Wednesday, January 19, 2022

💐నందమూరి తారక రామారావు గారి వర్థంతి సందర్భంగా💐

🌷🙏నటుడి నుంచి నాయకుడిగా ఎదిగిన యుగపురుషుడు నందమూరి తారక రామారావు  గారి వర్థంతి సందర్భంగా



నటనలో ప్రఖ్యాతుడు – రాజకీయ విఖ్యాతుడు.💐💐💐💐

✍️కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు’ .. అన్న అభియుక్తికి నిలువెత్తు నిదర్శనం అన్న ఎన్టీఆర్. ‘నందమూరి తారక రామారావు’.. ఈ మాటే ఓ సంచలనం.. రాజకీయాల్లో ప్రభంజనం.. ప్రతి తెలుగువాడి ఆత్మగౌరవం. ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపం.. సంక్షేమ పథకాలకు తారకమంత్రం అన్న ఎన్టీఆర్.

‘ఈ తెలుగుదేశం పార్టీ శ్రామికుడి చెమటలో నుండి వచ్చింది. కార్మికుడి కరిగిన కండాలల్లోనుండి వచ్చింది. రైతు కూలీల రక్తంలో నుండి వచ్చింది. నిరుపేదల కన్నీటిలో నుండి.. కష్టజీవుల కంటి మంటల్లో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం ఆశీర్వదించండి’ అంటూ.. 1982 మార్చి 29న హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కేవలం పదిమంది పత్రికా విలేకరుల మధ్యన ‘తెలుగు దేశం’ పార్టీని స్థాపించారు.
ఆయన పిలుపు ఓ నవ్యోపదేశం అయ్యింది.. ఆయన పలుకు ఓ సంచలనమై విరజిల్లింది .. ఆయన ప్రతి మాట ఓ తూటాగా.. ఆయన సందేశమే స్పూర్తిగా జనాల్లోకి చొచ్చుకుని వెల్లింది.చైతన్య రథం ఎక్కి ఊరూరా తిరుగుతూ.. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి.. దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను మట్టికరిపించారు. రైట్ పర్సన్ ఇన్ రైట్ టైమ్ అనే మాటను అక్షరాలా నిజం చేస్తూ.. రాజకీయ శూన్యతను మందే పసికట్టిన ఢిల్లీ నాయకుల్ని బెంబేలెత్తించి తెలుగోడి సత్తాను రుచిచూపించారు.

నాడు ఎన్టీఆర్ స్థాపించిన ‘తెలుగు దేశం పార్టీ’ అప్పటి నుండి ఇప్పటి వరకూ రాష్ట్ర రాజకీయాల్లోనూ.. దేశ రాజకీయాల్లోనూ బలీయమైన శక్తిగా ఎదిగిందంటే అది ముమ్మాటికీ అన్న ఎన్టీఆర్ వేసిన పటిష్ఠ పునాదులు... ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు.. అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణం.

✍️బాల్యం-విద్యాభ్యాసం:

1923 మే 28న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు. 



పాఠశాల విద్య విజయవాడ మున్సిపలు ఉన్నత పాఠశాలలో చదివాడు. తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో చేరాడు. ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి. ఒకసారి రామారావును ఒక నాటకములో ఆడవేషం వేయమన్నాడు. అయితే రామారావు తన మీసాలు తీయటానికి 'ససేమిరా' అన్నాడు. మీసాలతోటే నటించడం వలన అతనుకు "మీసాల నాగమ్మ" అనే పేరు తగిలించారు. 1940ల్లో కుటుంబానికి అండగా ఉండడం కోసం విజయవాడలో హోటళ్లకు ఎన్టీఆర్ పాలు పోసేవారు.
1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్ళి చేసుకున్నాడు. వివాహో విద్యానాశాయ అన్నట్లు పెళ్ళయిన తరువాత పరీక్షల్లో రెండుసార్లు తప్పాడు. తర్వాత గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో చేరాడు. అక్కడకూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవాడు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ (NAT) అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కె.వి.ఎస్.శర్మ తదితరులతో చేసిన పాపం వంటి ఎన్నో నాటకాలు ఆడాడు. తర్వాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది. ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా. రాష్ట్రవ్యాప్త చిత్రలేఖన పోటీలలో అతనుకు బహుమతి కూడా వచ్చింది.

1947లో పట్టభద్రుడయ్యాడు. తదనంతరం అతను మద్రాసు సర్వీసు కమిషను పరీక్ష రాసాడు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచాడు. అప్పుడు అతనుకు మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయారు.

✍️సినిమా రంగ ప్రవేశం:

మొదటిసారి కెమేరా ముందు నటించిన సినిమా మనదేశం.1951లో కె.వి.రెడ్డి పాతాళభైరవి, దాని తరువాత అదే సంవత్సరం బి.ఎన్‌.రెడ్డి మల్లీశ్వరి, 1952లో ఎల్వీ ప్రసాదు పెళ్ళిచేసి చూడు, ఆ తరువాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు చిత్రం చంద్రహారం అతనుకు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. 
1956లో విడుదలైన ‘మాయాబజార్’లో తొలిసారి శ్రీకృష్ణుడిగా నటించి మెప్పించారు. పౌరాణిక పాత్రలకు ఈ చిత్రంతోనే నాంది పలికాడు. 
ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా కచ్చితంగా ఉండేవాడు. గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ మద్రాసు మెరీనా బీచిలో అభ్యాసం చేసేవాడు. నర్తనశాల సినిమా కోసం అతను వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నాడు. వృత్తిపట్ల అతను నిబద్ధత అటువంటిది. కెమెరా ముందు ఎన్టీఆర్ తడబడిన దాఖలాలు లేవని చెబుతూంటారు, ఎందుకంటే అతను డైలాగులను ముందుగానే కంఠతా పట్టేసేవాడు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. నటుడిగానే కాకుండా.. నిర్మాతగా, దర్శకుడిగా పలు చిత్రాలను నిర్మించారు.
రామారావుకు సొంత కుర్చీ తెచ్చుకోవడం అలవాటు. ఆయనకంటే ముందే సెట్‌లోకి కుర్చీ వచ్చిందటే రామారావు వస్తున్నట్లే. వెంటనే సెట్లో వాళ్లంతా అలర్ట్ అయి లేచి నిలబడేవారు. తన కుర్చీమీద ఎన్‌.టి.ఆర్‌ పేరు అందంగా కుట్టివుండేది. కుర్చీతోబాటు ఒక కంచు మరచెంబు నిండా మంచి నీళ్ళు, గ్లాసు, వెండి కంచం వచ్చేవి. అవసరమైతే ఇంటి నుంచి మంచినీళ్ల బిందె కూడా వచ్చేది. మంచి నీళ్లలో తేనె కలుపుకొని తాగడం రామారావుకి అలవాటు.

✍️రాజకీయ ప్రవేశం:

1982 మార్చి 29 న
తెలుగుదేశం  పార్టీని స్థాపించి ఎన్టీఆర్ ప్రజలను చైతన్య పరుస్తూ చైతన్యరథంపై ఆంధ్ర ప్రదేశ్ నలుమూలలకూ ప్రచార యాత్రను సాగించాడు.ఎన్నికల్లో విజయం సాధించిశఆంధ్ర ప్రదేశ్ లో మొదటి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత అతను ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు.

పేదవాడి కడుపు నింపే రెండు రూపాయలకు కిలోబియ్యం, సగం ధరకే చేనేత వస్త్రాలు, రైతన్నకు సబ్సిడీపై విద్యుత్‌ తదితర ప్రజాకర్షక, ప్రజాసంక్షేమ పథకాలు తిరుగులేని విజయాన్ని అందించాయి. ఆడిన మాట తప్పని "అన్న"ఎన్‌టిఆర్‌ అధికారంలో కొనసాగినంత కాలం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు.
1989 ఎన్నికల్లో ఓటమి చెందారు.1994లో గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చారు.తెలుగు దేశం పార్టీలో అంతర్గత పరిస్థితుల కారణంగా ఎన్‌టిఆర్‌  ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు.
అంతటితో ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసినట్లయింది. తర్వాత  1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించాడు.

✍️బుద్ధుడి విగ్రహాం:

ఎన్టీఆర్ ఒకసారి న్యూ యార్క్ వెళ్లినప్పుడు అక్కడి స్టాట్యూ అఫ్ లిబర్టీని చూసి మైమరచిపోయారoట. అలాంటి విగ్రహం హైదరాబాద్‌లో కుడా ఉండాలని ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని  నెలకొల్పారు.

✍️సమయస్పూర్తి:

ఎన్టీఆర్ కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వరుడు లాంటి పురాణ పాత్రలు చేసిన సినిమాల్లో ఎడమచేతితోనే ఆశీర్వదించేవారు, అభయం ఇచ్చేవారు.
అలా ఎందుకని చాలా మందికి సందేహం ఉండేది, కొందరు ఆయన్నే డైరెక్టుగా అడిగారు కూడా.
దానికి ఎన్టీఆర్ స్పందిస్తూ.. "మన హృదయం ఉన్నది ఎడమవైపు. పూజలలో భార్యను ఎడమవైపే కూర్చోబెట్టుకుంటాం. మన శరీరంలోని మాలిన్యాన్ని శుభ్రం చేసేది కూడా ఎడమ చెయ్యే. ఎడమ భాగానికున్న ప్రాధాన్యత కుడి భాగానికి లేదు. అందుకే ఎడమ చేతితోనే ఆశీర్వదిస్తున్నాను" అన్నారట..
అవతలివారు ఆశ్చర్యపోయాక అసలు గుట్టు విప్పేవారట ఎన్టీఆర్. సినిమాల్లో తీసే అడ్వెంచర్స్, ఫైటింగుల వల్ల, ఒక రోడ్డు ప్రమాదం వల్ల ఎన్టీఆర్ కుడిచెయ్యి నాలుగు సార్లు విరిగింది. వరుస ప్రమాదాలతో కుడిచేయి పట్టు తప్పడంతో ఎడమచేత్తోనే దీవెనలు ఇవ్వడం ప్రారంభించారట ఎన్టీఆర్.

✍️ముఖ్యమంత్రి హోదాలో పెళ్లి పెద్దగా ఎన్టీఆర్!

ఎన్టీఆర్‌ స్వయంగా ఓ పెళ్లికి పౌరోహిత్యం వహించారన్న సంగతి అతి తక్కువమందికి మాత్రమే తెలిసిన విషయం. అదీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో పెళ్లి పెద్దగా వ్యవహరించడం విశేషం. ఆయన పౌరహిత్యంలో ఒక్కటైన ఆనాటి వధూవరులు నాగభైరవ వీరబాబు.
 
✍️జూలై 7, 1988... ఉదయం 6గంటల 40 నిమిషాలకు వివాహ ముహూర్తం... ఒంగోలు పట్టణం రాంనగర్‌లోని టొబాకో సంస్థ ప్రాంగణంలో కళ్యాణ వేదిక. వధూవరులను ఆశీర్వదించడానికి హాజరైన ఎన్టీఆర్‌ ‘‘కవి గారూ’’ అంటూ నాగభైరవ కోటేశ్వరరావు (పెళ్లికొడుకు తండ్రి)ని దగ్గరకు పిలిచి చెవిలో ఏదో చెప్పారు.
అప్పటిదాకా వేదికపై ఉన్న పురోహితుడు వేదిక దిగాడు. ఆయన స్థానంలో ఎన్టీఆర్‌ ఆశీనులయ్యారు. అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. సర్వత్రా ఏం జరగబో తోందనే ఉత్కంఠ. ఎన్టీఆర్‌ మైక్‌ అందుకున్నారు. ‘‘సంస్కృతంలో ఉన్న వివాహ మంత్రాల అర్థం వీరికి తెలీదు. భార్యాభర్తల అన్యోన్యత, దాంపత్యం గురించి వివరించే ఆ మంత్రాల పరమార్థాన్ని మనకు అర్థమైన తెలుగులో చెప్పి ఈ పెళ్లి నేనే జరిపిస్తాను’’ అన్నారు.
వివాహవ్యవస్థ ఔన్నత్యాన్ని, సప్తపది, తాళి పరమార్థాన్ని అచ్చమైన తెలుగులో వివరించారాయన. మా చేత పెళ్లి ప్రమాణాలు చేయించారు. 
"ఆ! మేళగాళ్ళూ కానివ్వండి.!’’ అంటూ ఆయనే స్వయంగా బాజాభజంత్రీలను పురమాయించారు. ఎన్టీఆర్‌ గారు పెళ్లి మంత్రాలన్నింటినీ కంఠతా ఆలపించడం విశేషం. 

✍️కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి రచించిన ‘వివాహ విధి’ గ్రంథం ఆధారంగా ఎన్టీఆర్‌ వివాహ మంత్రాల అర్థాన్ని వివరిస్తూ, విపులీకరిస్తూ వధూవరులతో ప్రమాణాలు చేయించారు.సప్తపది, జీలకర్ర బెల్లం, మంగళసూత్ర ధారణ పవిత్రను, పరమార్థాన్ని వివరించారు.
✍️ఆ తర్వాత ఎన్టీఆర్‌ని ఆయన సన్నిహితులు చాలామంది పెళ్లి పెద్దగా హాజరవ్వాల్సిందిగా విన్నవిస్తే ‘‘కవిగారిపై నాకున్న అభిమానంతో వారి కుమారుడి వివాహానికి పౌరోహిత్యం చేశాను. ఆ అవకాశం వారికి మాత్రమే సొంతం’’ అని అన్నట్లు ‘నందమూరితో నా అనుభవాలు’ పుస్తకంలో నాగభైరవ కోటేశ్వరరావు రాశారు.

✍️చిత్రజగతి, చిత్రవిచిత్ర రాజకీయ రణస్థలిలోనూ రాణకెక్కిన రాణ్మౌళి. సరస సమ్మోహన రూపం, నవ నవోన్మేష ప్రతిభా భాస్వంత చైతన్య స్వరూపం నందమూరి తారకరామ నామధేయం. ఆయన జీవితం ధ్యేయానికి  కట్టుబడినఅధ్యాయం.
నటుడు,నిర్మాత,  దర్శకుడు, నాయకుడు, ప్రతినాయకుడు, ప్రతిపక్షనాయకుడు, చిత్రకారుడు. చిత్ర జీవితంలోనే కాదు, నిజజీవితంలోనూ ఇన్ని పాత్రలు పోషించి, శాసించి, భాసించిన ప్రభంజనుడు.

✍️ఎన్టీఆర్‌ ఈ భూమి మీద లేకపోయినా తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన తారక రాముడి ఖ్యాతి తెలుగు వెలుగు ఉన్నంత కాలం శాశ్వతం.

0 comments:

Post a Comment