Tuesday, March 29, 2022

తాళ్ళపాక అన్నమాచార్యుల వర్ధంతి*

*నేడు తాళ్ళపాక అన్నమాచార్యుల వర్ధంతి*



*సంకీర్తనాచార్య! అన్నమాచార్య విచ్చేయవే!*

తాళ్ళపాక అన్నమయ్య! తెలుగు పద భారతికి తన అపూర్వమైన భావనా పటిమతో, నవ్య నవనీతమైన సుమధుర గీతికలతో వెలుగు హారతులద్ది, భాషా ప్రవర్ధమానానికి ఎనలేని కృషి సల్పిన వాగ్గేయ ధురీణుడు. తెలుగు పద కవితకు సొబగులద్ది, ఆ సొగసులకు అద్భుత పదసిరులనే విరుల పరిమళాన్ని అద్దిన పద కవితా పితామహుడు. తన సంకీర్తనా ప్రక్రియతో తేటతెలుగుపాటకు ప్రాణప్రతిష్ఠ చేసి, ఆ మధురిమలకు అద్బుత పదసిరులను విరుల పరిమళాన్ని గుబాళించిన పదకవితా పితామహుడు. వాడుక భాషలో గేయరచన చేసి సామాన్యజనులకు పాట పాడుకునే అవకాశాన్ని కలిగించిన స్తవనీయుడు! భాష యొక్క పరమార్థాన్నీ, నిజమైన ప్రయోజనాన్నీ గ్రహించి తాను రాసిన వాటిలో అత్యధిక సంకీర్తనలను సామాన్యులు, పల్లెపట్టుల్లో నివసించే గ్రామీణులు పాడుకునే జానపద బాణిలో సృజించి సరికొత్త వాజ్ఞయాన్ని సృష్టించిన మహనీయుడు.

అందరిలోనూ శ్రీనివాసుడే...
తాను దర్శించిన సకల దేవతా స్వరూపాలలోనూ శ్రీవేంకటేశ్వరుని దర్శించిన భక్తశిరోమణి అన్నమయ్య. పల్లవి, చరణాలతో కూడిన గేయ రచనకు ఆద్యుడై, శ్రీనివాసుని పదారవింద అనుభూతినీ, ఆ హరిపద మకరంద ఆసక్తినీ తన సంకీర్తనలలో సరళమైన భాషలో వెలయించిన ఘనుడు అన్నమయ్య. సకల వేదాల సారాన్నీ తన సంకీర్తనలుగా చేసి వేదాలలోని ఉత్తమ గుణాలను అమృత గుళికలుగా చేసి మనకు అందించాడు సంకీర్తనాచార్యుడు. అన్నమయ్య సంకీర్తనలు వెంకట పద ముద్రాంకితాలు.

రాముడైనా, కృష్ణుడైనా, నారసింహుడైనా, అన్నమయ్య పదాలలో వేంకటేశ్వరునిగా ఒదిగి వేంకట పద ముద్రాంకితులు కావలసిందే. వేంకటాచలవల్లభునిగా, భక్తజన సన్నిభునిగా వెలుగొందవలసిందే. బాలకృష్ణుడైనా, తిరుమలగిరిపై వేంకటాద్రి ఇంద్రనీలమణిలా ప్రకాశించవలసిందే. ఘోర విదారణ నృసింహుడైనా వేంకటగిరిపై వెలుగుతూ అందపు నవ్వులు చల్లవలసిందే. తాను రాసిన ప్రతి సంకీర్తన హరి వైభవాన్నీ, ఆ తిరువేంకట విభుని ప్రాభవాన్నీ చాటిన వాణీ వీణా నాదాలుగా నినదించేలా చేసి, అద్భుత భావ సౌందర్యం ప్రతిఫలించే గీతికలుగా తీర్చిదిద్దిన అక్షర శిల్పి అన్నమయ్య.

అంతేగాక హరి తనకే సొంతమనే భావనకు ప్రతిబింబంగా 'నేనొక్కడ లేకుండితే నీ కృపకు పాత్రమేది' అంటూ ఒకింత ఆడంబరం ఒలకబోస్తాడు. అయితే, అన్నమయ్యకు ఉన్నది ఆడంబరం కానే కాదని, అణువణువునా నిండిన శ్రీనివాస పదానుభూతి అని, తన్మయత్వంతో కూడిన అలౌకిక భావన మాత్రమేనని అవగతమవుతుంది. భక్తిస్ఫోరకమైన 'అణురేణు పరిపూర్ణమైన రూపము, అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము' అంటూ ఆర్తితో కీర్తించిన సంకీర్తనలలో భక్తి గంగ ఉప్పొంగుతుంది.

అలతి పదాలతో అనంతమైన భావాన్ని వెలయించటం అన్నమయ్య సంకీర్తనల ప్రత్యేకత. భగవంతుని కీర్తించటంలో భక్తికి ప్రాధాన్యతనిస్తూ ధన్యత చెందిన భక్త కవులు మన విశాల సంస్కృతిలో కోకొల్లలుగా కనబడతారు. అన్నమయ్య సంకీర్తనల్లోని వైవిధ్యం భారతీయ వాగ్గేయకార రచనల్లోనే అగ్రగణ్యంగా విరాజిల్లుతోందంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు.

అన్నమయ్య సంకీర్తనల్లో దేవభాషగా పిలువబడే సంస్కృత సంకీర్తనలు ఎన్నో ఉన్నాయి. మర్యాద పురుషోత్తముడై సకల సుగుణాలకు నెలవైన శ్రీరాముని 'దేవదేవం భజే దివ్యప్రభావం రావణాసుర వైరి రఘు పుంగవం రామం' అంటూ కీర్తిస్తాడు. హిరణ్యకశిపుని భంజించిన నారసింహుని "జయజయ నృసింహ సర్వేశ! భయహర వీర ప్రహ్లాద వరద'' అంటూ ప్రణతులర్పిస్తాడు.

తన్మయ హృదయంతో 'కేవల కృష్ణావతార కేశవా! దేవదేవ లోకనాధ దివ్యదేహ కేశవ' అంటూ గోపాలకృష్ణుని సన్నుతి చేస్తాడు. ఇక అన్నమయ్య ఘనవిశేషణాలతో ఆగణిత భవహరుడైన శ్రీహరిని కీర్తించాడు. "ఆగమ పుంజ పదార్థుని ఆపత్సఖ సంభూతుని నాగేంద్రాయత తల్పుని నానాకల్పుని కోరుదు నామది ననిశము'' అంటూ సాగుతుంది ఘనపద విభూషితమైన ఆయన పదం.

సంకీర్తనా మాణిక్యాలు
జానపదులకు ప్రాణప్రదుడై అద్భుత సంకీర్తనా మాణిక్యాలను సృజించిన ఘనత అన్నమయ్యకే చెందుతుంది. పల్లెపట్టుల్లో జనం పాడుకునే సువ్విపాటలు, గొబ్బిపాటలు, కోలాటం పాటలు అన్నమయ్య హృదయసాగరం నుంచి ఉత్తుంగ తరంగాల్లా ఎగసిపడ్డాయంటే అతిశయోక్తి లేదు. శ్రమజీవులు అలసట తొలగటం కోసం ఆలపించే దంపుళ్ళ పాటలు అన్నమయ్య రాసిన విధం పులకింపచేస్తుంది. కన్నెపిల్లలు వెన్నదొంగపై ముద్దుగా ఆలపించే 'కొలనిదోపరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికిని గొబ్బిళ్ళో' వంటి సంకీర్తనలకు ప్రాణం పోసింది అన్నమయ్యే.

ఇక అన్నమయ్య తత్వామృతాలు జగత్ప్రసిద్ధాలు. "తెలియ చీకటికి దీపమెత్తక పెద్ద వెలుగు లోపలికి వెలుగేలా..', 'ఎంత విభవము కలిగే నంతయును ఆపదని చింతించినది కదా చెడని జీవితము' వంటి అన్నమయ్య తత్వాలు మనకు జ్ఞానబోధ చేసి మనలోని అజ్ఞానపు చీకట్లను పారద్రోలతాయి.అన్నమయ్య సంకీర్తనలు సాహిత్య ప్రధానమైనవని కొందరూ, సంగీతం పాలు తక్కువని వాదించేవారు కొందరూ ఉన్నారు. ఈ అల్పమైన విషయాలను పక్కనపెడితే అనల్పమైన అన్నమయ్య సాహిత్య సేవ, భక్త పారవశ్యం తెలుగుజాతికి ఎన్నటికీ శిరోధార్యమే.

ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు  అన్నమయ్య వర్ధంతి. తన తండ్రికి తీర్థవిధిని నిర్వర్తిస్తూ అన్నమయ్య పుత్రుడు, వాగ్గేయకారుడు అయిన తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు ఆర్తితో లిఖించిన "దినము ద్వాదశి నాడు..తీర్థ దివసము నేడు.. జనకుండ..! అన్నమాచార్యుండ..! విచ్చేయవే..'' అనే సంకీర్తనను స్మరిస్తూ తెలుగు నేలపై ఆ భాగవతుని తిరిగి అవతరించమని అర్థిస్తూ, అన్నమయ్యకు భక్తిభావాంజలితో ప్రాంజలి ఘటిద్దాం.



0 comments:

Post a Comment