A homepage subtitle here And an awesome description here!

Saturday, April 30, 2022

మహాకవి ‘శ్రీశ్రీ’ గారి జయంతి

🖋📖మహాకవి ‘శ్రీశ్రీ’ గారి జయంతి ........తెలుగు సాహితి ప్రపంచంలో అక్షర సమిధను ధారపోసిన కవి కర్షకుడు..📖✒


【"ఏ దేశచరిత్ర చూచినా
ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం"】

ఆయన పాటల్లో సగటు మనిషి ఆవేదన ఉంటుంది. వారి బాధలను పోగోట్టే ఆనందం ఉంటుంది. విప్లవ గీతాలైనా...భావాత్మక గీతాలైనా..దేశభక్తి గీతాలైనా....ప్రణయ గీతాలైనా..విరహగీతాలైనా...విషాద గీతాలైనా...భక్తి గీతాలైనా ఆయన కలం నుంచి అలవోకగా జాలువారుతాయి.

శ్రీశ్రీ గారు తెలుగు సాహిత్యంలో సూర్యుని వలె తాను వెలుగుతూ తెలుగు సాహిత్యాన్ని వెలిగించినా అభ్యుదయ కవి, విప్లవ యోగి.

 #తెలుగు పాటకు కావ్య గౌరవం కల్పించిన  #మహాకవి.తెలుగు పాటకు #తొలిసారి జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చిన మహనీయుడు.విప్లవ కవిగా తన రచనలతో ప్రజలను చైతన్య పరుస్తునే... సినీ కవిగా తన రచనలతో ప్రేక్షకలపై పాటల జల్లులు కురిపించాడు. తన కలంతో సామాన్య మానవుడి బాధల్ని పాటల్లో వినిపించిన యుగకర్త శ్రీశ్రీ.* ‘‘నేను సైతం ప్రపంచాగ్నికి కవితనొక్కటి ఆహుతిచ్చాను’’ అంటూ సినీకవిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. విప్లవ గీతాలను తెలుగు ప్రపంచానికి రుచి చూపించిన మహా ప్రస్థాన కవి.  సమ సమాజ స్థాపన తన లక్ష్యం అంటూ తన కలంతో ప్రవచించిన ఆధునిక యుగ ప్రవక్త. ఆయన అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. 1910 ఏప్రిల్ 30న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పటకొండ దంపతులకు
విశాఖపట్నం లో జన్మించాడు.

#శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఈయన ఇంటి పేరు శ్రీరంగం గా మారింది. శ్రీశ్రీ ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం విశాఖపట్నం లో జరిగింది. 1931లో మద్రాసు యూనివర్సిటీలో బి.ఏ పూర్తి చేశాడు.1935లో విశాఖలోని మిసెస్ ఎవిఎస్ కాలేజీలో డిమాన్స్టేటరుగా చేరాడు. 1938 లో మద్రాసు ఆంధ్రప్రభలో సబ్ ఎడిటరుగా చేరారు. ఆ తర్వాత ఢిల్లీ ఆకాశవాణిలోను, నిజాం సంస్థానంలోను, ఆంధ్రవాణి పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసారు. 1933 నుంచి 1940 వరకు తాను రాసిన ‘గర్జించు రష్యా’, ‘జగన్నాథ రథ చక్రాలు’ వంటి గొప్ప కవితలను సంకలనం చేసి ‘మహా ప్రస్థానం’ అనే పుస్తకంగా ప్రచురించాడు.

#మహా ప్రస్థానం:

#తెలుగు సాహిత్యపు దశను, దిశను మార్చిన పుస్తకం గా శ్రీశ్రీ #మహాప్రస్థానం మిగిలిపోయింది.
ఇందులో ఉపయోగించిన పదబంధం, వాక్య నిర్మాణం ఇంకా మహాప్రస్థాన కవితలలో నిండిన సాహితి వస్తువులన్నీ చాలా గొప్పవి. మహాప్రస్థానం అంతా సామాజిక స్పృహను రగిలించేటట్లుగా ఉంటుంది....
విరసం కవిగా మరెన్నో రచనలు చేసినా శ్రీశ్రీ పేరు వినగానే గుర్తుకొచ్చేది మహాప్రస్థానమే.
శ్రీశ్రీ రచించిన సంచలన కవితా సంకలనం మహా ప్రస్థానం, ఇది వెలుబడిన తరువాత తెలుగు సాహిత్యపు ప్రస్థానానికే ఓ దిక్సూచిలా వెలుగొందినది, ఆధునిక తెలుగు సాహిత్యాన్ని 'మహా ప్రస్థానానికి ముందు, మహా ప్రస్థానానికి తరువాత' అని విభజించవచ్చు అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు
#మహాప్రస్థానా”నికి #యోగ్యతాపత్రం రాస్తూ “కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ” అన్నాడు చలం. అసలు ఎవరీ శ్రీశ్రీ. తెలుగులో కవిత్వం పేరెత్తగానే అందరి తలలూ ఆయనవైపెందుకు తిరుగుతాయి? “రెండు శ్రీల ధన దరిద్రుడు - కవితా ఘన సముద్రుడు శ్రీశ్రీ” అని వేటూరి అంటారు.

శ్రీశ్రీ సిరి #సిరి మువ్వలు:

#అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా... విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా....సినిమా పాటల రచయితగా శ్రీశ్రీ అనేక భూమికలు పోషించాడు. సమరానికి నేడే ఆరంభం...ఎవరో వస్తారని ఏదో చేస్తారని అంటూ సందేశాత్మక గీతాలు నేటికి తెలుగు నేలపై ఏదో సందర్భంలో గుర్తించుకోని తెలుగు వారుండరు. మనసున మనసై  బ్రతుకున బ్రతుకై అంటూ మదిలోని భావాలను మనుసుతో ముడిపడిన బ్రతుకును ఆవిష్కరించిన అద్భుత కవి శ్రీశ్రీ.‘ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా! అంటూ సోమరి పోతులను జాగృతం చేసిన చైతన్య శీలి శ్రీశ్రీ. మాంగల్య బలంలోని ‘ఆకాశ వీధిలో అందాల జాబిలి’ అంటూ చందమామ పై రాసిన ఈ గీతం  శ్రీశ్రీ కలం నుంచి జాలు వారింది.

#అల్లూరి సీతారామరాజు’లో చిత్రంలో శ్రీశ్రీ రాసిన ‘తెలుగు వీర లేవరా’ పాట తెలుగు సినీ పాటల్లో ఆణిముత్యం లా నిలిచిపోయింది. ఈ మూవీలోని ఈగీతానికే తొలిసారి తెలుగు సినిమా పాటకు #జాతీయ స్థాయి పురస్కారం లభించింది. ఇలా తెలుగు సినీ పాటకు తన రచనతో గౌరవం దక్కేలా చేసాడు శ్రీశ్రీ.
సినిమా పాటలలో తమదైన ముద్ర ను వేశారు. విప్లవ గీతాలతో పాటు, కొన్ని భావ కవిత్వం తో కూడిన యుగళ గీతాలను, జాతిని జాగృతం చేసే గీతాలను సినిమాలకు రాశారు. యే గీతం రాసినప్పటికి శ్రీశ్రీ గారి ముద్ర సినీ జగత్తు లో ప్రత్యేకం గా ఉండేది

#శ్రీ శ్రీ మహాకవి:

1952 లో ప్రారంభమైన ఆయన సినీ గేయ ప్రస్థానం 1982 వరకు నిరాటంకంగా కొనసాగింది. దాదాపు 50 చిత్రాల వరకు సినీ సాహిత్యాన్ని అందించారు.

#ప్రతి అంశాన్ని గురించి రచనలు చేసిన ఘనత ఈయన సొంతం.గద్యం కవిత్వంమే కాదు పద్య కవిత్వంలో కూడా శ్రీ శ్రీ గారిది అందెవేసిన చేయి.
1930 వరకు తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది ఆ తర్వాత తెలుగు సాహిత్యం అంతటినీ నేను నడిపిస్తున్నాను అని సగర్వంగా చెప్పుకున్న కవి శ్రీ శ్రీ.
తన రచనలతో ఎంతో మందిని చైతన్య పరిచిని... ఈ మహా ప్రస్థానా కర్త 1983 జూన్ 15న స్వర్గస్తులైనారు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి. "వ్యక్తికి బహువచనం శక్తి" అనేది ఆయన సృజించిన మహత్తర వాక్యమే! శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించడంలో విజయం సాధించాడు శ్రీశ్రీ. ఆయన మన మధ్య లేక పోయిన ఆయన అందించిన సాహితి సౌరభాలు...విప్లవ రచనలు ఇప్పటికీ.. ఎప్పటికీ ..సజీవంగానే ఉన్నాయి.


Tuesday, April 26, 2022

మహాగణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి వర్థంతి .

💐💐అపారమైన మేధస్సుతో భారతదేశపు కీర్తి ప్రతిష్టలను  ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన మహాగణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి వర్థంతి .




#అపారమైన మేధస్సుతో భారతదేశపు కీర్తి ప్రతిష్టలను  ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన మహాగణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్.
20వ శతాబ్దపు గణిత మేధావుల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు
 ప్రస్తుతం ప్రపంచం అనుసరిస్తున్న దశాంశమాన పద్దతిని వేల సంవత్సరాల క్రితమే భారతీయులు వినియోగించగా.. మనదేశం నుంచి అటువంటి గొప్ప గుర్తింపు పోందిన వ్యక్తి రామానుజన్. 

శ్రీనివాస #రామానుజన్. తమిళనాడులో ఈరోడ్‌లోని ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కోమలమ్మాళ్, శ్రీనివాస అయ్యంగార్ దంపతులకు 1887 డిసెంబరు 22 న రామానుజన్ జన్మించారు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శించి ఆయిలర్ నియమాలు, త్రికోణమితికి చెందిన సమస్యలను సాధించారు.

ఒకసారి ఓ #ఉపాధ్యాయుడు ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే ఒకటి వస్తుందని చెబితే– ఈ నియమం సున్నాకు కూడా వర్తిస్తుందా అని ప్రశ్నించాడు. పన్నెండేళ్ళ వయసులోనే డిగ్రీ స్థాయి గణిత పుస్తకాల్లోని త్రికోణమితి, ఆయిలర్‌ సూత్రా ల్లో నిక్లిష్ట సమస్యలను సులువుగా సాధించేవాడు.

దేశం #గర్వించదగ్గ మేధావి శ్రీనివాస రామానుజన్ జీఎస్ కార్ రచించిన సినాప్సిస్ ఆఫ్ ప్యూర్ మ్యాథ్‌మెటిక్స్ అనే పుస్తకం శ్రీనివాస రామానుజన్‌లోని ప్రతిభను బయటకు తీసుకొచ్చింది. ఆ పుస్తకంలో ఆల్‌జీబ్రా, అనలిటికల్ జామెట్రీ లాంటి విషయాలకు సంబంధించిన 6165 సిద్ధాంతాలను నిరూపించడానికి పెద్ద పెద్ద ప్రొఫెసర్‌లు సైతం నానా తంటాలు పడేవారు. అయితే వారు అర్థం చేసుకోలేకపోయిన సూత్రాలకు రామానుజన్ ఎలాంటి పుస్తకాల సహాయం లేకుండా అలవోకగా పరిష్కరించేవాడు.

కుంభకోణంలోని #ప్రభుత్వ కాలేజీలో చేరిన రామానుజన్ తన దృష్టి కేవలం గణితంపై కేంద్రీకరించడంతో ఎఫ్.ఎ. పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాలేదు. ఆ తర్వాత మద్రాస్‌లోని వచ్చయ్యప్ప కళాశాలలో చేరి అక్కడ అధ్యాపకుడు ఎన్.రామానుజాచారి గణిత సమస్యలను కఠినంగా చెప్తుంటే, రామానుజన్ వాటిని సులభమైన రీతిలో తక్కువ సోపానాలతో సాధించే వాడు. రామానుజన్‌ ప్రతిభను గుర్తించిన ప్రొఫెసర్ సింగారవేలు మొదలియార్ ఆయనతో కలిసి మ్యాథమెటికల్ జర్నల్స్‌లో క్లిష్టమైన సమస్యలపై చర్చించి వాటిని సాధించేవారు.

1909లో జానకి అమ్మాళ్‌ను అనే మహిళను రామానుజన్ వివాహం చేసుకున్నారు. మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, పార్టిషన్ ఆఫ్ నంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ లాంటి విషయాలపై పరిశోధనలు కొనసాగించారు. 1913లో మద్రాస్ వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్ వాకర్ ఈ పరిశోధనలు చూసి ఆశ్యర్యాన్ని వ్యక్తం చేశాడు. రామానుజన్ కనుగొన్న 120 పరిశోధన సిద్ధాంతాలను ఆయన #కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ గాడ్ ఫ్రెహెరాల్డ్ హార్టీకి పంపాడు.

లండన్‌లో కేంబ్రిడ్జిలో గల ట్రినిటి కాలేజిలో ప్రవేశించి, 1917 వరకు గణిత పరిశోధనలు చేశాడు. వీటి గురించి ప్రపంచ పత్రికల్లో వ్యాసాలు ప్రచురితమయ్యాయి. దీనివలన ప్రపంచ వ్యాప్తంగా రామానుజన్‌ ప్రతిభ వెల్లడైంది. 1914 నుండి 1919 వరకు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కఠోరంగా పరిశ్రమిస్తూ 32 పరిశోధనా పత్రాలు సమర్పించారు రామానుజన్‌.

మహా #మేధావులకు మాత్రమే సాధ్యమయ్యే పరిశోధన ఫలితాలను చూసిన హార్టీ రామానుజన్‌ను కేంబ్రిడ్జి యూనివర్శిటీకి ఆహ్వానించారు. 1914 మార్చిలో లండన్‌కు వెళ్లిన రామానుజన్ అక్కడ నిరంతరం గణితంపై పరిశోధనలు చేసి కొత్త సిద్ధాంతాలను కనిపెట్టారు. ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజి గౌరవం పొందిన తొలి భారతీయుడిగానూ, ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండవ భారతీయుడిగానూ ఆయన చరిత్రకెక్కారు. బ్రిటన్ నుంచి 1919 మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చారు.రామానుజన్‌ π విలువను 3.14159265262= (9²+19²/22)¼ గా లెక్కించారు.  

#మనదేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన చెప్పిన రామానుజన్ అనారోగ్యంతో తన 33 వ ఏట కన్నుమూశారు. బ్రిటన్‌లో ఉన్నప్పుడు ఆరోగ్యం గురించి ఏమాత్రం లెక్కచేయకుండా గణిత పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన ఇండియాకు వచ్చిన ఏడాది తర్వాత అంటే 1920 ఏప్రిల్ 26న అస్తమించారు. జీవిత చరమాంకంలో రామానుజన్ రాసిన మ్యాజిక్ స్క్వేర్, ప్యూర్ మాథ్స్‌కు చెందిన నెంబర్ థియరీ, మాక్ తీటా ఫంక్షన్స్ చాలా ప్రసిద్ధి పొందాయి.

వీటిని ఆధారంగా చేసుకుని కనుగొన్న స్వింగ్ థియరీ, క్యాన్సర్‌పై పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని 1986-87 రామానుజన్ శతజయంత్యుత్సవాల్లో గణిత శాస్త్రవేత్తలు ప్రకటించారు. 
 భారత ప్రభుత్వం 1962 వ సంవత్సరంలో ఆయన 75వ జన్మదినం నాడు, సంఖ్యా శాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషిని కొనియాడుతూ స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది. 2012లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు.

తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నపుడు కూడా #హార్డీకి 1729 సంఖ్య ప్రత్యేకతను తెలిపి ఆయన్ని ఆశ్చర్యపరిచారు. ఈ సంఘటన గురించి హార్డీ తన మాటల్లో ఇలా చెప్పారు: నేనోసారి రామానుజన్‌ను చూసేందుకు ట్యాక్సీలో వెళ్ళాను. దాని నెంబరు 1729. ఈ నెంబరు చూడటానికి డల్‌గా కనిపిస్తోంది ఇది దుశ్శకునమేమీ కాదుగదా అని అన్నాను. దానికి బదులుగా రామానుజన్ ఇలా అన్నాడు ఇది చాలా ఆసక్తికరమైన సంఖ్య; రెండు సంఖ్యల ఘనాల మొత్తాన్ని రెండు వేరువేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యల్లో ఇది అన్నిటికంటే చిన్నది అని దాన్ని ఈ విధంగా విశదీకరించారు 1729 = 103+93 = 123+13. వీటిని ట్యాక్సీక్యాబ్ సంఖ్యలు అని పిలుస్తారు. గణితంపై ఆయనుకున్న అవ్యాజమైన అనురాగానికి, అంకిత భావానికి ఇది నిదర్శనం.

#శుద్ధ గణితంలో నంబర్ థియరీలోని ఇతని పరిశోధనలు, స్ట్రింగ్ థియరీ, క్యాన్సర్ పరిశోధనల వంటి ఆధునిక విషయాలలో ఉపయోగ పడుతూ ఉన్నాయి. రామానుజన్ చివరిదశలో మ్యాక్-తీటా ఫంక్షన్స్ పై చేసిన పరిశోధనలు చాలా ప్రసిద్ధమైనవి. ఆయన ప్రతిపాదించిన కొన్ని అంశాలు కొన్ని ఇప్పటికీ అపరిష్కృతం గానే ఉండటం విశేషం.

#రామానుజన్ నిధి:
తన ప్రారంభ మరియు అకాల మరణం తరువాత, రామానుజన్ భూమిపై అతిపెద్ద వజ్రం కంటే అమూల్యమైన నిధిని విడిచిపెట్టాడు --- అతని మూడు నోట్బుక్లు మరియు కొన్ని కాగితపు స్క్రాప్లు 3900 సమీకరణాలు, సారాంశాలు మరియు ఫలితాలను కలిగి ఉన్నాయి. అయితే, వారితో ఎటువంటి రుజువు లేదు. ఇప్పుడు కూడా, దాదాపు 100 సంవత్సరాల తరువాత, శాస్త్రవేత్తలు మరియు పండితులు ఆయన రచనల ఆధారంగా పరిశోధనా పత్రాలపై పనిచేస్తున్నారు.

సంఖ్యాశాస్త్రంలో రామానుజన్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1962 వ సంవత్సరంలో రామానుజన్ 75వ జన్మదినం నాడు స్మారక #తపాలా బిళ్ళను విడుదల చేయడమేకాకుండా 125వ జయంతి సందర్భంగా 2012ను #జాతీయ గణితశాస్త్ర సంవత్సరంగా ప్రకటించింది. 2017లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా లోని కుప్పంలో రామానుజన్ మఠ్ పార్క్ ప్రారంభించబడింది. తమిళనాడు ప్రభుత్వం డిసెంబర్ 22 ఐ.టి దినోత్సవంగా జరుపుతున్నారు.

#మానవ నాగరికత చరిత్రకు గణితాన్ని పరిచయం చేసిన ఆర్యభట్ట, భాస్కరుడు.... ఆ తదనంతరం రామానుజన్ వంటి గణిత మేథావుల పరంపర  కొనసాగుతుంది.


Thursday, April 21, 2022

శకుంతలాదేవి గారి వర్థంతి

_*🌹హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి గారి వర్థంతి సందర్భంగా 🌹*


✍️అత్యంత వేగంగా అంకెలను గణించి రికార్డు సృష్టించిన #భారత గణిత మేధావి స్వర్గీయ #శంకుతలా దేవీ పేరిట గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ క్రియేట్ చేసారు. నలభై ఏళ్ల క్రితం శకుంతలా దేవి ఈ రికార్డు నమోదు చేశారు. రెండు 13 అంకెల సంఖ్యలను గుణించి 28 సెకన్ల వ్యవధిలోనే సమాధానం చెప్పి సంచలనం సృష్టించారు.

✍️శకుంతలాదేవి 1929 నవంబర్ 4న సంప్రదాయ కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో బెంగళూరులో జన్మించారు. ఆమె తండ్రి సర్కస్‌లో పని చేసేవారు. మూడేళ్ల వయసులోనే పేకలతో ట్రిక్కులు చేయడంలో శకుంతల ప్రతిభను ఆయన గుర్తించారు. ఎంత ప్రతిభ ఉన్నా.. పేదరికం కారణంగా ఆమె చదువుకోలేకపోయారు. తల్లిదండ్రులు ఆమెను ఒకటో తరగతిలో చేర్చినప్పటికీ.. నెలకు రూ.2 ఫీజు కట్టలేక మధ్యలోనే బడి మాన్పించేశారు.
అయితే, ఆమె ప్రతిభ గురించి అన్ని దిక్కులా వ్యాపించింది. ఆరేళ్లప్పుడు యూనివర్సిటీ ఆఫ్ మైసూర్‌లో, ఎనిమిదేళ్ల వయసులో అన్నామలై వర్సిటీలో.. గణితంలో తనకున్న ప్రావీణ్యాన్ని ఆమె బహిరంగంగా ప్రదర్శించారు. 1977లో 201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గాన్ని ఆమె తన మనసులోనే గుణించి 50 సెకన్లలో సమాధానం చెప్పి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.

ఆమె చెప్పిన సమాధానాన్ని... #ద్రువీకరించుకోవడానికి శాస్త్రజ్ఞులు ఆ అంకెను వేగవంతమైన యూనివాక్ 1108 కంప్యూటర్‌కు ఫీడ్ చేయగా.. ఇదే సమస్యను పరిష్కరించడానికి దానికి ఒక నిమిషంపైగానే సమయం పట్టింది. అలాగే, 1980 జూన్ 18న.. ఇంపీరియల్ కాలేజ్, లండన్ కంప్యూటర్ విభాగం వారు ఆమెకు ఒక పరీక్ష పెట్టారు. కంప్యూటర్ అప్పటికప్పుడు ఇచ్చిన రెండు పదమూడు అంకెల సంఖ్యలను గుణించి ఫలితం చెప్పమన్నారు.
ఆ ప్రశ్నకు ఆమె సరిగ్గా 28 సెకన్లలో సమాధానం చెప్పి వారిని ఆశ్చర్యానికి గురిచేశారు. గత శతాబ్దిలో ఏ ఏడాదిలో ఏ నెలలో ఏ తేదీన ఏ వారం వచ్చిందో.. నిద్రలో లేపి అడిగినా ఠక్కున చెప్పే మేధస్సు ఆమె సొంతం. అంతేకాదు, ఆమె రచయిత్రి కూడా. గణితం, జ్యోతిషాలను అంశాలుగా తీసుకుని.. ఫన్ విత్ నంబర్స్, ఆస్ట్రాలజీ ఫర్ యు, పజిల్స్ టు పజిల్ యు, మాథబ్లిట్, ఎవేకెన్ ద జీనియస్ ఇన్ యువర్ చైల్డ్, ఇన్ ద వండర్‌లాండ్ ఆఫ్ నంబర్స్ వంటి పుస్తకాలు రాశారు.

✍️ఆమె మేధస్సు🍁*_

1977లో అమెరికాలో ఓ కంప్యూటర్తో శకుంతలా దేవికి పోటీ పెట్టారు. 188132517 అనే సంఖ్యకు మూడో వర్గం కనుక్కోవడంలో ఈ పోటీ పెట్టగా, ఆమె కంప్యూటర్ను  ఓడించేశారు. ఇక 1980 జూన్ నెలలో 13 అంకెలున్న రెండు సంఖ్యలు తీసుకున్నారు. 76,86,36,97,74,870 అనే సంఖ్యతో 24,65,09,97,45,779 అనే సంఖ్యను హెచ్చవేస్తే ఎంత వస్తుందని లండన్ ఇంపీరియల్ కాలేజిలోని కంప్యూటర్ విభాగంలోని ఓ సూపర్ కంప్యూటర్  శకుంతలా దేవిని ప్రశ్నించింది. దానికి ఆమె కేవలం 28 సెకన్లలో సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం.. 18,947,668,177,995,426,462,773,730. ఆ దెబ్బకు గిన్నిస్ రికార్డు ఆమె పాదాక్రాంతమైంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన మానసిక శాస్త్ర ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సెన్ స్వయంగా శకుంతలా దేవి గణిత ప్రతిభను పరిశీలించి అవాక్కయ్యారు.

✍️ఆరేళ్ల వయసులో తొలిసారి శకుంతలా దేవి మైసూరు విశ్వవిద్యాలయంలో తన గణిత ప్రతిభను బహిరంగంగా ప్రదర్శించారు.

#ఎనిమిదేళ్ల వయసులో అన్నామలై విశ్వవిద్యాలయంలో ఆమె ప్రదర్శనతో శకుంతలాదేవిని బాలమేధావిగా గుర్తించారు.
గత శతాబ్ద కాలంలో ఏ తేదీ చెప్పినా అది ఏ వారం అవుతుందో చిటికెలో ఆమె చెప్పేవారు.

1977లో 201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గం ఎంతో కేవలం 50 సెకండ్లలో చెప్పేశారు.

ఆమె ప్రతిభను గుర్తించి, అక్టోబర్ 5, 1950 న లెస్లీ మిచెల్ నిర్వహించిన బిబిసి ఛానెల్‌లో ఆమె ప్రతిభను అంచనా వేసిన తర్వాత ఆమె '#హ్యూమన్ కంప్యూటర్' గా పేర్కొంది అయితే ఈ టైటిల్‌ను ఆమె ఎప్పుడూ ఇష్టపడలేదు. మానవ మనస్సు కంప్యూటర్ కంటే సాటిలేని సామర్ధ్యాలను కలిగి ఉందని, మానవ మనస్సును కంప్యూటర్లతో పోల్చడం సముచితం కాదని ఆమె అన్నారు.

అమె #విజయవంతమైన జ్యోతిష్కురాలు , వంటల పుస్తకాల రచయిత మరియు నవలా రచయిత కూడా.

#తన 83వ ఏట 2013 ఏప్రిల్ 21న  గుండె, మూత్రపిండాల  సమస్యలతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు.

✍️బయెపిక్:
మే 2019 లో శకుంతల దేవి జీవిత కథ ఆధారంగా ఒక చిత్రాన్ని ప్రకటించారు. శకుంతల దేవి పేరుతో ఉన్న ఈ చిత్రంలో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించారు మరియు సన్యా మల్హోత్రా , అమిత్ సాధ్ మరియు జిషు సేన్‌గుప్తా నటించారు. సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ప్రొడక్షన్స్ విక్రమ్ మల్హోత్రా ఈ చిత్రం హిందీ లో నిర్మించారు అను మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల తేదీని మొదట్లో 2020 మే 8 న ప్లాన్ చేశారు, కాని కోవిడ్ -19 మహమ్మారి కారణంగా, ఈ చిత్రం 31 జులై 2020 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా విడుదల అయినది .

Sunday, April 17, 2022

సర్వేపల్లి రాధాకృష్ణ గారి వర్థంతి



సర్వేపల్లి రాధాకృష్ణ గారి వర్థంతి 







ఈ చిత్రం 1947లో ప్రముఖ తెలుగు కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు #బుజ్జాయి గీసింది. దీనిపై 1947 జనవరి 3వ తేదీన సర్వేపల్లి రాధాకృష్ణ #సంతకం చేస్తూ తన పేరును తెలుగులో 'సర్వేపల్లి రాధాకృష్ణయ్య' అని రాయటం చూడొచ్చు
తెలుగులో సంతకం చేయాల్సి వచ్చినపుడు ఆయన సర్వేపల్లి #రాధాకృష్ణయ్య అనే రాసేవారు. అదే ఆయన అసలు పేరు
***         ***    ***
ఉపాధ్యాయ వృత్తి నుంచి భారత ప్రథమ పౌరుడి స్థాయికి ఎదిగిన అరుదైన ఘనత ఆయన సొంతం.

అయితే, రాష్ట్రపతిగా కంటే #తత్వవేత్తగానే ఆయన ప్రపంచానికి ఎక్కువగా పరిచయం. భారతీయ తాత్విక దృక్పథాన్ని ప్రపంచ దేశాలకు అందించిన గొప్ప వ్యక్తుల్లో ఒకరిగా ఆయన నిలిచారు.

#ఉపాధ్యాయుడిగా, తత్వవేత్తగా, రచయితగా, రాజనీతిజ్ఞుడిగా సర్వేపల్లి ప్రయాణం బహుముఖాలుగా సాగింది.

##రాయబారిగా తనదైన ముద్ర
1949లో రష్యా రాయబారిగా వెళ్లినప్పుడు రాధాకృష్ణన్ అక్కడ తదైన ముద్రవేశారు. కశ్మీర్ విషయంలో రష్యా మద్దతు భారత్‌కు లభించేలా కృషిచేశారు.
తన వాక్చాతుర్యంతో ఒక సందర్భంలో స్టాలిన్‌ను సైతం మెప్పించారు.

** #సోవియట్ రష్యాకు నియమితులైన  భారత దేశపు మొట్ట మొదటి దౌత్యవేత్త డా. రాధాకృష్ణన్. "దేవుడిని నమ్మని  దేశానికి, దేవుడే సర్వస్వం అనే మీరు రాయభారిగా పోతున్నారు. ఇదెలా పొత్తు కుదురుతుంది" అన్న ప్రశ్నకు "Truth, Eternity and Beauty, (సత్యం, శివం, సుందరం) are the symbols of the God. Russians believe in them." అని విమర్శకుల నోరు మూపించారు.

రష్యా దేశపు నియంత #స్టాలిన్, తన అధికార నివాసం( క్రెమ్లిన్) లో, రాధాకృష్ణన్ కు స్వాగతం పలికేందుకు   లేచి వచ్చి స్వయంగా  వాకిలి తెరిచారు. రష్యానుంచి తిరిగొస్తున్నపుడు డా. రాధాకృష్ణన్ స్టాలిన్ దగ్గరవెళ్ళి, వీపు మీద చెయ్యేసి  క్షేమ సమాచారాలు  విచారించారు. అపుడు స్టాలిన్ చలించారు.  గద్గగ స్వరంతో, కన్నీళ్ళు కారుస్తూ: " రక్కసిగా కాక, మానవునిగా నన్ను చూచిన ప్రథమ వ్యక్తి మీరు. మా దేశమునించి వెళ్ళి పోవడం నాకెంతొ విచారం కలిగిస్తున్నది. మీరు చిరకాలం పాటు జీవించాలని నా కోర్కె. నేను మరెన్ని రోజులు బ్రతుకుతానో తెలియదు." అన్నారు.

**#కంగారు పడకండి మావో’

భారత ఉపరాష్ట్రపతిగా ఆయన 1957లో చైనాలో పర్యటించారు. అప్పుడు చైనా అధినేతగా ఉన్న మావో జెడాంగ్‌ను కలవాలనుకున్నారు. ఒక రోజు అర్ధరాత్రి 12 గంటలకు మావోను కలిసే అవకాశం ఆయనకు వచ్చింది.
మావోనే స్వయంగా ఆయనను ఆహ్వానించారు. ఆ సమయంలో రాధాకృషన్ మావోతో కరచాలనం చేయడంతో పాటు, ఆయన గడ్డాన్ని చేతితో తాకారు. ఊహించని ఈ పరిణామానికి మావో ఉలిక్కిపడ్డారు.
ఆయన తేరుకునేలోపు ’మిస్టర్ మావో, నేను మీతోనే కాదు స్టాలిన్, పోప్‌లతో కూడా ఇలానే చేశాను. మీ మీదున్న వాత్సల్యంతోనే అలా చేశాను. కంగారుపడకండి’ అని చెప్పారు.

**#రాధాకృష్ణన్
ఆయన విద్యాభ్యాసం అనేక ఒడిదొడుకుల మధ్య కొనసాగింది. కటిక పేదరికాన్ని అనుభవించిన సర్వేపల్లికి కనీసం చదువుకోవడానికి పుస్తకాలు కూడా ఉండేవి కావు. అలాంటి పరిస్థితుల్లో పుస్తకాలు కొనుక్కోగలిగిన స్థోమత ఉండి, కొనుక్కున్న వ్యక్తి ఇంటికి వెళ్లి ఆయనను ‘అయ్యా..ఒక్క కాగితం నలగకుండా నేను పుస్తకం చదువుకుంటాను. దయచేసి నాకు పుస్తకం ఇప్పించండి’ అని ప్రార్థన చేసి తెచ్చుకుని చదువుకునేవారు.
పుస్తకాలు ఉన్న వ్యక్తులు తనను ఎప్పుడు రమ్మంటే అప్పుడే వెళ్లి, వాటిని తెచ్చుకుని చదివి గొప్ప తత్వశాస్త్రవేత్త అయ్యారు.

**#పరీక్షకి రుసుం చెల్లించటానికి అదే చివరి రోజు. అలా వస్తున్న రాధాకృష్ణన్‌ ఒక దొంగ అడ్డగించి, దాడిచేసి చెవి పోగులు లాక్కున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో హడలిపోయిన సర్వేపల్లికి ఒళ్ళునొప్పులు, జ్వరం వచ్చింది. దీంతో పరీక్ష ఫీజు విషయం మర్చిపోయి పాఠశాలకు కూడా వెళ్ళకుండా నిద్రపోయారు. ఇదే సమయంలో పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు ఎవరైనా ఉన్నారా? అని ప్రధానోపాధ్యాయుడు పరిశీలించారు.
అందులో రాధాకృష్ణన్ పేరు చూసి, "అయ్యో! చాలా బాగా చదువుకునే విద్యార్థి ఈరోజు రాకపోవడమేంటి? అని పరీక్ష రుసుం ఆయనే చెల్లించారు. ఆ తరువాత రాధాకృష్ణన్ పరీక్షల్లో తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఉపాధ్యాయుడంటే ఎలా ఉండాలో చూసిన రాధాకృష్ణన్ ఈ సంఘటన తన జీవితంలో మర్చిపోలేదు. అందుకే ఒక ఉపాధ్యాయుడు ఒక వ్యక్తిని ఎంత ఎత్తుకు తీసుకెళ్లగలరో తెలుసుకుని, ఆచరించిన మహా పురుషుడు. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన తత్వశాస్త్రవేత్త అయినా, రాష్ట్రపతి పదవిని అలంకరించినా, భారతరత్నను అందుకున్నా తన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవం పరమ పవిత్రంగా చెయాలని కోరుకున్నారు.

**పలుమార్లు #నోబెల్ బహుమతికి నామినేట్
సర్వేపల్లి గొప్ప పండితుడు. ఆయన 16సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. 

** ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో  ఉపన్యాసాలివ్వడానికి ఆహ్వానం పొందిన #ప్రథమ  భారతీయుడు సర్వెేపల్లి. అక్కడి సభాభవనం సరిపడక ప్రేక్షకులు బయట నిలుచుకొని సర్వేపల్లి ఉపన్యాసం విన్నారు. 
లండన్‌లో సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రసంగం విన్న అనంతరం హెచ్ఎన్ స్పాల్డింగ్ 1936లో ఆక్స్‌ఫర్డ్ ఫర్ ఈస్టర్న్ రిలీజియన్స్ అండ్ ఎథిక్స్‌లో స్థానం కల్పించారు.

**#ప్రాచీన కాలం నుంచి శ్రీకృష్ణుడిని గురువుగా, అర్జునుడిని శిష్యుడిగా పిలుస్తుంటాం. గురుశిష్యుల బంధానికి వారు కూడా ప్రతీకలు. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పారు.

**1928, నవంబర్, 17,18 న  నంద్యాలలో #ఆంధ్ర మహాసభ జరిగింది.దానికి అనిబిసెంట్ అధ్యక్షత వహించగా ప్రకాశం పంతులు, కట్టమంచి రామలింగా రెడ్డి, కొండా వెంకటప్పయ్య లతో పాటు ఆప్పటికే వేదాంతిగా ప్రపంచ ఖ్యాతి పొందిన సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా వచ్చారు. ఆయన తెలుగులోనే ప్రసంగించారు. చిలుకూరి నారాయణ రావు సూచన మేరకు "దత్త మండల జిల్లాలు" , ‘‘రాయలసిమ’’గా మారిందీ సభలోనే.

** #మైసూరు విశ్వవిద్యాలయము నుండి  రాధాకృష్ణన్   కలకత్తా విశ్వవిద్యాలయానికి ఉద్యోగ రీత్యా వెళ్తున్నప్పుడు, విద్యార్థులు, అధ్యాపక బృందమే గాక సమస్త ప్రజానికం ఆయనను బండిలో (పూలరధం) కూర్చొబెట్టి రైల్వే నిల్దాణం(స్టేషన్) వరకు లాగి  గౌరవం ప్రకటించారు. దివానులకు, మహారాజులకు కూడాఇలాంటి గౌరవం దక్కి ఉండదు.

** 1964 లొ #హిందీ వ్యతిరేక ఉద్యమం ఉధృతంగా, హింసాత్మకముగా మారినఫ్పుడు, వారు సందేశంలో  "భాషలన్ని సరస్వతి దేవి యొక్క వివిధ స్వరూపములు " అనే భావం గలిగిన " సర్వజ్ఞమ్ తత అహం వందే/ పరంజ్యోతి తపావహమ్/ యన్ ముఖద్ దేవి/ సర్వ భాషా సరస్వతి" శ్లోకాన్ని ఉదహరించారు. 

**#చాగ్లాగారు  ఇంగ్లాండ్ లో హైకమిషనర్ గా ఉన్నప్పుడు రాధాకృష్ణన్ అక్కడ పర్యటనకు వెళ్ళారు. ఒక రోజు కామన్ వెల్త్ సభ నుంచి వాపసు వస్తూ, వస్తూ, తన రచనల ప్రచురణ కర్త అల్లెన్ & ఉన్ విన్ (Allen & Unwin) అక్కడే ఉందని తెలిసుకున్నారు. సిబ్బంది, రక్షక భటులు ఎవ్వరు నచ్చజెప్పినా వినుపించుకొకుండా ఆ భవనానికి వెళ్ళి , మెట్లెక్కి మొదటి అంతస్తులో అల్లెన్ వాకిలు తట్టారు. అల్లెన్ బయటికి వచ్చినిశ్చేష్టుడయ్యాడు. ‘మీరు ఒక మాట ముందే చెప్పిఉంటె మీకు స్వాగతం పలకడానికి ఏర్పాటు చేసెవాడిని కదా,’ అన్నారు. "నేను భారత రాష్ట్రపతిగా మీదగ్గరకు రాలేదు. ఒక రచయితగా వచ్చాను. నా పుస్తకాలు ఎలా అమ్ముడు పోతున్నవి." అని నిరాడంబరంగా అడిగి తెలుసుకున్నారు.  

** #ముగ్గురు ప్రధానులకు, నెహ్రూ , శాస్త్రి, ఇందిరా గాంధి లతో ప్రమాణం నిర్వహించిన ఏకైక రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్. 

**1931-36 మధ్యకాలములొ, సర్కేపల్లి రాధాకృష్ణన్  #ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఉన్నారు.  దాని పురోభివృద్ధికి అంచనాకు మించి కృషిచెేశారు. ఒక వేదాంతి అయినా  గొప్ప గొప్ప విజ్ఞానులను అహ్వానించి వైజ్నానిక విషయాలను భోదించే శాఖలను ప్రారంభించారు. వారివల్ల విశ్వవిద్యాలయానికి వచ్చిన వారిలో  డా.టి.ఆరె.  శేషాద్రి, డా.సూరి భగవంతం, ఆచార్య హిరేన్ ముఖర్జీ, ఆచార్య హుమాయూన్ కబీర్, ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య, సి,వి.రామన్, తదితరులున్నారు.  

**#ఉపరాష్ట్రపతి ముఖ్య విధి రాజ్యసభ అధ్యక్షత. దానిని సమర్థవంతంగా పది సంవత్సాల పాటు నిర్వహించారు. వారి హాయాంలో సభలో ఉన్న ప్రముఖుల్లో కొందరు: అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్, సత్యేంద్రనాథ బోస్, ప్రథ్విరాజ కపూర్, రుక్మిణి దేవి అరుండేల్, జకీర్ హుస్సైన్, మైథిలి శరణ్ గుప్త, కాకాసాహెబ్ కాలెల్కర్, రాధాకుముద్ ముఖర్జీ, పి.వి.కాణె, మోటూరి సత్యనారాయణ, వాడియా, తారాచంద్,  భూపెష గుప్తా, ఫణిక్కర్, జైరామదాస్ దౌలత్ రామ్, తారాశంకర్ బంద్యోపాధ్యాయ, మొహన్లాల సక్షేనా, వి.టి.కృష్ణమాచారి. ఈ గంభీరోపన్యాసకులను ఆయన సంస్కృత శ్లోకాలు ఉదహరించి శాంతపరిచే వారు.

**1964 లో  కర్నూలునుండి కారులోె వెళ్లాలి. కాన్వాయిలో ఐదారు కార్లు మాత్రమే. కర్నూలులో ఒక అపశ్రుతి దొర్లింది.  ఒక చిన్న పిల్లవాడికి ఒక కాన్వాయ్ కారు తగిలింది. అదృష్టవశాత్తు ,అది పెద్దాస్పత్రికి ఎదురుగా జరిగింది. కాన్వాయి ఆగింది. రాష్ట్రపతి అగాడు. పిల్లవాడిని ఆస్పత్రికి తరలించారు.భారత రాష్ట్రపతి రాధాకృష్ణన్ నడుచుకొంటూ ఆస్పత్రి అత్యవసర చికిత్సగదికి వెళ్లారు. అక్కడ ఆదుర్దాగా  కూర్చొన్నారు. పిల్లవాడిని పరీక్షించిన వైద్యులు చిన్న చిన్న గాయాలేనని తీర్మానించి ప్రథమ చికిత్సచేసి పిల్లవాడిని వారి సంరక్షకులకు అప్పజెప్పారు. అపుడు గాని రాష్ట్రపతి తేరుకోలేదు. తరువాత రాధాకృష్ణన్ గారు బయటకు నడుచుకుంటూ వచ్చి కారు ఎక్కబోతున్నారు. అపుడు జిల్లా పోలీస్ అధికారి విక్టర్ సిబ్బందిని ప్రమాదం మీద నిలదీస్తున్నారు.అది రాష్ట్రపతి కంట పడింది. అంతే, ఆయన  పోలీసు అధికారి దగ్గరకు పోయి, వీపు మీద చెయ్యేసి: "Be calm, cool yourself. #They are also human beings," అన్నప్పుడు అధికారి తలవంచుకొన్నారు.

**#రాధాకృష్ణన్ చెవెనింగ్ స్కాలర్‌షిప్స్, రాధాకృష్ణన్ మెమోరియల్ అవార్డులు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన జ్ఢాపకార్థం ఏర్పాటు చేశారు.

**#అమెరికా అద్యక్షుడు జాన్ ఎప్ కెనడీ రాధాకృష్టన్ ని  ఎంతోగానో అభిమానించే వాడు. ఇండియా- చైనా యుద్ద సమయంలో  ఇండియాకు సహాయ సహకారాలు అందించాడు
కెనడీ'రాధాకృష్టన్ ని International teacher అని సంభోదించేవాడు.


Tuesday, April 5, 2022

శ్రీ బాబూ జగ్జీవన్‌ రాం గారి జయంతి.

🌷🙏భారత అమూల్య రత్న, స్వాతంత్ర్య సమర యోధుడు,సంఘ సంస్కర్త, శ్రీ బాబూ జగ్జీవన్‌ రాం గారి జయంతి.





✍️కొలిమి జ్వాల్లో వన్నెదేలిన బంగారంలా ఎదిగిన జగ్జీవన్‌రామ్‌ పట్ల నా ఆత్మ గౌరవాభిమానాతో ఉప్పొంగుతున్నది, జగ్జీవన్‌రామ్‌ #అమూల్యరత్నం’’ అని #గాంధీ ఒక సందర్భంలో రాశారు:-

✍️అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎన్నో పోరాటాలు చేసిన యోధుడు డాక్టర్​ బాబూ జగ్జీవన్ రామ్. ఆయన చేసిన పోరాటాలు ఇప్పటి తరానికి కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తాయనడం అతిశయోక్తి కాదు. ఆనాటి సమాజంలో చదువుకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్న.. పీడిత దళిత దీన జనుల కోసం జీవితాంతం శ్రమించిన సంస్కరణల యోధుడు జగ్జీవన్ రామ్. అందరితోనూ ఆప్యాయంగా బాబూజీ అని పిలిపించుకున్నారు.

✍️ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన రాజ కీయ, #సామాజిక విప్లవ #యోధుడు బాబూ జగ్జీవన్‌ రామ్‌. 

✍️అతి చిన్న వయస్సులో(27 ఏళ్లకే) శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యి అప్పట్లో రికార్డు సృష్టించిన స్వాతంత్ర్య సమరయోధుడు, ధీశాలి, బాబూ జగ్జీవన్‌ రాం. పోలిటికల్ కింగ్ మేకర్‌గా రాజకీయంలో రాణించి, అధికారం కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు కోసమే ధైర్యంగా అడుగేసిన మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం.
ఓ వైపు నిమ్న వర్గాల ఉన్నతికి కృషి చేస్తూనే,అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలను కలిగి ఉండి,తన ప్రతిభాపాటవాల ద్వారా గొప్ప పరిపాలనదక్షులుగా పేరు తెచ్చుకున్నారు బాబు జగ్జీవన్ రామ్ గారు.

✍️బాల్యం-విద్యాభ్యాసం:

జగ్జీవన్‌ బిహార్‌లోని షాబాద్‌ జిల్లా చాంద్వా గ్రామంలో 1908 ఏప్రిల్‌ 5న శోభిరామ్, బసంతి దేవిలకు జన్మించారు.

✍️వివక్షత పై అంకుశం:

ఆయన చదువుకున్న పాఠశాలలోనే మొదటిసారిగా అంటరానితనాన్ని అనుభవిం చాడు. పాఠశాలలో విద్యార్థుల కోసం మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తూ రెండు కడవలపై ‘హిందూ పానీ’, ‘ముస్లిం పానీ’ అని రాసి ఉంచేవారు. అయితే జగ్జీవన్‌ రామ్‌ హిందూ పానీలో మంచినీరు తాగారని హిందూ విద్యార్థులు ఆ కుండలోని నీరు త్రాగేవారు కాదు.ఈ ఉదంతంతో ఆగ్రహించిన బాబు ఒక రాయి విసిరి ఆ కుండను ముక్కముక్కలు చేశాడు. అప్పుడు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ‘హరిజన పానీ’ అనే మరో కుండను ఏర్పాటుచేశాడు. జగ్జీవన్‌ రామ్‌ ఆ కుండని కూడా పగులకొట్టాడు. ఇక చేసేదేమీలేక ఆ పాఠశాల వారు ఒకే కుండను ఏర్పాటుచేశారు. ఈ సంఘటనలో జగ్జీవన్‌ రామ్‌ గెలిచినా ఆయన గుండె ఆవేదనతోనూ, కోపంతోనూ నిండిపోయింది. ఆ అనుభవాలే ఆయన దళిత జనుల జాగృతివైపు ముందుకు సాగడానికి ప్రేరణనిచ్చాయి.

✍️బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఇంటర్‌,  కలకత్తా విశ్వవిద్యాయం నుంచి డిస్టింక్షన్‌లో బిఎస్సీ డిగ్రీ పూర్తి చేసి పట్టభద్రుడయ్యారు. ఆయన తన పీజీ చదువు పూర్తి చేశారు.

✍️స్వాతంత్య్ర ఉద్యమంలో:

విద్యార్థి దశలోనే గాంధీజీ అహింసా మార్గానికి ఆకర్షితుడు అయి 1930లో సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్‌ పోలీసులను ఎదిరించి లాఠీ దెబ్బలకు బెదరకుండా నిలబడ్డ నాటి స్వాతంత్య్ర సమరయోధుడు.
#బీహారులో 1934లో వచ్చిన భయంకరమైన భూకంపం సందర్భంగా జగ్జీవన్‌రామ్‌ ప్రజకు సహాయ, పునరావాస చర్యు చేపట్టాడు. తన బృందంతో ఆహోరాత్రు శ్రమించి ఆహారం, బట్టు, ఔషధాు, మంచినీరు, ఆశ్రయం మొదగు సౌకర్యాు బాధితుకు అందేవిధంగా సహాయ శిబిరాు జగ్జీవన్‌రామ్‌ నిర్వహించాడు. ఈ సందర్భంలోనే మొదటిసారిగా #గాంధీని జగ్జీవన్‌రామ్‌ కలుసుకోవడం తటస్థించింది.సత్యాగ్రహం శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో గాంధీజీ వెంట నడిచారు

✍️రాజకీయ రంగం:

కేవలం 27 ఏళ్ల వయస్సులోనే శాసన మండలి సభ్యునిగా ఎన్నిక కావడం ఆయనకే చెల్లింది.  52 ఏళ్లపాటు శాసనసభ, పార్లమెంటును ఏలిన మహా అనుభవ శీలి. వ్యవసాయ, రక్షణ, ఆరోగ్య, రైల్వేశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన సేవలు అనిర్వచనీయం. #మంత్రి మండలిలో అతి చిన్న వయసుడైన జగ్జీవన్‌రామ్‌ను అందరూ ‘#బేబి మినిష్టర్‌’ అని పిలిచేవారు. ప్రజలంతా ప్రేమతో ‘#బాబుజీ’ అని పిలిచేవారు.
ఆయన జీవితకాలం 78 ఏళ్ళు అయితే అందులో 52 ఏళ్ళు రాజకీయ జీవితం గడిపారు.

✍️ప్రపంచ రికార్డు:

1936 నుంచి 1986 వరకు ఐదు దశాబ్దాలకుపైగా చట్ట సభ సభ్యుడిగా కొనసాగడం ప్రపంచ రికార్డు. స్వతంత్ర భారతదేశంలో తొలి ఎన్నికలు జరిగిన 1952 నుంచి ఆయన చనిపోయే 1986 వరకూ పార్లమెంట్​ సభ్యుడిగా ఉన్నారు. దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన కేబినెట్ మంత్రిగానూ ఆయన రికార్డు సృష్టించారు. 

*1971 భారత-పాకిస్తాన్ యుద్ధంలో భారత రక్షణ మంత్రిగా పనిచేశారు. 

*బాబు జగ్జీవన్ రామ్ తన పదవీకాలంలో హరిత విప్లవం విజయవంతంగా అమలు చేయడానికి కూడా కీలకపాత్ర పోషించారు. కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖ మంత్రి 1967 నుండి 1970 సంవత్సరం వరకు. గతంలో, 1966 నుండి 1967 వరకు ఏర్పడిన కార్మిక, ఉపాధి మరియు పునరావాస మంత్రి విధులను కూడా ఆయన నెరవేర్చారు.

*బాబు జగ్జీవన్ రామ్ గౌరవార్థం, దేశీయంగా నిర్మించిన మొట్టమొదటి లోకోమోటివ్ అయిన WAM-1, అతని పేరు పెట్టబడింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యొక్క శిక్షణా అకాడమీకి బాబు జగ్జీవన్ రామ్ పేరు పెట్టారు.
*2015 సంవత్సరంలో పూణే నగరంలోని యెరావాడ పరిసరాల్లో మహాత్మా గాంధీ నగర్‌లో బాబు జగ్జీవన్ రామ్ ఇంగ్లీష్ మీడియం సెకండరీ స్కూల్ స్థాపించబడింది.

*ఉజ్జయినిలోని విక్రమ విశ్వవిద్యాయం 1967లో జగ్జీవన్‌రామ్‌కి ‘డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌’ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఆయన సేవను మెచ్చిన కాన్పూర్‌ విశ్వవిద్యాయం 1968లో డాక్టరేట్‌తో సత్కరించింది.

✍️రచయితగా:

బాబుజీ గొప్ప రచయిత అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆయన హిందీలో, ఇంగ్లీషులో రచనలు చేశారు. “భారత దేశంలో కులం సవాళ్ళు”, “ జీవన సరళి వ్యక్తిత్వ వికాసం” అను రెండు విశిష్ట గ్రంథాలను రాశారు.
ఆయన గొప్ప అధ్యయనశీలి.

✍️కూతురు కూడా తండ్రి బాటలోనే:

ఆయన కుమార్తె మీరాకుమార్‌ తండ్రి ఆదర్శాలతోనే పెరిగి కేంద్రమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా దేశానికి సేవలందించారు..

✍️సమతా దివాస్:

అతి పిన్న వయసులో మంత్రిగా, అతి ఎక్కువ కాలం చట్టసభ సభ్యునిగా, అతి ఎక్కువ శాఖల బాధ్యతలు చేపట్టిన మంత్రిగా అరుదైన రికార్డులు ఆయన సొంతం. బాబూ జగ్జీవన్​ రామ్​ జయంతిని యావత్​దేశం ‘#సమతా దివాస్’గా జరుపుకుంటోంది.

1986 జూలై 6వ తేదీన బాబూజీ తన తుదిశ్వాస విడవడంతో యావత్తు భారతజాతి కనీరుమున్నీరయ్యింది. ఆయన భౌతికంగా భారత దేశాన్ని విడిచినా ఆయన దేశానికి చేసిన సేవలు, సంఘ సంస్కరణలు, ఆయన ఆచరించిన సిద్దాంతాలు ఎప్పటికీ సంజీవంగానే ఉంటాయి..
హేతుబుద్ది, సానుకూ దృక్పథం, స్పష్టమైన దార్శనికత, విస్తృతమైన అధ్యయనం, గొప్ప #మేధాశక్తి, స్థిరమైన సంక్పబం, నిత్యకృషీవత్వం, ఓరిమి, కారుణ్యం, చర్చించే గుణం, ఒప్పించే గుణం, ఆత్మవిశ్వాసం, ధైర్యం, సేవానిరతి, #కార్యనిర్వహణాదక్షత మొదగు క్షణా నిండుదనంతో బమైన సుగుణశీ వ్యక్తిత్వం, తనకితాను నిర్మించుకున్న భారతదేశ ‘#అమ్యూరత్నం’ డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ గారు చిరస్మరణీయుడు.


Sunday, April 3, 2022

ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి వర్థంతి

🎠🙏భారత వీరత్వానికి ప్రతీక.. భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు.. గెరిల్లా యుద్ధాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేశిన వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి వర్థంతి  సందర్భంగా🙏🎠




#మొఘల్ సామ్రాజ్యానికి పతనాన్ని శాసించి.. మరాఠా సామ్రాజ్యపు వెలుగుల్ని విస్తరింప చేసిన యోధుడు.. యువతరానికి ఎప్పటికీ పౌరషాగ్నిని రగిలించే దిక్సూచి.. చీకట్లో నుండి నిప్పుకణికలా దూసుకొచ్చాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. మొఘలుల దాడి నుండి సమర్థవంతగా ఎదుర్కొన్నాడు. ఆ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడాడు.#గెరిల్లా యుద్ధాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేశాడు.

#శివుని ఆశీస్సుల చిన్నారి..

శివాజీ క్రీ.శ. 1630 ఫిబ్రవరి 19వ సంవత్సరం వైశాఖమాసపు శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయి పుణ్యదంపతులకు జన్మించాడు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయ బొస్లే కులానికి చందినవారు. శివాజీ తల్లి జీజియ బాయ్ యాదవ్ క్షత్రియ వంశమునకు చెందిన ఆడ పడుచు. శివాజీ పుట్టడానికి ముందు పుట్టిన వారందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై పార్వతికి పూజించగా శివాజీ పుట్టి క్షేమంగా ఆన్నాడు. దీంతో ఆయననకు ఆ పేరు పెట్టారు.

#తల్లి సంరక్షణ, దాదాజీ ఖాండ్‌దేవ్ శిక్షణతో శివాజీ వీరుడిగా అవతరించారు. భారతరామాయణాల విశిష్టత, హిందూ మతం గొప్పదనం తల్లిద్వారా నేర్చుకున్నాడు. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం కూడా ఆమె ద్వారా పెంపొందించుకున్నాడు. తండ్రి పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో యుద్ధ తంత్రంలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యా పారంగతుడైన శివాజీ, మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా వ్యూహారచన చేశాడు. 17వ ఏటనే తొలిసారిగా యుద్ధంలో పాల్గొన్న శివాజీ, బిజపూర్ సుల్తానులకు చెందిన తోర్నా కోటను ఆక్రమించుకున్నాడు. మరో మూడేళ్లలో కొండన, రాజ్‌ఘడ్ కోటలతో సహా పుణే ప్రాంతాన్నంతా తన అధీనంలోకి తెచ్చుకున్నాడు.

#నలుగురు గురువుల సాంగత్యంలో ...

మొదటి గురువు జిజియా బాయి. బాల్యంలో ఆమె చెప్పిన కథలు శివాజీని పరాక్రమ వంతుడిగా తీర్చిదిద్దాయి. రెండవ గురువు దాదాజీ కొండదేవ్. దగ్గర రాజకీయం, యుద్ద తంత్రం నేర్చుకున్నాడు. మూడవ గురువు తుకారామ్. వీరి దగ్గర సామాజిక సమరసత నేర్చుకున్నాడు శివాజీ. నాల్గవ గురువు సమర్థ రామదాసు. వీరి దగ్గర ఆధ్యాత్మికత, హైందవ పరిరక్షణనే జీవిత పరమార్థమనే విషయాన్ని నేర్చుకున్నాడు. ఈ విధంగా శివాజీ వ్యక్తిత్వం అన్ని రకాలుగా అత్యంత శ్రేష్ఠమైనదిగా తీర్చి దిద్ద బడింది.

#శివాజీ మెరుపుదాడులు..

 గెరిల్లా యుద్ధ రీతులు తెలుసుకొన్న అఫ్జల్‌ఖాన్ అతడిని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని భావించాడు. శివాజీని రెచ్చగొట్టడానికి ఆయన ఇష్ట దైవమైన భవానీ దేవి దేవాలయాలను కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్దంగా లేనని చర్చలకు ఆహ్వానించాడు. ప్రతాప్‌ఘడ్ కోట దగ్గర సమావేశమవడానికి ఇద్దరూ అంగీకరించారు. అఫ్జల్‌ఖాన్ దుర్బుద్ధి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి వెళ్లాడు. ఇద్దరూ తమ అంగరక్షకుల సమక్షంలో చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ కత్తితో శివాజీపై దాడి చేశాడు. ఉక్కుకవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు. అడ్డువచ్చిన అఫ్జల్‌ఖాన్ అనుచరులను శివాజీ సైనికులు అడ్డుకున్నారు. దీంతో శివాజీ తన దగ్గరన్న పులి గోర్లతో అఫ్జల్‌ఖాన్ పొట్టను చీల్చి హతమార్చాడు.

#లౌకిక వాదం పాటించిన రాజు....

శివాజీ మహారాజు ముస్లింల దురాక్రమణను వ్యతరిేకించిన్పటికీ, తన రాజ్యంలో మాత్రం లౌకికవాదాన్ని పాటించారు. అన్ని మతాల వారినీ సమానంగా ఆదరించారు. ఇతర మతాల వారిని కూడా హిందువుల మాదిరిగానే గౌరవించేవాడు. అంతేకాదు హిందువుగా మారిన ఓ వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి మరీ వివాహం జరిపించాడట.

#అన్ని మతాలను గౌరవించిన రాజుల్లో శివాజీ ఒకరు. తన హయాంలోని సైన్యం, పరిపాలన, వివిధ శాఖల్లోని ఉద్యోగుల కూర్పు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

#మతం ప్రతిపాదికన కాకుండా మానవీయ విధానాలతో శివాజీ పరిపాలన సాగించాడు. సైన్యం, అధికారుల నియామకాల్లో మతాన్ని ప్రతిపాదికగా తీసుకోలేదు. అతని సైన్యంలోని మూడో వంతు మంది ముస్లింలే.
శివాజీ నావికా దళ అధిపతి సిద్ధీ సంబాల్. అందులో ఎక్కువ మంది సైనికులు కూడా ముస్లింలే.

#శివాజీ స్నేహితుల్లో మహమ్మదీయులు..

ఛత్రపతి శివాజీ స్నేహితుల్లో చాలా మంది మహమ్మదీయులు ఉన్నారట. అంతేకాదు తన సైనిక వ్యవస్థలో ఎంతో మంది ముస్లింలకు సముచిత స్థానం కల్పించారట.

#పంచ కళ్యాణి గుర్రాలు...

యుద్ధాల్లో ఓటమి ఎరుగని ధీరుడు భరతమాత ముద్దు బిడ్డ ఛత్రపతి శివాజీ..   విశ్వాస్ ,కృష్ణుడు ఇలా ఏడు మేలిమిజాతి జాతి గుర్రాలను వాడేవారని.. అవి  పంచ కళ్యాణి జాతికి చెందిన గుర్రాలని చాలా మందికి తెలుసు.

#అంతుబట్టని యుద్ధతంత్రాలు...

శివాజీ మహారాజ్ యుద్ధ తంత్రాలు శత్రువులకు అంతుబట్టని విధంగా ఉండేవట. తిరుగులేని యుద్ధ వ్యూహాలను అనుసరించడమే శివాజీ అసమాన ప్రతిభకు నిదర్శనం. పటిష్టమైన సైన్యంతో పాటు నిఘా వ్యవస్థను కూడా కలిగి ఉండటమే కాకుండా, ఆధునిక యుద్ధ తంత్రాలను ఉపయోగించాడట.

#సైన్యం పట్ల శ్రద్ధ...

శివాజీ మహారాజ్ తన సైన్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకునేవారట. దీంతో వారంతా వారి ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేసేందుకు సిద్ధపడేవారు. అయితే సైనికులకు ప్రమాదం ఏర్పడే సందర్భంలో ఆయన వారిని అనూహ్యంగా అక్కడి నుండి తప్పించేవారట.

#నావికా దళం..

పటిష్టమైన నావికా దళం మరాఠాలకు మరింత బలాన్ని చేకూర్చింది. దీనికి శివాజీ వేసిన బలమైన పునాదులే కారణం. విదేశీ దండయాత్రల నుండి కాపాడటానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది. ఆ కాలంలో ఇలాంటి ఆలోచనలు ఏ రాజులకు రాకపోవడం గమనార్హం.

#కోటలు...

మరణించేనాటికి 300 కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి. కొండలపైన ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేధ్యమయిన కోటలను నిర్మింపచేయడంలో శివాజీ ప్రపంచ ఖ్యాతి పొందాడు. నాసిక్ నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగీ వరకు 1200 కిలోమీటర్ల మధ్య ఈ 300 కోటలు నిర్మించబడ్డాయి.

27 ఏళ్ళపాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా #సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 న మధ్యాహ్నం  రాయఘడ్ కోటలో మరణించాడు.

#శివాజీ... భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు. ఈ పేరు భారతావని పులకించిపోతుంది.
ముంబయిలోని విమానాశ్రయానికే కాదు, రైల్వే స్టేషన్‌కు కూడా ఆయన పేరే ఉంటుంది.
అరేబియా సముద్రంలో శివాజీ అతిపెద్ద విగ్రహాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు కూడా రూపొందుతున్నాయి.