Monday, March 7, 2022

గ్రంథాలయ గాంధీ" అయ్యంకి వెంకట రమణయ్య గారి వర్థంతి

🌹🙏 గ్రంథాలయోద్యమకారుడు, ఆయుర్వేదం,ప్రకృతి వైద్యంలో సిద్ధహస్తులు,పత్రికా సంపాదకుడు, గ్రంథాలయ పితామహుడు,"గ్రంథాలయ గాంధీ" అయ్యంకి వెంకట రమణయ్య గారి వర్థంతి సందర్భంగా🙏🌹





#ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు విస్తరించిన కారణంగా పుస్తకాలు చదివేవారు తక్కువయ్యారు. పెద్ద గ్రంథాలయాలు కొన్ని బాగా నడుస్తున్నప్పటికీ, మరికొన్ని గ్రంథాలయాలు సరైన సంరక్షణ, పర్యవేక్షణ లేక మూతపడుతున్నాయి.
కొన్ని దశాబ్దాలకి పూర్వం ఈ గ్రంథాలయాల అభివృద్ధికి ప్రముఖ గ్రంథాలయోద్యమకారుడు, పత్రికా సంపాదకులు అయ్యంకి వెంకట రమణయ్య ఎంత కృషిచేశారు.

#అయ్యంకి వెంకట రమణయ్య  గ్రంథాలయోద్యమకారుడు, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంలో సిద్దహస్తులు, పత్రికా సంపాదకుడు. గ్రంథాలయ సర్వస్వము అనే పత్రికను నిర్వహించాడు. ఈయన గ్రంథాలయ ఉద్యమంలో జీవితాంతం విశేష కృషి సల్పి గ్రంథాలయ పితామహుడుగా పేరుగాంచాడు.

#ఆయన తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా అనపర్తి నియోజక వర్గంలోని బిక్కవోలు మండంలో ఉన్న కొంకుదురు గ్రామంలో 1890 జూలై 24న జన్మించాడు. వీరి తల్లిదండ్రులు వెంకటరత్నం, మంగమాంబ.వీరి తండ్రి శ్రీ వెంకతరత్నం గారు నీటిపారుదల శాఖలో ఉద్యోగి. ఈయన అయ్యంకిలో శ్రీ గంగా పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం నిర్మించారు. 

#గ్రంథాలయోద్యమం:

1911లో విజయవాడలో రామమోహన గ్రంథాలయ స్థాపనకు తోడ్పడ్డాడు. 1914లో విజయవాడలో ఆంధ్రదేశ గ్రంథ భాండాగార, ప్రతినిధుల గ్రంథాలయ మహాసభలు జరిపి భారతదేశంలో తొలిసారిగా గ్రంథాలయ సంఘాన్ని, 1915లో సంఘ పక్షాన గ్రంథాలయ సర్వస్వం పత్రికను స్థాపించడానికి తోడ్పడ్డారు. 1919లో అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘాన్ని స్థాపించి, 1924లో ఆ సంఘ పక్షాన ఇండియన్ లైబ్రరీ జర్నల్ అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించాడు. వీరు ఈ సంఘాన్ని స్థాపించిన రోజును నేషనల్ లైబ్రరీ డేగా భారత గ్రంథాలయ సంస్థ గుర్తించి దేశమంతటా 1968 నుంచి ప్రతి సంవత్సరం జాతీయ గ్రంథాలయ వారోత్సవము (నేషనల్ లైబ్రరీ వీక్) ను నిర్వహిస్తుంది.

#గ్రంథాలయోద్యమంలో 70ఏళ్ళు నిర్విరామకృషిచేసిన నిస్వార్ధపరుడు.
చదువు కూడా ఆటలో భాగమేననీ, అన్నిటికంటే చదువే ఓ గొప్ప ఆట అనీ పిల్లలకు తెలియజెప్పేందుకు ఆయన  పుస్తకం రాసారు.

1907లోప్రముఖ #జాతీయ నాయకుడు,స్వాతంత్య్ర సమర యోధుడు బిపిన్ చంద్రపాల్  రాజమండ్రి లో భారతస్వాతంత్య్ర సమరంలో యువకులు పాల్గొనాలని ఇచ్చిన ఉత్తేజపూరితమైన ఉపన్యాసాలు విని, చదువుకు స్వస్తి చెప్పి దేశ సేవకు జీవితాన్ని అంకితం చెయ్యటానికి 'రక్షాబంధనం ' కట్టుకొన్నారు.

#దేశంలోని పలు సమస్యలకు ముఖ్యకారణం అవిద్య, అజ్ఞానం అని గ్రహించి, అందరినీ విద్యావంతులుగా,
జ్ఞాన వంతులుగా చెయ్యాలని అందుకు గ్రంథాలయాల వ్యాప్తి అవసరమని భావించి ఆ ఉద్యమ వ్యాప్తికి కంకణం
కట్టుకొన్నారు. 1910 లో బందరులో 'ఆంధ్రభారతి' సచిత్ర మాసపత్రిక ప్రారంభించారు. అలాగే 'గ్రంథాలయసర్వస్వం'(త్రైమాసిక),
'ఇండియన్ లైబ్రరీ జర్నల్', 'కొరడా', 'ప్రకృతి', 'ది ఇండియన్ నేచురోపతి','సహకారం', 'దివ్యజ్ఞాన దీపిక' వంటి పత్రికలను కూడా నడిపారు.

#వేటపాలెం, సి.పి.బ్రౌన్, శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషానిలయం లాంటి ప్రసిద్ధ పొత్తపుగుడుల అభివృద్ధిలోనూ పాలుపంచుకున్నారు. #ఏటా తన రెండు నెలల పెన్షనుతో రెండు పౌర గ్రంథాలయాలకు, సంక్షేమ కార్యక్రమాలకు సాయపడేవారు. అందుకే ఆయన ‘గ్రంథాలయ గాంధీ’ అయ్యారు.#

#ఆంధ్రభాషాభివర్థినీ మండలి, ఆంధ్రపరిషత్తు,కళాపీఠము, దివ్యజ్ఞాన చంద్రికామండలి అనే గ్రంథమాలలను
స్థాపించి అనేక ఉత్తమ రచనలను తెలుగు పాఠకులకు అందించారు. గ్రంథాలయోద్యమంలో వీరి సేవలను
గుర్తించి, వారి సప్తతి మహోత్సవ సందర్భంగా ,గుడివాడలో 'సరస్వతీ సామ్రాజ్య ప్రతిష్ఠాపనాచార్య' బిరుదుతో
సత్కరించారు.1977లో ప్రొఫెసర్ కౌలా అంతర్జాతీయ స్వర్ణపతకం అందుకున్నారు. భారత ప్రభుత్వం వీరి గ్రంథాలయ సేవలకు స్పందించి 1972 లో
'పద్మశ్రీ' తో గౌరవించింది.

#ఆంధ్రదేశంలో గ్రంథాలయోద్యమ పితామహుడుగా,గ్రంథాలయ వైతాళికుడుగా, 'గ్రంథాలయ శాస్త్ర విశా‌ద'గా ,వెలుగొందాడు అయ్యంకి వెంకటరమణయ్య.

#వెంకటరమణయ్యగారు 1979, మార్చి 7న దివంగతులైనారు. ఏటా ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన మనుమడు ఆచార్య డా.వెంకట మురళీకృష్ణ విద్యార్థులకు నోటు పుస్తకాలు అందిస్తున్నారు. తమ పూర్వీకులు కట్టించిన ఆలయానికి ధర్మకర్తగా ఉంటూ, లక్షలాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. ఆయన స్వగ్రామంలో ‘అయ్యంకి’ పేరిట ఒక గ్రంథాలయం నెలకొల్పాలని స్థానికుల అభిలాష.


0 comments:

Post a Comment