అపర భగీరధుడు సర్ ఆర్థర్ కాటన్ దొర జయంతి సందర్భంగా
నీటివనరులె జాతి సిరులని
జనుల కొఱకే మనిన
కారణజన్ముడవు నీవు
ఇది నీవు పెట్టిన దీపమే
నిత్యగోదావరీ స్నాన
పుణ్య దోయా మహామతిః
స్మరామ్యాంగ్లదేశీయం
కాటనుం, తం భగీరథం...
#అతివృష్టి, అనావృష్టితో అతలాకుతలమవుతున్న గోదావరి ప్రాంతాన్ని #ధాన్యాగారంగా మార్చాడు.. లక్షలాది ఎకరాలకు సాగునీరు.. వందలాది గ్రామాలకు తాగునీరు అందించి గోదావరి వాసుల మదిలో అజరామరంగా నిలిచిపోయాడు.. ఆయన చేతికర్రతో గీసిన గీతలు డెల్టా కాలువలయ్యాయి.. కరువు కోరల్లో చిక్కుకున్న ప్రాంతాలు పచ్చటి తివాచీలుగా మారాయి.. ధవళేశ్వరం ఆనకట్టతో గోదావరిజిల్లాలకు పునరుజ్జీవనం ప్రసాదించి ఆరాధ్య దైవంగా మారాడు..#అపర భగీరథుడిగా చరితలో నిలిచాడు సర్ ఆర్థర్ కాటన్.
‘#కాటన్ దొర’ అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ (మే 15, 1803 - జూలై 24, 1899) బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. సర్ ఆర్థర్ కాటన్ 18 ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చి మొదటిసారిగా మద్రాస్‌లో ఉద్యోగంలో చేరారు. అప్పటి బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ ఈయనను దక్షిణ ప్రాంత చెరువుల శాఖకు ఇంజనీర్‌గా నియమించింది. ఆయన నిరంతరం ప్రజల సంక్షేమం, సేవ కోసమే పరితపించేవారు.
18వ శతాబ్దంలో పవిత్ర జీవనదికి ఇరువైపుల ఉన్న ఉభయగోదావరి జిల్లాలు అతివృష్టి , వరద ముంపు, అనావృష్టి , కరువుకాటకాలతో విలవిలలాడాయి. 1833లో అనావృష్టి వల్ల కలిగిన కరువుతో రెడు లక్షల ప్రజలు తుడిచుపెట్టుకు పోయారు. అలాగే 1839లో ఉప్పెన, కరువు మరింతమందిని పొట్టనపెట్టుకొంది. దీంతో గోదావరి నది నీటికి అడ్డుకట్ట కట్ట వేయాలని కాటన్ అనుకున్నారు. తన ఆలోచనలను నిజం చేస్తూ జలాశయం నిర్మించారు.
#సముద్ర మట్టానికి 1600 అడుగుల ఎత్తున నిర్మించాలని ప్రతిపాదించిన జలాశయాన్ని, కొన్ని నదుల అనుసంధానాన్ని బ్రిటీష్ ప్రభుత్వం అనుమతించలేదు. దాన్ని ప్రభుత్వం వ్యతిరేకించడానికి కారణం.. వాటివలన కలిగే ఇబ్బందులు కాదు. పెట్టుబడి ఎంత?.. వచ్చే రాబడి, కట్టాల్సిన వడ్డీ ఎంత?.. అంటూ లెక్కలు వేయటం. బ్రిటీష్ ప్రభుత్వ వాదనను కాటన్ వ్యతిరేకించారు. పాలితుల సుఖాలు, ప్రాణాలు కరువుతో ముడిపడి ఉన్నాయని, పాలకులు ధర్మంగా, బాధ్యతగా కరువు నివారణ పనులు చేపట్టాలని పోరాటం జరిపారు.
#ఫలితంగా గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట రూపొందింది. 1847 - 52 మధ్య కాలంలో గోదావరిపై తూర్పగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తిచేశారు. దీంతో క్షామపీడితమైన గోదావరి డెల్టా సస్యశ్యామలమై కలకలలాడింది. తగ్గిపోతున్న జనసంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందికి వచ్చింది. ఈ మహత్కర్యాన్ని ఆయన కేవలం అయిదేళ్లలో పూర్తి చేయడం గమనార్హం. కాటన్ దొర గోదావరిపై నిర్మించిన ఆనకట్ట, ఉభయగోదావరి జిల్లాలలోని రైతుల ఆర్థిక, జీవనగతులను మార్చేసింది. తమపాలిట దుఖఃదాయినిగా ఉన్న గోదావరిని, ప్రాణహితగా మార్చిన భగీరథుడుగా కాటన్ దొర ఈ రెండు జిల్లాల ప్రజలగుండెల్లో నిలచిపోయాడు.
#పండితుల సంకల్పం:
ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానంతరము, పండితులు గోదావరిలో స్నానమాచరించి, ఇలా సంకల్పం చెప్పుకునేవారు.
నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః
స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం
(మాకు గోదావరి నదీ స్నాన పుణ్యాన్ని కలిగించిన అపర భగీరథుడు, ఆంగ్ల దేశీయుడైన కాటన్ దొరగారిని ప్రతినిత్యం స్మరించి తరిస్తున్నాము. అని ఈ శ్లోకానికి తాత్పర్యం)
#కాటన్ విగ్రహాలు:
#ఉభయ గోదావరి జిల్లాలలోని చాలా గ్రామాల్లో ఇతరదేశ నాయకుల విగ్రహాలున్నా, లేకపోయినా తప్పనిసరిగా కన్పించే విగ్రహం గుర్రం మీద స్వారీచేస్తున్న #కాటన్ దొర. బ్రిటీషు వారు మనదేశాన్ని వదిలిపెట్టి పోయినా.. ధవళేశ్వరం బ్యారేజి నిర్మించి 150 ఏళ్లు గడిచినా గోదావరి జిల్లాల ప్రజల గుండెల్లో కాటన్ దొర ఇంకా #చిరంజీవిగా ఉన్నారంటే ఆ కృషి ఎలాంటిదో అర్థమవుతోంది.
#దేవుడితో సమానంగా కొలుస్తారు...
సర్ ఆర్థర్ కాటన్‌ని గోదావరి వాసులు ఎంతగా అభిమానిస్తారన్నదానికి 2009లో భారత పర్యటనకు వచ్చిన ఆయన #మునిమనవడి పట్ల ఇక్కడివారు చూపిన ఆదరణ నిదర్శనంగా నిలిచింది.
రాబర్ట్ సి కాటన్ రాక సందర్భంగా రాజమహేంద్రవరంలో భారీ సభ కూడా నిర్వహించి ఆయనకు సన్మానం ఏర్పాటు చేయడం ద్వారా కాటన్ మీద ఉన్న తమ అభిమానాన్ని ఆయన కుటుంబ సభ్యుడిగా వారసుడి మీద చాటుకున్నారు.
‘‘మా ప్రాంతం ఇంత #పచ్చదనంతో ఉండడానికి ఆయనే కారణం. అందుకే ఆయన్ను మా కడుపు నింపిన #మహానీయుడిగా కొలుస్తాం. దేవుడితో సమానంగా భావిస్తాం. మా ఇళ్లలో దేవుడి ఫోటోలతో సమానంగా కాటన్ ఫోటో ఉంటుంది. ఊరూరా విగ్రహాలు ఉంటాయి. ఏటా ఆయన జయంతి, వర్థంతి జరుపుతాం. నిత్యం ఆయన్ని తలచుకున్న తర్వాత ఏ కార్యక్రమం అయినా చేపడతాం. మా తాతముత్తాతల నుంచి ఇది వారసత్వంగా వస్తోంది. గోదావరి నీటికి అడ్డుకట్ట వేసి, పంటలు పండించుకునే అవకాశం కల్పించినందుకు ఆయన రుణపడి ఉంటాం’’ అని అక్కడి ప్రజలు అంటారు."
#కడియం నర్సరీలకు #అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందంటే ఆయనే కారణం..
కాటన్ బ్యారేజ్ దిగువన కడియం సమీపంలో విస్తరించిన వేల ఎకరాల నర్సరీలు అంతర్జాతీయ కీర్తిని గడించాయి. ప్రపంచమంతటికీ మొక్కలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాయి.
1910 ప్రాంతంలో కడియంలో మొక్కల పెంపకం మొదలుకావడం ఆ తర్వాత అది వేగంగా విస్తరించడంతో ప్రస్తుతం సమీపంలోని మూడు నాలుగు మండలాల్లో నర్సరీ రంగం ప్రధానంగా మారింది.
అప్పట్లో పంటలు పండించడానికే నీరు లేక వర్షాధారంగా ఉన్న నేల ఇది. ఇప్పుడు విస్తారంగా వివిధ వెరైటీల మొక్కలు పండించే స్థాయికి చేరింది. అందుకే కడియం నర్సరీలో కీర్తిలో కాటన్‌దే ముఖ్యపాత్ర,
#తొలి తెలుగు ఇంజినీర్, #కాటన్‌కు చేదోడు వాదోడుగా ఉన్న "వీణెం #వీరన్న".
గోదావరి ఆనకట్ట నిర్మాణంలో సర్‌అర్థర్ కాటన్‌కు చేదోడు వాదోడుగా ఉండి పదివేల మంది కూలీలను సమీకరించి వారికి, పనిలో శిక్షణనిచ్చి సక్రమంగా వేతనాలిస్తూ ఆదివారం జీతంతో కూడిన సెలవునిచ్చి పనిచేయించినదెవరు అంటే వీణెం వీరన్న పేరే చెప్పాలి.
గోదావరి జిల్లాలను. 'అన్నప్రూర్ణలా మార్చే క్రతువులో కాటన్ దొరకు వెన్నెముకగా నిలిచిన ఇంజనీరు.
1844లో #గోదావరి పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చిన ఆర్థర్ కాటన్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి కాటన్‌కు సహాయకుడిగా వీరన్న కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కాటన్ నివాస వ్యవహారాలు, నౌకర్లు, ఆరోగ్య, ఆహార విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవడం లాంటివి వీరన్నే చూసుకున్నారు.
#1847లో ఆనకట్ట నిర్మాణం మొదలయ్యే నాటికి వీరన్న వయసు 53 ఆనకట్ట నిర్మాణానికి పని చేయడానికి గోదావరి జిల్లాల నుంచి శ్రామికులు ముందుకు రాలేదు. ఆ పరిస్థితుల్లో వీరన్న ఒడిస్సా, బెంగాల్ రాష్ట్రాల నుంచి వందలాదిమందిని తీసుకువచ్చి మంచి వేతనంతో పని చేయించారు.
పదివేల మందితో ఐదేళ్లపాటు సాగిన నిర్మాణంలో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకుండా నిర్మాణం పూర్తి అయిందంటే అడుగడుగునా ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో తెలుస్తుంది.
#నిర్మాణం జరుగుతున్నప్పుడు మధ్యలో కాటన్ దొర అనారోగ్యం కారణంగా లండన్, ఆస్ట్రేలియాలకు వెళ్లినప్పుడు ఆనకట్ట నిర్మాణానికి ఎటువంటి అంతరాయం కలగనివ్వకుండా సమర్థవంతంగా పనిచేయించారు వీరన్న.దీనికి ప్రతిఫలంగా బ్రిటిష్ వారు ఆనకట్టకు సమీపంలో ఉన్న మెర్నిపాడు గ్రామశిస్తును (ఆ రోజుల్లో రూ.500కు పైగా) వీరన్నకు శాశ్వతంగా దఖలుపరిచింది. అంతేకాదు ఆయనకు ‘రాయబహుదూర్’ బిరుదునిచ్చి సత్కరించింది.
0 comments:
Post a Comment