Thursday, January 19, 2023

ప్రజాకవి, సంఘసంస్కర్త వేమన గారి జయంతి

🙏💐ఆటవెలది ఈటెగా విసిరిన దిట్ట.. ఛాందస భావాలకు తొలి అడ్డుకట్ట..... కాలాతీత కవి... ప్రజాకవి, సంఘసంస్కర్త వేమన గారి  జయంతి సందర్భంగా...💐🙏

【"కవిత్రయం అంటే తిక్కన, వేమన, గురజాడ"- శ్రీశ్రీ.】




#సమాజంలోని మూఢనమ్మకాలను ఎత్తి చూపి నిజాన్ని మన ముందు ప్రతిబింబించిన హేతువాది, సామాజిక విప్లవకారుడు యోగి వేమన. పండిత లోకానికే పరిమితమైన వేదాంతాన్ని పామరులకు కూడా అర్థమయ్యేలా సరళమైన పదాలతో స్వచ్ఛమైన అచ్చమైన తేనె లాంటి తేట తెలుగు పద్యాలలో వివరించిన మహానుభావుడు వేమన.వేమన ప్రజాకవి, సంఘసంస్కర్త.

#ఆయన యోగమంతా అన్వేషణ, ఆ అన్వేషణలో అందివచ్చిన అనుభవాలను ఆటవెలదుల్లో అలవోకగా లోకానికందిచాడా మహానుభావుడు. ఆయన సూక్తి ఆయన అంతర్యక్తికి అద్దంపట్టిన అభివ్యక్తి ఆయన అంతస్సాధన ఆయనకు ముక్తినిచ్చిందో లేదో కానీ, సూక్తిలోని శక్తి మాత్రం జాతికొకనూత్న వ్యక్తిత్వాన్ని ప్రసాదించింది' అంటారు ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం. వేమన సాధకుడు. సాధనకు భక్తి-విశ్వాసం బలం. కానీ వేమన భక్తి కన్నా వివేకాన్ని నమ్ముకున్నాడు.

 "విశ్వదాభిరామ వినురవేమ" అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. 

*#మహాకవి యోగి వేమనకు  సొంత రాష్ట్రంలో తగిన గౌరవం దక్కటం లేదనే భావన ఇక తొలగిపోనుంది. యోగి వేమన జయంతిని రాష్ట్ర  ప్రభుత్వం ఏటా జనవరి 19న అధికారికంగా   జరపనుంది. ఈ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 164 జీవోను  విడుదల చేసింది.*

వేమన సుమారు (జననం19/1/1632)
1632 - 1730 మధ్య కాలములో జీవించాడు. వేమన కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందిన వారు అని, గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగినవారని అంటారు.

#ఇప్పటికీ పండిత, పామర భేదం లేకుండా వేమన పద్యాలు వినని తెలుగు వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. అంతగా ఆయన పద్యాలు జనబాహుళ్యం లోకి చొచ్చుకుపోయాయి. ఆయన రాసిన ప్రతి పద్యం ఒక ఆణిముత్యమే. మన వేమన...మంచి కోసం,మార్పు కోసం, మన కోసం ప్రశ్నించి, ప్రతిస్పందించి, ప్రతిధ్వనించాడు. వేమన పద్యాలు లోక నీతులు. సామాజిక చైతన్యం వేమన పద్యాల లక్షణం. వేమన స్పృశించని అంశం లేదు. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించాడు.

*#పద్య లక్షణము:*

వేమన పద్యాలన్నీ ఆటవెలది ఛందంలోనే చెప్పాడు. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో, చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు. సాధారణంగా మొదటి రెండు పాదాల్లోను నీతిని ప్రతిపాదించి, మూడో పాదంలో దానికి తగిన సామ్యం చూపిస్తాడు. నాలుగో పాదం "విశ్వదాభిరామ వినుర వేమ" అనే మకుటం.

*#విశిష్టత:*

వేమన పద్యాలలో ఎక్కువగా లోక నీతులు, సామాజిక చైతన్యంనకు సంబంధించినవి ఉంటాయి. అతను సృశించని అంశం లేదు. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించాడు. కుటుంబ వ్యవస్థలోని లోటు పాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అస్థవ్యస్థత మీద వేమన కలం ఝళిపించాడు. ఈ పద్యాలకు బహుళ ప్రచారం లభించటానికి కారణాలు చాలా ఉన్నాయి. సామాన్య నీతులను ప్రజల హృదయాలకు హత్తుకొనేటట్లు వారికి పరిచితమైన భాషలో, స్పష్టమైన రీతిలో సూటిగా, తేటగా, శక్తివంతంగా వ్యక్తీకరించటం, సామాన్యులైన వారిలో తనను ఒకనిగా భావించుకొని నీతి ఉపదేశం చేయటం వేమన నీతులలోని ప్రధాన గుణం. సునిశితమైన హాస్య, వ్యంగ్య, అధిక్షేప చమత్కృతులతో కల్పించి, నవ్వించి ఎదుటివారి లోపాలను, తన లోపాలను, గుర్తెరిగి ఉపదేశించిన రీతిని గమనించేటట్లు చేసే శైలిని ఆయన ప్రదర్శించాడు. సామాన్యాలు మనోజ్ఞాలు అయిన ఉపమాన దృష్టాంతాలతో సూక్తిప్రాయంగా నీతులను బోధించాడు.

*మానవుని హీనస్థితికి కారణమైన వ్యవస్థలపై తిరుగుబాటు చేశాడు. దీనికి ఆయనవాడిన ఆయుధం హేతువు లేక తర్క శీలత్వం.*

*#నాడే సాహసోపేత హేతువాది...*

ఆ కాలం పరిస్థితుల ప్రకారం వేమనను గొప్ప హేతువాదిగా ప్రశసించింది సాహితీలోకం. సమాజంలో ప్రబలంగా పాతుకుపోయిన ఆచారాలు, మూఢనమ్మకాలను ఆ రోజుల్లో అంత నిశితంగా  ఎత్తిచూపటానికి ఎంతటి ఆత్మస్థైర్యం, అవగాహన కావాలి. 

*#పద్య మకుటంపై వాదనలు:*

"విశ్వదాభిరామ వినురవేమ" మకుటానికి భిన్న వాదనలున్నాయి. అవి:

*వేమన ఆలనా పాలనా చూసిన ఆయన వదిన విశ్వదనూ, ఆయన ఆప్తమిత్రుడు అభిరాముడినీ మకుటంలో చేర్చి వారికి శాశ్వతత్వాన్ని ఇచ్చాడని ఒక వాదన.
*విశ్వద అంటే విశ్వకారకుడికి, అభిరామ అంటే ప్రియమైనవాడని - అంటే సృష్టికర్తకు ప్రియమైన వేమా, వినుము - అని ఈ మకుటానికి మరో అర్థం చెప్పారు, పండితులు.
*విశ్వద అంటే వేమన వద్ద ఉన్న వేశ్య అని, అభి రాముడు అంటే వేమన ఆప్తమిత్రుడైన స్వర్ణకారుడు,అనే వాదన కూడా ఉంది.

బ్రౌన్ కూడా ఈ రెండో అర్థాన్నే తీసుకుని పద్యాలను ఇంగ్లీషులోకి అనువదించాడు.

*#వేమన గురించి పరిశోధన:*

వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్తం కాకుండా కేవలం సామాన్యుల నోటనే విలచి ఉన్నాయి. 1731లో ఫాదర్ లెగాక్ తొలిసారిగా వేమన పద్యాలు సేకరించాడని పరిశోధకులు భావిస్తారు. 1816లో ఒక ఫ్రెంచి మిషనరీ, తరువాత ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎన్నో వేమన పద్యాలను సేకరించారు. తాను వేమనను కనుగొన్నానని బ్రౌన్ దొర సాధికారికంగా ప్రకటించుకొన్నాడు. అతను వందల పద్యాలను సేకరించి వాటిని లాటిన్, ఆంగ్ల భాషలలోకి అనువదించాడు. అలాగే హెన్రీ బ్లూచాంస్ (1897), విలియమ్ హోవర్డ్ కాంబెల్ (1910), జి.యు.పోప్, సి.ఇ.గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమనను లోకకవిగా కీర్తించారు.

#వేమన అందరికీ తేలికగా అర్థమయ్యే పదాలతో పద్యాలు రాసినవాడు వేమన. వేమనను ప్రజాకవి అంటారు. ఆయన సమాజంలో ఉండే మంచిమంచి విషయాలను గ్రహించి, వాటిని చిన్నపిల్లలు సైతం అర్థం చేసుకునే విధంగా చిన్నచిన్న పదాలతో శతకం రాశాడు. వేమన్న ఆశుకవి. 

తెలుగువారిలో వేమన కీర్తిని అజరామరం చేయడానికి కృషి చేసినవాడు కట్టమంచి రామలింగారెడ్డి. రాష్ట్రంలో పలుచోట్ల వేమన జయంతి ఉత్సవాలు నిర్వహించటానికి కృషి చేశాడు.

వేమన కాలం గురించీ, జీవితం గురించీ సి.పి. బ్రౌన్, వంగూరి సుబ్బారావు, వావిళ్ళ వెంకటేశ్వరశాస్త్రి, బండారు తమ్మయ్య, ఆరుద్ర, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, వేమూరి విశ్వనాధశర్మ, కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, కట్టమంచి రామలింగారెడ్డి, త్రిపురనేని వెంకటేశ్వరరావు, ఎన్. గోపి పరిశోధనలు చేశారు. 

*#వేమనకు గుర్తింపు:*

తెలుగు సాహిత్య చరిత్రకారులలో ప్రథములైన కందుకూరి వీరేశలింగం, గురజాడ శ్రీరామమూర్తి, కావలి రామస్వామి తన ఆంగ్ల గ్రంథంలోను వేమన చరిత్రను చేర్చలేదు. దీనిగూర్చి నార్ల వేంకటేశ్వరరావు "ఇట్టి మూగకుట్ర, ఒక మహావ్యక్తి పేరైనను ఉచ్ఛరించక మరుగుపరచిన మౌనకుతంత్రము ప్రపంచ భాషా చరిత్రలందెచ్చటనుకానము, ఇది ఒక పెద్ద విస్మయము "అని అన్నాడు. అయితే వేమన పద్యాలను కందుకూరి వీరేశలింగం తన సాహిత్యంలో కొన్ని పద్యాలనుదహరించాడు. గురజాడ అప్పారావు కన్యాశుల్కంలో వేమనను విరివిగా ప్రశంసించాడు. బ్రౌన్ తరువాత కట్టమంచి రామలింగారెడ్డి తన కవిత్వతత్వవిచారం గ్రంథంలో మహాకవిగా గుర్తించాడు. తరువాత 1928 లో రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ విశేష పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపన్యాసాలిచ్చాడు. ఆ తరువాత ఏభై ఎళ్లకు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆరుద్రచే వేమన్న గురించిన ఉపన్యాసాలు నిర్వహించింది. పైన పేర్కొన్న సాహితీ వేత్తల కృషి తరువాత వేమన రచనలకు పండితులనుండి అనన్యమైన గౌరవం లభించసాగింది. కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, వేటూరి ప్రభాకరశాస్త్రి వంటివారు వేమనను సంస్కర్తగా ప్రస్తుతించారు తరువాత ఎందరో యువ కవులు, రచయితలు వేమన గురించి, వేమన రచనల గురించి పరిశోధనలు చేశారు. ఎన్. గోపి, బంగోరె వంటివారు వీరిలో ప్రముఖులు.

#కేంద్ర సాహిత్య అకాడమీ ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు చేత వేమన జీవిత చరిత్రను వ్రాయించి 14 భాషల్లోకి అనువదింపజేశారు. ఆంగ్ల, ఐరోపా భాషలన్నింటిలోకి, అన్ని ద్రావిడ భాషలలోకి వేమన పద్యాలు అనువదింపబడ్డాయి. వేమనకు లభించిన ఈ గౌరవం మరే తెలుగు కవికి లభించలేదు. ఐక్య రాజ్య సమితి - యునెస్కో విభాగం వారు ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకొని ఆ రచనలను పలు భాషలలోకి అనువదింపజేశారు.

*#మహాకవి యోగి వేమన నిజంగానే బట్టలు లేకుండా ఉండేవారా?:*

వేమన గురించి అధ్యాయనం చేసిన సిపి బ్రౌన్ , ఆరుద్ర వంటి మహాకవులు వేమన ఓ దిగంబ‌రుడ‌ని ఎక్కడ పేర్కొన‌లేదు. 1920 ప్రాంతంలో తంజావూర్ లోని స‌ర‌స్వతి మ‌హ‌ల్ లో ఉన్న చిత్రాన్ని ఆధారంగా రెడ్డివాణి ప‌త్రిక‌లో వేమ‌న దిగంబ‌ర బొమ్మ ప్రచురింపబడింది. అయితే వేమన దిగంబరుడు అనే విషయంపై క్లాారిటీ లేదు.

*#స్మరణలు:*

శిలా విగ్రహాలు
హైదరాబాదులో టాంకుబండ్ పై తెలుగుజాతి వెలుగుల విగ్రహాలలో వేమన విగ్రహం ప్రతిష్ఠించారు.

*#మహాకవి పేరిట విశ్వవిద్యాలయం....*

ఆ మహాకవి పేరిట  డాక్టర్‌ వైఎస్ఆర్ కడప జిల్లాలో యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు.వేమన పేరుతో దేశంలో ఏర్పాటైన ఏకైక విశ్వవిద్యాలయం.

*#పోస్టు స్టాంపు:*

పోస్టు స్టాంపుపై వేమన
1972 లో భారత తపాలాశాఖ స్టంపు విడుదల చేసింది.

*#పుస్తకాలు:*

 వేమన పద్యాలను వివిధ ప్రచురణ కర్తలు ముద్రించారు. విస్తృతంగా పరిశోధనల పుస్తకాలు వెలువడ్డాయి. వాటిలో కొన్ని.....
రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ (1929). వేమన.
వేమన యోగి - వర్ణ వ్యవస్థ : డా. రాపెల్లి శ్రీధర్ (వ్యాఖ్యాత)- 2002
వేమన యోగి - అచల పరిపూర్ణ రాజయోగ సిద్ధాంతము :డా. రాపెల్లి శ్రీధర్ (వ్యాఖ్యాత)- 2000,
మన వేమన, ఆరుద్ర, 1985.
వేమన జ్ఞానమార్గ: 1958 నాటికి అత్యధికంగా 3002 పద్యముల సంకలనం అక్షరమాలక్రమంలో కూర్పు, కూర్పు: ముత్యాల నారసింహ యోగి, ప్రకాశకులు: సి.వి.కృష్ణా బుక్ డిపో, మదరాసు, 1958.
దృశ్యశ్రవణ మాధ్యమాలు
యోగివేమన (1947 సినిమా) చిత్తూరు నాగయ్య-వేమన
శ్రీ వేమన చరిత్ర (1986) - సినిమా విజయ చందర్-వేమన
యోగివేమన - ధారావాహిక, నిర్మాత: గుమ్మడి గోపాలకృష్ణ- టివిలో ప్రసారమైంది.

చివరకు  వైఎస్ఆర్ జిల్లా చిట్వేలు మండలం చింతపల్లి వద్ద మహాసమాధి చెందారు.

#వేమనది వితండవాదం కాదు. మానవతావాదం. మనిషే దైవం మనిషిని సేవించడమే దైవదర్శనం అన్నాడాయన. ఆరుద్ర తన 'వేమన్న వేదం' లో చెప్పిన వ్యాఖ్యానం గమనించదగ్గది. 'శ్లోకార్ధేన ప్రవక్ష్యామి యదుక్తం గంథకోటిఖి:/పరోపకర; పుణ్యాయ పాపయ పరపీడనం 'కోటి గ్రంథాల్లో చెప్పిన దాన్ని నేను అర్ధశ్లోకంలోనే చెప్తాను. పరులకు ఉపకారం చేయ్యడమే పుణ్యం. పరపీడనమే పాపం అనే శ్లోకార్ధం వేమన జీవిత సందేశం. వేమన భాష స్వచ్ఛమైనది. వాడిగలది. శైలి సరళం సాటిలేనిది. ఆయన ఉపమలు, పోలికలు సహజంగా సరికొత్తగా, గంభీరంగా, వియత్తలాన్నంతా వెలిగించే మెరు తీగల్లాగా ఉంటాయి. కొన్ని విషయాలను గూర్చి ఆయన వెలుబుచ్చిన అభిప్రాయాలు నాటి కాలానికే కాదు... ఆధునిక కాలానికి కూడా వర్తించేటట్లుగా ఉంటాయి. 'తెలుగు ప్రజలు వేమన కవిత్వాన్ని అధికంగా అభిమానిస్తారన్న డా. పోప్‌ వ్యాఖ్యానం అక్షరసత్యం. తెలుగు భాష వేమనకు రుణపడి ఉంది.


0 comments:

Post a Comment