Sunday, December 18, 2022

💐💐నిజాయితీకి, నిర్భీతికి మారుపేరు "గరిమెళ్ళ సత్యనారాయణ" గారి వర్థంతి 💐💐

💐💐తెల్లదొరలను వణికించిన 
తెలుగు పాట...............
నిజాయితీకి, నిర్భీతికి మారుపేరు "గరిమెళ్ళ సత్యనారాయణ" గారి వర్థంతి సందర్భంగా💐💐






" మాకొద్దీ తెల్ల దొరతనం" అంటూ సత్యాగ్రహుల్లో గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించి... "దండాలు దండాలు భారత మాత" అంటూ ప్రజలను ఎంతగానో జాగృతం చేసిన కవి గరిమెళ్ళ సత్యనారాయణ. స్వాతంత్రోద్యమ కవుల్లో విశిష్టమైన స్థానం సంపాదించుకున్న ఈయన గేయాలన్నీ అప్పట్లో జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాలను ఉర్రూతలూగించాయి.

దేశభక్తి కవితలు రాసి జైలుశిక్షను అనుభవించిన వారిలో ప్రప్రథముడు గరిమెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి మారుపేరుగా నిలిచిన ఈయన రాసిన మాకొద్దీ తెల్ల దొరతనం అనే పాట ఆనాడు ప్రతి తెలుగువాడి నోటిలోనూ మార్మేగేది. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడిపెట్టిన మేటి కవి గరిమెళ్ళ జన్మదినం నేడే. ఈయనలాగా ప్రసిద్ధి చెందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరు లేరంటే అతిశయోక్తి కానేరదు.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా, గోనెపాడు గ్రామంలో 1893 జూలై 14వ తేదీన గరిమెళ్ళ సత్యనారాయణ జన్మించారు. తల్లి సూరమ్మ, తండ్రి వేంకట నరసింహం. ఈయన ప్రాథమిక విద్య ప్రియాగ్రహారంలోనూ... విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరంలలో పై చదువులు చదివారు. బీఏ పూర్తయ్యాక గంజాం కలెక్టర్ కార్యాలయంలో గుమస్తాగా, విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగానూ పనిచేశారు.

ఆ తరువాత... జాతీయోద్యమ స్ఫూర్తితో 1920 డిసెంబర్‌లో కలకత్తాలో జరిగిన కాంగ్రెసు మహాసభలో సహాయ నిరాకరణ తీర్మానం అమోదించబడింది. ఆ వీరావేశంతో ఉద్యమంలోకి దూకిన గరిమెళ్ళ "మా కొద్దీ తెల్లదొరతనం" పాటను రాశారు. ఆ రోజుల్లో రాజమండ్రిలో ఈ పాట నకలు కాపీలు ఒక్కొక్కటి బేడా ( 12 పైసలు) చొప్పున అమ్ముడు పోయేవట. ఆనోటా, ఈనోటా ఈ పాట గురించి ఆనాటి బ్రిటీషు కలెక్టరు బ్రేకన్ చెవినపడి ఆయన గరిమెళ్ళను పిలిపించి పాటను పూర్తిగా పాడమన్నారట.

గరిమెళ్ళ కేవలం రచయితే కాదు, గొప్ప గాయకుడు కూడా. తన కంచు కంఠంతో ఖంగున పాటలు కూడా పాడగలడు. అయితే, ఆ పాటను వ్రాసినందుకు గరిమెళ్ళకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించారు. శిక్షపూర్తి చేసుకుని జైలు నుంచి విడుదలయ్యాక కూడా ఆయన మళ్ళీ ప్రజల మధ్య గొంతెత్తి పాడుతూ, ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకోసాగారు.

‘‘పన్నెండు దేశాలు పండుచున్నగాని పట్టెడన్నము లోపమండి...
ఉప్పు ముట్టుకుంటే దోషమండి
నోట మట్టి కొట్టి పోతాడండి
అయ్యో! కుక్కలతో పోరాడి కూడు తింటామండి...’’
అంటూ ఆ పాటలో నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా వర్ణిస్తూ ఆయన పాడుతుంటే ఆబాల గోపాలమూ గొంతు కలిపేవారు. ఉద్యమావేశంతో ఉర్రూతలూగిపోయేవారు. జనాలను ఉర్రూతలూగించే కవి గాయకుడు జనంలో ఉంటే తమ ఉనికికే ముప్పు తప్పదని తలచిన బ్రిటిష్‌ పాలకులు ఆయనను అరెస్టు చేసి, జైలుకు పంపారు.

 కాకినాడ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. రెండు సంవత్సరాల జైలు శిక్షపడటంతో జైల్లో ఉండగా 1923లో ఆయన తండ్రి మరణించారు. అయితే గరిమెళ్ళ క్షమాపణ చెబితే, తండ్రిని చూసేందుకు వదిలిపెడతామని అన్నారట బ్రిటీష్ అధికారులు. అయితే దేశభక్తి జీర్ణించుకుపోయిన గరిమెళ్ళ క్షమాపణ చెప్పేది లేదని జైల్లోనే ఉండిపోయారు.

జైలునుంచి విడుదలయ్యాక చాలాచోట్ల ప్రజల సన్మానాలందుకున్న గరిమెళ్ళ, వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులనే ఎదుర్కొన్నారు. భార్య మరణంతో రెండో వివాహం, అప్పులు, ఆస్తుల అమ్మకం వెంటవెంటనే జరిగిపోయాయి. ఆపై ప్రియాగ్రహారంలో గ్రంథాలయ కార్యదర్శిగా పనిచేస్తూ, శ్రీ శారదా గ్రంథమాల స్థాపించి 18 పుస్తకాలు అచ్చు వేయించారు.

1921 లో గరిమెళ్ళ "స్వరాజ్య గీతములు" పుస్తకం వెలువడింది. 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యములు, భక్తిగీతాలు , బాలగీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయి. గరిమెళ్ళ చాలాసార్లు జైలు శిక్ష అనుభవించారు. జైల్లో వుండగా తమిళ, కన్నడ భాషలు నేర్చుకున్నా ఆయన తమిళ, కన్నడ గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. ఆంగ్లంలో కూడా కొన్ని రచనలు చేశారు.

జీవనోపాధి కోసం 1933లో మద్రాసు చేరుకున్న గరిమెళ్ళ , గృహలక్ష్మి పత్రిక సంపాదకుడిగా చేరారు కొంతకాలం తరువాత అక్కడ మానివేసి ఆచార్య రంగా, వాహిని పత్రికలలో సహాయ సంపాదకుడిగా చేరారు. ఆ తర్వాత ఆంధ్రప్రభలో, ఆనందవాణిలో, మరికొంతకాలం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా జీవనం సాగించారు.

‘సుకవి జీవించు ప్రజల నాల్కలయందు’ అనే జాషువా గారి మాట గరిమెళ్ల సత్యనారాయణ గారికి అక్షరాలా అతికినట్లుగా సరిపోతుంది. 

చివరిదశలో పేదరికం బారిన పడ్డ గరిమెళ్ళకు దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు కొంత సహాయ పడ్డారు. వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు ప్రతి నెలా ఆయనకు ఆర్థిక సహాయం చేసేవారు. వివిధ పత్రికలకు, ఆలిండియా రేడియోకి రచనలు చేసి కొంత గడిస్తున్నా ఆయన అవసరాలకు ఆ డబ్బు చాలేది కాదు. ఒకవైపు పేదరికం, మరోవైపు అనారోగ్యం ఆయనను బాగా దెబ్బతీశాయి.

ఒక కన్ను పోగొట్టుకుని, పక్షపాతం బారిన పడ్డ ఆయన దిక్కుతోచని స్థితిలో కొంతకాలం యాచన మీద కూడా బ్రతికారు. స్వాతంత్ర్యానంతరం మన పాలకుల వల్ల కూడా ఆయనకు చెప్పుకోదగ్గ సహాయం లభించలేదు. దేశ భక్తుడు, స్వాతంత్ర్య పిపాసి గరిమెళ్ళ చరమ దశలో దుర్భరదారిద్ర్యాన్ని అనుభవిస్తూ... 1952 డిసెంబర్ 18వ తేదీన పరమపదించారు.


0 comments:

Post a Comment