Sunday, December 11, 2022

భారతీయ సంగీత హిమశిఖరం ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారి వర్థంతి 💐💐

💐💐భారతీయ సంగీత హిమశిఖరం ఎం.ఎస్. సుబ్బులక్ష్మి  గారి వర్థంతి సందర్భంగా💐💐






#కర్ణాటక సంగీత ఝరి..ఎన్నటికీ వాడని మల్లెల సౌరభ సంగీత సుగంధం..ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి.... సూర్యచంద్రులు ఉన్నంత వరకూ ఆమె సంగీతం అలరారుతుంది.
శ్రీవారి సుప్రభాతాన్ని యావత్‌ ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఎంఎస్‌ సుబ్బలక్ష్మీ దే......
కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని , నటి. ఈమె #భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ #మెగసెసే పురస్కారం పొందిన తొలి #భారతీయ సంగీత కళాకారిణి.

#బాల్యం-తొలి జీవితం:

#కర్ణాటక సంగీత ఝరి ఎం.ఎస్‌. సుబ్బలక్ష్మి. తమిళనాడు రాష్ట్రం మదురైలో 1916 సెప్టెంబరు 16న న్యాయవాది సుబ్రమణ్య అయ్యర్‌, వీణా విద్వాంసురాలు షణ్ముఖ వడివూ అమ్మాళ్‌కు సుబ్బలక్ష్మి జన్మించారు. బాల్యంలోనే పాఠశాలకు వెళ్లడం మానేసిన ఆమె - అక్క, అన్నయ్యలతో కలిసి ఇంటివద్దే చదువు, సంగీతసాధన చేసేది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్‌వద్ద, తరువాత హిందుస్థానీ సంగీతాన్ని పండిత్‌ నారాయణరావు వ్యాస్‌వద్ద శిక్షణ తీసుకున్నారు. పదేండ్ల వయస్సులో తిరుచిరాపల్లిలోని రాక్‌ఫోర్ట్‌ గుడిలోని వందస్తంభాల హాలులో తొలి సంగీత ప్రదర్శన ఇచ్చారు.మొత్తం పది భాషల్లో సుబ్బలక్ష్మి పాడారు. అయితే ఏభాషలో పాడినా.. అది తన మాతభాషలో పాడినట్టుగా భాషానుడికారంతో భావయుక్తంగా ఆలపించడం మరో విశేషం.స్వాతంత్య్ర సమర యోధుడు, ఆనంద వికటన్‌ పత్రిక సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అయిన సదాశివన్‌ ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నేండ్లపాటు నాలుగు తమిళ సినిమాలు, వీటిలో మీరాబాయిని హిందీలో రీమేక్‌లోనూ నటించారు. ఆమె నటించినవన్నీ పౌరాణిక పాత్రలే.

భారత సాంస్కతిక రాయబారిగా లండన్‌, న్యూయార్క్‌, కెనెడా, తూర్పుతీర దేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. 1997లో భర్త సదాశివం మరణం తరువాత బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం మానేశారు.

#మహాత్మాగాంధీ, ప్రశంసించిన మహనీయురాలు సుబ్బులక్ష్మి:

#మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో, జె పీర్ పరాయీ జానేరే వంటి గీతాలకు ప్రాణం పోసిన వ్యక్తి ఆమె. భజనపాడుతూ అందులోనే అమె పరవశురాలవుతారు. ప్రార్థన సమయములో ఎవరయిన అలా లీనమవాలి. ఓ భజనను మొక్కుబడిగా పాడటం వేరు, అలా పాడుతూ పూర్తిగా దైవ చింతనలో లీనమవడం వేరు అని మహాత్మా గాంధీ ఆమెను ప్రశంసించారు.

#సంగీత సామ్రాజ్ఞిగా:

సుబ్బలక్ష్మి గాత్ర మాధ్యుర్యానికి పరవశించిపోయిన నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సంగీత సామ్రాజ్ఞిగా కీర్తించగా, ఉస్తాద్‌ బడే గులాం అలీఖాన్‌ సుస్వర లక్ష్మిగా కొనియాడారు. సంగీత ప్రపంచంలో ఎన్నో అవార్డులు ఆమెను వచ్చి వరించాయి. 1998లో దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న ఇచ్చి ప్రభుత్వం తన గౌరవాన్ని చాటుకుంది. తిరుపతి పూర్ణకుంభం సర్కిల్‌లో దేశంలో మొదటి సారి ఆమె కాంస్య విగ్రహాన్ని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి ఆవిష్కరించారు. శ్రీవారి సుప్రభాతాన్ని యావత్‌ ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఎంఎస్‌ సుబ్బలక్ష్మీ దే.

సేవాసదనం' అనే చిత్రం ద్వారా సినీ గాయకురాలిగా పరిచయం అయిన సుబ్బులక్ష్మి 1940లో 'శకుంతలై' అనే చిత్రంలో గాయకురాలిగా తెరపై కనిపించారు. అంతేకాదు 1945లో "మీరా" అనే చిత్రంలో మీరాబాయిగా నటించి జాతీయ గుర్తింపు పొందారు. ఇందులో ఆమె నటనకు ప్రపంచస్థాయి ప్రశంసలు అందాయి.

#ఐక్య రాజ్య సమితిలో #పాడిన #గాయనిగా చరిత్ర

ఐక్య రాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బులక్ష్మి. ఆ సందర్భంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక సుబ్బులక్ష్మిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా పేర్కొన్నాయి. రాయల్ ఆల్బర్ట్ హాల్, లండన్లో ప్రదర్శన యిచ్చినపుడు ఇంగ్లండ్ రాణిని కూడా తన్మయురాలిని చేసి ఆమె ప్రశంసలు పొందింది.

#ఒక వృద్ధురాలు కోసం కచేరీ:

ఒకసారి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి ఒక కచేరి చేసారు. కచేరి ముగిసిన తర్వాత తన గదిలోనికి వెళ్ళిపోయారు.గేటు బయట ఒక వృద్ధురాలు సుబ్బులక్ష్మిని చూడాలని బయటివారితో ఘర్షణ పడుతోంది. కాని వారు ఆమెను లోనికి అనుమతించడం లేదు. బయటి ఈ హడావుడి విన్న సుబ్బులక్ష్మి విషయం తెలుసుకొని ఆ ముసలావిడను లోనికి అనుమతించమన్నారు. ముసలావిడ లోనికి వచ్చిన తర్వాత ఆమెను విషయం అడిగారు. అప్పుడు ఆమె మీ కచేరి చూద్దామని 10 మైళ్ళ నుండి నడుచు కొనివచ్చాను. నా దురదృష్టంకొద్దీ మీ కచేరీ అయిపోయింది. కనీసం మిమ్మల్ని చూద్దామంటే వారు లోనికి అనుమతించలేదు అంది. 
 సుబ్బులక్ష్మి ఎంతో బాధపడి ఆ ముసలావిడకు ఆహారం పెట్టారు. తర్వాత ఎవరూ ఊహించని విధంగా సుబ్బులక్ష్మి ఆ ముసలావిడ ఒక్కదాని కోసం మళ్ళీ కచేరి చేసారు. అక్కడున్న అందరూ ఆమె మానవత్వానికి, జాలిగుండెకు చలించిపోయారు. ఏ మూర్ఖుడైనా తనదైన రోజున ఘనకార్యం చేసి గొప్పవాడని పేరు తెచ్చుకోవచ్చు. కాబట్టి గొప్పతనం అనేది ఒకరు చేసిన ఘనకార్యాలపై ఆధారపడి అంచనా వేయకూడదు. వారు చేసే చిన్నచిన్నపనులలో వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది వారి గొప్పతనం అంచనా వేయాలి అన్న వివేకానందుని వాక్కులకు సుబ్బులక్ష్మి జీవితమే ఒక ఉదాహరణ.#ఆమె కేవలం గాయని మాత్రమే కాదు, #మానవీయమైన #సుగుణసంపత్తి గల వ్యక్తి.

#ఆమె గాత్రం, సోత్రం, గానం, గీతం అజరామరం......

#సుబ్బులక్ష్మి పాడుతుంటే
స్వయంగా అమ్మవారే పాడుతున్నట్లు భావించేవారు. నిండైన విగ్రహం, భారతీయతకు ప్రతీకగా పట్టుచీరతో, నుదుటి మీద ఎర్రటి కుంకుమబొట్టు, చేతుల నిండా గాజులు, కళ్లకు నిండుగా కాటుక, కొప్పు, కొప్పు నిండా మల్లెపూలు, చేతిలో తంబూర పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు.
మైమరచిపోయేవారు.కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ధ్యానంలా సాగేది. పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలును, శాస్త్రీయ, లలిత గీతాలను, భజనలు, జానపద గేయాలు, మరాఠీలో అభంగాలు, దేశభక్తి గేయాలు పాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బులక్ష్మి ప్రత్యేకత. శృతి, లయ, ఆలపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్ళలో వ్యక్తీకరించడంతోపాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యం! ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడిన సంస్కృత భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బులక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు.

#పురస్కారాలు:

#ఎక్కని స్టేజిలేదు.. పాడని కృతిలేదు.. పొందని పురస్కారం లేదు.. భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్ ఆమె స్వరానికి నీరాజనాలు పట్టాయి. అలాగే ప్రపంచ కర్ణాటక సంగీతంలో మ్యూజిక్ అకాడెమీచే సంగీత కళానిధి పురస్కారాన్ని అందుకున్న తొలి మహిళగా చరిత్రపుటలకెక్కారు. ఫిలిప్పైన్ ప్రభుత్వం రామన్ మెగసెసె అవార్డు కూడా అందించింది. 
అలాగే ఎస్వీ విశ్వవిద్యాలయంతోపాటు పలు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. 

#ప్రపంచ స్థాయిలో ఒక శకాన్ని రూపొందించి ఆబాలగోపాలాన్ని మెప్పించిన ఆ స్వరం 2004 డిసెంబర్ 11న చెన్నైలో మూగబోయింది. అయినా ఇప్పటికీ ప్రతి ఇంటా తెల్లవారు జామునుంచే "కౌశల్యా సుప్రజా రామా" అంటూ ఎంఎస్ స్వరం సంగీత జల్లులు కురిపిస్తూనే ఉంటుంది.


0 comments:

Post a Comment