయనకు మనమిచ్చే నివాళులు.