Sunday, December 4, 2022

ఘంటసాల వెంకటేశ్వరావు గారి శతజయంతి

🙏🎸🎻తెలుగు సినీ సంగీత ప్రపంచాన్ని అనేక దశాబ్దాలు తన గాన మాధుర్యంతో ఉర్రూతలూగించిన గాన గంధర్వుడు,అమర గాయకుడు...... స్వరబ్రహ్మ ఘంటసాల వెంకటేశ్వరావు గారి శతజయంతి సందర్భంగా🎻🎸🙏

【ఘంటసాల వెంకటేశ్వరావు గారి శతజయంతి జయంతి ఉత్సవాలు సందర్భంగా】





#పాటకు ప్రాణం పోసిన స్వరం ఆయనది. ఆయన పాట అలసిన మనసును సేదతీరుస్తుంది. వెన్నెల్లో #జోలపాడుతుంది. ముద్దుచేస్తూ గోరుముద్దలు తినిపిస్తుంది. కోటి వీణియలను తనలోనే దాచుకుని తుమ్మెద నాదమై మన చెవిని చేరుతుంది.వేణువులోకి దూరే పిల్లగాలులోలె సవ్వడి చేస్తుంది. ఉషోదయ సుప్రభాతమై నిద్రలేపుతుంది. భానుడి రవికిరణమై నులివెచ్చగా మదిని తాకుతుంది.తెలుగు సినిమా చరిత్రలో ఆణిముత్యాలన్నీ ఆ గొంతుక నుంచి జాలువారినవే.తన పాటను ప్రతినోట పలికించి కంఠశాలగా నిలిచారు గంధర్వ #గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు.
గాయకులు చాలామంది ఉంటారు.కానీ గంధర్వ గాయకులు శతాబ్దానికి ఒక్కరో ఇద్దరో జన్మిస్తారు. ఎప్పటికీ గంధర్వ గాయకుడు శ్రీ ఘంటసాల. ఘంటసాల అనే పదాన్ని తెలుగు నిఘంటువులో చేర్చి దానికి అర్ధంగా 'బాగా పాటలు పాడేవాడు' అని చెప్పుకోవచ్చు.

ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తెలుగు సినిమా తొలితరము నేపధ్యగాయకులలో ప్రముఖుడు.  ఘంటసాల ఒక తెలుగు సినీ నేపధ్యగాయకుడిగా మాత్రమే మనందరికీ తెలుసు. అయితే, ఆయన గాన గాంధర్వం ఒక్క తెలుగు భాషకే పరిమితం కాలేదు. తమిళం, కన్నడం, మళయాళం, సింహళం, చివరకు హిందీలో కూడా పాడారు.

#బాల్యం-తొలి జీవితం:

ఘంటసాల 1922 డిసెంబర్ 4 న గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించాడు. సూర్యనారాయణ మృదంగం వాయిస్తూ, భజనలు చేసేవారు. అతను ఘంటసాలను భుజం పైన కూర్చోబెట్టుకొని పాటలు పాడుతూ సంగీత సభాస్థలికి తీసుకెళ్ళేవారు. ఘంటసాల అక్కడ జరుగుతున్న భజనలు వింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవాడు. ఘంటసాల నాట్యానికి ముగ్ధులయి అతన్ని 'బాల భరతుడు ' అని పిలిచేవారు. ఘంటసాల 11వ ఏట సూర్యనారాయణ మరణించారు. చివరి రోజుల్లో అతను సంగీతం గొప్పదనాన్ని ఘంటసాలకు వివరించి ఘంటసాలను గొప్ప సంగీత విద్వాంసుడిని అవమని కోరారు. 

#సీతారామశాస్త్రిగారి వద్ద సంగీత శిక్షణ:

 పదకొండేళ్ళకే తండ్రిని కోల్పోయిన వెంకటేశ్వరరావుకు పేదరికపు కష్టాలు చిన్న వయసులోనే ఎదురయాయి. చదువు సరిగ్గా సాగకపోయినా తన తండ్రి కోరినట్టుగా సంగీతం అభ్యసించాలనే పట్టుదలతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అతను విజయనగరం వెళ్ళి సంగీత కళాశాలలో చేరాడు. ఆరేళ్ళపాటు గురువు పట్రాయని సీతారామశాస్త్రిగారి వద్ద సంగీత శిక్షణ సాగింది.  ఘంటసాల వెంకటేశ్వరరావు మొదట్లో జోలె భుజాన వేసుకుని మధూకరం ద్వారా పొట్ట పోషించుకోవలసి కూడా వచ్చింది. ఏలాగైతేనేం సంగీతంలో పట్టభద్రుడయ్యాడు. శాస్త్రిగారి నుంచి ఘంటసాలకు శ్రుతిశుద్ధి, నాదశుద్ధి, గమకశుద్ధి, తాళగత, స్వరగత లయశుద్ధి అలవడ్డాయి. పాటల్లో సాహిత్యం ముఖ్యమనే అవగాహన కలిగింది.

#కచేరీలూ, హరికథలూ, రేడియో కార్యక్రమాలు.....

కొన్నాళ్ళు కచేరీలూ, హరికథలూ, రేడియో కార్యక్రమాలతో గడిచాయి. స్టేజినాటకాల్లో నటించే అవకాశాలు కూడా కలిగాయి. పెద్దలంతా మెచ్చుకున్నారు కాని ఆదాయం మాత్రం పెరగలేదు. ఇంతలో 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంవల్ల ప్రభావితుడైన ఘంటసాల దేశభక్తి గేయాలను గానం చేస్తూ కొన్నాళ్ళు జెయిలు శిక్ష కూడా అనుభవించాడు. ఆ పాటల రికార్డులు విశేష జనాదరణ పొందాయి. 

#సినీ రంగంలో ప్రవేశం:

ఆ రోజుల్లోనే ఆయనకు వివాహం జరగడం, అత్తవారి ఊరిలో సినీ రచయిత సముద్రాల సీనియర్‌తో పరిచయం కలిగాయి. సముద్రాల ద్వారా 1944లో ఘంటసాల సినీ రంగంలో ప్రవేశించాడు. మొదట్లో అక్కినేని నాగేశ్వరరావు పాటలతోనూ, ఘంటసాల నటనతోనూ ఒకేసారి కుస్తీ పడుతూండేవారు. ప్లేబాక్‌ పద్ధతి రావడం తో ఎవరి పాత్ర వారికి లభించినట్టయింది. సినీ నేపథ్య గాయకుడిగా త్వరలోనే ఆయనకు ఎనలేని గుర్తింపు వచ్చింది.

#పాటలో నటించడం ఆయనకు సహజంగా అబ్బిన విద్య. ఆయన గాత్రంలో ఉన్న లాలిత్యం, దానితో బాటు గాంభీర్యం; మూడు స్థాయిలలోనూ అవలీలగా పలికే రాగ భావం, #శబ్దోచ్చారణలోని స్పష్టత, రాగాల గురించిన నిర్దుష్టమైన అవగాహన ఇలా ఎన్నో ఉత్తమ లక్షణలు ఆయన పాటలను తీర్చి దిద్దాయి.
#బాల్యం ఆయన పాడిన శకంలో ఉద్దండులైన సంగీత దర్శకులుండేవారు. రాజేశ్వరరావు, సి.ఆర్‌.సుబ్బరామన్‌, పెండ్యాల, ఆదినారాయణరావు, సుసర్ల దక్షిణామూర్తి వంటివారి గొప్పదనం ఘంటసాల పాటలకు ఎక్కువ దోహదం చేసిందో, ఆయన వల్ల వారంతా రాణించారో చెప్పడం కష్టం. స్వరకర్తలూ గాయకులే కాక పాటల రచయితలూ, బి.ఎన్‌.రెడ్డి వంటి సినీ దర్శకులూ పాటల పట్ల ఎంతో శ్రద్ధ చూపేవారు కనుకనే అటువంటి సంగీతం తయారయింది. ఈ నాటి సంగీతంలో లోపాలున్నాయంటే అందుకు కారణం “రాగాల్లోనూ, బాణీల్లోనూ వెయ్యవలసినవీ, వెయ్యకూడనివీ గమకాలూ, సున్నితమైన అనుస్వరాలూ ఉంటాయి” అనేది పాడేవారికీ పాటలు కట్టేవారికీ కూడా తెలియకపోవడమే.

#ఘంటసాల పాడడం మొదలెట్టిన రోజుల్లో......

ఘంటసాల పాడడం మొదలెట్టిన రోజుల్లో అప్పటికే పేరు పొందిన ఎం.ఎస్‌. రామారావు, ఎస్‌.రాజేశ్వర రావు వంటి గాయకులలో వినిపించని నిండుదనం, తెలుగుదనం (నేటివిటీ) మొదటిసారిగా ఘంటసాల పాటలలో వినిపించి శ్రోతలను ఆకట్టుకున్నాయి. లైలా మజ్నూలో సుసర్ల దక్షిణామూర్తి, మాధవపెద్ది సత్యం, ఘంటసాల కలిసి పాడిన “మనుచుగా తా ఖుదా తోడై” అనే పాటలో హీరో ఎవరో గుర్తు పట్టడం చాలా తేలిక. అది 1949నాటి సినిమా. అప్పటికి స్టార్‌ సిస్టం అమలులోకి రాలేదు. బాగా పాడేవారినే హీరోకు ఎన్నుకునేవారు. ఘంటసాల తరవాత సినిమాల్లో పాడడానికి వచ్చిన మాధవపెద్ది సత్యం, ఏ.ఎం.రాజా, పి.బి.శ్రీనివాస్‌ తదితరులు ఈనాటి గాయకుల కన్న ఎంతో ప్రతిభావంతులే. అయినప్పటికీ వారు ఘంటసాలకు సమకాలికులు కావడంతో ఆయనకు సరితూగలేక పోయారు. అంతేకాదు. ఎన్నో దశాబ్దాలపాటు సినీ హీరోలుగా అగ్రస్థానంలో ఉన్న, రామారావు, నాగేశ్వరరావులు ఘంటసాల పాడందే నటించేవారు కాదు.

#విజయావారు సంస్థలో:

ఒకప్పుడు విజయావారు తమ నిర్మాణ సంస్థలో ఇతర కళాకారులతోబాటు ఘంటసాలను నెల జీతం మీద నియమించారు. అందులో ఇతర సంస్థలకు పని చెయ్యరాదనే నిబంధన ఉండడం వల్ల ఘంటసాల వంటి ఉత్తమ కళాకారులకు అది కుదరని పరిస్థితి అయింది. #మిస్సమ్మ సినిమాకు సంగీత దర్శకుడుగా కాని, గాయకుడుగా కాని ఆయన పని చెయ్యక పోవడానికి కారణం ఇదేనంటారు. కారణాలు ఏవైనా ఘంటసాల పాడినంత కాలమూ ఆయనకు పోటీ లేకుండా పోయింది. ఏపాటకు ఎంత మోతాదులో భావం పలికించాలో ఆయనకు ఎవరూ వివరించనవసరం లేదని అనిపిస్తూండేది. తరవాతి తరం గాయకులలాగా కృత్రిమంగా, కష్టపడి భావం కోసం ఆయన ఎన్నడూ ప్రయత్నించలేదు.

#సంగీత దర్శకుడుగా:

ఘంటసాల సంగీత దర్శకుడుగా కనబరిచిన ప్రతిభ ఆయన గాయకుడుగా సాధించిన విజయం వల్ల కొంత మరుగున పడింది. 1950 ప్రాంతాల తీసిన పెళ్ళిచేసిచూడు లోనే ఆయన చక్రవాకం (ఏడుకొండలవాడ), చారుకేశి (ఎవరో ఎవరో) వంటి కర్ణాటక రాగాలను అతి సమర్థవంతంగా సినీగీతాలకు వాడుకున్నాడు. హిందోళం ఎప్పుడు ఉపయోగించినా అందులో పంచమం పలికించడం ఆయనకు సరదా అనిపిస్తుంది. రాగేశ్రీ వంటి హిందూస్తానీ రాగాలను కూడా ఆయన “ఇది నాచెలి” (చంద్రహారం), “అన్నానా భామిని” (సారంగధర) వగైరా పాటల్లో ఉపయోగించాడు. కుంతీకుమారి పద్యాల్లో కర్ణాటక రాగాలైన హేమావతి, బిలహరి, మాయామాళవగౌళ, అమృతవర్షిణి, హిందూస్తానీ రాగాలైన లలిత్‌ వంటివి అనేకం వినిపిస్తాయి. లలితసంగీతానికి పనికిరావనిపించే రంజని, భైరవి వంటి కర్ణాటక రాగాలను ఆయన తన కరుణశ్రీ పద్యాల్లో అద్భుతంగా ఉపయోగించాడు. ఇది విద్వాంసులు సైతం గుర్తించవలసిన విషయం. ఏ రాగం ఎక్కడ వాడినా రాగభావాన్ని చెడనివ్వలేదు. మాటల్లోని అర్థమూ కనుమరుగవలేదు. రహస్యం సినిమాలో సందర్భాన్ని బట్టి సరస్వతి, లలిత వంటి దేవతల పేర్లున్న రాగాలలో ఆయన స్వరరచన చేశాడు. రాజేశ్వర రావు, పెండ్యాల వంటి సంగీత దర్శకులు అతి ప్రతిభావంతులే అయినా రాగాల మీద ఘంటసాలకు ఉండిన అధికారం వారికన్నా ఎక్కువేమో.
#ఘంటసాల స్వయంగా తాను సంగీతదర్శకుడు అయినప్పటికీ ఆర్కెస్ట్రాలో దిట్ట అయిన సి.ఆర్‌.#సుబ్బరామన్‌ వద్ద అసిస్టెంటుగా పనిచేసి ఎంతో అనుభవం గడించాడు.

#మాయాబజార్‌లో:

మాయాబజార్‌లోని నాలుగు యుగళగీతాలూ మొదట రాజేశ్వరరావు స్వరపరచారట. తక్కినవన్నీ నిస్సందేహంగా ఘంటసాలవే. చారుకేశిలో సత్యంచేత “భళిభళిదేవా” పాడించి ఘటోత్కచుడికి 
**“#వివాహ భోజనంబు” కూడా పాడించిన ఘనత ఆయనదే. ఇది Laughing policeman అనే పాత ఇంగ్లీషు పాటకు అనుకరణ. ఒరిజినల్‌ పాట చతురశ్రంలో సాగితే తెలుగు పాట స్వింగ్‌ రిధంలో వినబడుతుంది. పోలీసువాడి నవ్వుని రాక్షసుడి వికటాట్టహాసంగా మార్చిన ఘనత #ఘంటసాలదీ, పింగళిదీ, కె.వి.రెడ్డిిదీ కావచ్చు.**

ఈ #లుంగీ వాలా ఏం #పాడతాడు లే!....

జీవిత చక్రం కొత్తదనం కోసం ప్రఖ్యాత హిందీ సంగీత దర్శకులైన శంకర్‌-జైకిషన్‌ను ఆ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చమని కోరారు. బొంబాయిలో పాటల రికార్డింగ్‌ కోసం మద్రాస్‌ నుంచి గాయనీ గాయకుల్ని పిలిపించారు. విమానంలో ఘంటసాల బొంబాయి చేరుకున్నారు
ఘంటసాల రికార్డింగ్‌ థియేటర్‌లోకి అడుగు పెట్టగానే అక్కడున్న బొంబాయి ఆర్కెస్ట్రా జనం ఆశ్చర్యపోయారు. కారణం ఘంటసాల వేషధారణ అతి సామాన్యంగా ఉంది. తెల్లని లాల్చీ, లుంగీ, సాధారణమైన ఆకు చెప్పులతో ఉన్న ఘంటసాలలో సెలెబ్రిటీ లక్షణాలు బొత్తిగా కనిపించలేదు. ఆయన్ని చూడగానే ‘ఈ లుంగీవాలా ఏం పాడతాడు లే!’ అని బొంబాయి వాలాలు గుసగుసలుపోయారట. ఘంటసాల తెలుగు పాటల్ని పరిశీలించారు. శంకర్‌-జైకిషన్లతో మాట్లాడి ట్యూన్స్‌ తెలుసుకొన్నారు. చిన్న రిహార్సల్‌ వేసుకొని, రెడీ అంటూ టేక్‌ కోసం మైక్‌ ముందు నిల్చున్నారు. రికార్డింగ్‌ థియేటర్లో సైలెన్స్‌... ఘంటసాల తన గంభీరమైన గొంతును విప్పారు.
బొంబాయిలోని అత్యంత ఆధునికమైన రికార్డింగ్‌ యంత్రాలు ఒక్కసారి ప్రతిధ్వనించాయి. అంత వరకు ఈ లుంగీ వాలా ఏం పాడతాడు లే! అని లైట్‌ గా తీసుకొన్న బొంబాయి ఆర్కెస్ట్రా వారికి చెవిలో సముద్రపు హోరులాగా ఘంటసాల మాస్టారి గొంతు వినిపించింది. రికార్డింగ్‌ పూర్తయింది. పాట బ్రహ్మాండంగా వచ్చిందంటూ శంకర్‌-జైకిషన్లు ఘంటసాలని అభినందించారు. దాంతో తల దించుకోవడం ఆర్కెస్ట్రా సభ్యుల వంతయింది.

#వ్యక్తిగతంగా ఘంటసాల ఎంతో #మంచివాడు..... #వినయసంపన్నుడు.....

వ్యక్తిగతంగా ఘంటసాల ఎంతో మంచివాడనీ వినయసంపన్నుడనీ ఆయన సమకాలికులకు తెలిసినదే.  మద్రాసుకు ఉస్తాద్‌ బడే గులాం అలీఖాన్‌గారు వచ్చినప్పుడు ఆయనను ఘంటసాల కోరి తమ ఇంటో అతిథిగా ఉంచుకున్నాడు. ఉస్తాద్‌గారంటే ఆయనకు అంత అభిమానం.

జాషువా గారు వ్రాసిన శిశువు(పాపాయి) అనే ఖండికను ఘంటసాల గారు అద్భుతంగా గానం చేశారు. ఈ సందర్భంలో గాన గంధర్వుడు ఘంటసాల గారు పాడే సందర్భంలో, రికార్డింగ్ జరిగే సమయంలో శ్రీ జాషువా గారు ఘంటసాల వారి యింటికి వచ్చి, బయట అరుగు మీద కూర్చున్నారట. ఘంటసాల గారు, బయటకు వచ్చి, "ఏమిటండీ! బయటనే కూర్చున్నారు" అని అడిగితే, అందుకు జాషువా గారు "నేను అంటరాని కులమునకు చెందిన వాడను, మీరు బ్రాహ్మణులు, మీ అనుమతి లేకుండా లోపలి ఎలా రాగలను?" అన్నారట. అందుకు, ఘంటసాల గారు  "నాకు అటువంటి పట్టింపులు లేవు, మీరు స్వేచ్చగా లోపలి రావచ్చు. పైగా మీరు సరస్వతీ పుత్రులు. మీరు అంటరాని వారైతే, సరస్వతీ దేవి కూడా అంటరానిదనే కదా అర్ధం!" అని చెప్పియింటిలోకి సాదరంగా తీసుకొని వెళ్లి, తన సహృదయాన్ని చాటుకొన్న ధన్యజీవి ఘంటసాల.

#పద్మశ్రీ వచ్చిన వార్త:

మద్రాసులోని ఒక తెలుగు సభలో ఆయన ఉండగానే ఆయనకు పద్మశ్రీ వచ్చిన వార్త విన్న ముదిగొండ లింగమూర్తిగారు, చాలా ఆర్భాటంగా ఆ సంగతి ప్రేక్షకులకు ప్రకటించారు. ఘంటసాలగారు లేచి అతివినయంగా అందరికీ నమస్కరించారు.  అక్కడి సభలో ఆయన “నీ కొండకు నీవే రప్పించుకో” అని ఎంతో భావోద్వేగంతో పాడాడు.

#ఆయన చేతిలో రుమాలు ఉండాల్సిందే..#

ఘంటసాలకి రికార్డింగ్‌ సమయంలో చేతిలో కర్చీఫ్‌ ఉండాలట. పొరబాటున మర్చిపోతే ‘కర్చీఫ్‌ లేకుండా ఎలా పాడటం?’ అనేవారట. అలాగే పాడేటప్పుడు కుడిచెవిని కుడి చేత్తో మూసుకోవడం ఆయనకు అలవాటు. అలా అయితేనే తన పాట తనకు స్పష్టంగా వినిపిస్తుందని ఆయన అభిప్రాయం. 

#పద్య గానంతో:

నాటకాల పద్యాల వరవడికి అలవాటుపడ్డ తెలుగు ప్రజలకు, తన పద్య గానంతో ఆకట్టుకున్నారు ఘంటసాల . లవకుశ, పాండవ వనవాసం, నర్తనశాల మొదలైన సినిమాలలో ఆయన పాడిన పద్యాలు ఆయా పాత్రలు పోషించిన వ్యక్తుల పాత్రలను ఎలివేట్ చేసాయనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు! కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్పవిలాపం, కుంతీ కుమారి ... మొదలైన గీతాలను పాడి వాటికి  ప్రాణం పోసారు. అలాగే శ్రీ జాషువా గారు వ్రాసిన శిశువు(పాపాయి) అనే గీతాన్ని భావగర్భితంగా పాడి సంగీత సాహిత్యప్రియులను ఓలలాడించారు.

#అనారోగ్యం:

1969 నుండి ఘంటసాల తరచు అనారోగ్యానికి గురయ్యేవాడు. .1970లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. 1971లో ఐరోపాలో, అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చి సంగీతప్రియులను రంజింపచేసాడు.1972లో రవీంద్రభారతిలో ప్రదర్శన ఇస్తున్నపుడు గుండెనొప్పి అనిపించడంతో హాస్పిటల్లో చేరాడు. అప్పటికే చక్కెర వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. చాలారోజులు చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యాడు.

#భగవద్గీత:

అప్పుడే ఆయనకు భగవద్గీత పాడాలన్న కోరికకలిగింది. భగవద్గీత పూర్తిచేసిన తర్వాత సినిమా పాటలు పాడకూడదు అనుకున్నాడు. 1973లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు మొదలైన హిట్ చిత్రాలకు పాటలు పాడాడు. 

#ఉన్నతమైన వ్యక్తిత్వం:

మద్రాసులో ఇల్లుకొన్నపుడు గురువుగారైన సీతారామశాస్త్రిగారికి గృహప్రవేశానికి రావడానికై టికెట్లుకొని గృహప్రవేశం రోజు వెయ్యి న్నూటపదహార్లు, పట్టుబట్టలు వెండిపళ్ళెంలో సమర్పించి సాష్టాంగ నమస్కారంచేసి అతనుపట్ల తన గౌరవాన్ని చాటుకున్నాడు. సీతారామశాస్త్రిగారి కూమారుడు పట్రాయని సంగీతరావు ఘంటసాల వద్ద సంగీత స్వరసహచరుడిగా, ఘంటసాల చివరి శ్వాస వరకు తోడుగా, ఆప్తమిత్రుడుగా ఉన్నారు.
పానగల్ పార్కులో కష్టాల్లో ఉన్నపుడు కూడా తోటివారికి ఆకలిగా ఉన్నపుడు భోజనాలు కల్పించేవాడు. సంగీతాభ్యాసం చేస్తున్నరోజుల్లో తనను 'అన్నా' అని పిలిచే స్నేహితుడు పాపారావుకు తాను గొప్పవాడినైతే వాచీ కొనిస్తానని చెప్పాడు. కొన్నేళ్ళకు పాపారావు 'అన్నా గొప్పవాడివయ్యావు కదా నా వాచీ ఏదీ' అని ఉత్తరం రాయగా నూరు రూపాయలు పంపించాడు. కానీ అప్పటికే పాపారావు టైఫాయిడ్ వచ్చి మరణించాడు. తరువాత పాపారావు కుమారుడు నరసింగరావును తనఇంట పెంచి తనకుమారుడిగా చూసేవాడు.

1974 నాటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరికి 1974 ఫిబ్రవరి 11న ఆస్పత్రిలో కన్నుమూసాడు. యావదాంధ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.

#ఘంటసాల వెంకటేశ్వరరావు మనని వదలి వెళ్ళి దాదాపు మూడు దశాబ్దాలు కావస్తున్నా ఈనాటికీ ఆయన పాటలను ఎవరూ మరిచిపోలేదు. ఆయనకు సాటి రాగల గాయకుడూ రాలేదు. #తెలుగు సినీ సంగీతపు స్వర్ణయుగానికి ప్రతీకగా ఆయన అమరుడే.


0 comments:

Post a Comment