A homepage subtitle here And an awesome description here!

Sunday, May 22, 2022

వేటూరి గీతాలు, పాటల సిరి వేటూరి సుందరమూర్తి గారి వర్థంతి

🌹🙏వాగ్దేవి వర పారిజాతాలు... వేటూరి గీతాలు, పాటల సిరి వేటూరి సుందరమూర్తి గారి వర్థంతి  సందర్భంగా🙏🌹
✍️ఆయన పేరు వింటే కృష్ణాతరంగాలు సారంగ రాగాలు వినిపిస్తాయి. ఆయన పేరు తలచినంతనే పాట వెన్నెల పైటేసి ఒయ్యారమొలకబోస్తుంది. నాట్యం విలాసంగా నర్తిస్తుంది. ఆయనే పాటల సిరి.. వేటూరి. ఆ సుందరమూర్తి శృంగార కవే కాదు.. ఆధ్యాత్మిక తత్వాన్ని, జీవిత పరమార్థాన్ని సంపూర్ణంగా అవగతం చేసుకున్న భక్త యోగకవి. అల్లరి పాటలతో ‘మాస్‌’ మనసులను దోచుకున్నా, యమకగమకాలతో ‘క్లాస్‌’ మదిని ఝమ్మనిపించినా అది ఆయనకు మాత్రమే సాధ్యం. సాహిత్య విలువలు కలిగిన వైవిధ్యభరిత గీతాలెన్నింటినో మనకందించి, అందరి మదిలో పాటై నిలిచిపోయిన సినీ కవిరాజు వేటూరి సుందరరామ్మూర్తి గారు.

ఓ పాట... #ఆడపిల్లల భుజాలపై అందంగా జాలువారే అల్లరి పైట. ఓ పాట... కొత్తగా మీసమొచ్చిన కుర్రకారు గుండె గొంతుకలో కొట్టుమిట్టాడే కూనిరాగం. ఓ పాట ... కొండాకోనల్లో ఒక్కసారిగా దుమికే ప్రేమ జలపాత ప్రవాహం. ఇంకో పాట... గుండెల్ని పిండేసే విరహ గీతి. రక్తి, భక్తి, విరక్తి... ఇలా పాట పాటకో నేపథ్యం. ఆశలు, ఆశయాల సాధన కోసం ప్రజలందరినీ సామూహికంగా కట్టి పడేసే ఉద్యమ గీతాలు కొన్ని. శిశుర్వేత్తి, పశుర్వేత్తి గాన రస:పణి అన్నట్లు... ప్రతి ఒక్కరిని అలరించే పాటలు జీవితాల్ని ప్రభావితం చేసేవే. కవులంతమందీ అన్ని రకాల పాటలూ రాయలేరు. కొన్ని పాటలు మాత్రమే రాయడంలో లబ్ధప్రతిష్టులవుతారు. ప్రముఖ సినీ కవి శ్రీ వేటూరిలాంటి వారు మాత్రమే...

#బాల్యం-విద్యాభ్యాసం:

వేటూరి చంద్రశేఖర శాస్త్రి - కమలమ్మ దంపతులకు 1936 జనవరి 29వ తేదీన పెదకళ్లేపల్లి గ్రామంలో వేటూరి సుందరరామ్మూర్తి జన్మించారు. తెలుగు సాహితీ దిగ్గజాల్లో ఒకరైన వేటూరి ప్రభాకరశాస్త్రి ఈయన పెద్దనాన్న.మద్రాస్‌ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియేట్, విజయవాడలో డిగ్రీ పూర్తి చేశాడు.అప్పట్లో దైతా గోపాలం నటన, కధ, కవిత, గాన, దర్శకత్వ శాఖల్లో ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చేవారు. వేటూరి కూడా ఆయన దగ్గర తొలి పాఠాలు నేర్చుకున్నారు.

#పత్రికా రంగంలో ప్రవేశం:

స్వరాలకు పద సౌందర్యాన్ని అద్ది, సాహిత్య సామ్రాజ్యంలో ప్రకాశింపచేసిన మూర్తి వేటూరి 18 ఏళ్ల ప్రాయంలోనే కలం పట్టుకుని పత్రికా రంగంలో ప్రవేశించారు. #1962లో నాటి ప్రధాని నెహ్రూ శ్రీశైలం విచ్చేసిన సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు.# 
ఆంధ్ర జనతా పత్రికలో ఎడిటర్‌గా ఎదిగి, భద్రాచలం సమీపంలోని పాల్వంచ వద్ద జరిగిన ఒక బహిరంగ సభలో నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పొరపాటుగా మాట్లాడిన అంశాన్ని బాక్స్‌ ఐటమ్‌గా ఇచ్చి సంచలనం సృష్టించిన ధైర్యవంతుడు వేటూరి.

#సినీ ప్రస్థానం:

కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన వేటూరి, సంగీత జ్ఞానాన్నీ పదరచనల బాణీల్నీ స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో సినిమాపాటకు వోణీలు వేయించారు. సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణసాహిత్యంలోని పంక్తుల్నీ గ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యుడు. వేటూరి అనగానే వెంటనే స్ఫురించేది అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం... ఇలా ఎన్నో సినిమాలు...ఈ సినిమాలలోని అందమయిన అద్బుతమయిన పాటలు!
“పిల్లనగ్రోవికి నిలువెల్లగాయాలు అల్లన మ్రోవిని తాకితే గేయాలు” “నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ” ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు కదులు ఎదలోని సడులే మృదంగాలు ఇలాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి. 

#పురస్కారాలు:

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పాటల రచయితగా తనదైన వాణి, బాణీతో ఇక ఇజాన్ని సృష్టించిన మహాకవి డాక్టర్‌ వేటూరి. అందుకే ఎనిమిది నంది అవార్డులు, ఒక జాతీయ అవార్డుతో పాటు మరెన్నో అవార్డులు, ప్రజల రివార్డులు ఆయన్ని వరించాయి. ఒక శ్రీనాథుడు, ఒక పోతన, ఒక పెద్దన, ఒక అన్నమయ్య వేటూరి పాటలో మనకు దర్శనమిస్తారు. ఆ మహాకవి స్మృత్యర్ధం తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆవరణలో వేటూరి సాహితీపీఠం కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించింది.

##శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు. ఆయన మాతృదేవోభవ సినిమాకి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే... అనే పాటకి 1994వ సంవత్సరానికి గాను ఈ పురస్కారం వచ్చింది. ఇది తెలుగు పాటకు రెండవ జాతీయ పురస్కారం.##

#తెలుగు పాటకు వన్నెలద్ది, సంస్కృత సమాసాలనైనా, సరస పదాలనైనా అలవోకగా లిఖించిన వేటూరి, 2010 మే22న పాటల పల్లకిలో ఊరేగుతూ గంధర్వ లోకాలకు వెళ్లిపోయారు. ఆయన భౌతికంగా కనుమరుగైనా, తెలుగు వారి గుండెల్లో పాటై, నట్టింట్లో కూనిరాగమై నిలిచే ఉంటారు.

Saturday, May 21, 2022

టెలికాం విప్లవం పితామహుడు శ్రీ రాజీవ్‌ గాంధీ గారి వర్థంతి

💐💐ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు టెలికాం విప్లవం పితామహుడు  శ్రీ రాజీవ్‌ గాంధీ గారి వర్థంతి  సందర్భంగగా💐💐



【#జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం】

"సార్..#ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట "..#ఫోన్ పట్టుకుని #వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.."

" ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు.."

" ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి " మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం..ఏర్పాట్లు చూడండి "..అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి.."

" సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా ? నసిగాడు కార్యదర్శి "

" వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ " నిక్షేపంగా " అన్నారు.."

" ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ.. అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది..రాజీవ్గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు..సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి ? అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు..కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు ..

కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా..అదీ ఆయన మాటల్లోనే..

1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా..1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది..డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు..ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు..ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా వెళ్లాలని ఫోన్ లో కోరారు..కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ " అటల్ జీ..ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి "..అని చెప్పారు..ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే....నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్న వాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడి లాంటి వాడే ".

పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే  పార్టీల నాయకులు రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు!
     *****

శ్రీ రాజీవ్‌ గాంధీ
40 ఏళ్ళ వ‌య‌సులో భార‌త యువ #ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రాజీవ్‌గాంధీ బ‌హుశా #ప్ర‌పంచంలోనే అతి పిన్న‌వ‌య‌స్కులైన #ప్ర‌భుత్వాధినేత‌ల్లో ఒక‌రు కావ‌చ్చు. ఆయ‌న త‌ల్లి ఇందిరాగాంధీ 1966లో మొద‌టిసారి ప్ర‌ధాన‌మంత్రి అయిన‌ప్పుడు ఆమె రాజీవ్ గాంధీ కంటె 8 ఏళ్ళు (48) పెద్ద‌. ప్ర‌ఖ్యాతివ‌హించిన‌ ఆయ‌న తాత పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ స్వేచ్ఛా భార‌తానికి తొలి ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టేనాటికి వ‌య‌సు 58 సంవ‌త్స‌రాలు.

దేశంలో త‌రం మార్పుకు సంకేతంగా రాజీవ్‌గాంధీ దేశ చ‌రిత్ర‌లోనే అతిపెద్ద మెజార్టీ సాధించారు. హ‌త్య‌కు గురైన త‌న త‌ల్లి అంత్య‌క్రియ‌లు పూర్తికాగానే ఆయ‌న లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ఆదేశించారు. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అంత‌కుముందు 7 సార్లు జ‌రిగిన ఎన్నిక‌లలో కంటే అత్య‌ధిక ఓట్ల‌ను సాధించింది. 508 లోక్‌స‌భ సీట్ల‌లో రికార్డుస్థాయిలో 401 సీట్లు గెలుచుకుంది.
7 కోట్ల మంది భార‌తీయుల‌కు నాయ‌కునిగా అటువంటి శుభారంభం చేయ‌డం అది ఎటువంటి ప‌రిస్థితి అయినా చెప్పుకోద‌గిందే. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే రాజీవ్‌గాంధీ పూర్తిగా రాజ‌కీయ కుటుంబానికి చెందినవారు అయిన‌ప్ప‌టికీ ఆల‌స్యంగా, అయిష్టంగా రాజ‌కీయాల్లో ప్ర‌వేశించి కూడా ఇంత పెద్ద మెజార్టీ సాధించ‌డం, స్వాతంత్ర ఉద్య‌మంలోను, ఆ త‌రువాత 4 త‌రాలపాటు భార‌త‌దేశానికి సేవ‌లు అందించిన రాజ‌కీయ కుటుంబానికి చెందిన రాజీవ్‌గాంధీ అనివార్య ప‌రిస్థితుల్లోనే రాజ‌కీయ ప్ర‌వేశం చేశారు.

రాజీవ్‌గాంధీ 1944 ఆగ‌స్టు 20 న జ‌న్మించారు. భార‌త‌దేశం స్వాతంత్య్రం సాధించేనాటికి ఆయ‌న తాత ప్ర‌ధాన‌మంత్రి అయ్యేనాటికి రాజీవ్ వ‌య‌సు కేవ‌లం 3 సంవ‌త్స‌రాలు. ఆయ‌న త‌ల్లిదండ్రులు ల‌క్నో నుంచి ఢిల్లీకి మ‌కాం మార్చారు. తండ్రి ఫిరోజ్ గాంధీ పార్ల‌మెంటు స‌భ్యుడు అయ్యారు. నిర్భ‌యంగా క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే పార్ల‌మెంటేరియ‌న్‌గా పేరు తెచ్చుకున్నారు.

రాజీవ్‌గాంధీ త‌న బాల్యాన్ని తాత‌గారితో క‌ల‌సి తీన్‌మూర్తి హౌస్‌లో గ‌డిపారు. అక్క‌డ ఇంధిరాగాంధీ ప్ర‌ధాన‌మంత్రి స‌హాయ‌కురాలిగా ప‌నిచేశారు. డెహ్రాడూన్‌లోని వెల్హామ్ ప్రెప్ స్కూల్‌కు కొద్దికాలంపాటు వెళ్ళిన రాజీవ్‌గాంధీ త‌రువాత రెసిడెన్షియ‌ల్ డూన్ స్కూల్‌కు మారారు. అక్క‌డ ఆయ‌న అనేక మందితో ప్ర‌గాఢ మైత్రిని పెంపొందించుకున్నారు. చిన్న‌త‌మ్ముడు సంజ‌య్‌గాంధీ కూడా ఆయ‌న‌తో క‌లిశారు.

స్కూల్ చ‌దువు పూర్త‌యిన త‌రువాత రాజీవ్‌గాంధీ కేంబ్రిడ్జి ట్రినిటీ క‌ళాశాల‌లో చేరారు. అయితే త్వ‌ర‌లోనే లండ‌న్‌లోని ఇంపీరియ‌ల్ కాలేజ్‌కి మారారు. అక్క‌డ మెకానిక‌ల్ ఇంజినీరింగ్ కోర్సు చేశారు.

రాజ‌కీయాల‌ను జీవిత వ్యాప‌కంగా మ‌ల‌చుకోవాల‌ని ఆయ‌న ఎప్పుడూ అనుకోలేదు. ఆస‌క్తి కూడా చూప‌లేదు. సైన్సు, ఇంజినీరింగ్‌కు సంబంధించిన అనేక ఉద్గ్రంధాలు ఆయ‌న బీరువాల నిండా ఉండేవ‌ని రాజీవ్ స‌హ విద్యార్థ‌లు చెబుతారు. ఫిలాస‌ఫీ, రాజ‌కీయాలు లేదా చ‌రిత్ర గురంచి ఆయ‌న ప‌ట్టించుకునేవారు కాదు. అయితే సంగీతాన్ని ఇష్ట‌ప‌డేవారు. వెస్ట్ర‌న్‌, హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంతోపాటు ఆధునిక సంగీతాన్ని కూడా ఇష్ట‌ప‌డేవారు. రాజీవ్ ఆస‌క్తి క‌న‌బ‌బ‌రిచే ఇత‌ర అంశాల్లో ఫొటోగ్ర‌ఫీ, అమెచ్యూర్ రేడియో ముఖ్య‌మైన‌వి.

కాగా, రాజీవ్‌కు అత్యంత ఇష్ట‌మైన‌వి గాల్లో ప్ర‌యాణించ‌డం. ఇంగ్లండ్ నుంచి తిరిగివ‌చ్చిన వెంట‌నే ఢిల్లీ ఫ్లైయింగ్ క్ల‌బ్ ఎంట్ర‌న్స్ ప‌రీక్ష పాసై క‌మ‌ర్షియ‌ల్ పైలెట్ లైసెన్సు తీసుకోవ‌డానికి వెళ్ళారు. అన‌తికాలంలోనే దేశీ విమాన సంస్థ ఇండియ‌న్ ఎయిర్‌లైన్స్‌ లో పైలెట్ జీవితం ప్రారంభించారు.
1980లో సోద‌రుడు సంజ‌య్‌గాంధీ విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డంతో ప‌రిస్థితి మారింది. అప్ప‌ట్లో అంత‌ర్గ‌తంగా, బ‌హిర్గ‌తంగా అనేక స‌వాళ్ళు చుట్టుముట్టిన ప‌రిస్థితుల్లో త‌ల్లికి చేయూతను ఇవ్వ‌డానికి రాజ‌కీయాల్లో చేర‌వ‌ల‌సిందిగా రాజీవ్‌గాంధీపై వ‌త్తిడి పెరిగింది. మొద‌ట్లో వీటిని ప్ర‌తిఘ‌టించిన‌ప్ప‌టికీ త‌రువాత త‌ల వొగ్గ‌క త‌ప్ప‌లేదు. త‌మ్ముని మృతి కార‌ణంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అమేథీ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో రాజీవ్‌గాంధీ గెలుపొందారు.

1982 న‌వంబ‌ర్‌లో భార‌త్ ఆసియా క్రీడ‌ల‌కు ఆతిథ్యం ఇచ్చిన‌పుడు అంత‌కు చాలా సంవ‌త్స‌రాల ముందు జ‌రిగిన ఒప్పందానికి క‌ట్టుబ‌డి స్టేడియంలు, ఇత‌ర మౌలిక స‌దుపాయాలు క‌ల్పించే కార్య‌క్ర‌మాన్ని రాజీవ్‌గాంధీ విజ‌య‌వంతంగా పూర్తిచేశారు. వీటి ప‌ని స‌కాలంలో పూర్త‌య్యేలా చూసే బాధ్య‌త‌ను రాజీవ్‌గాంధీకి అప్ప‌గించారు. ఈ ల‌క్ష్యాన్ని విజ‌య‌వంతంగా పూర్తిచేయ‌డం ద్వారా రాజీవ్‌గాంధీ త‌న సామ‌ర్థ్యాన్ని, స‌మ‌న్వ‌య స్ఫూర్తిని చాటుకున్నారు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేసే ప్ర‌క్రియ‌ను త‌న భుజ‌స్కందాల‌పై వేసుకున్నారు. ఆ త‌రువాత కాలంలో అనేక ప‌రీక్షా స‌మ‌యాల్లో రాజీవ్‌గాంధీ శ‌క్తి సామ‌ర్థ్యాలు, ప్ర‌జ్ఞాపాట‌వాలు బ‌య‌ట‌ప‌డుతూ వ‌చ్చాయి.
1984 అక్టోబ‌ర్ 31న త‌ల్లి ఇందిరాగాంధీ దారుణ హ‌త్య‌కు గురైన స‌మ‌యంలో ప్ర‌ధాన‌మంత్రిగాను, కాంగ్రెస్ అధ్య‌క్షునిగాను ఆయ‌న నిర్వ‌ర్తించాల్సి వ‌చ్చింది. వ్య‌క్తిగ‌త దుఃఖాన్ని, విచారాన్ని అణ‌చుకొని జాతీయ బాధ్య‌త‌ను ఎంతో హుందాగా, ఓర్పుగా త‌న భుజాల‌కు ఎత్తుకున్నారు.

1984 నుండి 1989 వరకు తన ఐదేళ్ల పాలనలో, యువ నాయకుడు దేశాన్ని 21 వ శతాబ్దానికి తీసుకెళ్లడానికి  ప్రయత్నాలు చేశాడు.

#టెలికాం విప్లవం:

రాజీవ్ గాంధీని 'ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు టెలికాం విప్లవం యొక్క పితామహుడు' అని ప్రశంసించారు. అతను డిజిటల్ ఇండియా యొక్క వాస్తుశిల్పిగా పిలువబడ్డాడు.
అతడి పాలనలోనే అత్యాధునిక టెలికమ్యూనికేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి మరియు భారతీయ టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్ అవసరాలను తీర్చడానికి 1984 ఆగస్టులో సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సి-డాట్) స్థాపించబడింది.
సి-డాట్ భారతదేశంలోని పట్టణాలు మరియు గ్రామాలలో కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లో విప్లవాత్మక మార్పులు చేసింది. రాజీవ్ గాంధీ ప్రయత్నాల వల్ల పిసిఓ (పబ్లిక్ కాల్ ఆఫీస్) విప్లవం జరిగింది. పిసిఓ బూత్ గ్రామీణ ప్రాంతాలను కూడా బయటి ప్రపంచానికి అనుసంధానించింది.

1986 లో, MTNL (మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్) స్థాపించబడింది, ఇది టెలిఫోన్ నెట్‌వర్క్ వ్యాప్తికి సహాయపడింది. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకి సలహాదారుగా సామ్ పిట్రోడాతో, టెలికమ్యూనికేషన్స్, నీరు, అక్షరాస్యత, రోగనిరోధకత, పాల మరియు చమురు విత్తనాలకు సంబంధించిన ఆరు సాంకేతిక మిషన్లు స్థాపించబడ్డాయి.

#కంప్యూటరీకరణ:

రాజీవ్ గాంధీ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించారు. అటువంటి పరిశ్రమలపై, ముఖ్యంగా కంప్యూటర్లు, విమానయాన సంస్థలు, రక్షణ మరియు టెలికమ్యూనికేషన్లపై దిగుమతి కోటాలు, పన్నులు మరియు సుంకాలను తగ్గించడం ఒక మార్గం. కంప్యూటరీకరించిన రైల్వే టిక్కెట్లను ప్రవేశపెట్టిన తరువాత భారత రైల్వే ఆధునీకరించబడింది.

#ఓటింగ్ వయస్సు:

తాను యువకుడిగా ఉన్నందున, రాజీవ్ గాంధీ యువతకు అధికారం ఇవ్వడానికి ప్రయత్నించారు. ఆ దిశగా, రాజ్యాంగంలోని 61 వ సవరణ చట్టం 1989 లో ఆమోదించబడింది, ఓటింగ్ వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించింది. ఈ చర్య రాష్ట్రాలలో లోక్‌సభ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడంలో యువతకు అవకాశం కల్పించింది.

#పంచాయతీ రాజ్:

ప్రజాస్వామ్యాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లేందుకు పంచాయతీ రాజ్ సంస్థలకు పునాది వేసిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కింది. 1992 లో రాజ్యాంగంలోని 73 వ మరియు 74 వ సవరణల ద్వారా పంచాయతీ రాజ్ సృష్టించబడినప్పటికీ, రాజీవ్ గాంధీ హత్య చేయబడిన ఒక సంవత్సరం తరువాత, ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో నేపథ్యం సిద్ధమైంది.

#రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా 1986 లో దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా కార్యక్రమాలను ఆధునీకరించడానికి మరియు విస్తరించడానికి #నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ (ఎన్‌పిఇ) ను ప్రకటించారు. ఎన్‌పిఇ అమల్లో ఉండటంతో, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో #జవహర్ నవోదయ విద్యాలయాలు అనే నివాస పాఠశాలలను ఏర్పాటు చేసి, గ్రామీణ ప్రతిభావంతులలో అత్యుత్తమమైన వారిని బయటకు తీసుకువచ్చారు. ఈ పాఠశాలలు ఆరు నుండి పన్నెండు వరకు గ్రామీణ ప్రజలకు ఉచిత నివాస విద్యను అందిస్తాయి.

#రాజీవ్ గాంధీ  భారతీయ సమాజం మరియు రాజకీయాలపై చెరగని ముద్ర వేశాడు
ఆధునిక భావాలు, నిర్ణ‌యాత్మ‌క శ‌క్తి క‌లిగిన రాజీవ్‌గాంధీ అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞాన ప్ర‌పంచంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. త‌న ప్ర‌ధాన ఆశ‌యాల‌లో భార‌త ఐక్య‌త‌ను ప‌రిర‌క్షిస్తూనే దేశాన్ని 21వ శ‌తాబ్దంలోకి తీసుకువెళ్ళడం ముఖ్య‌మైన‌ద‌ని రాజీవ్ ప‌దేప‌దే చెబుతూండేవారు.

స్వర్గీయ రాజీవ్‌గాంధీ జయంతి ని సద్భావన దినోత్సవంగా నిర్వహిస్తారు.
 రాజీవ్ గాంధీ వర్ధంతి రోజును జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపబడుతుంది.




Friday, May 20, 2022

తెలుగుజాతి కీర్తి ‘ప్రకాశం" శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్థంతి

💐💐"తెలుగుజాతి కీర్తి ‘ప్రకాశం"
 శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్థంతి   సందర్భంగా💐💐

"భవ్య గుణముల దివ్యఖనియ
భారతాంబకు ముద్దుబిడ్డయి
గాఢమైన స్వరాజ్యకాంక్షల
గండుమీరిన శూరుడాతడు
సరిసములులేనట్టి యాతడు
ప్రజలకున్ దేశాభిమానము
పంచిపెట్టిన నేతయాతడు"

#ఆంధ్రకేసరి.. ఆ పేరులోనే ఓ దర్పం.. ఆయన వర్తనలో కూడా తెలుగు పౌరుషం.. నిరాడంబరత.. నిజాయతీ, పట్టుదల, క్రమశిక్షణ, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదురించే గుణం.. నచ్చని ఏ అంశంపైనైనా నిప్పులు చెరిగేతత్వం.. నిజాయితీకి నిలువెత్తు రూపం.. తన గుండెను తూపాకీ గొట్టానికి అడ్డుపెట్టి తెల్ల దొరలను సైతం తెల్లబోయేలా చేసిన సాహస సింహం, తెలుగు విలువల ప్రతాకం ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు.

 #విద్యాభ్యాసం:

'టంగుటూరి ప్రకాశం' పంతులు (ఆగష్టు 23, 1872 – మే 20, 1957)
నాలుగో క్లాస్ చదువుతున్న ఓ కుఱ్ఱాడు తన పరీక్ష ఫీజు కు మూడు రూపాయలు లేక ,వాటికోసం తన ఊరుకు 25 మైళ్ళదూరంలో ఉన్న వాళ్ళ బావగారింటికి కాలినడకన బయల్దేరాడు.తీరాచేసి బావగారింటికి వెడితే 'నాదగ్గర మాత్రం ఎక్కుడున్నాయిరా'
అన్నాడా బావ గారు. చేసేదేముందనుకుంటూ కాళ్ళీడ్చుకుంటూ 25 మైళ్ళు తిరిగి నడుచుకుంటూ ఇంటికొచ్చేశాడు ఆ కుఱ్ఱాడు. ఆ పరిస్థితి కి తల్లడిల్లిపోయిన ఆతని తల్లి తన పెళ్ళినాటి పట్టుచీరను అమ్మి ఆ మూడురూపాయల ఫీజు కట్టింది.ఆ తరువాత ఎన్నో ఎన్నెన్నో ఢక్కామొక్కీలు తిని తనకిష్టమైన ప్లీడరీ పరీక్షలో నెగ్గి,అక్కడితో తృప్తి పడక ఇంగ్లండ్ పోయి బారిష్టరయ్యాడు.

#లాయర్ గా:

#మద్రాస్ మైలాపూర్ అరవ మేధావులతో పోటీపడి ఆరోజులలోనే(1917-18 నాటికే)రోజుకు వెయ్యి రూపాయల ఫీజు తీసుకునే స్థాయిలో , కోస్తా జిల్లాలన్నిటిలో భూములు బంగళాలు కొనుగోలు చేసేటంతగా ఎదిగిన మన కాలపు మేరునగధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు.*
అప్పట్లో మద్రాసులో ప్రసిద్ధి చెందిన బారిష్టరులందరూ ఆంగ్లేయులు లేదా తమిళులు. పేరుపొందిన తెలుగు బారిష్టరులలో ఈయనే ప్రప్రథముడు. ప్రకాశం పౌర, నేర వ్యాజ్యాలనన్నింటినీ చేపట్టేవాడు.
లాయర్ గా ఎంతోమందిని జైళ్ళనుంచి బైటకు తెచ్చిన ఆయన ప్రజలకోసం తాను స్వచ్చందంగా జైలుశిక్షను అనుభవించాడు.

#స్వరాజ్య పత్రికకు సంపాదకత్వం:

లాభదాయకమైన న్యాయవాద వృత్తిని వదిలి ఇంగ్లీషు, తెలుగు, తమిళ భాషలలో ఏకకాలమున విడుదలవుతున్న స్వరాజ్య పత్రికకు సంపాదకత్వం చేపట్టాడు. ఈయన ఒక జాతీయ పాఠశాలతో పాటు ఒక ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నడిపాడు.
గాంధీజీ ఆశయాల ప్రచారం కోసం 'స్వరాజ్య' పత్రికను స్థాపించి గాంధీజీ నిజమైన అనుచరునిగా ఆయన మెప్పును పొందాడు.అదే గాంధీజీ కొందరి చెప్పుడు మాటలు విని ఆయనను తప్పు పట్టుకుంటే గాంధీజీని సైతం నిలదీశాడు.

#సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా:

1928 లో #సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా మద్రాస్ నగరంలో హర్తాళ్ జరిగినప్పుడు తెల్లవాడి తుపాకీకి తన గుండెనే ఎదురు పెట్టాడు.తుపాకికి ఎదురు నిలిచి, కాల్చమని సవాలు చేసాడు. ఆయన #ధైర్యసాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు 
#ఆంధ్ర కేసరి అనే బిరుదునిచ్చి గౌరవించారు.

#ముఖ్యమంత్రి గా:

ఆనాటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి రెవిన్యూ మంత్రిగా,ముఖ్యమంత్రి గా పనిచేశాడు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు(1953)తొలి తెలుగు ముఖ్యమంత్రి అయ్యాడు.
దురాశాపరుల మూలంగానూ,శాసన సభ స్పీకర్ తెలివి తక్కువ తనం మూలంగానూ ఒకే ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పతనమైనప్పుడు , వ్యతిరేకంగా ఓటువేసిన వారు తమ తప్పు తెలుసుకుని మళ్ళీ ఓటింగ్ కు వెడదామని బ్రతిమాలుకున్నా వినకుండా శాసనసభ నుండి తిన్నగా గవర్నర్ వద్దకు వెళ్ళి తన రాజీనామాను సమర్పించాడు.కేవలం 13 నెలల తన ప్రభుత్వ కాలంలో ఆ రోజుల్లోనే14 నీటి పారుదల ప్రాజెక్టులు స్థాపించాడు.శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించాడు. తెలుగు వారికి ఓ హైకోర్టు స్థాపించాడు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణకు కావలసిన మార్పులకు శాసనబద్దత కల్పించాడు.సహకార రంగంలో తెలుగు రాష్ట్రాన్ని ప్రధమ స్థానంలో నిలిపాడు.

#ప్రకాశం బారేజ్:

బెజవాడలో కాటన్ దొర కట్టిన బరాజ్ కొట్టుకుపోయే పరిస్థితి వస్తే ఆనాటి కేంద్ర ప్రభుత్వం పైసా కూడ ఇవ్వలేమని స్పష్టం చేస్తే,రాష్ట్ర నిధులనన్నీ మళ్ళించి యుద్ధ ప్రాతిపదికన బరాజ్ ను బాగుచేయించి నిలబెట్టాడు.ఆ భారాన్ని పన్నుల రూపంలో ప్రజలమీద వెయ్యకుండా ఆ లోటును సరిదిద్దాడు.అందుకే ప్రజలందరూ ఆ బరాజ్ ను ఆయన పేరునే ప్రకాశం బారేజ్ గా పిలుచుకుంటున్నారు.రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా దేశంలోనే తొలిసారిగా ఖైదీలందరినీ విడుదల చేశాడు.

#ఆత్మకథ "నా జీవిత యాత్ర":

ఆయన ఆత్మకథ "నా జీవిత యాత్ర" పేరిట నాలుగు భాగాల పుస్తకంగా  విడుదల అయింది. ఇందులో మూడు భాగాలను ఆయన వ్రాయగా, నాలుగో భాగం మాత్రం తెన్నేటి విశ్వనాథం వ్రాసాడు. దీనిలో స్వాతంత్ర్యోద్యమ నాయకుల మనస్తత్వాలు, అప్పటి ప్రజల స్థితిగతులు వివరించబడినవి. తెలుగు సమితి హైదరాబాదు ఆగష్టు 2006 లో ప్రచురించింది. ఈ పుస్తకం హిందీ లోకి కూడా అనువదింపబడింది.

#శాలువ నాకెందుకు!ఆ డబ్బుతో #అరటిపళ్ళు కొనితెస్తే......

అంతటి మహనీయుడు తన చరమ దశలో కటిక దారిద్ర్యాన్ననుభవించాడు.తనను శాలువతో సత్కరిస్తే “ఈ శాలువ నాకెందుకురా!ఆ డబ్బుతో అరటిపళ్ళు కొనితెస్తే ఓ పూట గడిచేది కదురా!! “ అని తన అనుచరునితో అన్నారంటే ఆయన పరిస్థితి అర్థంచేసుకోవచ్చు.

#అధికారం కోసం ప్రాకులాడలేదు....

ఆయన మూలంగా అధికారంలోకి వచ్చిన మహానాయకులందరూ అధికారం కోసం ఆయనకు వెన్నుపోటు పొడిచినా అధికారం కోసం ప్రాకులాడలేదు. 

85 సంవత్సరాల వయస్సులో రోహిణీ కార్తె మండుటెండలో వడదెబ్బకు మరణించిన ఇద్దరు ముదుసలుల కుటుంబ పరామర్శ కోసం వెళ్ళి తాను వడదెబ్బ తిని,
ప్రకాశం గారు1957, మే 20న పరమపదించాడు.

#ప్రకాశం జిల్లా ఏర్పాటు:

స్వాతంత్ర్య సమరయోధునిగా ప్రకాశం యొక్క ఉత్తరదాయిత్వం నేటికీ ఆంధ్ర దేశములో వెలుగొందుతూ ఉంటుంది. టంగుటూరి ప్రకాశం పంతులు జాతికి చేసిన సేవలకు గుర్తుగా 1972 డిసెంబర్ 5న ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. గుంటూరు జిల్లాలో మూడు తాలూకాలు (అద్దంకి, చీరాల, ఒంగోలు), నెల్లూరు జిల్లాలో నాలుగు తాలూకాలు (కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి), కర్నూలు జిల్లాలో రెండు తాలూకాలు (మార్కాపురం, గిద్దలూరు) కలిపి ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు.

#గౌరవం:

*ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కళాశాల ‍, ఉన్నత పాఠశాల (1974) - అద్దంకి, ప్రకాశం జిల్లా .
*ఆంధ్ర కేసరి యువజన సమితి, సాంస్కృతిక కళా సంఘం 30-04-1962న రాజమండ్రిలో ఆంధ్ర కేసరి యువజన సమితి,పక్షాన ప్రారంభించబడింది.
*ఆంధ్ర కేసరి శత జయంతుత్సవ జూనియర్ కళాశాల 23-08-1972, పంతులు గారి శత జయంతి సందర్భంగా రాజమండ్రిలో ప్రారంభించబడింది.
*ప్రకాశం పంతులు గారి గౌరవార్ధం అక్టోబర్ 16,1972 లో ఒక ప్రత్యేక తపాల బిళ్ళ విడుదల చేసారు.
*ఆంధ్ర కేసరి పట్టభద్ర కళాశాల 23.08.1994 లో వావిలాల గోపాలకృష్ణయ్య ద్వారా రాజమండ్రిలో ఆంధ్ర కేసరి యువజన సమితి,పక్షాన ప్రారంభించబడింది.
*ప్రకాశం నగర్,కర్నూలు
*సత్యనారాయణపురం(విజయవాడ)లో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఉన్నత పాఠశాల ఉంది. ఈ ప్రాథమిక పాఠశాలనందు 1వ తరగతి నుండి 10వతరగతి వరకు గలవు. ఈ పాఠశాల 1955-60 మధ్య కాలంలో మొదలుపెట్టబడింది.

#తెలుగు పౌరుషాన్ని పైలోకాలకు తీసుకుపోయిన " ఆంధ్రకేసరి"టంగుటూరి ప్రకాశం పంతులు గారిని  ప్రతిఒక్కరు గుర్తుచేసుకోవాలి.

Thursday, May 19, 2022

రాజకీయ ఆణిముత్యం "నీలం"....... శ్రీ నీలంసంజీవరెడ్డి గారి జయంతి

💐 🇮🇳రాజకీయ ఆణిముత్యం                            "నీలం"....... శ్రీ నీలంసంజీవరెడ్డి గారి జయంతి సందర్భంగా🇮🇳💐



#భారతదేశ హృదయాల్లో పరి పాలనాదక్షుడిగా మహోన్నత స్థానాన్ని పొందిన వారిలో పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, లాల్‌బహదూర్‌శాస్త్రి, రాజగోపాలాచారి, ఇందిరాగాంధీ, కామరాజ్‌ నాడార్‌ ముఖ్యులు. కాగా ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రిగా, అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా, రాష్ట్రపతిగా అనేక పదవులు అలంకరించి తన పరిపాలనా చాకచక్యంతో ఆ పదవులకే వన్నె తెచ్చిన పరిపాలనాదక్షుడు నీలం సంజీవరెడ్డి. సామాన్య రైతుబిడ్డగా జన్మించి, దేశంలో అత్యున్నతమైన భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన నీలం  జయంతి నేడు.

#దేశంలో వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన రాయలసీమలోని అనంతపురం జిల్లా ఇల్లూరు గ్రామంలో 1913 మే 19న నీలం సంజీవరెడ్డి జన్మించారు. గ్రామస్థాయి నుంచి దేశ స్థాయి వరకు అన్ని కీలకపదవులు అలంకరించారు. ముఖ్యమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా కొత్త సత్సంప్రదాయాలను సృష్టించిన మహా మనిషి. 

#ఒక కాంట్రాక్టరు ఒక ఉత్తరంతో అతను వద్దకు వచ్చాడు. సంజీవరెడ్డి ఆప్తమిత్రుడి వద్దనుండి తెచ్చిన ఉత్తరం అది. దాన్ని అతను అందుకున్నాడుగాని, చించి చూడలేదు. కాంట్రాక్టరుతో ఇలా అన్నాడు. "నువ్వో కాంట్రాక్టరువని నాకు తెలుసు.. దీనిలో ఏమి రాసుందో కూడా తెలుసు. నీ క్షేమం కోరుకునేవాడివయితే, ఈ ఉత్తరం వెనక్కి తీసేసుకో. లేదూ, దీన్ని తెరిచి చూడమంటావా.., ఆపై నేను తీసుకోబోయే చర్యకు సిద్ధంగా ఉండు" అని అన్నాడు. మరో మాట లేకుండా ఉత్తరాన్ని తీసేసుకున్నాడా కాంట్రాక్టరు.

#1964లో కర్నూల్‌ జిల్లాలో బస్సు రూట్లను జాతీయం చేసే అంశంలో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అదే ఏడాది ఫిబ్రవరి 23న ఏపీ ముఖ్యమంత్రి పదవికి తనకు తానుగా రాజీనామా చేసి దేశంలోనే సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.1967 లోక్‌సభ ఎన్నికల అనంతరం #లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన వెంటనే కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి గొప్ప సంప్రదాయాన్ని నెలకొల్పారు.

#ఏపీకి నీలం సంజీవరెడ్డి ఎంతో సేవ చేశారు. జిల్లా పరిషత్, పంచాయతీ సమితులు, విధాన పరిషత్‌ ఏర్పాటుకు కారకులయ్యారు. పంచాయితీ వ్యవస్థకు పరిపుష్టి చేకూర్చి జాతిపిత కలలు కన్న పంచాయితీ రాజ్‌ వ్యవస్థ పురోభివృద్దికి సోపానం వేశారు. ఆయన పరిపాలన విధానాలను నెహ్రూ సైతం ప్రశంసించారు. 1959లో ఏపీ పర్యటనకు వచ్చిన నెహ్రూ నీలం సంజీవరెడ్డి పరిపాలన విధానాలకు ఆకర్షితులయ్యారు. పంచాయితీ రాజ్‌ వ్యవస్థ పాలనలో దిట్టగా పేరుగాంచి, తద్వారా సాధించిన అనుభవం జాతీయ రాజకీయాల్లోకి వెళ్లటానికి దోహపడింది. 

#నీలం సంజీవరెడ్డి పరిపాలనాదక్షుడే కాదు. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు. అనంతపురం, మద్రాస్‌లలో విద్యనభ్యసించిన సంజీవరెడ్డి స్వాతంత్య్ర పోరాటంలో అనేకసార్లు జైలుకు వెళ్లారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని దీర్ఘకాలం అంటే 1942 నుంచి 1945 వరకు వేలూరు, అమరావతి జైళ్లలో నిర్బంధితులయ్యారు. 1946లో విడుదలైన తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. మద్రాస్‌ రాష్ట్ర లెజిస్లేచర్‌ పార్టీకి కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత 1949 ఏప్రిల్‌లో అప్పటి ఉమ్మడి మద్రాస్‌ ముఖ్యమంత్రి అయిన కుమారస్వామి రాజా మంత్రివర్గంలో గృహనిర్మాణ, అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు. 1951–53 మధ్య ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.

1953 అక్టోబర్‌ నుంచి టంగుటూరి ప్రకాశం, బెజ వాడ గోపాల్‌రెడ్డి మంత్రి వర్గాల్లో ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. వారితో కలిసి పనిచేయడం వల్ల పరిపాలన రంగంలో అపారమైన అనుభవం గడించారు. ఫలి తంగా 1956 నవంబర్‌ 1న ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా నియమితులయ్యారు. తిరిగి 1962 మే నుంచి 1964 ఫిబ్రవరి వరకు సీఎంగా పనిచేశారు. జవహర్‌లాల్‌ నెహ్రూకు అత్యంత విశ్వాసపాత్రుడిగా మెలిగారు. 1956 నవంబర్‌ నుంచి 1959 డిసెంబర్‌ వరకు ఏఐసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 

#నెహ్రూ తర్వాత ప్రధాని పదవి చేపట్టిన లాల్‌బహదూర్‌ శాస్త్రి, ఇందిరాగాంధీల మంత్రివర్గాలలో నీలం సంజీవరెడ్డి పనిచేశారు. 1967 సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 1969లో రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడిపోయారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 1977లో జనతాపార్టీ తరపున లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి జనతా పార్టీ తరఫున ఎన్నిక అయిన ఏకైక పార్లమెంట్‌ సభ్యుడిగా చరిత్ర సృష్టించారు. అనంతరం అదే ఏడాది జూలైలో భారత రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈయన రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఒకే ఒక్క రాష్ట్రపతి సంజీవరెడ్డి. 1982లో రాష్ట్రపతి పదవినుండి దిగిపోయాక, రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుని బెంగుళూరులో స్థిరపడ్డారు.

#ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలో మంత్రిగా, ఏపీ సీఎంగా, ఉపముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా, రాష్ట్రపతిగా వివిధ హోదాల్లో పనిచేశారు. తన హయాంలో అనేక భారీ పరిశ్రమలను స్థాపించారు. దేశానికి సేవలందించిన గొప్ప నాయకులలో ఒకడిగా తనదైన ముద్రవేశారు.   
సంజీవరెడ్డి పేరిట శ్రీశైలం ప్రాజెక్టుకు నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టు అని పేరుపెట్టారు.
1958లో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం అతనుకు గౌరవ డాక్టరేటు బహూకరించింది.
#అనేక క్లిష్టపరిస్థితుల్లో అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. దేశానికి నిరుపమాన సేవలందించిన నీలం సంజీవరెడ్డి 1996 జూన్‌ 1న తుది శ్వాసను విడిచారు.


నిరతాన్నదాత్రి శ్రీమతి డొక్కా సీతమ్మ గారి వర్ధంతి*_

_*ఈ రోజు నిరతాన్నదాత్రి శ్రీమతి  డొక్కా సీతమ్మ గారి వర్ధంతి*_



✍️ఆకలి మనిషిచేత ఏమైనా చేయిస్తుంది. ఆకలి బాధని తీర్చుకోవడానికి మనిషి ఎన్నో చెయ్యరాని కార్యాలు చెయ్యడానికి కూడా వెనుకాడడు. ప్రాణి బతకడానికి ఆహారం కావాలి.  కడుపునిండిన వాడి మనసులో చెడ్డ ఆలోచనలు రావు. తన పొట్ట నిండిన నాడు మనిషి పక్కవాడి మేలు గురించి ఆలోచిస్తాడు. అలా నలుగురూ ఆలోచిస్తే , సమాజం బాగుపడుతుంది. అందువలన అన్నదానాన్ని మించిన దానమేలేదు. మరే దానం చేసినా , గ్రహీత ఇంకా ఇంకా కావాలని ఆశించే అవకాశం వుంది. మనం కోట్లు కుమ్మరించినా , దానాన్ని స్వీకరించేవారు మరిన్ని కోట్లు రావాలని ఆశించవచ్చు. అలాగే గోదానమూ , భూదానమూ , కనక వస్తు వాహనాల దానమూను.  అయితే , ఒక్క అన్నదానంలో మాత్రమే దానం స్వీకరించిన వారు సంపూర్ణంగా , ఏ లోటూ లేకుండా తృప్తి చెందుతారు. మృష్టాన్న భోజనము చేయడం వలన శరీరములోని సకల అవయవములకు , మనసుకు , ఆత్మకూ ఏకకాలం లో తృప్తి కలుగుతుంది. అలా భోజనం చేసినవారు , ఆ అన్నదాతను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. వారి వంశం కలకాలం చల్లగా వుండాలని దీవెనలందిస్తారు. 

మహాభారతంలో అశ్వమేధ పర్వం లో , అన్నదాన మహిమకు సంబంధించిన ఒక కథ వుంది. కురుక్షేత్ర సంగ్రామం తరువాత ధర్మరాజు అశ్వమేధం  చేస్తాడు. ఆసమయంలో అతిథులందరికీ కావలసినవన్నీ ఇచ్చి , సమస్తమూ దానం చేస్తాడు. అందరూ అతని దాన గుణాన్ని వేనోళ్ళ కొనియాడతారు. అప్పుడు అక్కడికి ఒక ముంగిస వస్తుంది. దాని శరీరం సగం బంగారు వర్ణంలో వుంటుంది. *"ధర్మ రాజా , నీకు నిజమైన   అన్నదానం ఎలా వుంటుందో చెబుతాను విను. ఈ కురుక్షేత్ర భూమిలోనే , ఎన్నో ఏళ్ళ క్రితం సక్తుప్రస్థుడు అనే మహాత్ముడు ఉండేవాడు. ఆయన , భార్య , కొడుకు , కోడలు నలుగురూ , జీవకోటిని కరుణతో , దయతో చూస్తూ , కామ క్రోధాలను విడిచి , ధర్మ బద్ధంగా జీవితాన్ని గడిపేవారు. అతిథి అభ్యాగతులను దేవుళ్ళవలె పూజించి ఆదరించి పంపేవారు. కేవలం జీవితాన్ని నిలుపుకోవడానికి ఎంత ఆహారం కావాలో అంత మాత్రమే తినేవారు. కడు పేదలైనప్పటికీ పరమేశ్వర ధ్యానంలో జీవితం గడిపేవారు. ఒక రోజు వారికి అతి తక్కువ ఆహారం దొరికింది. కేవలం ఒక రొట్టికి సరిపోయే పిండి మాత్రమే సమకూరినది. ఆ చిన్ని రొట్టెను నాలుగు భాగాలు చేసుకుని వారు తినడానికి సిద్ధమౌతున్న సమయంలో ఒక అతిథి వచ్చి *"తన ప్రాణం పోతోన్నదనీ , తనకు ఏదైనా ఆహారం ఇవ్వమనీ"* కోరాడు.

అప్పుడు సక్తుప్రస్థుడు తన వంతు రొట్టే ముక్కను ఇచ్చాడు. అది తిన్న అతిథి తన ఆకలి బాధ మరింత ఎక్కువైనదని చెప్పాడు. అప్పుడు ఆ కుటుంబంలోని అందరూ తమ వంతు రొట్టెను ఇచ్చి వేసారు. అవి తిన్న అతిథి తృప్తిగా వారిని దీవించాడు. *"మీ అతిథి సత్కారం , అన్నదానం నాకు నచ్చాయి. మీరంతా ప్రాణాలు పోయేటంతటి ఆకలితో బాధపడుతూ కూడా , మీరు తినబోయే ఆహారం నాకు దానం చేసి , ఎంతో పుణ్యం సంపాదించుకున్నారు. మీ దానబుద్దికి దేవతలు సంతోషిస్తారు. అన్ని లోకాలూ మిమ్ములను ప్రశంసిస్తాయి. దానము , భూత దయ ఈ రెండు వున్న మీకు మోక్షం లభిస్తుంది"  అని దీవించాడు. అప్పుడు పరమాత్మ వారికొరకు పుష్పక విమానాన్ని పంపించాడు. వారు దివ్యలోకాలకు తరలి వెళ్ళారు. ఆ దృశ్యాన్ని చూసిన నేను , సక్తుప్రస్థుడు ఆ అతిథి కాళ్ళు కడిగిన నీటిలో అప్రయత్నంగా తిరిగాను. అప్పుడు నా శరీరం లో ఆ తడి తగిలిన సగ భాగం బంగారు రంగులోకి మారింది. దానమంటే అలా వుండాలి. అప్పటినించీ ఎన్నో దాన , ధర్మ ప్రదేశాలు తిరిగాను. అయినా నా రెండవ ప్రక్క బంగారు రంగు రాలేదు , ఇక్కడ కూడా రాలేదు"* అని నవ్వుతూ వెళ్ళిపోయిందిట.   అన్నదానము ఎలా చెయ్యాలో , ఎంత ప్రేమతో , దయతో , మాతృహృదయంతో , అపారమైన త్యాగ బుద్ధితో చెయ్యాలో ఈ  కథ మనకు వివరిస్తుంది.

భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్న రోజులవి. పద్ధెనిమిది వందల నలభైలనాటి మాట. అకాలంలో ఒక వూరినించి మరొక వూరికి ప్రయాణాలన్నీ బండ్ల మీద సాగుతూ వుండేవి. గమ్యం చేరుకోవడానికి కొన్ని రోజులు పట్టేది. మార్గ మధ్యంలో భోజనాలు దొరకక పెద్దలూ , పిల్లలూ ఎంతో ఇబ్బంది పడేవారు. హోటళ్ళు లేవు. కొందరు ధర్మాత్ములు కట్టించిన సత్రాలు ఉన్నా , అవి చాలా తక్కువమందికి మాత్రమే ఉపయోగపడేవి. ప్రతి సత్రానికి ఒక గుమాస్తా వుండేవాడు. అతని దయా దాక్షిణ్యాలపై సత్రం నిర్వహణ జరిగేది. అతను పద్దులు రాయటం పూర్తైన తరువాత , ఉదయం ఏ పన్నెండుగంటలకో ఒకసారి , తిరిగి రాత్రి ఒక సారి మాత్రమే భోజనం పెట్టేవారు. మిగితా సమయాలలో వచ్చిన వారికి మొండిచెయ్యే మిగిలేది. భోజనం పెట్టే
సమయంలో కూడా సూటి పోటి మాటలంటూ *"తేరగా వచ్చిన తిండి , తినండి , మీకు రాసిపెట్టుంది మరి"* అంటూ హేళన చేసేవారు. దానితో ప్రయాణీకులు ఈ సత్రాలకి రావడానికే భయపడి పస్తులతోనే ప్రయాణాలు సాగించేవారు. పిల్లలు ఆకలికి తాళలేక విలవిలలాడిపోయేవారు. *"దూషణ భూషణ తిరస్కారములు ఆశీస్సులుగా భావించే"* యే పేకాట రాయుళ్ళకో , వ్యసన పరులకో , సోమరులకో మాత్రమే బాగా ఉపయోగ పడేవి చాలా సత్రాలు.
అటువంటి కాలంలో *అపర అన్నపూర్ణగా , నిరతాన్నదాత్రిగా ఖండాంతర కీర్తినార్జించిన శ్రీమతి డొక్కా సీతమ్మగారు జన్మించారు.  ఆ మహా సాధ్వి గురించి "విబుధ జనులవలన విన్నంత కన్నంత , తెలియవచ్చినంత"* వివరించాలనే ఉద్దేశ్యం తోనే ఈ వ్యాసానికి శ్రీకారం చుట్టాను. గొప్పలు చెప్పుకోవాలనో , కీర్తి చాటుకోవాలనో కాదు. కేవలం అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మగారి గురించి నాకు , మా వంశస్థులకు తెలిసిన వివరాలు , ఆసక్తి గలవారితో పంచుకోవాలనే ఉద్దేశ్యంతో చేస్తున్న ప్రయత్నం ఇది. తప్పులుంటే పెద్దలు సవరించగలరు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు చెప్పే ప్రవచనాలలో డొక్కా సీతమ్మగారిని గురించి చెప్పడం విన్న ఎంతో మంది నాకు , అన్నకు ఫోను చేసి , ఈమెయిలు చేసి , మరిన్ని వివరాలు కావాలని పదే పదే అడగడంతో , మావద్ద వున్న సమాచారం సేకరించి , ఈ వ్యాసంగా రాస్తున్నాను.

కోనసీమలో చతుర్వేదపారంగతులైన పండితోత్తములకు నిలయమైన పేరూరు అనే గ్రామము వుంది. అక్కడ ద్రావిడ వంశమునకు చెందిన శ్రీ డొక్కా వారి కుటుంబంలో శ్రీ డొక్కా జోగన్న గారు క్రీ.శ 1804 (రక్తాక్షి నామ సంవత్సరం) లో జన్మించారు. వీరి తండ్రి శ్రీ డొక్కా విశ్వేశ్వరుడు గారు , తల్లి శ్రీమతి సోదెమ్మ. విశ్వేశ్వరుడు గారికి ఐదుగురు మగ పిల్లలు. నాలుగవ వారు జోగన్న గారు.
1) సూరన్నగారు 
2) నరసన్నగారు
3) సుబ్రహ్మణ్యం  గారు
4) వెంకట జోగన్న గారు 5) జగ్గన్న గారు
సూరన్నగారు , నరసన్నగారు ఇల్లరికపుటల్లుళ్ళుగా వక్కలంక వెళిపోయారు. సుబ్రహ్మణ్యం గారు చిన్నప్పుడే చనిపోయారు. మిగిలిన వెంకట జోగన్న గారు , జగ్గన్న గారు లంకల గన్నవరములో వ్యవసాయము చేసుకొనే వారు.  జోగన్న గారు వేద పండితులు. సదాచార సంపన్నులు. సాముద్రిక శాస్త్రమునందు నిపుణులు. వీరి మొదటి భార్య పేరు లక్ష్మీ దేవి. వారికి  సూర్యనారాయణ అను కొడుకు పుట్టాడు. అయితే భార్య లక్ష్మి దేవి గారు , కుమారుడు సూర్యనారాయణ చనిపోయారు. అప్పుడు జోగన్న గారు సుబ్బమ్మను పెళ్ళిచేసుకున్నారు. కొంతకాలానికి ఆమె విశ్వేశ్వరుడను పిల్లవాడికి జన్మనిచ్చి చనిపోయారు. జోగన్న గారు ఎంతో విచారించి , ఎన్నో ఏళ్ళు ఒంటరిగా గడిపి కుమారుణ్ణి పెంచారు.
మండపేట గ్రామములోని అనప్పిండి భవానీ శంకరం గారు (బువ్వన్న గారు) , నరసమ్మ దంపతులకు జన్మించిన కుమార్తెయే సీతమ్మ గారు. డొక్కా సీతమ్మగారు 1841 (ప్లవ నామ సంవత్సరం) లో జన్మించారు. భవానీ శంకరం గారు వేద వేదాంగములను అభ్యసించిన మహా మేధావి. సీతమ్మ గారి పసితనమునందే నరసమ్మగారు చనిపోయారు.  తల్లి లేని బిడ్డను భవానీ శంకరం గారే ఎంతో జాగ్రత్తగా పెంచారు. ఒక రోజు డొక్కా జోగన్న గారు వేద సభలలో చర్చలు చేసి , విజయులై , ఎన్నో సన్మానములను పొంది తిరిగి వస్తూ , మధ్యాహ్న భోజన సమయమునకు మండపేటకు చేరారు. ఆ వూరిలో వేద పండితులైన భవానీ శంకరం గారింట స్వయం పాకము చేసికొనవచ్చు కదా అని యోచించి వారింటికి వచ్చారు. ఆ సమయానికి భవానీ శంకరంగారు ఇంటిలో లేరు. వారి కుమార్తె సీతమ్మ గారు వున్నారు. సీతమ్మ గారు జోగన్న గారిని ఆదరించి , ఆయన స్వయంపాకమునకు కావలసిన సామాగ్రినంతయు సమకూర్చి ఇచ్చారు. జోగన్న గారు ఆ బాలిక త్యాగ బుద్ధికి , తెలివి తేటలకు , ఆదరణకు ముగ్ధులై స్వయంపాకము చేసుకొంటున్నారు. ఇంతలో భవానీ శంకరం గారు వచ్చి , మహాపండితులైన డొక్కా జోగన్న గారు తమ యింటికి వచ్చుట చూసి , అమితానంద పడి , వారిని ఆదరించి , ఎన్నోరీతుల సత్కరించి పంపారు. డొక్కా జోగన్న గారి వంటి పండితోత్తమునకు తన కూతురునిచ్చి పెండ్లి చేయాలని మనసులో సంకల్పము చేసుకొన్నారు. సీతమ్మ గారి చురుకుతనము , అణకువ , త్యాగ బుద్ధి చూసి , సాముద్రిక శాస్త్రము సూచించిన అనేక శుభలక్షణములు గలిగిన ఆ బాలికను వివాహము చేసుకొన్న బాగుండునని , ఆమె వున్న చోట ఏ కొఱత వుండదని , ఆ వంశమునకు చిర కీర్తి లభించునని గ్రహించిన జోగన్నగారు కూడా వివాహము చేసుకొన్నచో బాగుండునని తలచారు. పిమ్మట ఆచారము ప్రకారము భవానీ శంకరము గారు తమ వూరి పెద్దలను తోడ్కొని వచ్చి , వారి ద్వారా తన కుమర్తెను జోగన్నగారికిచ్చి పెండ్లి చేయవలెనను తమ ఆకాంక్షను జోగన్నగారికి తెలియజేసారు. ఆయన సమ్మతించారు. గృహస్థాశ్రమ విధులకూ , యజ్ఞ యాగాదులకు ఆటంకము కలుగకూడదనే ఉద్దేశ్యముతో , శ్రీ డొక్కా జోగన్న గారు 1850 ("సాధారణ" నామ సంవత్సరము) లో సీతమ్మగారిని వివాహమాడారు. వివాహం నాటికి సీతమ్మగారి తొమ్మిదేళ్ళు. చిన్నతనంలోనే సీతమ్మగారు అత్తవారింటికి వచ్చారు. పాడి పంటలకు లోటులేని కుటుంబము. ఎన్నో బాధ్యతలను అంత చిన్న వయసునుంచి , ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు సీతమ్మగారు. ఎంతమంది పనివారున్నా , ప్రతి పనీ స్వయముగా దగ్గరుండి చూసుకొనేవారు. ఊరిలో ఎవరికి ఏ ఆపదవచ్చినా అది తమదిగా భావించి , వారికి తగిన సహాయం చేసేవారు. మొదటిలో భర్త జోగన్నగారు ఏమనుకుంటారో అని కాస్త బెరుకుగా వుండేవారు. అయితే మహాపండితులైన జోగన్న గారు , అన్నదాన విషములయందు , పరోపకార విషయములయందు సీతమ్మగారిని ఎంతో  ప్రోత్సహించేవారు. అప్పటినుండి వచ్చు పోవు వారికందరికీ భోజనములను ఏర్పాటు చేయుట విధిగా చేసేవారు సీతమ్మగారు. రేవులు దాటే సౌకర్యాలు సరిగా లేకపోవటం వలన , ప్రయాణ సౌకర్యాలు అంతగా లేకపోవడం వలన , ఎంతో మంది మార్గస్థులు లంకల గన్నవరం లో అగేవారు. సీతమ్మగారి ఖ్యాతి విని వారింటికి వచ్చేవారు. వారందరికీ మజ్జిగ తేటను , భోజనాలను , ఫలహారాలను సమకూర్చేవారు సీతమ్మగారు. సీతమ్మగారి అన్నదాన వ్రతమునకు వేళ లేదు. 24 గంటలలో ఎప్పుడు , ఏవేళ , ఎవరు వచ్చినా , వారి కడుపు నింపి , వారిని ఆదరించేవారు సీతమ్మగారు. ఇలా ఎన్నో యేళ్ళు చేయడం వల్ల ఆవిడ ఆరోగ్యము దెబ్బతింది. అయితే ఆవిషయం జోగన్నగారికి తెలియనీయలేదు. ఆవిడ క్రమముగా చిక్కి పోవడం గమనించిన జోగన్న గారు , సీతమ్మగారిని విశ్రాంతి తీసుకోమని చెప్పారు. వేళకు వచ్చిన వారికి భోజనము పెట్టుమని తక్కిన సమయంలో కాస్త విశ్రాంతి తీసుకోమని సూచించారు. అయితే అతిథులకు , అన్నార్తులకు ఇబ్బంది కలుగుతుందని , తన ఆరోగ్యము బాగానే వున్నదని చెప్పి సీతమ్మగారు అన్నదాన వ్రతం కొనసాగించారు. జోగన్న గారు ఆవిడకు వంటలు వండడానికి సాయంగా కొంత మంది వంట బ్రాహ్మలను ఏర్పాటు చేసారు. వారే వండి వడ్డిస్తారని చెప్పారు. అయితే సీతమ్మగారు , వారు వండినప్పటికీ , వడ్డన మాత్రము తానే స్వయముగా చేసి , అందరికీ కొసరి కొసరి తినిపించేవారు. వేళ కాని వేళ వచ్చిన అతిథులకు వంట కూడా తానే చేసి , వడ్డించేవారు. అందరినీ బతిమాలి , బుజ్జగించి , వారి మొహమాటాన్ని పోగొట్టి , కన్న తల్లిలాగ అన్ని రకాల వంటలూ చేసి , వడ్డించి , దగ్గరుండి , కొసరి కొసరి తినిపించే వారు సీతమ్మగారు. ఒక గదిలో తరవాణి కుండలు పెట్టించి , చద్దెన్నము నిండుగ నింపి , ఏ అర్థరాత్రి ఎవరు వచ్చినా వారికి ముందుగా ఆ అన్నంపెట్టి , ఆకలి మంట చల్లార్చి , పిమ్మట వంట చేసి తృప్తిగా భోజనము పెట్టేవారు సీతమ్మగారు.
సీతమ్మగారికి , జోగన్నగారికి ఇద్దరు కుమారులు , ఇద్దరు కుమార్తెలు పుట్టారు.
1.సుబ్బారాయుడు గారు 2.గోపాలం గారు 
3. నరసమ్మ గారు (చాకుఱ్ఱు అయ్యగారి రామకృష్ణయ్య గారి భార్య) 
4. సోదెమ్మ గారు
తమ పెద్ద కుమారుడైన సుబ్బారాయునకు, తన మరిదిగారైన జగ్గన్నగారి కూతురు కూతురు (మనుమరాలు) సుబ్బమ్మను ఇచ్చి పెండ్లిచేసారు సీతమ్మగారు.

*అంతర్వేది ప్రయాణము - పెళ్ళివారి రాక*

అన్నదానానికి భంగం కలుగుతుందనే ఉద్దేశ్యంతో ఎన్నడూ ఇల్లు కదలని సీతమ్మగారు , ఒకే ఒక్క సారి , దగ్గరలోని అంతర్వేది నరసింహస్వామిని దర్శించుకుని రావాలనే కోరికతో మేనాలో బయలుదేరారు. మేనా కొంత దూరం వెళ్ళింది. బోయీలు ఓ పంట చేను పక్కన చెట్టువారగా విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే సమయంలో ఒక పెద్ద పెళ్ళివారి గుంపు వేరొక ఊరినించి వచ్చి అక్కడే విశ్రాంతి తీసుకుంది. ఆ గుంపులోని పెద్దలు , పిల్లలు ఆకలికి తాళలేకపోతున్నారు. పిల్లలు ఏడుపులందుకున్నారు. పెద్దవాళ్ళు వాళ్ళను ఊరుకోబెడుతూ *"ఏడవద్దు పిల్లలూ , మరి కాస్త సేపట్లో మనం డొక్కా సీతమ్మగారి ఇంటికెళిపోదాం. అక్కడ హాయిగా అందరమూ కడుపు నిండా భోజనం చేసి , హాయిగా విశ్రాంతి తీసుకుందాం"* అంటున్నారు. ఈ మాట సీతమ్మగారి చెవిన పడింది. మానవ సేవే మాధవ సేవ అని గట్టిగా నమ్మిన ఆవిడ , మరుక్షణమే తన మేనాను వెనుకకు తిప్పి వీలైనంత వేగంగా ఇంటికి తీసుకుపొమ్మని బోయీలకు చెప్పారు. అడ్డదారిన , పెళ్ళి వారికంటే అరగంట ముందుగా ఇల్లుచేరారు ఆవిడ. అయినా అరగంటలో ఏమి వంట చేయగలరు ? అందునా సుమారు వందమంది పెళ్ళివారికి ? అందుకనే ఆవిడ ముందుగా అటక మీదనించి బెల్లం బుట్టలు దింపించి , శ్రీరామ నవమి రోజున దేవునకు అర్పించే బెల్లం పానకం తయారు చేయించారు. నాలుగు బుట్టల తియ్యటి మామిడి పండ్లను ముక్కలుగా కోయించి సిద్ధం చేయించారు. ఇంతలో పెళ్ళి వారి గుంపు వచ్చేసింది. వారంతా హాయిగా పానకములు త్రాగి , పండ్లు తిని కాస్త కుదుట పడ్డారు. ఇంతలో పంచ భక్ష్య పరవాన్నాలతో అతి రుచికరమైన , సంతృప్తికరమైన భోజనాలతో వారికి విందు చేసారు సీతమ్మగారు. సాయంత్రము పొలము నుండి తిరిగి వచ్చిన జోగన్న గారు ఆశ్చర్యపడి *"అంతర్వేది వెళ్ళలేదా ?"* అని సీతమ్మ గారిని అడిగారు. *"ఇంతమందిని పస్తు పెట్టి , నేను దర్శనానికి వెడితే , ఆ నరసింహ స్వామి హర్షించడు. అందుకే తిరిగి వచ్చేసాను"* అని చెప్పారు సీతమ్మగారు. అది విన్న జోగన్న గారు , ఆవిడ త్యాగ నిరతికి ఎంతో సంతోషించారు.

*కోడూరుపాడు రాజు గారి కుమార్తె:*

కోడూరుపాడు రాజుగారు గర్భిణీ అయిన తమకుమార్తెను పుట్టింటికి పురిటికి తీసుకువెడుతున్నారు. మధ్యలో కోడేరు రేవు దాటగానే ఆమెకు నొప్పులు వచ్చాయి. లంకల గన్నవరం వచ్చేసరికి నొప్పులు ఎక్కువయ్యయి. అప్పుడు వారిని సీతమ్మగారు తన ఇంట ఉంచుకొని , ఆ రాచ బిడ్డకు ఒక గది ప్రత్యేకముగా కేటాయించి , ఆమెకు పురుడు పోసారు. కన్న తల్లికన్న ఎక్కువగా పథ్యం భోజనాలు చేసి పెట్టి , ఒక నెల రోజులు తన ఇంటనే వుంచుకుని , అప్పుడు రాజు గారినీ , కుమార్తెనూ , మనుమరాలినీ చీర , సారె పెట్టి పసుపు కుంకుమలిచ్చి సాగనంపారు. ఊరిలో ఎవరింట బంధువులు వచ్చినా వారి ఇంటికి , పెరటి దారిన , కావలసిన కూరలు , వంట సామాగ్రి పంపేవారు. కాస్త పేదవారైతే వారి వారి పెళ్ళిళ్ళు తమ ఇంటి వద్దనే పందిళ్ళు వేయించి , తన స్వంత ఖర్చులతో వైభవంగా జరిపించేవారు. సీతమ్మగారు ఎన్నడూ కుల , మత , జాతి భేదములు పాటింపలేదు. నిరుపేదలు మొహమాట పడతారని గ్రహించి , వారికి తెలియకుండానే రహస్యంగా ఎన్నో సహాయాలు చేసేవారు. డొక్కా వారింటిలో అన్ని కులములవారు , జాతులవారు , మతములవారు , దేశములవారు సీతమ్మగారి అన్న ప్రసాదాన్ని తృప్తిగా ఆరగించేవారు.

*వరహాల శెట్టి కథ:*

బొంబాయి మహా నగరంలో ప్రసిద్ధిగాంచిన బంగారు వ్యాపారి ధనగుప్తుడు. విశేషంగా ధనం సంపాదించాడు. అతని కొడుకు నిగమ శర్మ లాంటి వరహాల శెట్టి. చిన్ననాటి నుంచి తల్లియొక్క అతిగారాబం వల్ల చెడిపోయి , జులాయిగా పెరిగాడు వరహాల శెట్టి. అతనికి లేని చెడ్డగుణము లేదు. పెళ్ళి చేసుకుని పిల్లవాణ్ణి కన్నాడు. అయినా అతని శైలిలో మార్పు రాలేదు. వేశ్య మోహంలో పడి భార్యను విడిచి , తన ఆస్తి వాటా గుంజుకొని , దానినీ తగలేసి , భ్రష్టుడై , జైలు పాలయి , ఎప్పటికో విడుదలయి , దొంగగామారి దేశ ద్రిమ్మరి అయ్యి , తిరిగి తిరిగి ఆంధ్ర దేశానికి వచ్చాడు.  అప్పుడు ఆంధ్ర దేశములో వర్షాలు పడక కరువు పరిస్థితులు వున్నాయి. అతనికి పట్టెడన్నం పెట్టేవారే లేరు. అతను తిరిగి తిరిగి , చివరకు డొక్కా సీతమ్మగారి ఖ్యాతి విని , కడ ప్రాణాలతో లంకల గన్నవరం వచ్చి చేరాడు. అందరితో పాటు అతనికి కడుపునిండా అన్నం పెట్టారు సీతమ్మగారు. అతను హాయిగా తిని , పెరట్లోకి పోయి పశువుల శాల పక్కన పడుకునేవాడు. మళ్ళీ ఆకలివేసినప్పుడు వచ్చి పంక్తిలో కూర్చుని భోజనం చేసేవాడు. ఇలా కొన్ని రోజులైనతరువాత అతనికి దుర్భుద్ది కలిగింది. ఒక రాత్రి అతను సీతమ్మగారు ఆరవేసుకొన్న పట్టు చీర దొంగిలించి పారిపోబోయాడు. ఎవరిదో కాలు అడ్డు తగిలి కిందపడ్డాడు. అందరూ లేచి అతనిని స్థంభానికి కట్టేసారు. ఈ విషయం సీతమ్మగారికి తెలియదు. పొద్దున్న అవిడ లేచి ఎంతో బాధపడి , కట్లు విప్పి , వరహాల సెట్టిని విడిపించి *"ఆ చీర నేనే అతనికి ఇచ్చాను" అని చెప్పి , అతనికి తల్లిలా తలంటు పోసి , కొత్త బట్టలు తెప్పించి ఇచ్చి గౌరవించారు. అతనికి తృప్తిగా మరల భోజనము పెట్టి , తన వద్దనున్న మొత్తం సొమ్ము యాభై రూపాయలను అతనికి ఇచ్చారు. అతని హృదయం కరిగిపోయింది. అతని దుర్గుణాలన్నీ అంతటితో నశించాయి. అతను సీతమ్మగారి పాదాలు పట్టుకుని చిన్నపిల్లవానివలె ఏడుస్తూ క్షమాపణ కోరాడు. ఆమె అతనిని ఓదార్చి "  విధిని తప్పించుకోలేము నాయనా. నీకు లేకపోవడం చేతనే కదా ఇలా తప్పు చేసావు. అందుకే ఈ యాభై రూపాయలతో ఏదైనా కొనుక్కో"* మని తల్లిలా చెప్పారు. అప్పుడు వరహాల శెట్టి తన కథనంతా చెప్పి , తనను క్షమింపుమని వేడుకొని , సీతమ్మగారి ఆశీర్వచనములతో తన ఇల్లు చేరి , ఆ యాభై రూపాయలతో  మరల వ్యాపారమును వృద్ధి పరచుకొని , దినదినాభివృద్ధి చెంది ఎంతో సంతోషముగా భార్యా బిడ్డలతో కాలంగడిపాడు. తనజీవితములో ఎప్పుడూ సీతమ్మగారు తనకు చేసిన మేలు మరువలేదు. వీలుకుదిరినప్పుడల్లా కుటుంబంతో వచ్చి సీతమ్మగారి దర్శనం చేసుకునేవాడు.

*హరిజనునకు ప్రాణదానము:*

ఒక వర్షాకాలపు నడి రాత్రి. తుఫాను సమయము. ఆకాశం నిండా నల్లని మబ్బులు. విపరీతమైన పోటులో వుంది గోదావరి. ఎవరూ పడవ కట్టడానికి సాహసించని సమయం అది. అటువంటి సమయంలో గోదావరిలోని దిబ్బలలోనుంచి ఒక గొంతు అతి దీనంగ వినబడింది *"అమ్మా , సీతమ్మ తల్లీ , ఆకలితో కడుపు కాలిపోతోంది , ప్రేగులు మాడిపోతున్నాయమ్మా. హరిజనుణ్ణి తల్లీ , ఎవరూ నా గోడు వినేవారు లేరు. తల్లీ , పట్టెడన్నం పెట్టి నా ప్రాణాలు కాపాడమ్మా."* అప్పటికే ఇంటికి వచ్చిన అందరికీ భోజనాలు పెట్టి , ఇంకా ఎవరైనా తినకుండా మిగిలిపోయారా అని ఒక లాంతరు వేసుకుని వీధి అరుగుమీద చూస్తున్న సీతమ్మగారికి ఆ హరిజనుని ఆర్తనాదాలు వినపడ్డాయి. వెంటనే అతనికి భోజనం అరిటాకులలో కట్టి , కప్పుకోవడానికి రెండు బొంతలు , కట్టుకోవడానికి ఒక పొడి పంచె , వెలిగించుకోవడానికి నాలుగు లంక పొగాకు చుట్టలు ఒక సంచీలో సద్ది , జోగన్న గారికి ఇచ్చి , పడవ కట్టించుకుని వెళ్ళి , ఏరు దాటి , దిబ్బలలో వున్న అతనికి ఇచ్చి రమ్మన్నారు. *"ఇంత తుఫానులో , ఈ అర్థరాత్రి ఎవరూ పడవకట్టరు , ఒక వేళ కట్టినా గోదావరి పోటు విపరీతంగా వుండడం వల్ల పడవ మునిగి ప్రాణాలు పోతాయి , కాబట్టి ఇప్పుడింత సాహసం చెయ్యడం ఎందుకు , రేపు ఉదయాన్నే వెడతాను"* అని ఆగారు జోగన్నగారు. *"రేపు ఉదయం వరకు అతను బతకడు , నేనే వెళ్ళి వస్తాను , నా ప్రాణాలు పోయినా పరవాలేదు"* అని బయలుదేరారు సీతమ్మగారు. సీతమ్మగారి నిశ్చయం ఎరిగిన జోగన్న గారు , తానే బయలుదేరి వెళ్ళి , పడవ వాడిని బతిమాలి పడవకట్టించుకుని , దిబ్బలు చేరుకుని , అతనిని ఆ చిమ్మ చీకటిలో వెతికి పట్టుకుని , అతనికి భోజనం పెట్టి , పొడి బట్టలిచ్చి , ప్రాణాలు నిలిపారు. అతను జోగన్నగారి కాళ్ళు పట్టుకుని , సాష్టాంగ ప్రణామం చేసి , తన ప్రాణములు నిలిపినందులకు కృతజ్ఞతలు తెలిపాడు.

*శ్రీమతి ముదునూరు పద్మావతమ్మగారికి మేలు చేయుట:*

విజయనగరమనే గ్రామంలో శ్రీ ముదునూరి కృష్ణమరాజు గారిది పేరు ప్రఖ్యాతులు గల కుటుంబం. ఆయన భార్య శ్రీమతి పద్మావతమ్మ. వారికి లేకలేక ఒక మగ బిడ్డ పుట్టాడు. బారసాలనాడు ఉండుండి పద్మావతమ్మగారు పెద్ద కేక పెట్టి వెనక్కు పడిపోయారు. అప్పటినించీ ఎంతో వింతగా ప్రవర్తించేవారు. పిల్లవాణ్ణి విసిరేసేవారు. ఇంటికి వచ్చిన వారిని కొడుతూ , బెదిరిస్తూ , వెక్కిరిస్తూ చాలా చిత్రమైన చేష్టలు చేసేవారు. ఎంతోమంది వైద్యులు పరీక్షించినా ఏమీ కనుక్కోలేకపోయారు. ఆమెను ఒక గదిలో వేసి తాళం పెట్టారు. ఆమె అన్నం తినడము , నీళ్ళు తాగడమూ కూడా మానివేసారు. కోనసీమలో పేరుగాంచిన ఒక శాస్త్రిగారు వచ్చి , ఎన్నో జపములు , హోమములు చేసి , పద్మావతమ్మగారిని రప్పించి ఆమెపై విభూతి చల్లారు. అప్పుడు ఆమె వణుకుతూ శాస్త్రిగారి పాదాలపై పడి , రక్షించమని వేడుకుని , తాను బ్రహ్మ రాక్షసుడననీ , తనను డొక్కా సీతమ్మగారి వద్దకు తీసుకుని పొమ్మనీ , సీతమ్మగారు హరిజనుడి ప్రాణాలు కాపాడిన పుణ్య ఫలం తనకు ధారపోస్తే తనకు విముక్తి కలుగుతుందనీ చెప్పారు. అందరూ ఆమెను సీతమ్మగారి దగ్గరకు తెచ్చారు. తక్షణమే సీతమ్మగారు పండితులను పిలిచి , పద్మావతమ్మగారి చేతిలో ఆ పుణ్య ఫలాన్ని మంత్ర పూర్వకంగా ధారపోసారు. అంతటితో ఆబ్రహ్మరాక్షసుడు పద్మావతమ్మగారిని విడిచిపెట్టి , సీతమ్మగారికి తన పూర్వ జన్మ వృత్తాంతం ఇలా చెప్పాడుట.
*"తల్లీ , మేము బ్రాహ్మలము. ఇద్దరన్నదమ్ములము. మ తల్లి దండ్రులు చిన్నతనమునందే చనిపోయారు. నేను పెద్దవాణ్ణి కావడంతో నా తమ్ముడి పెంపకం నేనూ , నా భార్యా చూసుకునేవాళ్ళం. కొన్నాళ్ళకు నాకు ఆరుగురు కొడుకులు పుట్టారు. వాళ్ళు పెద్దవాళ్ళయ్యేకొద్దీ , నాకు , నా భార్యకు దురాశ పెరిగిపోయింది. అస్తిలో నా తమ్ముడికి వాటా ఇవ్వడం మాకు ఇష్టం లేదు. అందుకని తీర్థ యాత్రల పేరుతో అతణ్ణి వేరే వూరు తీసుకెళ్ళి , అక్కడ అతనికి విషాహారం పెట్టి చంపేసాము. తిరిగి మావూరొచ్చి , తమ్ముడు విష జ్వరంతో చనిపోయాడని అందరికీ అబద్ధం చెప్పాము. అయితే నేను చేసిన పాపం నన్ను కట్టి కుడిపింది. నా ఆరోగ్యం శిధిలమై , నేను చనిపోయి , ఇలా బ్రహ్మ రాక్షసుడిగా పుట్టాను. అయితే , నా పూర్వ జన్మ సుకృతం వల్ల నాకు తరుణోపాయం గోచరించింది. చిన్నప్పుడు ఒక హరికథలో అన్నదాన మహత్యాన్ని గురించి చెబుతూ , ఒక శాస్త్రి గారు *" ఎవరికైనా బ్రహ్మ రాక్షసి పట్టినచో , వారికి త్రికరణ శుద్ధిగా ఒక రోజు చేసిన అన్నదాన పుణ్య ఫలాన్ని ధారపోస్తే , ఆ బ్రహ్మరాక్షసి విడిచిపోతుంది. అంతే కాక ఆ బ్రహ్మ రాక్షసి కి కూడా విముక్తి కలుగుతుంది"* అని అన్నారు. నా అదృష్ట వశాత్తూ నేను ఆ హరికథ విన్నాను. అది గుర్తుకు వచ్చి ఈవిధంగా ప్రవర్తించాను తల్లీ , నేటితో నీ దయ వలన నాకు విముక్తి కలిగింది , అని నమస్కరించి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన మరుక్షణమే డొక్కా వారి ఇంటికి కొద్ది దూరంలో వున్న రావి చెట్టు పెద్ద కొమ్మ ఫెళ ఫెళ మని శబ్దం చేస్తూ విరిగి పడిపోయింది. తమకు జరిగిన మేలుకు కృష్ణమరాజుగారు , పద్మావతమ్మగారు ఎంతో సంతోషించారు. ప్రతి సంవత్సరము లంకల గన్నవరానికి కుటుంబంతో సహా వచ్చి సీతమ్మగారి దర్శనం చేసుకునేవారు.
1873 శ్రీముఖ నామ సంవత్సరంలో జోగన్న గారి తమ్ముడు జగ్గన్న గారు చనిపోయారు. అప్పుడు జోగన్న గారికి 69 ఏళ్ళు. సీతమ్మగారికి 32 ఏళ్ళు.  జగ్గన్న గారి కుమారుడైన నరసయ్య గారిని సీతమ్మగారు సొంత బిడ్డల వలె చూసుకున్నారు.
డొక్కావారి భూములన్నీ మెట్ట భూములు. వర్షాలు లేక వ్యవసాయాలు పాడయ్యాయి. పంటలు పండలేదు. ఎన్నో ఎకరములు గోదావరిలో కలసిపోయినవి. ఖర్చులు ఎక్కువయ్యాయి. మార్గస్థుల రాక ఎక్కువైంది. ఆదాయం తగ్గిపోయింది. రోజులు గడవడం చాలా భారంగా , ఎంతో ప్రయాసగా తయారయింది. అయినా అన్నదానవ్రతానికి ఏమాత్రమూ భంగము రాకుండా కాపాడుకుని వస్తున్నారు జోగన్న గారు , సీతమ్మ గారు. అటువంటి రోజులలో ఒక నాడు మిట్ట మధ్యాహ్న వేళ ఒక బ్రహ్మచారి బ్రాహ్మడు సీతమ్మగారి ఇల్లు వెతుక్కొని వచ్చాడు. అతను స్నానము , జపము పూర్తిచేసుకునే వేళకు భోజనం వడ్డించారు సీతమ్మగారు. అతను ఇలా అన్నాడు *"అమ్మా , నేను వివాహం చేసుకోవాలి. సంబంధమైతే కుదిరింది గానీ , ఆ పిల్లకు నేనొక నగ చేయించి ఇస్తేనే వివాహం చేస్తారుట. నా వద్ద సొమ్ము లేదు. నేను ఈ ఒంటి బతుకుతో చాలా కష్టాలు పడుతున్నాను. వివాహం చేసుకుంటే నాకు ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి మీరు మీ మెడలో వున్న ఆ నగ ఇస్తేనే , నేను మీరు వడ్డించిన ఈ భోజనం తింటాను. లేకపోతే తినను". ఇది విన్న జోగన్నగారు సీతమ్మగారిని లోపలికి పిలిచి " మనము సామాన్య సంసారులము. ఇంటికెవరైనా వస్తే భోజనం మాత్రం పెట్టగల స్థోమత మనది , అంతేగానీ , కంటెలూ , కాసుల పేర్లూ ఎక్కడ ఈయగలము ? అయినా నీకు మిగిలినది అది ఒక్కటే నగ. దానిని ఇవ్వద్దు" అని చెప్పారు. విన్న సీతమ్మగారు జోగన్నగారి పాదాలపై పడి "  మీకు ఎదురుచెప్పడం నాకిష్టంలేదు. కానీ , అతిథి విష్ణుమూర్తితో సమానం. అతనికి భోజనం పెట్టి , తృప్తిగా పంపుదాము. అతని సంసారం నిలబడుతుంది. ఈ నగ వల్ల నాకేమి ప్రయోజనం ? ఇది అతనికి ఉపయోగపడుతుంది , నామాట వినండి"* అని ఆయన్ని ఒప్పించి అతనికి నగ ఇచ్చి , భోజనము పెట్టి పంపించారు. తీరా చూస్తే ఆ నగ పీట కిందే వదిలి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మడు. అతనికోసం వూరంతా గాలింఛినా కనపడలేదు. దిగులుతో ఆరాత్రి సీతమ్మగారికి నిద్ర పట్టలేదు. ఎప్పటికో చిన్న కునుకు పట్టింది. అప్పుడు కలలో శ్రీమహా విష్ణువు కనిపించి ఆనాడు తానే అతిథిగా వచ్చానని చెప్పి , ఆమె చిత్త శుద్ధికి , త్యాగనిరతికి తాను సంతోషించాననీ , ఆమె కీర్తి కలకాలం నిలుస్తుందనీ చెప్పారట. సీతమ్మగారికి మెలకువ వచ్చి జోగన్న గారికి ఈవిషయాన్ని చెప్పారట. వారి సంతోషమునకు అంతులేదు. మరికొన్ని రోజులలో ఇంట్లోని ధనమంతా ఖర్చు అయిపోయింది. మరుసటి రోజు వచ్చే అతిథులకు భోజన వసతులు ఎలా చెయ్యాలో పాలుపోక జోగన్న గారు పొలంలో తచ్చాడుతున్నారు. పొలంలో రైతులు పొలం పని చేస్తూ , మట్టి బెల్లు విరిపిస్తున్నారు. ఇంతలో *"ఖణేల్"* మన్న శబ్దం జోగన్నగారికి మాత్రము వినిపించినది. ఆయన అంతటితో పని ఆపించి అందరినీ పంపేసారు. తనకు నమ్మకస్థుడైన ఒక పాలేరు సాయంతో అక్కడ తవ్వగా , ఒక కంచు మద్దెల బయట పడింది. దానిని ఇంటికి తెచ్చి పగులగొట్టి చూడగా , దానిలో బంగారపు మొహరీలు దొరికాయి. ఇదంతా దైవానుగ్రహంగా భావించి , తమ అన్నదాన వ్రతమునకు భంగము కలుగకుండా విష్ణుమూర్తి చేసిన ఏర్పాటుగా భావించారు. తిరిగి నిర్విఘ్నముగా ఎన్నో ఏళ్ళు అన్నదాన వ్రతం జరిపారు.
1881 (వృష నామ సంవత్సరం) సెప్టెంబరు మాసంలో జోగన్న గారు చనిపోయారు. చనిపోయేముందు పెద్ద పిల్లవడైన సుబ్బారాయుణ్ణి పిలిచి *"తల్లి చేసే అన్నదాన కార్యక్రమానికి ఎప్పుడూ భంగం రానీయకు. తల్లి మాటకు ఎదురుచెప్పకు"* అని చెప్పి , ప్రమాణం చేయించుకుని కన్నుమూసారు. సీతమ్మగారు ఎంతో దుఃఖించారు. అయినా గుండె రాయి చేసుకుని , అన్నదాన వ్రతానికి భంగం వాటిల్లకుండా రోజులు గడిపారు.

*పోడూరు రాజుగారికి సహాయము:*

ఒకసారి పోడూరు రాజుగారి పశువులకు గాళ్ళ వ్యాధి వచ్చింది. అందుచేత వాళ్ళ వ్యవసాయ పనులు ఆగిపోయాయి. అప్పుడు వారు సీతమ్మగారిని సహాయం కోరగా , తమ పశువులను పంపారు. రాజు గారి పశువులు లంకల గన్నవరానికి వచ్చాయి. సీతమ్మగారు వాటిని హాయిగా కొన్నాళ్ళు పోషించారు. వాటి వ్యాధి పూర్తిగా తగ్గిన పిమ్మట వాటిని పోడూరు పంపించారు. రాజుగారి వ్యవసాయానికి డొక్కా వారి పశువులు ఎంతగానో సహాయపడ్డాయి. రాజుగారు ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసారు. ఒక ఏడాది లంకల గన్నవరంలో కరువు పరిస్తితులు ఏర్పడి పంటలు పండలేదు. అన్నదానానికి భంగం కలుగకూడదనే ఉద్దేశ్యంతో సీతమ్మగారు తన తమ్ముడు అనప్పిండి సుబ్బారాయుడు గారిని , గన్నవరపు లింగమూర్తిగారిని పోడూరు రాజు గారివద్ద వంద బస్తాల ధాన్యము బదులు తెమ్మని , పంట వచ్చిన వెంటనే తిరిగి ఇచ్చేస్తామని చెప్పి పంపారు. రాజు గారు *"సీతమ్మగారు తమకు చేసిన సహాయానికి తాము ఎంతో ఋణపడి వున్నాము"* అని చెప్పి , వీరిద్దరినీ అమితంగా ఆదరించి , సత్కరించి , వారికి ఎంతో కాలము విందు చేసారు కానీ ధాన్యం మాట మట్లాడలేదు. ఒకనాడు వీరిద్దరూ తిరిగి లంకల గన్నవరం చేరుకుని ఆ మాట సీతమ్మగారితో చెప్పారు. సీతమ్మ గారు నవ్వి , *"మీరు వెళ్ళిన రోజునే రాజుగారు నూరు బస్తాల ధాన్యమూ పంపారు. తిరిగి ఇవ్వ వద్దు అని చెప్పి మరీ పంపారు"* అన్నారు. రాజుగారి గొప్ప మనసుకు వారిద్దరూ ఆశ్చర్యపోయారు. రాజుగారు వద్దని చెప్పిననూ , పంటలు పండిన వెంటనే రాజుగారి వంద బస్తాల ధాన్యమూ వారికి పంపిచి , కృతజ్ఞతలు తెలియచేసారు సీతమ్మగారు. డొక్కా వారి వంశము ఎన్నడూ ఎవరివద్దనుండీ ఏమీ ఆశించలేదు. ప్రతిఫలమును కోరలేదు.

*మశూచి వ్యాధి నయమగుట:*

నెల్లూరు జిల్లా కుల్లూరు గ్రామస్థులు కొందరు ముత్యాలు , పగడాల వ్యాపార నిమిత్తమై లంకల గన్నవరము వచ్చేవారు. ఒక ఏడు లంకల గన్నవరములో అంటువ్యాధులు చాలా ఎక్కువయ్యాయి. వాటికి భయపడి ఊరిలోని చాలా మంది తాత్కాలికంగా ఊరు విడిచి వెళ్ళిపోయారు. ఈ నెల్లూరు వ్యాపారులలో లక్కాకుల గోపాలము , ఇరుకుమాటి కృష్ణమూర్తి వడ్డీ వ్యాపారము కూడా చేస్తూ , ఏడాదికి ఆరు నెలలు లంకల గన్నవరంలోనే ఉండేవారు. వారికి మశూచికము సోకింది. వారి దగ్గరికి వెళ్ళడానికే అందరూ భయపడి వారిని వారి ప్రారబ్ధానికి విడిచిపెట్టేసారు. వారు ఆ వ్యాధితో ఎంతో బాధపడ్డారు. దగ్గరకు వచ్చి కాస్త సాయం చేసే నాథుడే లేడు. అప్పుడు సీతమ్మగారు ఈ విషయం తెలుసుకుని , తమ ఇంటికి దగ్గరగా వున్న ఒక ఖాళీ ఇంటిలో వారిని చేర్పించి , వారికి వైద్య సదుపాయాలు కల్పించి , వారి బాగోగులు చూస్తూ , ఎంతో సహాయం చేసారు.  వారు త్వరలో పూర్తిగా కోలుకున్నారు. వారు నెల్లూరుకు వెళ్ళి కొద్ది నెలలలో ఎన్నో ముత్యాలు , పగడాలు , ఇతర కానుకలు తెచ్చి సీతమ్మగారికి ఇచ్చారు. సీతమ్మగారు *" నాయనా , నేను ప్రతిఫలం కోరి ఏపనీ చేయను. మీకు ఆయుర్దాయం వుండి మీరు బతికారు. ఇందులో నేను చేసినది ఏమీ లేదు"*
అని వారి బహుమతులను పుచ్చుకొనలేదు. వారు ఎంతగానో అర్థించినను సీతమ్మగారు ప్రతిఫలము తీసుకొనుటకు అంగీకరించలేదు. అప్పుడు ఆవ్యాపారులు సీతమ్మగారి కుమారుడు సుబ్బారాయుడు గారిని తమ వూరు తీసుకుని వెళ్ళి ఊరేగింపు చేసి , ఎన్నో రీతుల వారిని ఆదరించి పంపారు. 
అమరపురితో సమానమైన పేరూరు గ్రామంలో ఒకసారి తీవ్రమైన నీటి ఎద్దడి వచ్చింది. బావులలో నీరు తాగడానికి అనువుగాలేదు. అప్పుడు ఆగ్రామస్థులు సీతమ్మగారి వద్దకు వెళ్ళి ఈ విషయం చెప్పగా , ఆవిడ 50 రూపాయలిచ్చారు. ఆ డబ్బుతో నుయ్యి తవ్వగా , ఆ నూతిలో ఎంతో తియ్యటి నీళ్ళు వచ్చాయి. (నా చిన్నప్పుడు , ఒక వేసంగుల్లో మా లంకలగన్నవరంలో సీతమ్మగారి బావి లోంచి తోడిన నీళ్ళు నేను తాగాను. అవి కొబ్బరి బొండం నీళ్ళలాగ ఎంతో తియ్యగా వున్నాయి. పక్కన వున్న నూతులలో నీరు మామూలుగా చప్పగా వుంది. ఇది నాకు స్వీయ అనుభవం) . సీతమ్మగారి ఇంట భోజన ప్రసాదము తిన్నచో ఎంతో మేలుకలుగునని భావించి , లెఖ్ఖలేనంత మంది వచ్చి తృప్తిగా సీతమ్మగారి ఇంట భోజనం చేసేవారు. ఒక బ్రిటిష్ కలెక్టరుకు పిల్లలు లేరు. అతను సీతమ్మగారి అన్నదాన వ్రతము గురించి తెలుసుకుని , వారి ఇంటికి వచ్చి భోజనము చేసాడు. కొన్నాళ్ళకు అతనికి కొడుకు పుట్టాడు. అతను తన కుటుంబ సమేతంగా వచ్చి సీతమ్మగారికి నమస్కరించి కృతజ్ఞత తెలియ చేసాడు. ఈ కలెక్టరు ఒక సారి పిఠాపురం జమీందారు శ్రీ రాజారావు మహీపతి గంగాధర రామారావు బహద్దర్ గారి ఇంటిలో విందుకు హాజరయ్యాడు. అప్పుడు ఆయన జమీందారు గారితో సీతమ్మగారి గురించి చెప్పగా , రాజా గారు ఆశ్చర్యపడి , తనకు తెలియదని , త్వరలో సీతమ్మగారి దర్శనం చేసుకొంటామని చెప్పారు. ఎన్నో సత్రాలను కట్టించి , ఎంతో ధనం ఖర్చుపెడుతున్న మహారాజులకు అలభ్యమైన కీర్తి ఈ సామాన్య స్త్రీకి ఎలా వచ్చిందా అని రాజావారు ఆశ్చర్యపోయారు. త్వరలో రాజా వారు మారు వేషములో తన దివానుగారితో సహా లంకల గన్నవరము వచ్చి , సీతమ్మగారి వీధి అరుగు మీద పడుకున్నారు. జాతి , మత , కుల , ప్రాంత , దేశ భేదాలు లేకుండా , ఎంతో అణకువతో , ప్రేమతో సీతమ్మగారు స్వయంగా చేస్తున్న అన్నదానాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు , ముగ్ధులైపోయారు. పాలు కావలిసిన పిల్లలకు ఆవు పాలు , మజ్జిగ కావలిన పెద్దలకు మజ్జిగ తేట , భోజనములవారికి భోజనములు , ఫలహారములవారికి ఫలహారములు , పథ్యముల వారికి పథ్యం భోజనములు , ఇలా ఎవరికి కావలిసినవి వారికి , అన్ని వేళలా సీతమ్మగారు సమకూరుస్తున్నారు. రాత్రి పొద్దుపోయింది. సీతమ్మగారు ఒక హరికేను లాంతరు తీసుకుని అరుగుమీదకు వచ్చి , అక్కడ విశ్రాంతి తీసుకొంటున్న వారందరినీ *"నాయనా , నువ్వు భోజనం చేసావా ? తల్లీ , నువ్వు ఫలహారం తిన్నావామ్మా?"* అని అందరినీ అడుగుతున్నారు. మారు వేషములోనున్న రాజా గారిని అడిగారు. ఆయన మొహమాట పడడం గ్రహించి , *"అయ్యో , మీరు భోజనము చేయలేదా. రండి , కాస్త భోజనం చేసి , అప్పుడు విశ్రాంతి తీసుకుందురు గాని" అని  దివానుగారిని కూడా అడగ్గా , ఆయన సీతమ్మగారిని పరీక్షించదలచి" అమ్మా , నాకు జ్వరము గా ఉంది , ఆకలి లేదు , నోటికేమీ సయించట్లేదు"* అని చెప్పారు. అప్పుడు సీతమ్మగారు *"అలా అయితే మీకు పథ్యం పెడతాను , రండి బాబూ"* అని వారిద్దరినీ లోపలికి తీసుకువెళ్ళి మహారాజుగారికి అన్నీ వడ్డించి , దివాను గారికి చింతకాయ పఛ్ఛడి , నిమ్మకాయ ఊరగాయ వడ్డించి అవి తినేలోపు , బీరకాయ నేతిపోపు కూర తెచ్చి వడ్డించారు. మహరాజు గారికి పెరుగు , దివాను గారికి పథ్యము కనుక పాలు పోసారు. వారిద్దరికీ కొసరి కొసరి తినిపించారు. భోజనాలయ్యాక *"నాయనా , బయట గాలి ఎక్కువగా ఉంది. మీకు పడదు. మీకు సావడిలో పక్కలు వేయిస్తాను , అక్కడే విశ్రాంతి తీసుకోండి"* అని చెప్పి , వారికన్ని ఏర్పాట్లు చేసారు. తెల్లవారు ఝామున రాజుగారు , దివాను గారు లేచి గోదావరి కెళ్ళి స్నానం చేసి వచ్చే సరికి అప్పటికే సీతమ్మగారు వంట ప్రయత్నాలలో వున్నారు. చద్దెన్నం తినేవారికి హయిగా తరవాణికుండలోని అన్నము , ఊరగాయ వడ్డిస్తూ వారి కడుపు నింపుతున్నారు. ఇది చూసిన రాజుగారు *"ఇక్కడ జరిగినట్లుగా ఇంకెక్కడా జరుగదు. ఏ మహారాజు ఎంత ధనం వెచ్చించినా కూడా ఇంత శ్రద్ధగా , ప్రేమగా అన్నదాన వ్రతము ఆచరించడం అసాధ్యం. ఈవిడ సాక్షాత్తూ కాశీ అన్నపూర్ణే "* అని నిశ్చయించుకుని , దివాను గారితో సహా సీతమ్మగారి పాదములపై పడి , తమ తప్పు క్షమింపమనీ , తాము మరువేషములో వున్న మహారాజులమనీ చెప్పారు.  సీతమ్మగారు తలుపు చాటుకు వెళ్ళి *"అయ్యో , నాయనా నాకు తెలియలేదు. మీకు తగిన సదుపాయాలు ఏర్పాటు చెయ్యలేకపోయాను , ఏమీ అనుకోవద్దు"* అని బాధపడ్డారు. అప్పుడు గంగాధర రామారావు రాజు గారు తమకు ఏవిధమైన లోటూ జరగలేదని చెప్పి , *"మీ అదరణ , వితరణ మాకు ఎంతో సంతోషం కలిగించాయి. మీకు ఒక గ్రామాన్ని రాసి ఇస్తాము , మీరు మీ అన్నదానాన్ని కొనసాగించండి"* అని చెప్పారు. అప్పుడు సీతమ్మగారు *"మీ దయకు చాలా కృతజ్ఞతలు. కానీ , ఇతరుల సహాయంతో అన్నదానం చేస్తే , అది అన్నాన్ని అమ్ముకోవడంతో సమానమౌతుంది. దానివల్ల దుర్గతులు ప్రాప్తిస్తాయి నాయనా. అందుచేత నేను ఈ దానాన్ని స్వీకరించలేను , క్షమించండి"* అని సున్నితంగా తిరస్కరించారు. చేసేది లేక రాజుగారు సీతమ్మగారికి  కృతజ్ఞతలు తెలిపి దివానుగారితో సహా తమ సంస్థానానికి వెళ్ళిపోయారు.

*బ్రిటిష్ చక్రవర్తి ఏడవ ఎడ్వర్డు గారి పట్టాభిషేకమునకు ఆహ్వానము:*

సీతమ్మగారి చరిత్ర , ఖ్యాతి ఇంగ్లాండువరకు వ్యాపించింది. అప్పడు భారత దేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ చక్రవర్తి ఏడవ ఎడ్వర్డు గారు సీతమ్మగారి ప్రఖ్యాతి విని , ఏటా ఢిల్లీ లో జరుగు తన పట్టాభిషేకోత్సవమునకు ఆహ్వానము పంపారు. 1902 డిశెంబరులో సీతమ్మగారికి పట్టాభిషేక ఆహ్వానం వచ్చింది. అప్పటికి సీతమ్మగారికి 61 ఏళ్ళు. ఆవిడ తను పొగడ్తల కొరకో , పేరు కొరకో అన్నదానము చేయుటలేదని విన్నవించి , పట్టాభిషేకమునకు వెళ్ళలేదు. అప్పుడు చక్రవర్తి తన రాజ ప్రతినిథిని డొక్కా సీతమ్మగారి ఫొటో తీయించి పంపవలసిందిగా ఆదేశించారు. ఆమె దానికి కుడా ఒప్పుకోలేదు. చివరికి మెజిస్ట్రేటు వచ్చి , ఫొటో పంపనిచో తన ఉద్యోగం పోతుందని బతిమాలడంతో , ఇక తప్పదని గ్రహించి , సీతమ్మగారు ఫొటో ఇవ్వడానికి ఒప్పుకున్నారు. *"నాకు లేని పోని ఘనతలు కల్పించి నన్ను బాధించవద్దు , క్షమింపుము"* అని ఆవిడ కలెక్టరును , మెజిస్ట్రేటును వేడుకుని , వారిని సత్కరించి పంపేసారు. ఫొటో చక్రవర్తిగారికి చేరింది. దానిని పెద్ద పటము కట్టించి , 1903 జనవరి ఒకటవ తేడీన ఢిల్లీ లో జరిగిన తన పట్టాభిషేకమహోత్సవంలో తమ సింహాసనానికి ఎదురుగా ఆ ఫొటోను ముఖ్య అతిథుల వరుసలో వేరొక సింహాసనం పై ఉంచి గౌరవించారు. సీతమ్మగారి త్యాగాన్ని గూర్చి ఒక యోగ్యతా పత్రాన్ని గవర్నర్ జనరల్ ద్వారా పంపారు. శివకోడు తహసీల్దారు గారు వి.పి.పద్మనాభరాజు గారు మార్చ్ 15, 1903 నాడు ఆ యోగ్యతాపత్రాన్ని సీతమ్మగారికి అందజేసారు. సీతమ్మగారు ఆయనతో *"నాయనా , మానవసేవే మాధవ సేవ అని నమ్మి నేను నా విధి నిర్వహిస్తున్నాను. నాకెందుకీ యోగ్యతా పత్రాలు ? దేవుడి దయవల్ల నా అన్నదానానికి ఇంతవరకూ ఎటువంటి లోటూ జరగలేదు"* అన్నారు. ఆ తహసీల్దారుగారు సీతమ్మగారికి సాష్టాంగ ప్రణామం చేసి , నచ్చ చెప్పి , తన విధి తాను చేస్తున్నాను అని ఒప్పించి , ఆ యోగ్యతా పత్రం అందినట్లు రసీదు తీసుకుని వెళ్ళిపోయారు.  ఇలా ప్రతి సంవత్సరం డొక్కా సీతమ్మగారికి బ్రిటిష్ చక్రవర్తిగారి పట్టాభిషేక ఆహ్వానాలు అందుతూనే వున్నాయి. ఇది భారతదేశంలో మరెవ్వరికీ దక్కని అరుదైన గౌరవం.
1908 లో సీతమ్మగారికి 68 ఏళ్ళ వయసులో చేతిమీద కేన్సర్ వచ్చినది. పెద్ద వైద్యం చేయించాలని సుబ్బారాయుడుగారు ప్రయత్నించారు. కానీ సీతమ్మ గారు ఒప్పుకోలేదు. *"ప్రారభ్దాన్ని అనుభవించి తీరాలి కానీ , తప్పించుకోకూడదు. కర్మ ఫలితం వల్లనే సుఖ దుఃఖాలు , లాభ నష్టాలు కలుగుతాయి. *ప్రారబ్ధం భోగతో నశ్యేత్ - పారబ్ధమనేది అనుభవించడం వల్లే తీరుతుంది"* అని చెప్పి వైద్యం చేయించుకోవడానికి అంగీకరించలేదు. సుబ్బారాయుడు గారితో *"నాయనా , నేను వెళ్ళిపోతున్నాను. మీకెన్ని కష్టాలు వచ్చినా అన్నదానం మానద్దు. అన్నం పెట్టేప్పుడు కులం , మతం , ప్రాంతం , జాతి - ఏమీ చూడద్దు. వాటిని మనం పాటించకూడదు. అన్నదానాన్ని మించినది మరొకటి లేదు. నువ్వు అన్నదానం నిర్విఘ్నంగా చేస్తానని నా చేతిలో చెయ్యేసి మాటియ్యి. అప్పుడు నేను నిశ్చింతగా వెళ్ళిపోతాను"* అని ఒట్టు వేయించుకున్నారు సీతమ్మగారు. ఏప్రిల్ 28 , 1909 వైశాఖ శుద్ధ నవమీ బుధవారం నాడు, మధ్యాహ్నం 12 గంటలకు సీతమ్మగారు లంకల గన్నవరంలో తమ ఇంట్లో కుటుంబాన్ని , ఆశ్రితులనీ , గ్రామస్థులనీ అందరినీ విడిచి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అదే సమయంలో దగ్గరలోని ఇందుపల్లి గ్రామం లో శ్రీ మంథా నరసింహ మూర్తి గారి ఇంటి దగ్గర శ్రీ కాలనాథభట్ల వెంకయ్య గారు "పఠాను" ఏకపాత్రాభినయం చేస్తున్నారు. మహా పండితులు శ్రీ.వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు ఆ ఏకపాత్రాభినయాన్ని చూసి ఆనందిస్తున్నారు.  ఇంతలో ఆకాశంలో ఒక గొప్ప తేజస్సు పడమర నించి తూర్పుకి ఒక గుండ్రని బంతిలా అమితమైన వేగంతో వెళ్ళడం చూసి *" ఎవరో గొప్ప వ్యక్తి మరణించారు"* అన్నారు శాస్త్రి గారు. కొద్దిసేపటికే డొక్కా సీతమ్మగారు చనిపోయారనే వార్త దావానలంలా వ్యాపించింది.
తల్లికి ఇచ్చిన మాట ప్రకారము సుబ్బారాయుడుగారు అన్నదానవ్రతాన్ని కొనసాగించారు. పట్టాభిషేక ఆహ్వానాలు వస్తూనే వుండేవి. ఎన్నో భూములు హరిజన వాడలకు ఇచ్చేసారు. ఆస్తులు కరిగిపోయినా , భూములు , వ్యవసాయము లేకపోయినా అన్నదానము కొనసాగించారు.
సుబ్బారాయుడు (భార్య సుబ్బమ్మ గారు) గారి కుమారులు 1.రామ జోగన్న గారు 
2.సూరన్న గారు 3.రామభద్రుడు గారు
1917 సెప్టెంబరు లో (పింగళ నామ సంవత్సరం భాద్రపద శుద్ధ త్రయోదశి నాడు) సుబ్బారాయుడు గారు చనిపోయారు. కాలక్రమేణా ఆస్తులు కరిగిపోయి , భూములు లేక , వ్యవసాయము లేక పోయినా , తమ శక్తి కొలది సీతమ్మగారి మనుమలు , మునిమనుమలు , డొక్కా వంశస్థులు అందరూ తమకు తోచిన రీతిలో అతిథులనూ , అభ్యాగతులనూ ఆదరించారు , ఆదరిస్తున్నారు.
ఈ నా రచనకి శ్రీ మిర్తిపాటి సీతారామ చయనులు గారు అరవై సంవత్సరాల క్రిందట వ్రాసిన *"శ్రీ నిరతాన్నదాత్రి డొక్కా డొక్కా సీతమ్మగారి జీవిత చరిత్ర"* అనే పుస్తకం ఎంతో ఉపయోగపడింది. వారికి , వారి వంశస్థులకూ సదా కృతజ్ఞుణ్ణి.
కాశీలో గర్భగుడిలో సీతమ్మగారి ఫొటో కొన్నాళ్ళు వుండేదని పెద్దలు చెప్పగా విన్నాను. అలాగే మా స్నేహితుని తల్లిదండ్రులు కొన్నేళ్ళక్రితం కాశీలోని చింతామణి గణపతి ఆలయంలో హోమం , యజ్ఞం చేయించారు. అప్పుడు అక్కడి శిలాఫలకంపై *"చింతామణి గణపతి ఆలయానికి లంకల గన్నవరం డొక్కా వంశస్థులు మాన్యపు భూములను ఇచ్చారు"* అని వున్నదట. ఆయన (మా అట్లాంటా లోనే వున్న) వాళ్ళ అబ్బాయికి చెప్పగా , అతను నాకు చెప్పిన విషయం ఇది.
రెండు దశాబ్దాల క్రితం వరకు తెలుగు వాచకంలో డొక్కా సీతమ్మగారిపై పాఠం వుండేది. ఇప్పుడు లేదు.  సీతమ్మగారి సేవలను గుర్తించి , కొన్నేళ్ళ క్రితం , గన్నవరం అక్విడెట్టు వద్ద , సీతమ్మగారి శిలా విగ్రహం ఏర్పాటు చేసిన ప్రభుత్వానికీ , రాజకీయనాయకులకు , సహృదయిలైన ప్రజలకు అందరకూ కృతజ్ఞతలు.   నేటికీ సీతమ్మగారిని తమ గుండెలలో నిలుపుకుని , ఆమె చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకుని , ఆమె జీవితాన్ని కథలుగా , నాటకాలుగా , పద్య రూపకాలుగా అందరికీ అందిస్తున్న కవి పండితులకూ , ప్రతినిత్యమూ సీతమ్మగారిని స్మరించుకుంటూ , సాటి మనుషులకు సహాయపడుతున్న తెలుగువారందరికీ శిరసా ప్రణామం చేస్తున్నాను.

*నా పరిచయం:*

నేను డొక్కా సీతమ్మగారి మనవడికి మనవడిని. డొక్కా సీతమ్మగారి మనుమడు (సుబ్బారాయుడి గారి కొడుకు) శ్రీ.డొక్కా రామభద్రుడు గారు మా తాతగారు. మా నాన్నగారి పేరు శ్రీ.డొక్కా సూర్యనారాయణ గారు. అమ్మపేరు  శ్రీమతి.గంటి బాలా త్రిపుర సుందరి. నా పేరు డొక్కా శ్రీనివాస ఫణి కుమార్ (డొక్కా ఫణి). నేను గత రెండు దశాబ్దాలుగా అమెరికాలోని అట్లాంటాలో వుంటున్నాను. మా అన్న పేరు శ్రీ.డొక్కా రామభద్ర. తమ్ముడి పేరు డొక్కా వంశీ కృష్ణ.
(ఈ వ్యాసం మా లంకల గన్నవరం లో కొలువైన మా దైవం శ్రీ.రాజగోపాలస్వామికి అంకితం. )

Sunday, May 15, 2022

అపర భగీరధుడు సర్ ఆర్థర్ కాటన్ దొర జయంతి

అపర భగీరధుడు సర్ ఆర్థర్ కాటన్ దొర జయంతి సందర్భంగా





నీటివనరులె జాతి సిరులని
జనుల కొఱకే మనిన
కారణజన్ముడవు నీవు
ఇది నీవు పెట్టిన దీపమే

నిత్యగోదావరీ స్నాన
పుణ్య దోయా మహామతిః
స్మరామ్యాంగ్లదేశీయం
కాటనుం, తం భగీరథం...

#అతివృష్టి, అనావృష్టితో అతలాకుతలమవుతున్న గోదావరి ప్రాంతాన్ని #ధాన్యాగారంగా మార్చాడు.. లక్షలాది ఎకరాలకు సాగునీరు.. వందలాది గ్రామాలకు తాగునీరు అందించి గోదావరి వాసుల మదిలో అజరామరంగా నిలిచిపోయాడు.. ఆయన చేతికర్రతో గీసిన గీతలు డెల్టా కాలువలయ్యాయి.. కరువు కోరల్లో చిక్కుకున్న ప్రాంతాలు పచ్చటి తివాచీలుగా మారాయి.. ధవళేశ్వరం ఆనకట్టతో గోదావరిజిల్లాలకు పునరుజ్జీవనం ప్రసాదించి ఆరాధ్య దైవంగా మారాడు..#అపర భగీరథుడిగా చరితలో నిలిచాడు సర్‌ ఆర్థర్‌ కాటన్‌.
   
‘#కాటన్ దొర’ అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ (మే 15, 1803 - జూలై 24, 1899) బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ 18 ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చి మొదటిసారిగా మద్రాస్‌లో ఉద్యోగంలో చేరారు. అప్పటి బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీ ఈయనను దక్షిణ ప్రాంత చెరువుల శాఖకు ఇంజనీర్‌గా నియమించింది. ఆయన నిరంతరం ప్రజల సంక్షేమం, సేవ కోసమే పరితపించేవారు.

18వ శతాబ్దంలో పవిత్ర జీవనదికి ఇరువైపుల ఉన్న ఉభయగోదావరి జిల్లాలు అతివృష్టి , వరద ముంపు, అనావృష్టి , కరువుకాటకాలతో విలవిలలాడాయి. 1833లో అనావృష్టి వల్ల కలిగిన కరువుతో రెడు లక్షల ప్రజలు తుడిచుపెట్టుకు పోయారు. అలాగే 1839లో ఉప్పెన, కరువు మరింతమందిని పొట్టనపెట్టుకొంది. దీంతో గోదావరి నది నీటికి అడ్డుకట్ట కట్ట వేయాలని కాటన్ అనుకున్నారు. తన ఆలోచనలను నిజం చేస్తూ జలాశయం నిర్మించారు.

#సముద్ర మట్టానికి 1600 అడుగుల ఎత్తున నిర్మించాలని ప్రతిపాదించిన జలాశయాన్ని, కొన్ని నదుల అనుసంధానాన్ని బ్రిటీష్‌ ప్రభుత్వం అనుమతించలేదు. దాన్ని ప్రభుత్వం వ్యతిరేకించడానికి కారణం.. వాటివలన కలిగే ఇబ్బందులు కాదు. పెట్టుబడి ఎంత?.. వచ్చే రాబడి, కట్టాల్సిన వడ్డీ ఎంత?.. అంటూ లెక్కలు వేయటం. బ్రిటీష్ ప్రభుత్వ వాదనను కాటన్‌ వ్యతిరేకించారు. పాలితుల సుఖాలు, ప్రాణాలు కరువుతో ముడిపడి ఉన్నాయని, పాలకులు ధర్మంగా, బాధ్యతగా కరువు నివారణ పనులు చేపట్టాలని పోరాటం జరిపారు.

#ఫలితంగా గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట రూపొందింది. 1847 - 52 మధ్య కాలంలో గోదావరిపై తూర్పగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తిచేశారు. దీంతో క్షామపీడితమైన గోదావరి డెల్టా సస్యశ్యామలమై కలకలలాడింది. తగ్గిపోతున్న జనసంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందికి వచ్చింది. ఈ మహత్కర్యాన్ని ఆయన కేవలం అయిదేళ్లలో పూర్తి చేయడం గమనార్హం. కాటన్ దొర గోదావరిపై నిర్మించిన ఆనకట్ట, ఉభయగోదావరి జిల్లాలలోని రైతుల ఆర్థిక, జీవనగతులను మార్చేసింది. తమపాలిట దుఖఃదాయినిగా ఉన్న గోదావరిని, ప్రాణహితగా మార్చిన భగీరథుడుగా కాటన్ దొర ఈ రెండు జిల్లాల ప్రజలగుండెల్లో నిలచిపోయాడు.

  #పండితుల సంకల్పం:

ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానంతరము, పండితులు గోదావరిలో స్నానమాచరించి, ఇలా సంకల్పం చెప్పుకునేవారు.

నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః
స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం
(మాకు గోదావరి నదీ స్నాన పుణ్యాన్ని కలిగించిన అపర భగీరథుడు, ఆంగ్ల దేశీయుడైన కాటన్ దొరగారిని ప్రతినిత్యం స్మరించి తరిస్తున్నాము. అని ఈ శ్లోకానికి తాత్పర్యం)

#కాటన్  విగ్రహాలు:

#ఉభయ గోదావరి జిల్లాలలోని చాలా గ్రామాల్లో ఇతరదేశ నాయకుల విగ్రహాలున్నా, లేకపోయినా తప్పనిసరిగా కన్పించే విగ్రహం గుర్రం మీద స్వారీచేస్తున్న #కాటన్ దొర. బ్రిటీషు వారు మనదేశాన్ని వదిలిపెట్టి పోయినా.. ధవళేశ్వరం బ్యారేజి నిర్మించి 150 ఏళ్లు గడిచినా గోదావరి జిల్లాల ప్రజల గుండెల్లో కాటన్ దొర ఇంకా #చిరంజీవిగా ఉన్నారంటే ఆ కృషి ఎలాంటిదో అర్థమవుతోంది.

#దేవుడితో సమానంగా కొలుస్తారు...

సర్ ఆర్థర్ కాటన్‌ని గోదావరి వాసులు ఎంతగా అభిమానిస్తారన్నదానికి 2009లో భారత పర్యటనకు వచ్చిన ఆయన #మునిమనవడి పట్ల ఇక్కడివారు చూపిన ఆదరణ నిదర్శనంగా నిలిచింది.

రాబర్ట్ సి కాటన్ రాక సందర్భంగా రాజమహేంద్రవరంలో భారీ సభ కూడా నిర్వహించి ఆయనకు సన్మానం ఏర్పాటు చేయడం ద్వారా కాటన్ మీద ఉన్న తమ అభిమానాన్ని ఆయన కుటుంబ సభ్యుడిగా వారసుడి మీద చాటుకున్నారు.

‘‘మా ప్రాంతం ఇంత #పచ్చదనంతో ఉండడానికి ఆయనే కారణం. అందుకే ఆయన్ను మా కడుపు నింపిన #మహానీయుడిగా కొలుస్తాం. దేవుడితో సమానంగా భావిస్తాం. మా ఇళ్లలో దేవుడి ఫోటోలతో సమానంగా కాటన్ ఫోటో ఉంటుంది. ఊరూరా విగ్రహాలు ఉంటాయి. ఏటా ఆయన జయంతి, వర్థంతి జరుపుతాం. నిత్యం ఆయన్ని తలచుకున్న తర్వాత ఏ కార్యక్రమం అయినా చేపడతాం. మా తాతముత్తాతల నుంచి ఇది వారసత్వంగా వస్తోంది. గోదావరి నీటికి అడ్డుకట్ట వేసి, పంటలు పండించుకునే అవకాశం కల్పించినందుకు ఆయన రుణపడి ఉంటాం’’ అని అక్కడి ప్రజలు అంటారు."

#కడియం నర్సరీలకు #అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందంటే ఆయనే కారణం..

కాటన్ బ్యారేజ్ దిగువన కడియం సమీపంలో విస్తరించిన వేల ఎకరాల నర్సరీలు అంతర్జాతీయ కీర్తిని గడించాయి. ప్రపంచమంతటికీ మొక్కలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాయి.
1910 ప్రాంతంలో కడియంలో మొక్కల పెంపకం మొదలుకావడం ఆ తర్వాత అది వేగంగా విస్తరించడంతో ప్రస్తుతం సమీపంలోని మూడు నాలుగు మండలాల్లో నర్సరీ రంగం ప్రధానంగా మారింది.
అప్పట్లో పంటలు పండించడానికే నీరు లేక వర్షాధారంగా ఉన్న నేల ఇది. ఇప్పుడు విస్తారంగా వివిధ వెరైటీల మొక్కలు పండించే స్థాయికి చేరింది. అందుకే కడియం నర్సరీలో కీర్తిలో కాటన్‌దే ముఖ్యపాత్ర,

#తొలి తెలుగు ఇంజినీర్, #కాటన్‌కు చేదోడు వాదోడుగా ఉన్న "వీణెం #వీరన్న".

గోదావరి ఆనకట్ట నిర్మాణంలో సర్‌అర్థర్ కాటన్‌కు చేదోడు వాదోడుగా ఉండి  పదివేల మంది కూలీలను సమీకరించి వారికి, పనిలో శిక్షణనిచ్చి సక్రమంగా వేతనాలిస్తూ ఆదివారం జీతంతో కూడిన సెలవునిచ్చి పనిచేయించినదెవరు అంటే వీణెం వీరన్న పేరే చెప్పాలి.
గోదావరి జిల్లాలను. 'అన్నప్రూర్ణలా మార్చే క్రతువులో కాటన్‌ దొరకు వెన్నెముకగా నిలిచిన ఇంజనీరు.

1844లో #గోదావరి పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చిన ఆర్థర్‌ కాటన్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి కాటన్‌కు సహాయకుడిగా వీరన్న కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కాటన్‌ నివాస వ్యవహారాలు, నౌకర్లు, ఆరోగ్య, ఆహార విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవడం లాంటివి వీరన్నే చూసుకున్నారు. 

#1847లో ఆనకట్ట నిర్మాణం మొదలయ్యే నాటికి వీరన్న వయసు 53 ఆనకట్ట నిర్మాణానికి పని చేయడానికి గోదావరి జిల్లాల నుంచి శ్రామికులు ముందుకు రాలేదు. ఆ పరిస్థితుల్లో వీరన్న ఒడిస్సా, బెంగాల్ రాష్ట్రాల నుంచి వందలాదిమందిని తీసుకువచ్చి మంచి వేతనంతో పని చేయించారు.
పదివేల మందితో ఐదేళ్లపాటు సాగిన నిర్మాణంలో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకుండా నిర్మాణం పూర్తి అయిందంటే అడుగడుగునా ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో తెలుస్తుంది.

#నిర్మాణం జరుగుతున్నప్పుడు మధ్యలో కాటన్ దొర అనారోగ్యం కారణంగా లండన్, ఆస్ట్రేలియాలకు వెళ్లినప్పుడు ఆనకట్ట నిర్మాణానికి ఎటువంటి అంతరాయం కలగనివ్వకుండా సమర్థవంతంగా పనిచేయించారు వీరన్న.దీనికి ప్రతిఫలంగా బ్రిటిష్ వారు ఆనకట్టకు సమీపంలో ఉన్న మెర్నిపాడు గ్రామశిస్తును (ఆ రోజుల్లో రూ.500కు పైగా) వీరన్నకు శాశ్వతంగా దఖలుపరిచింది. అంతేకాదు ఆయనకు ‘రాయబహుదూర్‌’ బిరుదునిచ్చి సత్కరించింది.
నేడు సర్ ఆర్థర్ కాటన్ జయంతి  సందర్భంగా ఆయన్ని ఒక్కసారి స్మరించుకుందాం.

Thursday, May 12, 2022

ఫ్లోరెన్స్ నైటింగేల్’ గారి జయంతి.

💊🌷లేడి విత్ ద ల్యాంప్‌”గా పిలువబడే ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’ గారి జయంతి సందర్భంగా🌷💊

   #అంతర్జాతీయ నర్సుల దినోత్సవం.#







【 #ఫ్లోరెన్స్‌ నైటింగిల్‌ నర్సు వృత్తికి స్పూర్తిదాయకంగా నిలిచినందుకు ప్రపంచ వ్యాప్తంగా మే 12న ఆమె జయంతిని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.#】

#నర్సులు నిజంగానే సేవాముర్తులు.. చికిత్స చేయండి అని చేరిన నాటి నుంచి కోలుకొని తిరిగి వెళ్ళేవరకు వెన్నంటే ఉండి సేవలు చేస్తారు. అనుక్షణం నర్స్.. సిస్టర్ అంటూ పిలిచినా విసుగు చెందకుండ వస్తారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సమయంలో కరోనాను కట్టడి చేసేందుకు అటు డాక్టర్స్‏తోపాటు నర్సులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. తమ ప్రాణాలను సైతం లేక్కచేయకుండా.. కరోనా రోగులకు దగ్గరుండి మరీ సేవలు అందించారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ.. రోగులే తమ పిల్లలుగా భావిస్తూ అహోరాత్రులు శ్రమిస్తున్న చల్లని దేవతలు. కరోనా బాధితులకు ఫ్లూయిడ్స్‌ అందించడం,ఆక్సిజన్‌ పెట్టడం వంటి అనేక సపర్యలు చేస్తున్నారు. కరోనా పోరులో సేవలు చేస్తూ.. వారిలో కొందరు ఈ మహమ్మారికి బలయ్యారు. అయిన ఏమాత్రం అధైర్య పడకుండా.. కోవిడ్ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. అటు డాక్టర్లకు, ఇటు రోగులకు అనునిత్యం అందుబాటులో ఉంటూ స్వీయ రక్షణతోపాటు… బాధితులను కూడా రక్షించేందుకు పాటుపడుతున్నారు. 

#బాల్యం ఇంతటి సేవ చేస్తూ.. ఉద్యోగంలో ఎదురయ్యే ఒత్తిళ్లను ఎదుర్కోంటూ.. వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి దూరంగా ఉంటూ ఈ కష్ట కాలంలో సేవలు అందిస్తున్న ప్రతి ఒక్క నర్సుకు మనస్పూర్తిగా ధన్యవాదలు తెలుపుతుంది ఈ సమాజం.

 నేడు మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం రోగులకు వైద్యులు ఇచ్చే ఔషధం ఎంత ముఖ్యమో నర్సులు చేసే సేవలు కూడా అంతే ముఖ్యం. చిరునవ్వుతో పలకరిస్తూ, సేవలు చేసే నర్సులను చూడగానే రోగి రోగం సగం నయమౌతుంది. 

#ధనవంతుల కుటుంబంలో జన్మించి, వివాహం చేసుకోకుండా తన జీవితాన్ని సేవకే అంకితం చేసిన మహనీయురాలు “లేడి విత్ ద ల్యాంప్‌”గా పిలువబడే ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’ 1820 మే 12న ఇటలీలో జన్మించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ బాల్యం నుండి భిన్నంగా ఆలోచించి తోటి వారికి సాయపడటంలో ఎక్కువ ఆనందం పొందేది. ఆ ఆనందమే ఆమెను నర్స్ ట్రైనింగ్‌కి పంపింది. తమ వంటి ఉన్నత కుటుంబంలోని అమ్మాయి హాయిగా వెళ్లి చేసుకుని ఆనందంగా జీవితం గడపాలని ఈ రోగుల సేవ ఏమిటని తల్లి కోపగించినా ఫ్లోరెన్స్ తన మనసు మార్చుకోలేదు. 

#కుటుంబ కట్టుబాట్లను ధిక్కరించి నర్స్‌గా సేవలు అందించటానికే జీవితం అంకితం చేసింది. తన తోటి నర్సులలో కలిసి బ్రిటిష్ సైనికులకు ఐరోపాఖండ యుద్ధంలో సహాయం అందించింది. ఏ సమయంలోనైనా ఆమె సేవకు సిద్ధంగా ఉండేది. దీపం చేతిలో పట్టుకుని గాయపడిన సైనికుల కోసం వెతికే ఫ్లోరెన్స్‌ను చూస్తే వారికి ప్రాణం లేచొచ్చేది. ఆమె చేయి పడితే తమ గాయాలు మానినట్లే అనుకునేవారు. ఆమె అసలు పేరు మరచి ‘లేడీ విత్ ద ల్యాంప్’ గా   పిలవటం మొదలు పెట్టారు.

 #ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటే రోగాలు దరిచేరవు, కోలుకునే రోగులకు పరిశుభ్ర వాతావరణం అందించాలి అనే సూత్రంతో పని చేసిన ఆమెకు సైనికుల సేవలో ఆరోగ్యం దెబ్బతిన్నది. దాదాపు 53 సంవత్సరాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ జీవితం అనారోగ్య జీవితమే. మంచం మీదనే పడుకుని ఉండాల్సిన పరిస్థితి అయినా చురుకుదనంలో లోటుండేది కాదు. ఎప్పుడూ తన వెంట ఒక నోట్‌బుక్, పెన్సిల్ పట్టుకుని తనకు కలిగిన ఆలోచనలను రాసుకునేది. తన జీవితం ఎప్పుడైనా అంతం అవుతుందనుకునేది. ఆ కొద్దిపాటి మిగిలిన జీవితంలో సమావేశాలు, ప్రసంగాలు అంటూ కాలం వృథా చేసేకంటే, ప్రజల ఆరోగ్యం మెరుగు పరచే అంశాలపై మనసు పెట్టటం మంచిది కదా అనేది. అలా అనారోగ్యంతోనే ఫ్లోరెన్స్ 90 ఏళ్ల వరకు  బతికింది. 

#మొదట్లో ఆమెను చూసి అధికారులు జ్వలించి పోయేవారు. తరువాత ఆమె నిరుపమాన సేవకు ముగ్ధులయ్యారు. వారికి రోజూ రోగులకు కావల్సిన మందులు పరికరాలు పంపమని అభ్యర్థనలు పంపేది. చాలా సార్లు తన సొంత ఖర్చులతో అన్ని తెప్పించేది ఆసుపత్రులలో చోటు సరిపోకపోతే అధికారులను ఒప్పించి పాత ఇళ్లు, భవనాలను ఆసుపత్రులుగా మార్చేది. రాత్రులలో రెండు మూడు గంటలే పడుకుని అహర్నిశలు పని చేసే సరికి ఆమె చిక్కిపోయింది. అయినా రోగులకు ఆమె ఆరాధ్యదైవం. ఆమె నడచిన దారి అతి పవిత్రం ఆమె ఎక్కడికి వెళ్లినా సైనికులు అడవి పూలతో పుష్పగుచ్ఛాలను ఇచ్చేవారట. 

#అయినా ఆమె తన సేవలను మానకుండా సేవలు చేస్తుండగా ఒకనాడు స్పృహతప్పి పడిపోయింది. సైనికులకు వచ్చిన జ్వరమే ఆమెకు వచ్చింది. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన అనంతరం, కొంచెం నయంకాగానే తిరిగి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ రోగులకు సేవలందించింది. దురలవాట్లకు బానిసలైన వారిలో మార్పు తేవటానికి ఎంతగానో కృషి చేసింది. తాగుడుకు ఖర్చుపెట్టకండి, మీ ఇళ్లకు ఆ డబ్బును పంపండి వారికి భుక్తి గడుస్తుందని చెప్పేది. అక్షరాస్యతను పెంచాలనే ఆలోచన వచ్చిందే తడవుగా గ్రంథాలయాలు, చదువుకునే గదులు అందరికి అందుబాటులో ఉండేటట్లు చేసింది” 1902 వచ్చే సరికి ఆమెకు కంటి చూపు మందగించింది చదవటం, రాయటం కష్టమైంది. 

#ఇతరులు వచ్చి ఆమెకు పుస్తకాలు చదివి వినిపించేవారు. నర్సింగ్ వృత్తిలో ఉన్నవారిని చూస్తే ఆమెకు ఉత్సాహం లేచి వచ్చేది. ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’ వివాహం చేసుకోలేదు. చివరి దశలో ఆమెకోసం నర్సులను సహాయకులుగా నియమించారు. వారు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటుంటే ఫ్లోరెన్స్ నెమ్మదిగా లేచి వెళ్లి రోగుల పక్కలు సర్ది గది శుభ్రం చేస్తుండేది. ఎంత వారించినా వినకుండా తన జీవితం చివరి క్షణం వరకు ఇలాగే సేవ చేస్తు గడిచిపోవాలనుకునేది. భారత దేశానికి కూడా ఆమె ఇతోధిక సేవలు అందించింది. 1859తో విక్టోరియా రాణి ఆరోగ్య సంస్కరణల కోసం ఒక కమిషన్‌ను నియమించింది. చెన్నై మేయర్ ఆడ నర్సుల శిక్షణను ప్రోత్సాహించారు. నగర పారిశుద్ధ్యం మెరుగు పడింది. ఫ్లోరెన్స్  సలహాలలో మనదేశంలో మరణాల రేటు తగ్గింది. మళ్లీ ఒక ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టి మన ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగు పడాలని కోరుకుందాం.

#ఎంతో సేవాతత్పరతతో కూడిన నర్సింగ్‌ వృత్తికి, ఆధునిక నర్సింగ్‌ విద్యకు లేడీ విత్‌ ద ల్యాంప్‌ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతినొందిన ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ ఆద్యురాలు, మార్గదర్శకురాలు, స్ఫూర్తి ప్రధాత. 

 30ఏళ్ల ప్రాయంలో #జర్మనీలోని కెయిసర్‌ వర్త్‌లో నర్సింగ్‌ విద్యాభ్యాసం చేసిన అనంతరం పారిస్‌లో విధి నిర్వహణ చేస్తున్న కాలంలో యూరప్‌లో జరిగన క్రిమియాన్‌ యుద్ధం గాయాలపాలై రక్తసిక్తమై అల్లాడుతున్న సైనికుల వ్యధాభరిత కథనాలను వార్తాపత్రికల్లో చదివి చలించిపోయింది. ఆ యుద్ధంలోని క్షతగాత్రులను ఎలాగైనా కాపాడాలని నిశ్చయించుకుని కొంతమంది నర్సుల బృందంతో టర్కిలో ఆ సైనికులున్న లుక్ట్రాయి హాస్పటల్‌కు చేరుకుంది. అక్కడ ప్రతీరోజూ వైద్య సేవలు చేస్తూ నిశిరాత్రిలో కూడా చిన్న లాంతరు పట్టుకుని ఆ వెలుగులో గాయాలపాలై బాధతో నిద్రపట్టక విలవిలలాడుతున్న సైనికులను ఓదార్చుతూ వారి కళ్ళలో వెలుగులు నింపేది. దాంతో అక్కడివాలందరూ నైటింగిల్‌ను లేడి విత్‌ ద ల్యాంప్‌ అని పిలవడంతో ఆమెకు ఆ పేరు సార్ధకమయింది.

1910 ఆగస్ట్ 13 లో ఫ్లారెన్స్ మరణించిన, సేవా నిరతిగల ప్రతి నర్సు లోను ఆమె కలకాలం జీవించి ఉంటుంది. రోగులు జ్యాపకమున్చుకోవలసిన ఆదర్శ మూర్తి .

1820 మే 12 ఇటలీలోని ఫ్లోరెన్స్‌ నగరంలో బ్రిటీష్‌ కుటుంబంలో జన్మించిన ఫ్లోరెన్స్‌ నైటింగిల్‌ నర్సు వృత్తికి స్పూర్తిదాయకంగా నిలిచినందుకు ప్రపంచ వ్యాప్తంగా మే 12న ఆమె జయంతిని నర్సుల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

#భారతదేశంలో:

ఈ రోజున, నర్సింగ్ విభాగంలో దేశవ్యాప్తంగా విశేష సేవలందించిన నర్సులకు భారతదేశ రాష్ట్రపతి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను అందిస్తారు. 1973లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టిన ఈ అవార్డులో భాగంగా కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత, స్వచ్ఛంద సంస్థల్లో విశిష్ట సేవలందించిన నర్సులకు ఒక పతకం, ప్రశంసాపత్రము, జ్ఞాపికతోపాటు 50వేల రూపాయిల నగదు బహుమతిని బహుకరిస్తారు.

Tuesday, May 10, 2022

సామాజిక కార్యకర్త "దుర్గాబాయి దేశ్‌ముఖ్ గారి వర్థంతి

🙏💐మహిళా స్ఫూర్తిప్రదాత,
సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త
 "దుర్గాబాయి దేశ్‌ముఖ్ గారి  వర్థంతి సందర్భంగా💐🙏




తన #జీవితమంతా సమాజ సేవకు ముఖ్యంగా #స్త్రీజనోద్ధరణకు అంకితం చేసిన స్ఫూర్తిప్రదాత శ్రీమతి #దుర్గాబాయి దేశ్‌ముఖ్. ఈమె దేశభక్తురాలిగా, స్వాతంత్య్ర సమరయోధురాలిగా, సంఘ సంస్కర్తగా, కార్యకర్తగా, రచయిత్రిగా... తన కాలంలో మరెవరూ చూపని ధైర్యసాహసాలను, ఘ్ప్రజ్ఞను చూపి చరిత్రలో నిలిచిపోయారు.
మన ఆంధ్రరాష్ట్రం గర్వించదగ్గ మహిళామూర్తులో దుర్గాబాయిని ఆగ్రగణ్యులుగా చెప్పుకోవచ్చు. ఆమె వ్యక్తి మాత్రమే కాదు, ఒక వ్యవస్థ, ఓ గొప్ప మహోన్నత శక్తి. మేధావిగా, న్యాయకోవిదురాలుగా, #మానవతావాదిగా, ఆంధ్రమహిళాసభ వ్యవస్థాపకురాలిగా.. #బహుముఖ ప్రజ్ఞను కనబరిచి చరిత్రపుటల్లో మహామనిషిగా కీర్తి సాధించారు దుర్గాబాయి గారు.

#చాచాజీనే నిలదీసేంత తెగువ..!

  దుర్గాబాయి తన 11 సంవత్సరాల ప్రాయంలో ఖాదీ ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఆమెను వాలంటీర్‌గా నియమించినపుడు ఆ ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన పండిట్‌ నెహ్రూగారిని టికెట్‌ లేని కారణంగా అనుమతించలేదు...     
 
#బాల్యం-విద్య:

1909 వ సంవత్సరం జూలై 15వ తేదీన కాకినాడలో కృష్ణవేణమ్మ, రామారావు దంపతులకు దుర్గాబాయి జన్మించారు. ఈమె బాల్యంనుండీ ప్రతిభాపాఠవాలను కనబరుస్తూ  పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో #పాండిత్యాన్ని సంపాదించి, హిందీ #పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ విద్యాబోధన కావించేవారు.
స్వాతంత్య్రోద్యమ కాలంలో ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసారు.
బెనారస్‌ విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ (పొలిటికల్‌ సైన్స్‌లో), 1942లో ఎల్‌. ఎల్‌.బి పూర్తిచేసింది.న్యాయశాస్త్రం చదివి మద్రాసులో హైకోర్టు వద్ద ప్రాక్టీసు ప్రారంభిస్తుంది
న్యాయకోవిదురాలిగా, ప్రఖ్యాత క్రిమినల్‌ లాయర్‌గా పేరుగాంచారు. 11 సంవత్సరాల ప్రాయంలో ఖాదీ ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఆమెను వాలంటీర్‌గా నియమించినపుడు ఆ ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన పండిట్‌ నెహ్రూగారిని టికెట్‌ లేని కారణంగా అనుమతించలేదు. తదనంతరం టికెట్‌ కొన్నాకనే లోనికి పంపించారు.తన కర్తవ్య నిర్వహణకు గాను ఆయన నుండి ప్రశంసలను పొందింది. 

#స్వాతంత్య్ర సమరంలో:

#గాంధీజీగారి పిలుపుమేరకు పెద్దసంఖ్యలో నగదు మొత్తాన్ని, నగలను సేకరించిన దుర్గాబాయి... ఓ బహిరంగసభలో గాంధీగారికి విరాళంగా అందజేశారు. తన చేతులకు ఉన్న #బంగారు గాజులను కూడా #విరాళంగా ఇస్తుంది.ఆమెలోని ధైర్యసాహసాలకు, దక్షతకు, కృషి, పట్టుదలకు ఇవే నిదర్శనాలు.#స్వాతంత్య్ర సమరంలో, ఉప్పు సత్యాగ్రహంలో టంగుటూరి ప్రకాశంపంతులు, దేశోద్ధారకుని కాశీనాధ నాగేశ్వరరావు వంటి దిగ్గజాలతో కలసి ఈమె పనిచేశారు.
#మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది.

#వివిధ హోదాలలో:

తరువాత దుర్గాబాయి భారత రాజ్యాంగ రచనాసంఘం సభ్యురాలిగా, ప్లానింగ్‌ కమీషన్‌ మెంబరుగా, సాంఘిక సంక్షేమ బోర్డు చైర్‌పర్సన్‌గా, బ్లైండ్‌ రిలీఫ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంటుగా పనిచేశారు. నెహ్రూ, అంబేద్కర్‌వంటి నాయకులతో కలిసి పనిచేసిన ఆమె స్త్రీలకు న్యాయపరమైన హక్కుల సాధన కొరకు తీవ్రంగా కృషిచేశారు.

స్త్రీ #అభ్యున్నతి:

ఆనాటి ఆర్థికమంత్రి మరియు రిజర్వ్‌బ్యాంకు గవర్నరుగా పనిచేసిన శ్రీ చింతామణి దేశ్‌ముఖ్‌ను దుర్గాబాయి వివాహం చేసుకొన్నారు. అణగారిన, వివక్షతకు గురైన స్త్రీల అభ్యున్నతికి ఈమె ఆంధ్ర మహిళా సభను 1937లో స్థాపించారు. ఇందులోని రెండు ఆసుపత్రులు, మూడు పాఠశాలలు, రెండు కాలేజీలు నేటికీ స్త్రీ అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేస్తున్నాయి.

#మాస పత్రిక-రచనలు:

1943 లో దుర్గాబాయి ఆంధ్రమహిళ అనే పేరుతో ఒక మాస పత్రికను కూడా నడిపారు. తద్వారా సరళమైన భాషలో ఆలోచనాత్మకమైన అంశాల్ని ముందుపెట్టి ప్రజల్ని చైతన్యవంతం చేయగలిగారు. తదనంతర కాలంలో దానిపేరు ‘విజయదుర్గ’గా మార్చారు. ఆ పత్రికను ఇంగ్లీషు, తెలుగు రెండు భాషల్లో ప్రచురించారు. ‘లక్ష్మి’ అనే నవల సీరియల్‌గా ప్రచురించారు. చిన్నతనం నుంచీ శారద, భారతి, గృహలక్ష్మి, ఆంధ్రమహిళ పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. ప్రేమ్‌చంద్‌ కథలను తెలుగులోకి అనువదించారు.

#స్టోన్స్‌ దట్‌ స్పీక్‌:

ఆమె అనుభవాలతో ‘స్టోన్స్‌ దట్‌ స్పీక్‌’ పేరిట (‘మాట్లాడే రాళ్ళు’ అని) ఒక పుస్తకం రాసారు.పుస్తకంలో ఆమె కాలాన్ని ఎలా వినియోగించుకోవాలో రాస్తూ – ‘‘ఒక సంకల్ప శక్తి కలిగిన వ్యక్తి కాలం విలువను అర్థ చేసుకోగలిగిన వ్యక్తి, ప్రణాళికా బద్ధంగా కాలాన్ని తీర్చిదిద్దుకోగలిగిన వ్యక్తి.. ఏ కార్యాన్ని సాధించాలనుకున్నాడో దానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేసుకుని లోభ కారకాలనూ, మోహ కారకాలనూ జయించి నిలబడగలిగిన వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి తీసుకు రాగలడేమో కానీ, కోట్లాది రూపాయలు మాత్రం అటువంటి వ్యక్తిని తయారు చేసి తీసుకు రాలేవు. అటువంటి వ్యక్తులు దేశ చరిత్రను తిరగ రాస్తారు’’–అన్నారు.

#సామాజిక సర్వీస్ మదర్:

ఆమెను భారతదేశంలో సామాజిక సర్వీస్ మదర్ గా పిలిచేవారు. ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కు మొదటి చైర్‌మన్ గా వ్యవహరించింది.

#అవార్డులు:

ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి 1971లో గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. 1971లోనే ఆమె వయోజన విద్యాప్రాప్తికి చేసిన ఎనలేని కృషికిగానూ "నెహ్రూ లిటరరీ అవార్డు"ను అందుకున్నారు. అవే గాకుండా.. ప్రపంచశాంతి బహుమతినీ, పాల్‌.జి. హోస్‌మ్యాన్‌ బహుమతులను కూడా ఆమె అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆమెను పద్మవిభూషణ్‌తో సత్కరించింది. కాగా... #పద్మవిభూషణ్‌ అందుకున్న తొలి తెలుగు మహిళగా కూడా దుర్గాబాయి రికార్డులకెక్కారు.

*ఈమె చిత్రంతో భారతప్రభుత్వం ఒక తపాలబిళ్ళను విడుదల చేసింది.
&ఈమె జ్ఙాపకార్థం రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండు వద్ద గల స్వాతంత్ర్య సమరయోధుల పార్కులో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ విగ్రహంను స్థాపించారు. *కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వారు 1998లో ఈవిడ పేరున డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ అవార్డును నెలకొల్పారు. ఈ వార్షిక అవార్డు మహిళాభ్యున్నతికి పాటుపడే స్వచ్ఛంద సంస్థకై ఉద్దేశించబడింది. *ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ వారు 2006లో ఈవిడ పేరున దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్‌ను నెలకొల్పారు. 
*ఆంధ్ర విశ్వ విద్యాలయంలో 1987లో నెలకొల్పబడిన సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ 2006లో డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్‌గా నామాంతరం చెందింది.

#ఆడసింహం:

బ్రిటిషు అధికారులచే ‘ఆడసింహం’గా అభివర్ణించబడ్డ ధీరవనితగా, తనను తాను సంఘానికి సమర్పించుకున్న పూజనీయ వ్యక్తిగా, చైతన్య సేవా స్రవంతిగా అందరినోటా కీర్తించబడింది.

#దేశంలో ప్రముఖ సంఘ సేవకురాలిగా, ఉదాత్త వనితగా పేరు తెచ్చుకున్న
 దుర్గాబాయి... 1981 మే 9వ తేదీన హైదరాబాదులో పరమపదించారు. అయితేనేం మరణంలేని ఓ వ్యవస్థగా ఆమె ఎప్పుడూ మనమధ్యనే చిరస్థాయిగా నిలిచిఉంటారు.


Monday, May 2, 2022

ప్రముఖ సినీ దర్శకుడు,రచయిత సత్యజిత్ రాయ్ జయంతి .

💐🌸🌹ప్రముఖ సినీ దర్శకుడు,రచయిత సత్యజిత్  రాయ్ జయంతి  సందర్భంగా🌸



#సత్యజిత్ రాయ్ (మే 2 1921–ఏప్రిల్ 23 1992) భారతదేశంలోని బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత. ఆతను ప్రపంచ సినిమాలో 20వ శతాబ్దపు ఉత్తమ దర్శకుల్లో ఒకడుగా పేరు గడించాడు.కలకత్తాలో ఒక ప్రముఖ బెంగాలీ కళాకారుల కుటుంబములో జన్మించిన సత్యజిత్ రాయ్ కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలోనూ, రవీంద్రనాథ్ టాగోర్ స్థాపించిన శాంతినికేతన్ లోని విశ్వభారతి విద్యాలయము లోనూ చదివాడు.

 #కళాకారునిగా కెరీర్ ప్రారంబించిన రాయ్, లండన్ లో ఫ్రెంచి నిర్మాత జాన్ రెన్వాను కలిసాక, ఇటాలియన్ "నియోరియలిస్టు" సినిమా బైసికిల్ థీవ్స్ తరువాత సినిమాలు తీయడంపై ఆసక్తి పెంచుకున్నాడు.
సత్యజిత్ రాయ్

#రాయ్ సినిమాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు కలిపి మొత్తము ముప్పై ఏడు చిత్రాలకు దర్శకత్వము వహించాడు. ఆయన మొదటి సినిమా పథేర్ పాంచాలీ, కేన్స్ చలనచిత్రోత్సవములో అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది. ఆయనకి దర్శకత్వమే కాక, సినిమా తీయడంలోని ఇతర విభాగాల పట్ల కూడా మంచి పట్టు ఉంది. తన సినిమాలో చాలా వాటికి స్క్రీన్ ప్లే (కథాగమనము), కేస్టింగ్ (నట సారథ్యము), సంగీతము, సినిమాటోగ్రఫీ, కళా దర్శకత్వము, కూర్పు, పబ్లిసిటీ డిజైన్ చేసుకోవడము - వంటివి కూడా ఆయనే చూసుకునేవాడు. సినిమాలు తీయడమే కాక రాయ్ ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు కూడా రాసాడు. అలాగే, ఆయన ప్రచురణ కర్త కూడా. బెంగాలీ పిల్లల పత్రిక "సందేశ్"ను చాలా ఏళ్ళు నిర్వహించాడు. అనేక అవార్డులు పుచ్చుకున్న రాయ్ 1992 లో ఆస్కార్ కూడా అందుకున్నాడు.

#ప్రపంచానికి సత్యజిత్ రాయ్ ఒక దర్శకుడిగా మాత్రమే తెలిసినా కూడా ఆయన బెంగాలీలో ఎన్నో రచనలు చేశాడు. తన తాత ప్రారంబించిన "సందేశ్" పత్రిక మధ్యలో ఆగిపోతే సత్యజిత్ రాయ్ తిరిగి ప్రారంభించాడు. ఇది చిన్న పిల్లల కోసం ప్రారంభింపబడిన పత్రిక. ఇందులోనే సత్యజిత్ రాయ్ పిల్లల కోసం "ఫెలూదా" అన్న డిటెక్టివ్ ని సృష్టించారు. 1965 మొదలుకుని 1994 దాకా 35 ఫెలూదా నవలలు రాసారు. ఇందులో - ఫెలూదా, అతని కజిన్ తపేష్, జటాయు అని పిలువబడు లాల్ మోహన్ గంగూలీ ప్రధాన పాత్రలు. వీరు ముగ్గురు కలిసి పరిష్కరించే సమస్యల సంకలనమే ఫెలూదా కథలు. ఇది కాక సత్యజిత్ రాయ్ ప్రొఫెసర్ శొంకు అన్న మరో పాత్రని కూడా సృష్టించి నవలలు రాసాడు. బెంగాలీ పిల్లల సాహిత్యంలో ఈ రెండు పాత్రలకి ఓ విశిష్ట స్థానం ఉంది.

 #సత్యజిత్ రాయ్ కథా రచయిత కూడా. ఆయన రాసిన కథలు ఆయనకు వివిధ రంగాలలో ఉన్న విశేష పరిజ్ఞానాన్ని తెలియజేస్తాయి. ఆయన రచనల్లో చాలా వరకు గోపా మజుందార్ ఆంగ్లానువాదం చేసారు. సత్యజిత్ రాయ్ పిల్లల నవల - "ఫతిక్ చంద్" తెలుగు లోకి కూడా అనువదితమైంది.

#ఇవి కాక, సినిమాలు తీయడం గురించి ఆయన అనేక వ్యాసాలు రాశాడు. వాటిలో కొన్ని తెలుగులోకి అనువదితం అయ్యాయి కూడా.
ఆయన కథా సంకలనాలలో కొన్ని:
1.20 short stories
2. Stranger and other stories (20 short stories above + Fotik chand)
3. The Best of Satyajit Ray
- ఆయన కథలన్నీ మొదట పన్నెండు కథల సంకలనాలుగా వచ్చాయి. పన్నెండుకి రకరకాల నామాంతరాలతో విడుదల కావడం వాటి ప్రత్యేకత.


Sunday, May 1, 2022

కళాప్రపూర్ణ' శ్రీకాశీనాథుని నాగేశ్వరరావు గారి జయంతి

💐💐పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంథాలయాల విస్తరణకు కృషి చేసిన విద్యా వేత్త, దానశీలి, దేశోధ్ధారక, విశ్వదాత, 'కళాప్రపూర్ణ' శ్రీ
కాశీనాథుని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా💐


#ఆంధ్రపత్రిక నడపడమంటే పెద్ద తలనొప్పి సుమండీ!’ అన్నారట కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు,పరవాలేదు, అమృతాంజనం కూడా మీదే కదా!’అని చమత్కరించారట. రాజాజీ"#

#భారతీయ పత్రికలను బ్రిటిష్‌ ప్రభుత్వం వెంటాడుతున్న కాలమది. అలాగే స్వాతంత్య్రోద్యమాన్ని కర్కశంగా అణచివేస్తున్న సమయం కూడా అదే. ఆ సమయంలో ఇటు పత్రికా నిర్వహణలోను, అటు స్వరాజ్య సమరంలోను కీలకంగా నిలిచినవారు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు. ఆయన స్థాపించిన ఆంధ్రపత్రిక తెలుగువారి ఉద్యమానికి, సంస్కృతికి, సాహిత్యాభిలాషకి అద్దం పట్టింది. తలనొప్పి – అమృతాంజనం జంటపదాలైనాయి. ఎన్నో పత్రికలు రావచ్చు. పోవచ్చు.  కానీ ఆంధ్రపత్రికకు ఉన్న స్థానం చరిత్రలో మరొక పత్రికకు రాలేదు. అలాగే తలనొప్పికి అమృతాంజనమే ఈరోజుకీ దివ్యౌషధం.

 #భారత స్వాతంత్య్ర సమరం పదునెక్కుతున్న సంగతిని గమనించి అందుకు సంబంధించిన వార్తలను తెలుగులో అందించాలన్న ఆశయంతో ఆంధ్రపత్రికను స్థాపించారు పంతులుగారు. ఆయన స్వయంగా స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. 1838 ప్రాంతంలో తెలుగులో పత్రికల ప్రచురణ (వృత్తాంతి) ప్రారంభమైనప్పటికీ ఆంధ్రపత్రిక వచ్చే వరకు వాటికి పూర్తి స్వరూపం రాలేదంటే అతిశయోక్తి కాదు. కృషి, దీక్ష పట్టుదలతో వివాహానంతరం కూడా విద్యాభ్యాసము కొనసాగించారు. అటు పిమ్మట ముంబై మహానగరానికి వెళ్లి అక్కడి జన  సముద్రంలో ఆటుపోట్లను ఎదుర్కన్నారు. అమృతాంజనాన్ని  తయారుచేసి అమ్మకాన్ని కొనసాగించారు . అమృతాంజనాన్నివీరికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. కొంత ధనార్జ న చేసిన పిదప కాశీనాధుని వారు ఆంధ్ర పత్రికకు  అంకురార్పణ చేసారు. ఆంధ్ర పత్రిక సంవత్సరాది సంచికలను ప్రారంభించారు. ప్రతి ఏడాది ఉగాది నాడు అద్బుతంగా రంగుల ముఖచిత్రాలతో సంత్సరాది సంచికలను విడుదల చేసారు. 

#చెన్నై లోని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్ లోనే చారిత్రాత్మక శ్రీబాగ్‌ ఒడంబడిక కుదిరింది. కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య కుదిరిన ఈ ఒడంబడిక ద్వారా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది.#

#జీవిత విశేషాలు

కాశీనాధుని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా ఎలకుర్రు గ్రామంలో 1867లో మే 1న జన్మించాడు. తల్లిదండ్రులు: శ్యామలాంబ, బుచ్చయ్య. స్వగ్రామంలోనూ, తరువాత మచిలీపట్నంలోనూ విద్యాభ్యాసం కొనసాగింది. 1891లో 'మద్రాసు క్రిస్టియన్ కాలేజి'లో పట్టభద్రుడయ్యాడు. ఆ కాలేజిలో ప్రమముఖ విద్యావేత్త డా.రెవరెండ్ మిల్లర్ ప్రభావం అతనుపై బడింది. వివేకవర్ధనిలో కందుకూరి వీరేశలింగం వ్యాసాలు కూడా అతనును ప్రభావితం చేశారు.

#దేశోద్ధారక:

మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలన్న ఉద్యమానికి అరంభదశనుండి నాయకులుగా ఉన్నవారిలో నాగేశ్వరరావు ఒకడు. ఈ విషయమై తన పత్రికలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు. ఈ విషయంలోనూ, తెలుగు భాష, సంస్కృతిలకు సంబంధించిన ఇతర విషయాలలోనూ అతను తెలుగు జాతికి చేసిన సేవను గౌరవిస్తూ తెలుగువారు అతనును దేశోధ్ధారక అని సత్కరించారు.

#రాజకీయాలలో:

టంగుటూరి ప్రకాశం సమకాలీనుడైన నాగేశ్వరరావు 1924 - 1934 మధ్యకాలంలో నాలుగు సార్లు ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా ఉన్నాడు. ముఖ్యంగా ఖద్దరు ఉద్యమానికి నాగేశ్వరరావు బలమైన మద్దతును, సహకారాన్ని అందించాడు. అలాగే ఉప్పు సత్యాగ్రహం సమయంలో చురుకుగా పాల్గొన్న నాయకులలో అతను ఒకడు. నాగేశ్వరరావుపై ప్రజలకు ఎంతో అభిమానం, నమ్మకం ఉండేవి.

#భగవద్గీత :

ఉప్పు సత్యాగ్రహ సందర్భంగా 1931లో ఒక సంవత్సరం జైలులో ఉన్నపుడు నాగేశ్వరరావు భగవద్గీత గురించి వ్యాఖ్య వ్రాసాడు. గీత ఒక మతానికి పరిమితమైనది కాదనీ, దాని సందేశం సమస్తమానవాళికీ వర్తిస్తుందనీ అతను వివరించాడు.

#విశ్వదాత :

నాగేశ్వరరావు అసమాణ దానశీలి. అతను ఇల్లు ఎప్పుడూ అతిధులతోనూ, అర్ధులతోనూ కళకళలాడుతుండేది. వివిధ సేవఅ కలాపాలకు ధారాళంగా అతను సహాయం చేస్తుండేవాడు. అతను ఇంటినుండి వట్టిచేతులతో ఎవరూ వెళ్ళేవారు కాదు. అతను దాతృత్వానికి అబ్బురపడి మహాత్మా గాంధీ అతనును విశ్వదాత అని కొనియాడాడు.

#తెలుగు భాషకు అతను సేవ:

కాశీనాథుని నాగేశ్వరరావు యొక్క తెలుగు భాషాభిమానము, సాహిత్యము, విజ్ఞానశాస్త్రములలో ఆసక్తి అతను ఆయారంగములో వివిధ పత్రికల ప్రచురణకు చేసిన విశేషకృషి వలన విదితం. ఇతను భారతి, ఆంధ్ర పత్రిక వంటి పత్రికలు, ఆంధ్ర గ్రంథమాల వంటి ప్రచురణలు, ఉగాది ప్రత్యేక సంచికలు వెలువరించాడు. ఆంధ్ర గ్రంథమాల ద్వారా అతను తెలుగు భాషలో అనేక భాషా, సాహితీ, విజ్ఞాన శాస్త్ర విషయాలపై గ్రంథాలను పరిచయం చేసి శాస్త్ర, సాహిత్య విజ్ఞానాభివృద్ధికి దోహదం చేశాడు.తెలుగు నాటకం అభివృద్ధి చేసేందుకు ఆంధ్ర నాటక కళా పరిషత్తును 1929లో స్థాపించిన నాటకరంగ ప్రముఖుల్లో అతను కూడా ఒకరు.

#అమృతాంజనము సృష్టి కర్త#

తలనొప్పి నివారిణి అమృతాంజనం" ఆవిష్కర్త
కాశీనాధుని నాగేశ్వర రావు పంతులుగారు.
ఒకసారి చధరంగపు చాంపియన్ బాబీ ఫిషర్ భారతీయ చదరంగపు అటగాడు విశ్వనాథన్ ఆనంద్ ను అమృతాంజనం గురించి అడిగాడట తన సొంత దేశము అయినా ఐస్ ల్యాండ్ లో అమృతాంజనం దొరకటం లేదని తనకు అమృతాంజనం కావాలని అడిగాడు అంటే అమృతాంజనం ప్రతిభ దేశాలు దాటి ప్రముఖుల చెంతకు చేరింది అని చెప్పవచ్చు. భారతదేశములో 1980 ,1990 ల మధ్య పెరిగిన ఏ పిల్లవాడిని అడిగినా అమృతాంజనం గొప్పతనము చెపుతాడు ఆ రోజుల్లో ఈ రోజుల్లో ప్రతి వారి ఇంట్లో విధిగా ఉండే మందు ఇది. అమృతాంజనం లేని ఇల్లు ఊహించటం చాలా కష్టము. ఈ పసుపు రంగు పేస్ట్ లాంటి ఔషధము విపరీతమైన తలనొప్పి ఒళ్ళు నొప్పులను జలుబును తగ్గించే అమోఘమైన మందు. తాతయ్యలు,భామ్మల కాలము నుండి అమృతాంజనం వాడకం ఉంది దీనిని వాడి తలనొప్పినుండి సత్వరమే ఉపశమనము పొందేవారు ఇంత అమోఘమైన మందును తయారుచేసింది శ్రీ కాశీనాధుని నాగేశ్వర రావు పంతులుగారు.

కాశీనాథుని నాగేశ్వరరావు 1938లోఏప్రిల్ 11న మరణించాడు. తెలుగు జాతికీ, తెలుగు భాషకూ, తెలుగు సంస్కృతికీ అతను సేవ ఎనలేనిది.