Saturday, December 10, 2022

డాక్టర్ కట్ట'మంచి' రామలింగారెడ్డి గారి జయంతి

💐🙏సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత,  ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు
సాహితీ శ్రామికుడు నవ్యతకు నాయకుడు, బహుముఖ ప్రజ్ఞావంతుడు డాక్టర్ కట్ట'మంచి' రామలింగారెడ్డి గారి జయంతి సందర్భంగా🙏




💐

 ##చదువుకునే రోజుల్లోనే రామలింగారెడ్డి గారు  ఇంగ్లాండు జరిగిన ఎన్నికలలో లిబరల్ పార్టీ తరఫున వ్యూహకర్త గ ఉండీ,ప్రచారం చేసి, ఆ పార్టీ అధికారంలోకి రావటానికి కారకులయ్యారు##

#విమర్శలకు వెరవని నిండైన వ్యక్తీకరణ! సాహితీగగనంలో, విమర్శాక్షేత్రంలో దిక్సూచి! చెలియలికట్టల మధ్య బందీ అయిన సాహిత్యంలో కొండగాలి! ఆధునిక తెలుగు సమాజంలో రాజకీయాలకు కొత్త రంగు, రుచి.. కట్టమంచి.

దేశం బ్రిటిషు వలసపాలనలో మగ్గుతున్న రోజులవి. వ్యక్తి స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్య్రం అంటేనే నిర్బంధించే సంక్షుభిత పరిస్థితులవి. అలాంటి గడ్డురోజుల్లో చదువుకుని, అచంచల #మేధోసంపన్నుడిగా ఎదిగిన వ్యక్తి ‘కళాప్రపూర్ణ’ కట్టమంచి రామలింగారెడ్డి. సాహితీవేత్తగా, వక్తగా, విమర్శకుడిగా, విద్యావేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, అనేక రంగాల్లో తెలుగునాట తనదైన ముద్రవేశారాయన. 

‘‘గత శత వసంతాల తెలుగు సాహిత్య ప్రస్థానాన్ని గురించి ఆలోచించేటప్పుడు మొట్టమొదట మనసులో మెదిలే కొద్దిమంది వైతాళికుల్లో కట్టమంచి #రామలింగారెడ్డి గారొకరు. 1899లో తన 19 సంవత్సరాల వయస్సులో వారు రాసి ప్రచురించిన ‘ముసలమ్మ మరణము’ తెలుగు కవిత్వంలోకి ఒక కొత్త ఆలోచనను, ఆధునిక ఇతివృత్తాన్నీ తెలుగు కవిత్వంలోకి ప్రవేశపెట్టింది. 
ఆంధ్ర విశ్వవిద్యాలయం అనేది ఇప్పుడు వాడుకలో ఉన్న పేరు. విశాఖపట్నంలోని వాల్తేరు తీరంలో 1926లో స్థాపించినప్పుడు అది ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు! తెలుగువారి కోసం ఏర్పాటయిన తొలి విశ్వవిద్యాలయం. అయితే, యూనివర్సిటీని బెజవాడలో నెలకొల్పాలా లేక విశాఖలో స్థాపించాలా అనే తర్జనభర్జన సాగింది. బెజవాడలో పెట్టేద్దామనుకొని, ఒక సెంటర్‌ను కూడా కొంతకాలం తాత్కాలికంగా నడిపారని చెబుతారు. బెజవాడలో వేడి ఎక్కువగా ఉన్నదని, చల్లని విశాఖ ఒడ్డునే చివరకు ఖాయంచేశారు. యూనివర్సిటీ ఏర్పాటు విషయమై తీవ్ర మధనం సాగించిన పెద్దలు, తొలి ఉపాధ్యక్షుని ఎంపిక విషయంలో మాత్రం పెద్దగా ఆలోచించలేదు. కూడబలుక్కొన్నట్టు అంతా కట్టమంచి రామలింగారెడ్డి పేరునే ఆ పదవికి సూచించారట! 

#బాల్యం-విద్య:

భాషలో, సాహిత్యంలో, కళా విమర్శలో, ప్రజా రాజకీయాల్లో సవ్యసాచి అయిన కట్టమంచి.. 1880 డిసెంబరు 10న చిత్తూరులోని కట్టమంచి గ్రామంలో జన్మించారు. తండ్రి సుబ్రహ్మణ్యంరెడ్డి, గురువు కుప్పయ్య ప్రభావంతో తెలుగు సాహిత్యంపై ఆయన మక్కువ పెంచుకున్నారు. సాహిత్యమైనా, రాజకీయమైనా నిజాల్ని నిర్భయంగా వ్యక్తీకరించే విమర్శనాత్మక దృక్పథాన్ని ఆయన అనుసరించారు.

పాఠశాల ఉన్నతవిద్యను 1896 లో ప్రధమశ్రేణిలో పూర్తిచేసారు. తరువాత కళాశాల విద్యకోసం 1897 లో మద్రాస్ క్రీస్టియన్ కాలేజీలో చేరారు. ఆ కాలంలో ఆ కళాశాలకు రెవ్. Dr. మిల్లర్ గారు ప్రిన్సిపాల్ గా ఉండేవారు. డాక్టర్ స్కిన్నర్ గారు ఫిలాసఫి ప్రొఫెసర్ గా, ప్రొఫెసర్ కెల్లెట్ ఆంగ్ల భాషాధ్యాపకునిగా ఉండేవారు. శ్రీ రెడ్డి గారు వీరందరి మెప్పు పొందటమే కాకుండా, వారికి ప్రియతమ శిష్యుడిగా కూడా అయి అనతికాలంలోనే విద్యార్ధిగా తన ప్రతిభా పాటవాలను చాటుకున్నారు. కళాశాలలో ఉండగానే, తెలుగు భాషపై కూడా పట్టు సాధించారు. అంతేకాకుండా, స్కాలర్ షిప్ ను కూడా పొందారు.

#ముసలమ్మ మరణం:

 'ముసలమ్మ మరణం' అనే కావ్యాన్ని సాంప్రదాయ ప్రబంధ గ్రందాల రీతిలో రచించి, ప్రఖ్యాతి గాంచారు. 1899లో వ్రాసి, 1900లో ప్రచురింపబడిన 'ముసలమ్మ మరణము' 107 పద్య, గద్యాల కావ్యం. ఇది మద్రాసు క్రైస్తవ కళాశాలకు చెందిన 'భాషాభిరంజని సమాజం' పోటీ కోసం వ్రాసినది.బహుమతులను పొందింది.

#కవిత్వ తత్త్వ విచారము:

కవిత్వతత్త్వ విచారం’లో కవిత్వం అంటే ఎలా ఉండాలి! మంచి కవిత్వానికి ఉండాల్సిన లక్షణాలేంటీ! అసలు ‘కళాపూర్ణోదయం’ ఎందుకు గొప్ప కావ్యమయ్యిందీ! ఇలాంటి విషయాలెన్నింటినో చర్చించారు రామలింగారెడ్డి.కళాశాల రోజుల్లోనే పింగళి సూరన ‘కళాపూర్ణోదయం’ మీద రామలింగారెడ్డి విమర్శనాత్మక ఉపన్యాసం ఇచ్చారు. ఆ తర్వాత 1914లో మైసూరు విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉన్నప్పుడు నాటి ప్రసంగాన్ని విస్తరించి రాతరూపంలోకి తీసుకొచ్చి ‘కవిత్వ తత్త్వ విచారము’ అనే సాహిత్య విమర్శగా ప్రచురించారు.

#అన్ని రంగాల్లో #ప్రధముడిగా...

1901లో ఫిలాసఫిలో డిగ్రీ పట్టాను పుచ్చుకోవటమే కాకుండా అనేక విశ్వవిద్యాలయాల నుండి బహుమతులను పొందారు. అటు పిమ్మట ప్రభుత్వ ఉపకార వేతనంతో 1902లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించారు. కేంబ్రిడ్జిలోఆయన చదివిన కాలేజి పేరు సెయింట్ జాన్స్ కాలేజి. ఇదే కాలేజిలో ప్రముఖ ఆంగ్లకవి విలియం వర్డ్స్ వర్త్ కూడా చదువుకున్నారట! మద్రాస్ క్రీస్టియన్ కాలేజిలో లాగానే, ఇక్కడ కూడా అన్ని రంగాల్లో ప్రధముడిగా నిలిచారు. ఆ రోజుల్లోనే ప్రముఖ వక్తగా కూడా రాణించారు.
 
#లిబరల్ క్లబ్ కు......

లిబరల్ క్లబ్ అనే సంస్థకు వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన తొలి విదేశీయుడీయనే! జాన్ మేనార్డ్ కేయన్స్ అనే వ్యక్తి సెక్రటరీగా ఉండేవారు. (తరువాతి రోజుల్లో ఈయనే ప్రఖ్యాత ఆర్ధిక వేత్తగా పేరొందారు). 31-10-1905న శ్రీ కట్టమంచి, గోపాలకృష్ణ గోఖలే గారిని ప్రసంగించటానికి క్లబ్ కు ఆహ్వానించారు.

#వ్యూహకర్తగా:

  ##ఇంగ్లాండు   చదువుకునే రోజుల్లోనే రామలింగారెడ్డి గారు అక్కడ జరిగిన ఎన్నికలలో లిబరల్ పార్టీ తరఫున వ్యూహకర్త గ ఉండీ,ప్రచారం చేసి, ఆ పార్టీ అధికారంలోకి రావటానికి #కారకులయ్యారు.##

1907 లో స్వదేశానికి తిరిగి వచ్చారు. శ్రీ అరబింద్ ఘోష్ వలన ఖాళీ అయిన వైస్ ప్రిన్సిపాల్ పదవిలో బరోడాలోని బరోడా కాలేజీలో చేరారు. ఆయన ఒక ప్రముఖ ఉపన్యాసకుడిగా పేరు తెచ్చుకున్నారు. 

#పాఠశాలలు లేని గ్రామాల్లో కొత్త బడుల ఏర్పాటు....

#అమెరికా, ఫిలిప్పీన్స్, జపానుల్లో పర్యటించి అక్కడ విద్యా సంస్థల్ని, విద్యా విధానాలనూ కట్టమంచి పరిశీలించారు. మైసూరు మహారాజు కళాశాల ప్రధానాచార్యునిగా, విశ్వ విద్యాలయం రూపకర్తగా, విద్యాశాఖా ధికారిగా వివిధ హోదాల్లో పన్నెండేళ్ల పాటు పనిచేశారు. ఆ రోజుల్లో కట్టమంచి పాఠాలు వినేందుకు ఆయన విద్యార్థులు కానివారు కూడా వచ్చేవారట! 1916లో ఏర్పాటైన మైసూరు విశ్వ విద్యాలయం కట్టమంచి కృషి ఫలితమే. 1918లో కర్ణాటక రాష్ట్ర #ఇన్‌స్పెక్టరు జనరల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌గా రామలింగారెడ్డి నియమితులయ్యారు. ఆ సమయంలో పాఠశాలలు లేని గ్రామాల్లో కొత్త బడుల ఏర్పాటు కోసం ఓ ప్రణాళికను సిద్ధం చేశారు. దళితులకు పాఠశాల ప్రవేశం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. 

#శాసన మండలికి......

#బ్రిటీషువారికి వ్యతిరేకంగా గాంధీ నాయకత్వంలో సహాయనిరాకర ణోద్యమం ముమ్మరంగా కొనసాగుతున్న రోజుల్లో కట్టమంచి అధ్యాపకత్వానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. కొంతకాలం జస్టిస్‌ పార్టీలో పనిచేసి ఆ తర్వాత యునైటెడ్‌ నేషనలిస్టు పార్టీలో చేరారు. 1935లో కాంగ్రెస్‌ తరఫున చెన్నై శాసన మండలికి ఎన్నికయ్యారు. సభలో ప్రజా సమస్యల మీద గళం విప్పి జనాదరణకు పాత్రులయ్యారు. అద్భుత ప్రసంగాలతో అప్పటి ప్రభుత్వ విధానాలను దునమాడారు.

#ఆంధ్ర విశ్వవిద్యాలయం రూపశిల్పి:

ఆంధ్ర విశ్వవిద్యాలయం రూపశిల్పి కట్టమంచి రామలింగారెడ్డి. అయితే 1930లో సత్యాగ్రహుల పట్ల బ్రిటిష్ ప్రభుత్వ దమననీతికి నిరసనగా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసారు.
రామలింగారెడ్డి గారి తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆంధ్ర యూనివర్సిటీకి ఉపాధ్యక్షులయ్యారు. వారు 1936లో ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళడంతో సి. ఆర్. రెడ్డి గారు తిరిగి ఉపాధ్యక్షులుగా నియమితులై 1949 వరకు సమర్థవంతంగా పనిచేసారు. ఆ తర్వాత 1949 సెప్టెంబర్ లో మైసూరు విశ్వవిద్యాలయ ప్రొ-ఛాన్సెలర్ గా కొంతకాలం బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన కొనసాగించిన సంస్కరణలను, విద్యావిధానాలను నేటికీ కన్నడ ప్రజలు తలచుకుంటారు. మహాత్మా గాంధి గారి కన్నా ముందే హరిజన సంస్కరణలు ప్రారంభించిన గొప్ప సంస్కర్త ఈయన. విద్యను అభ్యసించటానికి కులం అడ్డుకాదని నొక్కి వక్కాణించిన చైతన్యమూర్తి శ్రీ కట్టమంచి. దేశ విభజన కట్టమంచి వారిని బాధించింది. 1942లో లభించిన #సర్ బిరుదును #స్వాతంత్య్రానంతరం త్యజించారు.

వీరు తెలుగుని "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ " అని నిర్వచించారు. వీరు ఆజన్మాంతం బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. 1951 ఫిబ్రవరి 24న సి. ఆర్. రెడ్డి గారు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. వీరి విగ్రహాలు పలుచోట్ల ఉన్నాయి. ఏలూరులో వీరి పేరు మీద ఒక పెద్ద కళాశాలను స్థాపించారు. ఆ కళాశాలలో చదువుకున్న ఎందరో విద్యార్ధులు ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. ఆ కళాశాలను స్వయం ప్రతిపత్తిగల ఒక విశ్వవిద్యాలయంగా ప్రభుత్వం గుర్తించింది. #కళాప్రపూర్ణ కట్టమంచి రామలింగారెడ్డి లాంటి ఉదాత్త చరితులు అరుదుగా జన్మిస్తుంటారు. 
🙏💐🌹🌺🌷💐🙏

0 comments:

Post a Comment