Monday, January 30, 2023

మహాత్మా గాంధీజీ వర్థంతి, జనవరి 30 అమర వీరుల సంస్మరణ దినోత్సవం,

🌷🙏నీ అడుగులు.. ప్రపంచ శాంతికి మార్గాలు.....
గాంధీజీ.. వర్థంతి  సందర్భంగా🙏🌷

【జనవరి 30 అమర వీరుల సంస్మరణ దినోత్సవం, మహాత్మా గాంధీజీ వర్థంతి】




 
#మానవులు జన్మిస్తుంటారు, మరణిస్తుంటారు. కానీ మరణాన్ని జయించిన మహానీయులు కొందరే ఉంటారు.

సూర్య చంద్రులున్నంత కాలం వారి కీర్తి ప్రతిష్టలు అజరా మరంగా ఉంటాయి.
మనకు తెలిసిన మనుషుల్లో మహాత్మునిగా నీరాజనాలందుకున్న వారు గాంధీజీ మాత్రమే.
కత్తులు, కఠారులు,బాంబులు, తుపాకులు ఏ ఆయుధం అవశరం లేకుండా అహింసనే ఆయుధంగా చేతబూని సమరాన్ని సాగించి అఖండ విజయ సంపదను భారత మాత దోసిళ్ళలో పోసిన త్యాగశీలి, అమరవీరులు మన బాపూజీ.
ఆయన జగతిలో అందరికీ ఆదర్శప్రాయులు.
అహింస ముందు ఎటువంటి గొప్ప శక్తి అయినా తలవంచక తప్పదు. హింసకు సరైన సమాధానం అహింస మాత్రమే అని గాంధీజీ నొక్కి వక్కాణించేవారు.
1948 జనవరి 30 భారత జాతికే దుర్దినం.ఆరోజు సాయంకాలం 4 గంటలకు అహింసా సిద్ధాంత ప్రవక్త , మన జాతిపిత, పూజ్య బాపూజీ నాథూరామ్ గాడ్సే తుపాకీ కాల్పులకు విగతజీవియై నేలకొరిగారు. స్వాతంత్ర పోరాట యోధుడైన గాంధీ మరణించిన ఈ రోజును ఆయన వర్ధంతి తో బాటు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా మనం జరుపు కుంటున్నాము.
***     ***    ***

*#మహానుభావుల బాట - శ్రీ చాగంటి వారి మాట..... శ్రీ #మహాత్మా గాంధీ గారు...

#ఎందరో మహానుభావుల జీవితములు మనకు మార్గదర్శనములు, నిరంతర స్ఫూర్తిదాయకములు. అటువంటి ఎన్నో విషయములు పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ డా||చాగంటి కోటేశ్వర రావు గారి మాటలలో...

అనేక సందర్భములలో, అనేక ప్రవచనములలో పూజ్య గురుదేవులు భారత జాతిపిత మహాత్మా గాంధీ గారి జీవితములోని అనేక ఆదర్శప్రాయమైన విషయములు, ఆయన శీల వైభవముల గురించి ప్రవచించిన అనేక విశేషములు, గాంధీ గారి వర్థంతి సందర్భముగా...

గాంధీగారు తన జీవితచరిత్రలో ఒక విషయము వ్రాసుకున్నారు. ఒకసారి ఆయన చెయ్యరాని పొరపాటు చెయ్యడానికి అంగుళము దూరము దాకా వెళ్ళారు. గీత దాటకూడనటువంటి స్థితిలో, ఆయన ఇక కొద్ది క్షణాల్లో గీత దాటుతారు అనగా, వేశ్యా లంపటంలో పడిపోతారు అనగా ఆయనను ఆ లంపటంలో పడకుండా కాపాడినది అమ్మకిచ్చిన మాట, అమ్మ ముఖం. గాంధీ మహాత్ముడు చదువుకోవడానికి  ఓడలో విదేశాలకు  వెళ్ళిపోతున్నప్పుడు  తల్లి పిలిచి పరస్త్రీ సంగమము ఎప్పుడూ చెయ్యనని ప్రమాణము చేయించుకున్నది. అమ్మ చెప్పిన మాట, అమ్మ వద్ద చేసిన ప్రతిజ్ఞ జ్ఞాపకమునకు వచ్చి వెంటనే వెనుకకు తిరిగి వెళ్ళిపోయారు. ఆ కారణానికి తరవాత కాలములో మహాత్మ అయ్యి, , జాతిపిత అయ్యి మన అందరి చేత తండ్రి అనిపించుకోగలిగిన వ్యక్తి అయ్యారు. దానికి కారణము ఆయన తల్లి, ఆయనకు తన తల్లికి ఇచ్చిన మాట పట్ల ఉన్న గురి. ధర్మము వైక్లబ్యము నందు వస్తున్నప్పుడు ఎవరు ఆయనని దిద్దారు అంటే, ఆయన తల్లి రూపములో పరమేశ్వరుడే దిద్దాడు అని చెప్పాలి.

మహాత్మాగాంధీ గారు తన జీవిత చరిత్ర అంతటినీ దేని కొరకు వ్రాసారు అనగా - మహాత్ములు తమ జీవితములో వచ్చిన వైక్లబ్యములను దాచకుండా తమ జీవితచరిత్రలో పొందుపరచి, తదనంతరము వచ్చే తరముల వాళ్ళు అటువంటి తప్పు చెయ్యకుండా సమగ్రతను పొందడము కోసము తమ జీవిత చరిత్రలను ఇస్తారు. గాంధీ గారు తన బాల్యములో చేసిన రెండు తప్పులను ఎత్తి చూపించుకున్నారు. ఒకటి దస్తూరి గురించి శ్రద్ధ తీసుకోలేదు ఆ కారణము చేత పెద్దవాడిని అయినాక కూడా నేను వ్రాసినది ఇతరులు చదవడము కష్టము అయ్యేది. నేను దస్తూరి విలువ తెలుసుకునేప్పటికి బాగా చూచివ్రాత వ్రాసి, దస్తూరి అభివృద్ధి చేసుకునే స్థితి దాటిపోవడము జరిగింది. అందుకని జీవితములో దిద్దుకోలేక పోవడము జరిగింది. రెండవది వ్యాయామము పట్ల చాలా చిన్న చూపు ఉండేది. ఈ పరిగెత్తడము, ఆటలాడడము ఎందుకు? అనిపించి హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు కదా అన్న భావన పెంచుకోవడము జరిగింది. దాని వలన ఏమి నష్ట పోయానన్నది పెద్దవాడిని అయ్యాక తెలుసుకున్నాను. చిన్నప్పుడు బాగా ఆటలు ఆడి, వ్యాయామము చేసి ఉంటే బహుశా నాకు ఇంతకన్నా శక్తివంతమైన శరీరము ఉండేది. ఎంత పెద్ద చదువు చదువుకున్నా గట్టిగా కి.మి. దూరము నడవలేక, ఎండగా ఉన్న వాతావరణములో తిరగ లేకపోతే , ఒక గంటసేపు మంచినీళ్ళు లేకుండా మాట్లాడలేకపోతే, మాట్లాడలేక శరీరము సహకరించకపోతే ఎంత పెద్ద చదువు చదువుకున్న వారైనా చెయ్యవలసిన పని నియంత్రింప బడుతుంది. అందరూ చేసే పని చెయ్యలేరు. చెయ్యవలసిన కార్యక్రమములకు శరీరమును సిద్ధముగా ఉంచుకోవాలి. దానికి రెండు ప్రధానమైన లక్షణములు చిన్నతనము నుంచి అలవాటు చేసుకోవాలి.

మహాత్మాగాంధీ గారు 1942లో రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్సుకి లండన్  వెళ్ళినప్పుడు అప్పటి లండన్ వైస్రాయ్ కూతురు ఆయనని చూడటానికి వచ్చింది. ఆ అమ్మాయి గాంధీజీ ఒంటి మీద పంచె తప్ప (గాంధీజీ కేవలం పంచె మాత్రమే కట్టుకునే వారు) ఏమీ లేకపోవడం చూసి "తాతగారూ! మీకు పైన వస్త్రం లేదు (అక్కడ ఆ సమయంలో విపరీతమైన చలి కూడా). మీకు నేను ఒక మంచి స్వెట్టర్ ఇస్తాను వేసుకోండి" అంది. ఆ అమ్మాయి మాటలకి గాంధీజీ నవ్వి, "భారతదేశంలో పంచె మాత్రమే కట్టుకుని, వేసుకోవటానికి బట్టలు లేకుండా ఉండిపోయిన కొన్ని కోట్లమందికి ప్రాతినిధ్యం వహిస్తున్నవాడు గాంధీ. వారందరూ పైన బట్టలు వేసుకోగలిగినరోజున గాంధీ కూడా వేసుకుంటాడు. వాళ్ళందరికీ కూడా స్వెట్టర్లిస్తే నాకూ ఇయ్యమ్మా!" అన్నారు.ఈ మాటలు విని ఆ పిల్ల తెల్లబోయింది. ఆయన ఎంతటి మహానుభావుడో చూడండి.

గాంధీగారు ఎప్పుడూ విలువలతో జీవించిన వ్యక్తి. గాంధీగారు దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ఇల్లు అద్దెకు తీసుకునేందుకు ఎక్కడికి వెళ్ళినా మీరు ఎవరు అని అడిగేవారు. "To which country do you belong?" అని అడిగేవారు.  "I am an Indian" అంటే "We don't give room for you" అనేవారు. "ఎందుకివ్వరు?" అని ఆయన ఎంతో క్లేశపడి అడిగితే కారణం చెప్పేవారు కాదు. ఆఖరుకి ఆయన కష్టపడి ఒక రూమ్ సంపాదించుకున్నారు. తర్వాత Indian అంటే ఎందుకు అద్దెకి ఇవ్వడం లేదు అని ఆరాతీశారు. "Indiansకి శుభ్రత ఉండదు. వాళ్ళు ఇంట్లో వస్తువులు సక్రమంగా పెట్టుకోరు, వాళ్ళు శుభ్రంగా ఉండరు, వాళ్ళు ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉండవు. అందుకని వాళ్లకి ఇల్లు ఇవ్వం" అన్నారు. గాంధీగారు చాలా బాధ పడ్డారు. అయ్యో నాదేశం గురించి, నా దేశవాసుల గురించి ఇలా చెప్పుకుంటున్నారు అన్నమాట. మార్పు రావాలి.  Indian అంటే పది రూపాయలు తక్కువైనా సరే మీకు ఇల్లు ఇస్తాం అనే రోజు రావాలి అని దక్షిణాఫ్రికాలో ఉన్న భారతీయులందరినీ పిలిచి ఒక సమావేశం పెట్టారు. "ఈ అగౌరవం మనకు కలగకూడదు. మనం పరిశుభ్రంగా ఉందాం. మనం ఎక్కడ ఉంటామో అక్కడ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి. కాబట్టి ఇవ్వాల్టి నుంచి మనం ఏయే ప్రాంతాలలో నివాసం ఉంటున్నామో ఆ ప్రాంతాలన్నీ, ఎవరిమీద ఆధారపడకుండా మనమే శుభ్రం చేసేసుకుందాం. మనవల్ల దేశానికి గౌరవం కలగాలి" అని కోరుకొని అందరినీ ప్రోత్సహించి అందరిలోనూ పరిశుభ్రత మీద ఉత్తేజం తీసుకువచ్చి దక్షిణాఫ్రికాలో ఇల్లు ఇవ్వను అన్నటువంటి వాళ్ళచేతనే భారతీయుడు అంటే చాలు ఇల్లు ఇచ్చేటట్లుగా చేశారు. భారతీయులలో పరిశుభ్రత గురించి అంత ఉద్యమం తీసుకువచ్చారు. అలాగే గాంధీగారు ఒకప్పుడు ఒక బ్రిటీష్ వైస్రాయ్ ఇంటికి అతిథిగా వెళితే ఆయనను "మీకు ఏది కావాలని అడిగితే ఏమడుగుతారు? " అని ఆ వైస్రాయ్ అడిగారు. అక్కడి విలేఖరులు అందరూ ఆయన స్వాతంత్ర్యము కావాలని అడుగుతారని అనుకున్నారు. కాని, ఆయన "దేశమంతటా స్వఛ్ఛత నిలబడాలని కోరుకుంటాను. ఈ పారిశుద్ధ్య పనివారు కూడా సంతోషముగా బ్రతికే రోజు రావాలని కోరుకుంటాను. వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుతాను" అన్నారు. మిమ్మల్ని ఇంకొకటి కూడా కోరుకోమంటే అని అడిగితే "ఆ పారిశుద్ధ్య పనివారికి సేవ చేసే అవకాశమిమ్మని అడుగుతాను" అన్నారు గాంధీ గారు. అంటే అంతర్లీనమైన సిధ్ధాంతముల చేత బ్రతికిన దేశం ఈ దేశం. ఒక ఫలితాన్ని సాధించటం కాదు, ఏ మార్గంలో సాధించాము అన్నదానివల్ల గొప్ప. ఏది ఏమైపోనీ...కష్టమే రానీ...సుఖమే రానీ, జీవితానికి విలువలు ప్రధానము.

నాకు తెలిసి ఈ మధ్య కాలంలో 'మహాత్మ ' అని పిలిపించుకోవడానికి  పరమ అర్హుడైన మహాపురుషుడు గాంధీజీ ఒక్కరే. ఎందుకని ఆయన 'మహాత్మగాంధి' అని పిలిపించుకోవడానికి అర్హుడు? ఎదురుగుండా నిలబడి తుపాకీ గురిపెట్టి గాంధీజీ మీదకి తుపాకీగుళ్ళ వర్షం కురిపిస్తోంటే, ఒక్కొక్క గుండు వచ్చి గుండెల్లో తగులుతోంటే, రక్తం బయటకి చిమ్మెస్తుంటే, ఆయన బుర్రలో ఎన్ని  వ్యాపకాలుండాలి నిజంగా? ఒక చిన్న కుటుంబం ఉన్న మనమే 'అబ్బో ఎన్ని వ్యాపకాలో, ఏదండీ టైము కుదరట్లేదు ' అంటాము. అంతటి మహానుభావుడు, దేశాన్ని ఒక త్రాటిమీద నడిపించిన వాడు అయిన గాంధీజి గుండెల్లో గురి పెట్టి కాలుస్తుంటే ఆయన నోటివెంట వచ్చిన మాట 'హేరాం'. హేరాం, హేరాం, హేరాం అంటూ ఆయన పడిపోయారు. అలా అనాలి అంటే లోపల సంస్కారం ఎంత గట్టిదో చూడండి. అందుకే మహాత్మాగాంధీగారు మరణించారు అని రేడియోలో చెప్తే, రమణమహర్షి అంతటివారు కన్నులనీరు పెట్టుకుని, 'ఒక మహాత్ముడు వెళ్ళిపోయాడు' అన్నారు. దేహమునందు అభిమానమును పొగొట్టుకునే స్థితికి కొందరే వెళ్ళగలరు, అది అందరికీ రాదు.
🙏

0 comments:

Post a Comment