Sunday, May 22, 2022

వేటూరి గీతాలు, పాటల సిరి వేటూరి సుందరమూర్తి గారి వర్థంతి

🌹🙏వాగ్దేవి వర పారిజాతాలు... వేటూరి గీతాలు, పాటల సిరి వేటూరి సుందరమూర్తి గారి వర్థంతి  సందర్భంగా🙏🌹
✍️ఆయన పేరు వింటే కృష్ణాతరంగాలు సారంగ రాగాలు వినిపిస్తాయి. ఆయన పేరు తలచినంతనే పాట వెన్నెల పైటేసి ఒయ్యారమొలకబోస్తుంది. నాట్యం విలాసంగా నర్తిస్తుంది. ఆయనే పాటల సిరి.. వేటూరి. ఆ సుందరమూర్తి శృంగార కవే కాదు.. ఆధ్యాత్మిక తత్వాన్ని, జీవిత పరమార్థాన్ని సంపూర్ణంగా అవగతం చేసుకున్న భక్త యోగకవి. అల్లరి పాటలతో ‘మాస్‌’ మనసులను దోచుకున్నా, యమకగమకాలతో ‘క్లాస్‌’ మదిని ఝమ్మనిపించినా అది ఆయనకు మాత్రమే సాధ్యం. సాహిత్య విలువలు కలిగిన వైవిధ్యభరిత గీతాలెన్నింటినో మనకందించి, అందరి మదిలో పాటై నిలిచిపోయిన సినీ కవిరాజు వేటూరి సుందరరామ్మూర్తి గారు.

ఓ పాట... #ఆడపిల్లల భుజాలపై అందంగా జాలువారే అల్లరి పైట. ఓ పాట... కొత్తగా మీసమొచ్చిన కుర్రకారు గుండె గొంతుకలో కొట్టుమిట్టాడే కూనిరాగం. ఓ పాట ... కొండాకోనల్లో ఒక్కసారిగా దుమికే ప్రేమ జలపాత ప్రవాహం. ఇంకో పాట... గుండెల్ని పిండేసే విరహ గీతి. రక్తి, భక్తి, విరక్తి... ఇలా పాట పాటకో నేపథ్యం. ఆశలు, ఆశయాల సాధన కోసం ప్రజలందరినీ సామూహికంగా కట్టి పడేసే ఉద్యమ గీతాలు కొన్ని. శిశుర్వేత్తి, పశుర్వేత్తి గాన రస:పణి అన్నట్లు... ప్రతి ఒక్కరిని అలరించే పాటలు జీవితాల్ని ప్రభావితం చేసేవే. కవులంతమందీ అన్ని రకాల పాటలూ రాయలేరు. కొన్ని పాటలు మాత్రమే రాయడంలో లబ్ధప్రతిష్టులవుతారు. ప్రముఖ సినీ కవి శ్రీ వేటూరిలాంటి వారు మాత్రమే...

#బాల్యం-విద్యాభ్యాసం:

వేటూరి చంద్రశేఖర శాస్త్రి - కమలమ్మ దంపతులకు 1936 జనవరి 29వ తేదీన పెదకళ్లేపల్లి గ్రామంలో వేటూరి సుందరరామ్మూర్తి జన్మించారు. తెలుగు సాహితీ దిగ్గజాల్లో ఒకరైన వేటూరి ప్రభాకరశాస్త్రి ఈయన పెద్దనాన్న.మద్రాస్‌ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియేట్, విజయవాడలో డిగ్రీ పూర్తి చేశాడు.అప్పట్లో దైతా గోపాలం నటన, కధ, కవిత, గాన, దర్శకత్వ శాఖల్లో ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చేవారు. వేటూరి కూడా ఆయన దగ్గర తొలి పాఠాలు నేర్చుకున్నారు.

#పత్రికా రంగంలో ప్రవేశం:

స్వరాలకు పద సౌందర్యాన్ని అద్ది, సాహిత్య సామ్రాజ్యంలో ప్రకాశింపచేసిన మూర్తి వేటూరి 18 ఏళ్ల ప్రాయంలోనే కలం పట్టుకుని పత్రికా రంగంలో ప్రవేశించారు. #1962లో నాటి ప్రధాని నెహ్రూ శ్రీశైలం విచ్చేసిన సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు.# 
ఆంధ్ర జనతా పత్రికలో ఎడిటర్‌గా ఎదిగి, భద్రాచలం సమీపంలోని పాల్వంచ వద్ద జరిగిన ఒక బహిరంగ సభలో నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పొరపాటుగా మాట్లాడిన అంశాన్ని బాక్స్‌ ఐటమ్‌గా ఇచ్చి సంచలనం సృష్టించిన ధైర్యవంతుడు వేటూరి.

#సినీ ప్రస్థానం:

కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన వేటూరి, సంగీత జ్ఞానాన్నీ పదరచనల బాణీల్నీ స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో సినిమాపాటకు వోణీలు వేయించారు. సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణసాహిత్యంలోని పంక్తుల్నీ గ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యుడు. వేటూరి అనగానే వెంటనే స్ఫురించేది అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం... ఇలా ఎన్నో సినిమాలు...ఈ సినిమాలలోని అందమయిన అద్బుతమయిన పాటలు!
“పిల్లనగ్రోవికి నిలువెల్లగాయాలు అల్లన మ్రోవిని తాకితే గేయాలు” “నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ” ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు కదులు ఎదలోని సడులే మృదంగాలు ఇలాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి. 

#పురస్కారాలు:

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పాటల రచయితగా తనదైన వాణి, బాణీతో ఇక ఇజాన్ని సృష్టించిన మహాకవి డాక్టర్‌ వేటూరి. అందుకే ఎనిమిది నంది అవార్డులు, ఒక జాతీయ అవార్డుతో పాటు మరెన్నో అవార్డులు, ప్రజల రివార్డులు ఆయన్ని వరించాయి. ఒక శ్రీనాథుడు, ఒక పోతన, ఒక పెద్దన, ఒక అన్నమయ్య వేటూరి పాటలో మనకు దర్శనమిస్తారు. ఆ మహాకవి స్మృత్యర్ధం తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆవరణలో వేటూరి సాహితీపీఠం కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించింది.

##శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు. ఆయన మాతృదేవోభవ సినిమాకి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే... అనే పాటకి 1994వ సంవత్సరానికి గాను ఈ పురస్కారం వచ్చింది. ఇది తెలుగు పాటకు రెండవ జాతీయ పురస్కారం.##

#తెలుగు పాటకు వన్నెలద్ది, సంస్కృత సమాసాలనైనా, సరస పదాలనైనా అలవోకగా లిఖించిన వేటూరి, 2010 మే22న పాటల పల్లకిలో ఊరేగుతూ గంధర్వ లోకాలకు వెళ్లిపోయారు. ఆయన భౌతికంగా కనుమరుగైనా, తెలుగు వారి గుండెల్లో పాటై, నట్టింట్లో కూనిరాగమై నిలిచే ఉంటారు.

0 comments:

Post a Comment